1970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్ జమాలుద్దీన్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన ఎవరు? నిజాం రాజు ఆస్థానంలో విదూషకుడా? కాదు. ఆయన ఆస్థానంలో అలాంటివారు ఎవరూలేరు. కానీ జమాలుద్దీన్ అనధికారంగా అంతటివాడే.
అక్బర్ ఆస్థానంలో బీర్‍బల్‍లాగా, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగ కవిలాగా, మన హైదరాబాద్ సంస్థానాధీశుడు లేడు. కానీ, ఆయన దగ్గరే చిరు ఉద్యోగిగా చేరి, క్రమక్రమంగా ‘బాగే-ఎ-ఆమ్’ పబ్లిక్ గార్డెన్స్కు సూపరింటెండ్‍గా పదోన్నతి సాధించాడు.
తెనాలి రామలింగడి గురించి, బీర్‍బల్ గురించి ఎలాగైతే కథలు, పిట్టకథలు వ్యాప్తిలోకి వచ్చాయో జమాలుద్దీన్ పేరుతో అలాంటివే ఎన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ తరంవారికి అవి అభూత కల్పనలని అనిపిస్తాయి. ‘జమాలుద్దీన్’ అనేది ఎవరో సృష్టించిన ఒక పాత్ర అని కూడా అనుకున్నారు. కానీ, జమాలుద్దీన్ నిజాం కాలంలో రంగ ప్రవేశం చేసి, తనదైన తరహాలో పాత్ర పోషణ చేసి ఈ జీవిత నాటకరంగం నుంచి నిష్క్రమించిన ఒక సజీవ విదూషకుడు! నిజాంరాజు ఆయనను ఆస్థాన విదూషకుడిగా నియమించకపోయినా, ప్రజల దృష్టిలో ఆయన హైదరాబాదు సంస్థానానికి విదూషకుడయ్యాడు.
దక్కను పీఠభూమిలో హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ప్రత్యేకమైన వంటకాలవలె జమాలుద్దీన్ సర్వర్ దండా లాంటి వాళ్లు కూడా హైదరాబాదు సంస్కృతిలో భాగమైపోయారు. నిజాం కుటుంబానికి అతి సన్నిహితుడైన జమాలుద్దీన్ టిప్పు సుల్తాన్ వంశంలోనివాడు.
1881లో మద్రాసులో అంటే చెన్నైలో పుట్టాడు. విద్యాభ్యాసం కోసం విద్యార్థిగా హైదరాబాదు చేరాడు. నాటి ప్రముఖ విద్యావేత్త, సరోజినీ నాయుడి తండ్రిగారైన అఘోరనాథ ఛటోపాధ్యాయ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. మెట్రుక్యులేషన్ పాసయ్యేవరకు సరోజినీ నాయుడి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి తిరిగాడు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నిజాం కళాశాలకు ప్రిన్సిపాల్‍గా ఉండేవారు. ఆబీడ్స్ రోడ్డులోని ‘గోల్డెన్ త్రెషోల్డ్’ భవనం వారి నివాసంగా ఉండేది. కవులకు కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు అది కేంద్రంగా విలసిల్లింది. సరోజినీ నాయుడితో పాటు ఆమె సోదరుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వీరి వయసువాడే! ఇక్కడ – అనుకోకుండా ఇంటా బయటా లభించిన సాహిత్య కళారంగాల వాతావరణం జమాలుద్దీన్ ఎదుగుదలకు దోహదం చేసింది.
అలాగే, ఒక మంచి అవకాశం కూడా అనుకోకుండానే చేజిక్కింది. జమాలుద్దీన్‍కు నవాబ్ కాజిమ్‍యార్ జంగ్ సోదరి గౌసియా బేగంతో ‘నిఖా’ జరిగింది. నవాబ్ కాజిమ్‍యార్ జంగ్ అంటే మాటలా? నిజాం ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన శాఖ నిర్వహిస్తున్న ‘నజీర్’! నవాబుల కుటుంబం. అందులో మంత్రిగారి చెల్లెలుతో పెళ్ళి. ఇంకేముంది? జమాలుద్దీన్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇకనేం నిజాం ప్రభువుతోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ పరిచయం కావడం, సాన్నిహిత్యం పెరగడం ఇక సహజమేకదా? ఆ విధంగా జమాలుద్దీన్‍కు సన్నిహితుడయ్యాడు. ఉద్యానవన శాఖలో నిన్న ఉద్యోగిగా చేరి, అనతి కాలంలో త్వరితగతిని పబ్లిక్ గార్డెన్స్కు అంటే ‘బాగ్-ఎ-ఆమ్’కు సూపరిటెండ్ అయ్యాడు. పబ్లిక్ గార్డెన్స్లో ‘జపనీస్ గార్డెన్’ అభివృద్ధి చేయడానికి నిజాం, జమాలుద్దీన్‍ను జపాన్ పంపించాడు.
