తెలంగాణ రైతుకు వైభవం

వ్యవసాయం దండుగ కాదు పండుగ అని, స్వరాష్ట్రం వస్తే రైతులకు అన్ని విధాల లాభం జరుగుతుందని మన ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‍ రావు చెప్పిన మాటలు ఇప్పటికే కార్యాచరణలోకి వచ్చేసాయి. రైతు బంధు, రైతు భీమా మొదలైన వాటితో పాటు తెలంగాణ భూములకు అనుకూలమైన అధిక ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయడానికి రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.


అందులో భాగంగా ఆయిల్‍ పామ్‍ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఒక టన్ను పామాయిల్‍ ఉత్పత్తి చెయ్యాలంటే 0.26 హెక్టర్‍ భూమి అవసరం అవుతుంది. అదే ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనెకు 1.43 హెక్టర్‍, సోయాబిన్‍ నూనెకు 2.00 హెక్టర్ల భూమి అవసరం అవుతుంది. ఆ విధంగా తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి పొందే అవకాశం ఉన్న ఆయిల్‍ పామ్‍ పంటకు ప్రభుత్వం రైతులకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తుంది. ఒక హెక్టర్‍ సాగు భూమి ద్వారా 5 టన్నుల పామాయిల్‍ పొందవచ్చు. అదే ఒక హెక్టర్‍ భూమిలో అయితే సోయాబీన్‍ ద్వారా 1.43 టన్నుల నూనె, వేరుశనగ ద్వారా 0.65 టన్నులు, ఆవాలు ద్వారా 1.07 తన్నులు, ప్రొద్దుతిరుగుడు ద్వారా 0.79 టన్నులు, కుసుముల ద్వారా 0.52 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఏ విధంగా చూసినా ఆయిల్‍ పామ్‍ పంట రైతుకు అధిక దిగుబడినిస్తుంది. ఆయిల్‍ పామ్‍ ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రము దేశంలో రెండవ స్థానంలో ఉంది. దేశంలో పామాయిల్‍ వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువ మన దేశంలో సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 16 కేజీల నూనెను తన ఆహారంలో వినియోగిస్తాడు. ఆ విధంగా మన దేశ జనాభాకు ప్రస్తుతం 21 మిలియన్‍ టన్నుల నూనె అవసరం. 2025 సంవత్సరం వరకు నూనె వినియోగం 30 మిలియన్‍ టన్నుల వరకు చేరుతుంది. కాగా మన దేశంలో 7 మిలియన్‍ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగల్గుతున్నాము. అంటే 14 మిలియన్‍ టన్నులు దిగుమతి చేసుకుంటూ ఉండగా అందులో 8.5 మిలియన్‍ టన్నులు పామ్‍ ఆయిల్‍ దిగుమతి చేసుకుంటున్నాము. ఈ విధంగా నూనె దిగుమతులు చేసుకోవడం వలన 65000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యమును ఖర్చు పెట్టవలసివస్తుంది.


28 లక్షల ఎకరాలలో ఆయిల్‍ పామ్‍ సాగు చేస్తే మనం ఆయిల్‍ పామ్‍ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మన దేశంలో 3 లక్షల ఎకరాలలో సాగుచేస్తూ 2.6 మిలియన్‍ టన్నుల పామ్‍ఆయిల్‍ ఉత్పత్తి మాత్రమే పొందుతున్నాము. దీని వల్ల మనము ఎక్కువ మొత్తం విదేశీ మారక ద్రవ్యం కోల్పోవాల్సి వస్తుంది.


తెలంగాణ రాష్ట్రంలో, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఆయిల్‍ పామ్‍ సాగు ద్వారా సంవత్సరానికి 15 నుండి 20 టన్నుల ఉత్పత్తి చేయగల్గుతున్నాం. మన రాష్ట్ర ప్రజల ఆహార వినియోగానికి గాను 3 లక్షల టన్నుల నూనె దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎకరాలలో ఆయిల్‍ పామ్‍ సాగుచేసినట్లయితే నూనె దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.


ఆ దిశగా ఆలోచించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ఠ్ర మరియు దేశ ప్రజల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని 7 లక్షల ఎకరాలలో ఆయిల్‍ పామ్‍ పంట విస్తరింపజేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. 23 జిల్లాలోని 230 మండలాలను ఆయిల్‍ పామ్‍ సాగు చేయుటకు తగినదిగా గుర్తించింది. ఆ విధంగా ఆయిల్‍ పామ్‍ పంట విస్తరింపచేయుటకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కొరకు లేఖ వ్రాసింది. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వ బృందం ఆయా జిల్లాలలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.


ఆయిల్‍ పామ్‍ పంటకు ఉద్యాన శాఖ ద్వారా హెక్టరుకు మొక్కలు మరియు ఎరువులపై రూ. 32,000 రాయితీని నాలుగు విడతలుగా నాలుగు సంవత్సరాలకు అందిస్తుంది.


