రాజేశ్వరపురం శాసనం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామం రాజేశ్వరపురం. ఇక్కడ వీరగోపాలస్వామి దేవాలయంలో నిలబెట్టివున్న 15 అడుగుల ఎత్తు, 3అడుగుల వెడల్పు 6అంగుళాల మందమున్న రాతిబండ (పలక,సలప)మీద రెండువైపులా శాసనం చెక్కివుంది. ఈ శాసనంలో 12మంది వ్యక్తుల పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో మొదటిపేరు కోటకేతన. కోట వంశస్తులు కాకతీయుల సామంతులే కాదు వారి బంధువులు కూడా. వీరి రాజధాని ధరణికోట. పట్టణం పేరే వారి ఇంటిపేరయింది. వీరికి పరబలసాధక, ప్రతాప లంకేశ్వర, కళిగళ మొగడకై, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ వంటి బిరుదులున్నాయని వేల్పూరులోని రామలింగేశ్వరా లయంలోని శాసనంలో పేర్కొనబడ్డాయి. కృష్ణానదికి దక్షిణాన వున్న 6వేల గ్రామాలకు ప్రభువులని (షట్సహస్రావని వల్లభ) పేరుపొందారని పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో రాయబడివుంది. వీరిలో బయ్యల మహాదేవి (బయ్యాంబ) కాకతీయ గణపతిదేవుని చెల్లెలు మైలాంబ, భర్త నతవాడి రుద్రుని కుమార్తె. కోటవంశంలో ముగ్గురు కేతనలు, 4గురు భీములు వున్నారు. 1250లో యనమదలలో గణపాంబ వేయించిన శాసనంలో పేర్కొనబడిన మొదటి, రెండవ కేతనలు, మొదటి, రెండవ భీములే రాజేశ్వరపురం శాసనంలో పేర్కొనబడిన కేతన, భీములు అవుతారు. కేతనలకు మారుపేర్లు వుంటే వారు కేశవ, మాధవ భూపతులవుతారు. కోట వంశం వారికున్న బిరుదులలో పర(బల)సాధక, (గండ)భేరుండ కేతనలుండడం ఆధారంగా ఈ శాసనం కోట వారిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజేశ్వరపురం గ్రామాన్ని కోట కేతన నిర్మించివుంటాడు. గ్రామంలో శివాలయం, గోఫాలస్వామి దేవాలయాలకు దక్షిణంగా పురాతన కాలంనాటి రాతికోట ఒకటి శిథిలమై వుంది.


రాజేశ్వరపుర శాసనంలో విష్ణుమూర్తి నాభిపద్మం నుంచి పుట్టిన బ్రహ్మపాదాల నుంచి పుట్టిన కోట కేతన వంశీకులు నిర్మించిన రాజేశ్వరపురం గ్రామంలోని వీరగోపాలస్వామి (మీసాల గోపాలస్వామి) దేవాలయానికి చేసిన భూదానాన్ని వివరిస్తున్నది ఈ శాసనం. కోట వంశంలో పుట్టిన కేతన, భీముడు, కేశవ భూపతి, బయ్యమాంబ పుత్రుడు మాధవ భూపతి. భేరుండ కేతన అతని భృత్యుడు కామిరెడ్డి, వెర్రమ, కాట్రెడ్డి మాచిరెడ్డి, ధీరుడు గోపాలవర్ధనుడు, ప్రోలాంబిక పుత్రుడు మందడి ప్రోలుడు కల్పవృక్షము లక్ష్మితో పాటు పుట్టినట్లుగా, సోమాంబతో కలిసి పుట్టాడని వివరిస్తున్నది శాసనం.


ఈ శాసనం శకాబ్దాలు రూప,బాణ,క్షితి,శశి మాధవ శుక్లపక్ష కావ్యవారం దశమి నాడు ద్విజవరులచేత ప్రతిష్ట చేయబడింది. శకసం. రూప1, బాణొ5, క్షితి1, శిశి1 వామాంకగతిలో చదివితే శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించబడింది. అనగా క్రీ.శ. 1229 మే 4న.


వీరగోపాలస్వామి దేవునికి అంగ, రంగ, భోగాలకు, బ్రాహ్మణులకు ధారవోయించి యిచ్చిన వ్రిత్తులు (శాశ్వతముగా అనుభవించు దానాలు)గా కట్టంగూరి చెరువు పడుమట, తాటితోట తూర్పున 8, తూర్పు తాటితోట వద్ద 4, (నేల)కొండపల్లి చెరువు ఉత్తరాన 1, తోటన 1, ముకిందపాయ చెరువుతూర్పు మామిడితోటన 4, పడుమట 1, సూరాదేవిపల్లి పొలాన4, బొల్లికుంట తూర్పున 5, ఇప్పల ఎరగుంట ఉత్తరాన 16, నల్లచెరువు ఉత్తరాన 10, దొంతు చెరువు ముందట నీరునేల (తరిభూమి), రాజనపు కాలువ రాటనపు నూతి తూర్పున ప.(ప అంటే పట్టు అని అర్థం. పట్టు అనేది పుట్టికి వాడినదై వుండొచ్చు. పుట్టి పండే భూమిని ఖండుక అని కూడా అంటారు.), గండకాలువనుప, దంతుల చెరువు మేడికొమ్మున ప, జుమలూరి గణయ మోగడ్ల చెరువు వెనక కాలువ పడుమట ప దానముగా ఇవ్వబడినవని శాసనం వివరిస్తున్నది.


