1908 మూసీ వరదల 116వ వర్ధంతిని పురస్కరించుకొని, ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ (FBH), సివిల్ సొసైటీ గ్రూపులతో కలిసి సెప్టెంబర్ 28న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలోని ప్రాణధాత చింతచెట్టుకింద 16వ స్మారక మరియు ఐక్యసమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎఫ్‍బిహెచ్ ఛైర్మన్ Er. వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ… 1908 మూసీ వరదల సమయంలో జరిగిన ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అఫ్జల్ పార్క్లోని ఈ చింతచెట్టుపైకి 150 మంది ఎక్కి ఆశ్రయం పొంది, ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. 1914లో ఈ తరహా విపత్తులను నివారించడానికి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (CIB)ను స్థాపించిన హైదరాబాద్ దక్కన్ 7వ నిజాం చేసిన ప్రయత్నాలను వేదకుమార్ ప్రశంసించారు. ప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కృషిని స్మరించుకున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మూసీ నదిపై రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు. ఒకటి ఉస్మాన్‍సాగర్, రెండవది హిమాయత్‍సాగర్. నిర్మించాల్సిందిగా ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్లు వరద ముప్పును తగ్గించడమే కాకుండా, నగరానికి నిరంతరం తాగునీటి సరఫరాను మరియు దిగువ ప్రాంతాల సేద్యానికి నీటిని అందించాయి. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (CIB) భూగర్భ పారుదల వ్యవస్థను నిర్మించడంలో కీలకమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో మురుగునీరు మరియు వర్షపు నీటి పారుదల వ్యవస్థలు కూడా ఉన్నాయి. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి పైపులైన్ నెట్ వర్క్ ద్వారా ప్రవేశపెట్టినట్లు, ఇతర పౌర సదుపాయాలను కూడా అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే నగర ప్రణాళికకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర ప్రాంతానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ అవసరాన్ని, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని జుతీ. వేదకుమార్ వివరించారు. నగరంలోని నీటి వనరులను, మూసీ నదిని కాలుష్యం మరియు ఆక్రమణల నుండి రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నివాస మరియు పారిశ్రామిక వనరుల నుండి వెలువడే మురుగునీటిని సర్ఫేస్ స్టాండర్డస్కు అనుగుణంగా శుద్ధి చేసి, తద్వారా ఆ నీటిని తోటలు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాల కోసం తిరిగి ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. శుద్ధి చేసిన మిగతా నీటిని సురక్షితంగా నీటి వనరులు మరియు మూసీ నదిలో విడుదల చేయాలన్నారు.
నగరంలోని నీటి వనరులను రక్షించడానికి మరియు శుభ్రమైన నీటిని నిర్ధారించడానికి ఘనవ్యర్థాల నిర్వహణ ముఖ్యం అని, హైదరాబాద్ పర్యావరణ మరియు నగర పరిశుభ్రతను సురక్షితం చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ Er. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో నదులను కలుషితం చేయకుండా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ Er. రమణ నాయక్ మాట్లాడుతూ.. నీటిని సక్రమంగా శుద్ధి చేసి వాడుకునేందుకు తగిన పరిశోధన, విశ్లేషణ నిర్వహించా లన్నారు. సుభాష్‍రెడ్డి మాట్లాడుతూ… నీటిని ఎలా పొదుపు చేయాలో, భూగర్భ జలాల నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరచడానికి వర్షాధారం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు.
సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ చింతచెట్టు కులమతాలకు అతీతంగా 150 మంది ప్రాణాలను కాపాడిందని, పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో ఉందన్నారు.
సంఘ సంస్కరణల పురస్కార గ్రహీత రాజలింగం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో వేదకుమార్, ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ (ఎఫ్‍బిహెచ్) చేస్తున్న కృషి అభినందనీయము అన్నారు. రాజలింగం చింత చెట్టుకు నమస్కరించి మొక్కలు చెల్లించుకున్నారు. హాజరైన ప్రముఖులంతా పర్యావరణ వనరుల పరిరక్షణకు తీసుకోవలసిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్మారక సమావేశం రామ్ నివాస్ పరాశర్ చింత చెట్టు యొక్క పాత్ర మరియు 1908 వరదల్లో దాని సహాయంపై అవగాహన కల్పించటం పై రచించిన ‘‘ఆంకోన్ దేఖా హాల్ ఆఫ్ ఫ్లడ్స్’’ లావణి పాటను ఆలపించారు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ మరియు SRD Orphanage విద్యార్థులు ప్రకృతిపై స్వాగత గీతం ఆలాపించారు.
కార్యక్రమానికి మణికొండ వేదకుమార్ అధ్యక్షత వహించగా, ఎఫ్‍బిహెచ్ జనరల్ సెక్రటరీ శోభాసింగ్ సభను స్వాగతించారు. ఎఫ్‍బిహెచ్ కో-ఆర్డినేటర్ సయ్యద్ ఖైజర్ భాష కృతజ్ఞతలు తెలిపారు. అతిథులు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ జై కిషెన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కవిత, జేబీఆర్‍ఏసీ ఆర్కిటెక్ట్ మౌనిక, గవర్నమెంట్ సిటీ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ దూసి, ఫిల్మ్ మేకర్ రఘురామ చంద్ర, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ వీరేష్ బాబు, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ రామ్‍రాజ్, తురాబ్, నరహరి, ఎస్ ఆర్ డి అనాథాశ్రమం సమన్వయకర్త శివరాణి, ఇలియాస్, శ్రీధర్, జెబిఆర్ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, హిమయత్ నగర్, సెయింట్ జోసెఫ్, ప్రగతి, రోస్ బడ్స్, తదితర స్కూల్స్ చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పాఠశాల నిర్వహకులు, సివిల్ సొసైటీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111