ఆయిల్‍ పామ్‍ సాగు వల్ల లాభాలు :

 • ఈ పంటలను సాగు చేయడం వలన నాలుగు సంవత్సరాల నుండి నికరంగా ఖర్చులు పోను రూ. 50,000/- పైగా ఆదాయం పొందవచ్చును.
 • ఈ పంటకు చీడపీడల బెడద చాలతక్కువ. కోతులు , కుక్కలు మరియు దొంగలు బెడద లేదు.
 • సమీపంలో రవాణా, మార్కెట్‍, ప్రోసెసింగ్‍ సౌకర్యాలు మరియు గిట్టుబాటు ధర కలిగిన పంట.
 • అంతర పంట వలన అదనపు ఆదాయం వస్తుంది. అంతరపంటల సాగుపై సంవత్సరానికి రూ.15,000కు నికర ఆదాయం నాలుగు సంవత్సరాలకు పొందవచును.
 • తదుపరి కోకో పంటను అంతర పంటగా సాగు చేసి సంవత్సరానికి రూ. 25,000 ఆదాయం పొందవచును.
 • భూసారం పెరుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి తట్టుకుంటాయి.
 • కూలీ ఖర్చు చాలా తక్కువ. అధిక విటమిన్లు కలిగిన ఈ నూనెను వంటలో ఉపయోగిస్తారు. అత్యధిక నూనె దిగుబడి ఇచ్చును. తద్వారా ప్రతి ఒక్కరికి నూనె అందుబాటులో ఉంటుంది.
 • ఇంకా పామాయిల్‍ వినియోగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
 • అన్ని నూనెల్లో చవకైనది పామాయిల్‍. ఈ నూనెలో కొలెస్టరాల్‍ శాతం కూడా తక్కువే! పైగా ఆరోగ్యకరమైన శాచురేటెడ్‍ వెజిటబుల్‍ ఫ్యాట్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి.
 • ఈ నూనెలోని విటమిన్‍-ఇ మరియు టోకోఎట్రినాల్‍ అనే యాంటిఆక్సిడెంట్స్ డిస్ట్రక్టివ్‍ డ్యామేజీని అరికట్టి మెదడు కణాలకు రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా డిమెన్షియా, అల్జీమర్స్లాంటి రుగ్మతలు దరిచేరవు.
 • పామాయిల్‍ రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా హృద్రోగాలు దరిచేరవు. ఈ నూనె ఫ్రీ ర్యాడికల్స్ను కట్టడి చేసి గుండె రక్తనాళాల్లో ఇన్‍ఫ్లమేషన్‍ను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే సమస్య ఉండదు.
 • ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‍కు గురికాకుండా కణాలకు రక్షణనిస్తాయి. దీన్లోని టోకోఎట్రినాల్‍ మరియు విటమిన్‍-ఇలు చర్మం, పొట్ట, పాంక్రియాస్‍, కాలేయం, ఊపిరితిత్తులు, పెద్ద పేగు, రొమ్ము ఇతర క్యాన్సర్‍లతో పోరాడటానికి సహాయపడుతాయి.


పై విషయాలనన్నిటిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి ఆదేశాలననుసరించి ఉద్యాన శాఖ మరియు ఆయిల్‍ ఫెడ్‍ సంయుక్తంగా రాష్ట్ర రైతులందరికి ఆయిల్‍ పామ్‍ సాగుపై విజ్ఞాన యాత్రలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నది.


నవంబర్‍ 2019లో వనపర్తి, మహబూబ్‍నగర్‍, నాగర్‍ కర్నూల్‍, నారాయణ్‍ పెట్‍, గద్వాల్‍, నిజామాబాద్‍, మహబూబాబాద్‍, నిర్మల్‍ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది ఔత్సాహిక రైతులకు భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలోని పలు ఆయిల్‍ పామ్‍ తోటలను మరియు అంతర పంటగా ఉన్న కోకో సాగును చూపించి సాగు విధానం అనుభవజ్ఞులైన రైతులచే వివరించడం జరిగింది. అదే విధంగా ఆయిల్‍ పామ్‍ నర్సరీ మరియు ఫ్యాక్టరీని సందర్శింపచేయడం జరిగింది.


ఆ సందర్భంలో ఆయిల్‍ ఫెడ్‍ చైర్మన్‍ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణాలో సాంప్రదాయ పంటలయిన ప్రత్తి, పొగాకు, మిరప లాంటి పంటలకు బదులుగా ఆయిల్‍ పామ్‍ తోటలను వేసి అధిక లాభాలు పొందమని రైతులకు సూచించారు.


ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‍ శ్రీలోక వెంకట రామిరెడ్డి ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్‍ పామ్‍ సాగు చేసి, పామాయిల్‍ ఉత్పత్తి చేసివినియోగించుకోవాలని తద్వారా నూనెల దిగుమతి తగ్గించుకొని విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవచ్చుఅని తెలిపినారు. కనుక రైతులందరు ఆయిల్‍ పామ్‍ తోటలు వేసుకొవాలని మరియు అధిక లాభాలు పొందవచ్చు అలాగే హెక్టరుకు నికర ఆదాయం లక్ష రూపాయలు పొందవచ్చని తెలిపినారు.
అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‍ పామ్‍ పంట రైతులందరి పాలిటా కల్పతరువుగా విలసిల్లుతుందని ఆశిద్దాం.


సముద్రాల విజయ్‍ కుమార్‍
ఎ : 837444992

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *