సామాజిక స్థితిగతులు స్థానికపరిస్థితులే మనుషులు విభిన్నంగ ఆలోచించడానికి కారణమైతయని నిరూపించిన జీవితం. తాను పుట్టిపెరిగిన వాతావరణంతో పాటు ఆనాటి భూస్వామ్య విధానం వల్ల చెలరేగిన ఉద్యమాన్ని కండ్లార చూసిండు. చిన్నతనం నుంచే పద్యాలు పాడడం, రాయడం పట్ల ఆసక్తిని పెంచుకొని, ఆయుధాలను చేతబట్టి తన శక్తియుక్తలను మేళవించి ప్రజాక్షేత్రంలో నిలబడ్డ మేథాసంపన్నుడు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో తన పదాలతో, పద్యనాదాలతో ఉద్యమాన్ని పదునెక్కించిన అభ్యుదయ కవి, సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు గురించి నేటి మన ‘అలుగెల్లిన పాట’లో…
ఖమ్మం మెట్టు సమీపంలోని ముదిగొండ దగ్గర గల గోకినేపల్లి గ్రామానికి చెందిన రావెళ్ళ లక్ష్మయ్య -సుబ్బమ్మ దంపతులది సంపన్న వ్యవసాయ కుటుంబం. వీరికి గల ఐదుగురు సంతానంలో రెండవ వారు అభ్యుదయకవిగా, సాయుధ పోరాట యోధుడిగా పేరు గడించిన రావెళ్ళ వెంకట రామారావు. ఈయన జనవరి 31, 1927న జన్మించిండు. వెంకటరామారావును స్థానిక వీధిబడిలో చేర్పించడంతో తెలుగు, ఉర్దూ భాషల మీద మంచి పట్టు సంపాదించిండు. తన భాషా పాండిత్యంతో అద్భుతమైన పద్యాలు రాసి, గొంతెత్తి గానం చేసిండు. రావెళ్ళ వెంకటరామారావు ఇరవైయేండ్ల వయసులోనే ఆంధ్రమహాసభ, హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలతో స్ఫూర్తి పొంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిండు. తన రచనలతో ప్రజలను చైతన్యం చేసిండు. పద్య, వచన, గేయ కవిత్వంలో చెరగని ముద్ర వేసుకుండు.
1944లో ఆంధ్రమహాసభలో చేరిన రావెళ్ళ వెంకట రామారావు గోకినేపల్లినే పోరాట కేంద్రంగా మార్చిండు. దళాలను ఏర్పాటు చేసి సాయుధ రైతాంగ పోరాటం వైపుకు బాటలు వేసిండు. మరోవైపు తన కలానికి పదునుపెట్టి ‘నవభారత్, స్వాతంత్య్రభారతి’ పత్రికలలో అనేక రచనలు చేసిండు. నిజాం ప్రజా వ్యతిరేక పాలనారీతులను వర్ణించిండు.
రావెళ్ల వేంకట రామారావు దసరాపండుగను పురస్కరించుకొని నాయకుల ధన దాహాన్ని, పదవీ వ్యామోహాన్ని అక్షరీకరిస్తడు. విజయోస్తు అంటూనే విప్లవాగ్నిని రగిలిస్తడు.
‘‘శ్రీరస్తు విజయోస్తు ధనదాహ పరిరస్తు / జనపీడలే మస్తు జయజయీభవరస్తు వాగ్ధానముల మస్తు పదవి సిద్ధీరస్తు / దేశభక్షణ మస్తు దిగ్విజయ విజయోస్తు’’ అంటూ రాసిన విమర్శనాత్మక గీతం ఎందరినో కదిలిస్తది. ఆలోచింపజేస్తది. రావెళ్ళ వెంకటరామారావు 1950 ప్రాంతంలో హైద్రాబాద్‍కు వచ్చినపుడు ‘‘తెలంగి – జేడంగి’’ అనే మాటలు ఆయనను ఎంతగానో కలిచివేసినయి. అవమానానికి గురిచేసినయి. ఆ బాధతో, దుఃఖంతో అనేక పద్యాలు రాసిండు. తెలంగాణ వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పిండు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్యంలో రాసిన పదాలే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినయి. అనేక వేదికల మీద రావెళ్ళ పద్యాలు, పాటలు మార్మోగినయ్.
ఆనాటి ఉద్యమ అవసరాలకు అనుగుణంగ ఆంధ్ర శబ్దాన్నే తన పదాల్లోకి ఒంపుకొని పల్లవిగా మార్చిన ‘జయజయాంధ్ర జననీ జయకాంతి వాహినీ / రాజిల్లు నవభావ రమణీయ రసధునీ నిత్యనూతన శక్తి నిర్జరులు పాంగార / పాతకొత్తల మేలి బంధనము చెలువార తరములందంతరము తెరలన్ని విడిపోవ / ప్రగతి రూపున కళలు ప్రజహృదిని వర్తింప’’ ఈ పాట బహుశా ఆంధ్ర ప్రాంతాన్ని బలవతంగా తెలంగాణలో విలీనం చేసినపుడు అంతరాలన్ని తొలగిపోవాలని పాత కొత్తలు కలగలిసి పోయి అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు అనిపిస్తది. అసలుసిసలైన మానవీయతను పాదుగొలిపే గొప్ప గుణం తెలంగాణ అనువణువునా నిండి ఉంటది. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. ఈ అంశాన్నే రావెళ్ళ వెంకట రామారావు ఒక పాటలో
‘‘మందార పూవు వలె మనతల్లి నవ్వింది / తొలిభాను కిరణమై తెలుగుకళ విరిసింది
అరుకోటుల వీణ అనురాగమున బల్మ / అరమరికలే లేని ఆనందమొలికింది’’
అంటూ తెలుగుతల్లి సంతోషాన్ని గానం చేస్తడు. తెలుగుకళ వెల్లువెత్తిన ఆనందంతో పరవశించిపోతడు. కాని అది ఎంతో కాలం నిలువదు. శ్రమతత్వం నిండిన తెలంగాణ సమైక్య గుణాన్ని ఆసరాగా తీసుకొని వలసపాలకులు వారి ఇష్టానుసారం వ్యవహరించిండ్రు. తెలంగాణ బిడ్డలు రెండవజాతి పౌరులుగా నెట్టివేయబడిండ్రు.
ఈ నేపథ్యంలోనే ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దశదిశలా చాటించే అద్భుతమైన పదాలను తెలంగాణ వాకిళ్ళలో పరిచిన సాహితీమూర్తి రావెళ్ళ వెంకట రామారావు. కదనరంగంలో శత్రువుల కంఠాలను తెగనరికే ఒడుపున్న ఈ నేల, ధీరులకు మొగసాల ఈ నేల అనే భావంతో 1950 నాటికే ఆయన రాసిన ఈ పాట ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్‍కు ఎంతగానో నచ్చింది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ పాటే ఆయుధంగా మారింది. ఎంతో ప్రేరణ కలిగించింది. అయితే తెలంగాణ మలివిడత పోరాటంలో దేశపతి శ్రీనివాస్ రాగయుక్తంగా పాడడంతో ఈ పాట ప్రాచుర్యం పొందింది.
‘‘కదనాన శత్రువుల కుత్తుకల దేవలీల
నుత్తరించగ బలోన్మత్తులేలిన భూమి
ధీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కాణాచిరా
ఆబలయని దేశమును కబళింప తలపడిన
వరరాజులకు స్త్రీల పటుశౌర్యమును జూపి
రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రుద్రమదేవిరా
కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును
వేయి కంచాలలో వెలయించి మించినది
అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా’’ కాకతీయ రాజుల శౌర్యపరాక్రమాలను, ముఖ్యంగ రాణిరుద్రమ దేవి రౌద్రాన్ని గానం చేస్తడు. కుల, మత భావాలు లేని సామరస్య భావనను గానం చేస్తది.
‘‘వర్ణ సహసత్వమున వసలతలు మరపించు
లాలిత్య రేఖావిలాసాల చిత్రణలు
ఆనాటి చిత్రాలురా తెలంగాణ ఆలయపు కుడ్యాలురా
కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్మించి
భోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పించె
శ్రీగిరి చైత్యమ్మురా తెలంగాణ చైతన్యమును చాటెరా
శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతలలో
బసవన్న శివతత్వ పారవశ్యమలోన
ఉర్రూతలగించెరా తెలంగాణ వెల్లువై పొంగిందిరా
కవితలో విక్రాంతి కాహళిని పూరించి
కమ్మ తెనుగున తేట కావ్యాలు విరిచించె
పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా
భాషా వధూనయన భాష్పతతి వణగింప
రాజనమ్మాన వైరాగ్యమును ప్రకటించె
కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా’’ అంటూ రాజులను ధిక్కరించి, రాజ్యసౌఖ్యాలను కాలదన్ని కష్టాన్ని నమ్ముకున్న ధర్మనిరతి గల నేలని గొంతెత్తి పాడుకుంటడు. ‘‘భూగర్భమున గనులు పొంగిపారెడు నదులు’’ అని గొప్పగా ఉప్పొంగిపోతడు.