రాటనపు నూయిః రాజేశ్వరపురం గోపాలస్వామి గుడికి వాయవ్యదిశలో మంచినీటి బావి వుంది. దానిపక్కన 20 అడుగుల ఎత్తున్న ఒక రాతిపలకస్తంభం వుంది. దానిపైన గాడి వుంది.గాడికి రెండువైపుల లోపలి అంచులలో రంధ్రాలున్నాయి. ఇవి గిలక లేక కదురువంటిది అమర్చడానికి అవసరమైనవి. దీనిమీద పొడుగాటి కర్రకు ఒకవైపు బొక్కెన మరోవైపున మనిషి నిలబడి,కర్రను తొక్కుతూ నీళ్ళు తోడేవాడు. దీనిని రాటనంబాయి అంటారు. ఇది గుడిబాయి. దానిలోని నీరు వ్యవసాయం సాగుకు వాడుకున్న ప్రజలు రాటనం పన్ను కడుతుండేవారు. దీనిమీద ‘నీరడి’ అని రాసివుంది. నీరడి అంటే నీటికట్టుబాటు, ఏర్పాటు, నిర్వహణలు.
ఈ శాసనం కోటనాయకుల గురించి తెలియజేసే శాసనాలలో కొత్తగా చేర్చతగినది. శాసనలిపి కూడా కాకతీయ శాసనాలలోని లిపిని పోలినప్పటికి కొన్ని అక్షరాల లేఖనము శాసనలేఖకుని కారణంగా భిన్నరూపంలో అగుపించాయి. శాసనానికి వాడిన రాయికూడా స్తంభ రూపంలో లేదు. ఫలకం వలె వుంది.


రాజ్యం: కాకతీయ
రాజు: గణపతిదేవ మహారాజు సామంతులు కోట వంశం వారు
రాజవంశం: కోట
కాలం: శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించ బడింది. అనగా క్రీ.శ. 1229 మే 4.
శాసనభాష: తెలుగు, సంస్కృతము
శాసనలిపి: తెలుగు (13వ శతాబ్దపు తెలుగు)
శాసనపంక్తులు: 52


రాజేశ్వరపురం శాసనపాఠం:
తూర్పు వైపు:

1. శ్రీనాథనాభికంజత్సంజాత బ్ర
2. హ్మాంఘ్రిజాత్కులాతుకోటకేత..
3. ….పో విప్రసాత్కుత గ్రామస.. (సాత్థ్రుత)
4. ప్రతి… తస్మాచ్ఛ భూనృపో భిమ
5. స్తస్మాత్కేశవభూపతిః అమ
6. రేశ పందాంభోజారాధకః పరసా
7. ధకః తత భూద్బయ్యమాం
8. బాయాంపుత్య్రం మాధవ
9. భూపతిః భేరుండ కేతన స్సత్య
10. వాదింన్మగణవాధిపః తద్భృ
11. త్యః కామిరెడ్డి తద్వావెఱ్ఱమ
12. దొరపో కాట్రెడ్డిమ్మాచిరెడ్డి
13. శ్చ ధీరో గోపాలవర్ధనః ప్రోలా
14. 0బికా పయోవిచ్యుం మంద
15. డి ప్రోలమందరాత్యే సహనృప (సో)
16. మాంబయాజాతా కల్పవృక్ష
17. ఇవశ్రియా శాకాబ్దరూప బా
18. ణ క్షితి శశిగణితే మాధవ శుక్ల
19. పక్ష కావ్యవారే దశమ్యాం ద్విజ
20. వర సహితాస్త ప్రతిష్టామ
21. కుమకుర్వనే ప్రాసాదం భా
22. నురమ్యం మునిసుర మ
23. నుజారొదరాదర్చితా ప్రెగ్గో
24. పిబఃక్కొక్కథాణిస్తితి రుచితమా
25. తే గ్గొపవేషసృ విష్ణోః రాజు
26. లు వేటింది ఇరుగారు దాప
27. దియ కడప దేవరనగ
28. రి ఇశాన్యననం బారి నివేశ
29. నము


పడమటివైపు:
1. వీరగోపాలదేవరకు అంగరంగ
2. భోగాలకు బ్రాహ్మలకుం గాలోచితము
3. లు హవిన్‍ ధారవోయించిన వ్రిత్తు
4. లు కట్టంగూరి చెరువు పడుమట తా
5. డి తొంటన (8)దాని తూర్పున తాడితొ
6. 0టన 4 కొండపల్లిచెరువు ఉత్తరా
7. న1కి దాని ఉత్తరాన తొంటన1
8. ముకిందపాయ చెరువు తూర్పున మా
9. విండితొంటన4, ఆ తెర్వు పడుమట
10. న1 ఆ తెరువు పడుమట సూరా
11. దేవిపల్లి పొలానన 4 దేవరబండ
12. ఉత్తరాన 8 బొల్లిగుంటి తిపున 5
13. ఇప్పల ఎఱంగుంట ఉత్తరానన16
14. నల్లంజెరువు ఉత్తరానన10… దొ
15. 0తుచెరువు ముందటన
16. నీరునేల రాజనపుం గాలువ
17. రాటనపు నూంతి తూర్పున
18. ప=జగయేచ గండకాలు
19. వను ప దంతుల చెరువు
20. మేడికొంమున ప=జుమ
21. లూరి గణయ మోగడ్లచెర్వు
22. వెనక ఎత్తుంగాలువ పడు
23. మట పెట్టింది ప


-శ్రీరామోజు హరగోపాల్‍
ఎ : 9949498698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *