తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగి డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చింది. సుస్థిరమైన తెలంగాణ నిర్మాణం కోసం విశాలమైన, విస్తృతమైన దృష్టితో కార్యదీక్షతో ఇంకా మునుముందుకు సాగాలన్న ధృఢమైన ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎన్నికల ఫలితాలు కనిపించాయి. పరిపూర్ణ స్థాయిలో ప్రగతిని అందుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో పారదర్శకమైన అంకితభావంతో ప్రజలంతా భాగస్వాములై తోడ్పడాలి. ప్రాధాన్యత కలిగిన అన్ని రంగాలలో కృషి ప్రణాళికాబద్ధంగా జరగాలి.
హైదరాబాదులో నేషనల్ బుక్‍ఫెయిర్ డిసెంబరులో ఎంతో ఘనంగా జరిగి ముగిసింది. మునుపెన్నడూ లేనివిధంగా లక్షలాదిమంది పుస్తక ప్రేమికులు బుక్‍ఫెయిర్‍ను సందర్శించి వెలకట్టలేని పుస్తకాలను ఒకచోట చూసే సదవకాశాన్ని పొందారు. బుక్‍ఫెయిర్‍లో భాగంగా పుస్తకావిష్కరణలు, సదస్సులు, బాలల వికాస కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వేలాదిమంది పుస్తకాభిమానులకు బుక్‍ఫెయిర్ ఒక మధుర జ్ఞాపకంగా మిగలడమే కాక పఠనాభిలాష ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పింది.
రేపటితరానికి ప్రతినిధులైన బాలలను నిర్మాణాత్మకంగా, సృజనశీలత కలిగినవారిగా తీర్చిదిద్దడం ఎంతో అవసరం. బాలసాహిత్యం అందుకు ఎంతగానో తోడ్పడుతుంది. బాలసాహిత్యం ఎక్కువగా రావలసిన పరిస్థితి ఉంది. పాఠశాల స్థాయి నుండి పిల్లలలో పఠనాభిలాషను పెంపొందింపజేసేందుకు కృషి జరగాలి. బాలసాహిత్యాన్ని రచింపజేసి, ప్రచురింపజేసి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు బహుముఖంగా ఉండాలి. పిల్లలలో సృజనాత్మక శక్తి పెంపొందింపజేసే మార్గాలను అన్వేషిస్తూ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రచురణలను విస్తారంగా చేపట్టి ముందుకు సాగాలి.పుస్తక పఠనాభిలాష, భాషపై మక్కువ చిన్నతనంలోనే పిల్లలలో పెంచగలిగితే భవిష్యత్తు ప్రయోజనాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వంతోపాటు సామాజిక సాహిత్య సంస్థలు బాలసాహిత్య ప్రచురణకు ముందుకు వచ్చి కృషిని కొనసాగించాలి.
2019 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ‘దక్కన్‍ల్యాండ్’ పాఠకులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలుకుని నేటివరకు ‘దక్కన్‍ల్యాండ్’ మీ అందరి ఆదరాభిమానాలు పొందుతూ తెలంగాణ ప్రాంత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే వేదికగా మారింది. సామాజిక, సాహిత్య, వారసత్వ, చారిత్రక అంశాలు, అస్థిత్వ పోరాటాలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలకు ప్రాధాన్యతను ఇస్తూ ఆయా రంగాలలో నిష్ణాతులైనవారెందరో రాసిన వ్యాసాలు, విశ్లేషణలు, స్పందనలను ప్రచురించి తెలంగాణ సమాజానికి కృతజ్ఞతాపూర్వకంగా అందించి ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కార్యదీక్షతో సాగే ‘దక్కన్‍ల్యాండ్’ అక్షర ప్రయాణానికి స్ఫూర్తివంతమైన మీ అందరి సహకారం, దిశానిర్దేశాన్ని సదా కోరుకుంటున్నాము. ప్రజాస్వామిక, రాజకీయార్థిక, సామాజిక సాహిత్య విశ్లేషణా వేదికగా ‘దక్కన్‍ల్యాండ్’ను తీర్చిదిద్దాలని జరుగుతున్న కృషికి మీ తోడ్పాటును మన:స్ఫూర్తిగా ఆహ్వానిస్తూ….
మణికొండ వేదకుమార్
ఎడిటర్