తెలంగాణ ఉద్యమానికి గొప్ప బలాన్నిచ్చిండు. యుద్ధచతురత కలిగినవాడు రావెళ్ళ. వందలాది మంది రజాకార్లు చుట్టుముట్టిన చాకచక్కంగా తప్పించుకునే నేర్పరి. శత్రువును భయపెట్టడంలో ధీశాలి. ఒక్కడైనను వెన్నుచూపక పోరాటపటిమ చూపి పదిమందికి ఆదర్శంగా నిలిచిండు.
1953 నుంచి వివిధ సాహిత్య సంస్థలలో సభ్యుడిగా పనిచేసిండు. ‘తెలంగాణ రచయితల సంఘం, ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ, దక్షిణ భారత హిందీ ప్రచారసభ, సంస్కృత ప్రచార సమితి’ వంటి సంస్థలలో బాధ్యుడిగా ఎనలేని సేవలు అందించిండు. కాళోజీ, దాశరథి, సినారె వంటి ఎందరో కవులతో రావెళ్ళ సన్నిహితంగా ఉండేవాడు. ఈయన రచనలు చేయడమే కాకుండ మంచి వక్త. రెండు మూడు గంటలపాటు అనర్గళంగ ప్రపసంగాలు చేసి ఆకట్టుకునేటోడు. నాయకులు మాటలు కాదని రావెళ్ళ పాటలను పాడించుకున్నరు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడ కవులు తమ గళాలను విప్పిండ్రు. ఎక్కువగా పద్యకవులుగాను ఉన్నరు. పద్యకవులను పాట కవులుగా మార్చిన సందర్భం కూడ ఉన్నది. తెలంగాణ మలివిడత పోరాటంలో కూడ ఆ పాట ఎంతగానో ప్రజలను అలరించింది. ఆ సమయంలో వెలువడిన ‘విప్లవశంఖం’ పాటల సంకలనంలో కూడ రావెళ్ళ పాటకు చోటు దక్కింది.
రావెళ్ళ వెంకటరామారావు రాగజ్యోతులు, జీవనరాగం, పల్లెభారతి, తాండవహేళ, చైతన్యస్రవంతి, అనలతల్పం, వ్యాసభారతి, కథాభారతి’’ వంటి పుస్తకాలు ప్రచురించిండు. ఇంకా చాలా రచనలు ప్రచురించవలసి ఉన్నది. ఈయనకు గుర్రం జాషువా, దాశరథి, గురజాడ అప్పారావుల అవార్డులు ప్రదానం చేయబడినవి. ఒక అద్భుతమైన కావ్యధారను ప్రవహింపజేసిన కవి పుంగవుడు రావెళ్ళ వెంకట రామారావు ‘పురాతన్, క్రిషిక్, తెలంగాణ్యుడు, ఆర్.వి.ఆర్. అనే పేర్లతో పాటు ‘‘జయశ్రీ’’ అనే కలం పేరుతో కూడ అనేక రచనలు చేసిండు. బతికినంత కాలం సాహిత్య సేవ చేసిండు. ఈయనకు ‘మధురకవి, కర్షక్‍కవి’ అనే బిరుదులు కూడా ప్రధానం చేసిండ్రు.
బెంగాల్‍కు చెందిన రాహుల్ సాంకృత్యాయన్‍తో కూడ రావెళ్ళకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. రావెళ్ళ వెంకట రామారావు కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన నాటి నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తీగల జైళ్ళో బంధించింది. అక్కడి నుంచి వరంగల్ జైలుకు తరలిచిండ్రు. రావెళ్ళ మీద అనేక కేసులు బనాయించి, సుదీర్ఘంగ జైళ్ళోనే ఉంచే ప్రయత్నం చేసిండ్రు. జైలునే సాహిత్య పాఠశాలగా మార్చుకొని, దాదాపు నాలుగు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిండు. ఎక్కడ ఏ సందర్భంలోనైనా ఎవరికి జడువకుండ, ఎనకడుగు వేయకుండ సాగిపోయిన సమరశీలి రావెళ్ళ వెంకట రామారావు డిసెంబర్ 10, 2013లో ఎనభై ఆరు సంవత్సరాల వయసులో తన స్వగ్రామమైన గోకినేపల్లిలో కనుమూసిండు. ఈయన మృతికి తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర సాధకుడు కలువకుంట్ల చంద్రశేఖర్‍రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్‍లు సంతాపం ప్రకటించిండ్రు.
–అంబటి వేకువ,
ఎ: 94927 55448