జమాలుద్దీన్ జపాన్ వెళ్ళి అక్కడి తోటల పెంపకం, నిర్వహణ అంతా అధ్యయనం చేశాడు. హైదరాబాదుకు తిరిగొచ్చాక వెంటనే కార్యరంగంలోకి దూకకుండా కాలయాపన చేశాడు. ఈయన బద్దకాన్ని గమనించి నిజాం ప్రభువే వెంటపడి ‘ఎంత డబ్బు కావాలో తీసుకో, జపాన్ గార్డెన్ అభివృద్ధి చెయ్యి’ అని ఒత్తిడి చేయసాగాడు. లక్ష రూపాయలు, సంవత్సరం గడుపూ కావాలన్నాడు జమాలుద్దీన్. నిజాం మంజూర్ చేశాడు.
కాలం గడిచింది. లక్ష ఖర్చయ్యింది. కానీ, ‘‘జపాన్ గార్డెన్’’లో ఒక్క మొక్కా పెంచలేదు. జపనీస్ పద్ధతిలో ఉద్యానవనం తయారై ఉంటుందనుకుని ఎంతో ఉబలాటంతో నిజాం రాజు తనిఖీకి వచ్చాడు. ‘పని ఎంతవరకు వచ్చింది’ అని అడిగాడు.
‘‘జపాన్ గార్డెన్ అంతా సిద్ధమైంది ప్రభూ! కానీ, ఒక్కటే తక్కువ! జపాన్ నుండి అగ్ని పర్వతాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంది!’’ అని నివేదించుకున్నాడు -జమాలుద్దీన్, పిసినిగొట్టూ, కోపిష్టీ అయిన నిజాం ప్రభువు మరి ఆ సమయంలో ఏ గుణాన ఉన్నాడో గానీ… చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. గార్డెన్‍కు మరికొంత డబ్బు మంజూరు చేశాడు. ఆ తర్వాత జమాలుద్దీన్ తన బద్ధకం వదిలించుకుని, రాత్రింబవళ్ళు జపనీయ తోట పెంపకం మీద మనసు పెట్టాడు. చివరకు జపనీస్ శైలిలో అద్భుతమైన గార్డెన్ అభివృద్ధి చేశాడు. ఇటీవలి కాలం వరకు పబ్లిక్ గార్డెన్‍లో జపనీస్ విభాగం ప్రపంచ విహారయాత్రికులను ఎంతగానో అలరించేది.
తర్వాత కాలంలో పబ్లిక్ గార్డెన్స్లో లలిత కళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయ భవన సముదాయం రావడంతో జమాలుద్దీన్ అభివృద్ధి పరిచిన జపనీస్ గార్డెన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బెరార్ యువరాజు, నిజాం యువరాజు మొజంజా మొదలైనవారంతా జమాలుద్దీన్‍తో స్నేహంగా ఉండేవారు. అప్పటికి మోటారు వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. గుర్రాలు వాడుకలో ఉండేవి. గుర్రాలమీద స్వారి చేస్తూ ఈ మిత్రులంతా ‘బాగె-ఎ-ఆమ్’కు వచ్చి జమాలుద్దీన్‍తో బాతాఖానీ వేసి, గరమ్ చాయ్ తాగి సరదాగా గడుపుతూ ఉండేవారు.
1940లో జమాలుద్దీన్ రెడ్ హిల్స్లో ఒక చిన్న భవనం కట్టుకున్నాడు. అది కూడా జపనీస్ శైలిలో ఎంతో అందంగా తయా రైంది. దాని పేరు ‘ఫెర్న్విల్లా’. అయితే జమాలుద్దీన్ ఆ భవనంలో ఎక్కువకాలం గడపలేకపోయాడు. కారణం, 1942లో ఆయన అకాల మరణం పొందాడు. కుటుంబంలోని వారంతా అనాధలయ్యారు.
జమాలుద్దీన్ కొడుకు ఇంటిలోని వస్తువులన్నీ అమ్ముతున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది తెలిసి నిజాం ప్రభువు హుటా హుటిన ‘ఫెర్న్విల్లా’కు వెళ్ళాడు. అక్కడి ఆస్థి విలువ ఎంతుందో అధికారులను లెక్కగట్ట మన్నాడు. వాళ్ళు అటూ ఇటూ కూడీ, తీసివేసి చివరకు ఆ ఆస్థి విలువ రెండు లక్షలని తేల్చారు. నిజాం భృకుటి ముడిచాడు. భవనం, ఫర్నీచర్, ఇతర వస్తువులు అన్నీ కలిపి లక్షకు బేరమాడాడు. ప్రభువే ఆ మాట అంటే కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చి కొంటామని ఎవరుమాత్రం ముందుకొస్తారూ? ఎంతటి ప్రభువైనా నిజాం పిసినారితరం జగద్విఖ్యాతమైంది. ‘ద టీల్స్ ఆఫ్ ఇండియన్ ప్రిన్సెస్’ అనే ప్రసిద్ధ గ్రంథంలో కూడా నిజాం పిసినారితనం నమోదై ఉంది.
జమాలుద్దీన్ బతికి ఉన్నంతకాలం నిజాంను అపహాస్యం చేస్తుండేవాడు. జమాలుద్దీన్ ‘ఫెర్న్విల్లా’ కట్టుకున్న తొలి రోజుల్లో యువరాజు మొజంజా ఫెర్నావిల్లాకు వచ్చి ‘ఇదేమిటి పావురాల గూళ్ళలాగ ఇంత ఇరుకుగా ఉందీ ఇల్లూ- ఇందులో ఎట్లా ఉంటారూ?’ అని హేళన చేశాడు. ‘తన స్థాయికి, తన సంపాదనకు తగినట్టుగా తను కట్టుకున్నానని జమాలుద్దీన్ సవినయంగా మనవి చేసుకున్నాడు. విచిత్రమేమంటే పోలీస్ యాక్షన్ తర్వాత యువరాజు తన అధికారం నివాసం ‘హిల్ ఫోర్ట్ ప్యాలెస్’ వదిలి, తన తండ్రి నిజాం బేరమాడి కొన్న ఈ ‘ఫెర్న్విల్లా’లోనే ఇరవైయేళ్ళు నివసించాడు. అలా జమాలుద్దీన్ కట్టిన పావురాల గూడులో యువరాజుకు జీవితం వెళ్ళబోయక తప్పిందికాదు.
జమాలుద్దీన్ పేర ప్రచారంలో ఉన్న కొన్ని హాస్యోక్తులు చూద్దాం. జమాలుద్దీన్ టోపీ ముందు భాగాన్ని వెనక్కి పెట్టుకుని తిరిగేవాడట. అదేమంటే ‘ఏమో నిజాం ప్రభువు గబుక్కున వెనకనుండి వస్తే ఎట్లా? అందుకే ఈ ఏర్పాటు’- అని అనేవాడట. తెలివి తక్కువ నౌకరు ఇంట్లో మేకు కొడుతున్నాడట. మేకు తలభాగం గోడకు పెట్టి, మొనతేలిన భాగాన్ని బాదుతున్నాడట. అది గమనించిన జమాలుద్దీన్ ‘ఆ మేకు ఆ గోడది కాదురా! అదిగో ఎదురుగా ఉన్న గోడది! కదిలించకుండా అలాగే తీసుకెళ్ళి ఎదురుగా కొట్టు దిగుతుంది’ అని చెప్పాడట. ఒక్కో గోడకు ఒక్కోరకం మేకులుంటాయా – అని నౌకరు ఆశ్చర్యపోయ్యాడట. ఒకసారి కారు డ్రైవర్ సడన్‍గా బ్రేకు వేశాడట. ఏమిటి? ఏమైంది? అని అడిగాడు జమాలుద్దీన్. ‘ఎదురుగా గొయ్యి ఉందిసార్. చూస్కోలే. మాఫ్‍కర్‍నా’ అన్నాడట డ్రైవర్.
‘‘గొయ్యి ఉన్నా నుయ్యి ఉన్నా హారన్ మోగిస్తూ వెళ్ళిపోవాలేగాని, బ్రేకులు కొట్టి కార్లో ఉన్నవాళ్ళ ప్రాణం తీస్తావా?’’ అని సీరియస్‍గా జోక్ చేశాడట జమాలుద్దీన్.
చదువుకోసం కూతురిని జమాలుద్దీన్ ఢిల్లీకి పంపించాడు. అక్కడ ఆమె ‘పింగ్‍పాంగ్’ ఆట నేర్చుకుని తల్లిదండ్రులకు ‘‘నేను పింగ్‍పాంగ్‍ను వదిలి ఉండలేకపోతున్నా’’నని ఉత్తరం రాసింది.
దానికి జమాలుద్దీన్ ‘అదిగో చూశావా నీ కూతురు ఎవరో చైనా వాడి వలలో పడింది’ అని భార్యను బెదిరించాడట. జమాలుద్దీన్ భార్య గౌసియా బేగం తెలివి తక్కువది కాదు. ‘పింగ్‍పాంగ్’– అంటే టేబుల్ టెన్నిస్ అని భర్తకు తెలియ జెప్పింది. నవాబుల కుటుంబంలోంచి వచ్చిన గౌసియా బేగం స్త్రీవిద్యకు ముఖ్యంగా హైదరాబాదు సంస్థానంలో మాంటిస్సోరి విద్యావిధానానికి నాంది పలికిన నారీమణి! ఇక్కడి నుండి పట్టభద్రులైన తొలితరం మహిళల్లో ఆమె ఒకరు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ వెళ్ళి మాంటిస్సోరి విద్యావిధానాన్ని అధ్యయనం చేసొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టిన ఘనత ఆమెదే! భర్త జమాలుద్దీన్ అటు ఉద్యానవన శాఖను పరిపుష్ఠి గావిస్తే, ఇటు ఈమె విద్యారంగాన్ని సుసంపన్నం చేశారు. హైదరాబాదు చరిత్ర పుటల్లో ఈ దంపతుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
-డా।। దేవరాజు మహారాజు
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)