సమతల
దర్పణమే ఐ తీరాలని
నిబంధనలేం లేవు
జల్లులు జల్లులుగా
వానకురుస్తూ ఉన్నప్పుడు
తుంపర తుంపరలుగా
చూరుచుక్కలు జారవిడుస్తూ ఉన్నప్పుడు
తరచిన అంతరంగంలా
శిలాకెరటాన్ని నునుపుగా చెక్కితే
అద్దంలానే ప్రతిబింబాన్ని పరుస్తుంది
సప్తవర్ణాల నయాసౌధాల నేలగోడల్లో
దీనవదనాలే కాదు
దిక్కులన్నీ కనిపిస్తాయి
మేఘాలు ఢీకొని మెరిసిన
ఆకాశ దర్పణం మీద
భూతల తడితలంపు
చిత్రితమౌతూనే ఉంటుంది
భూమ్యాకాశాల నడిమి
ఆవర్తన రేఖనిండా తిరగాడే
పిట్టలగుంపు మనుషుల్లోనే
దాగిన రెక్కలను
సంకేతిస్తూ ఉంటాయి
అన్నీ అంచనాలే
అనంతంలో దేన్నైనా
అచ్చంగా దాన్లాగే చూపే
పరికరమేదీ ఉన్నట్టు లేదు
అయినా మనల్ని మనం
అద్దంలోనేనా
మిత్రుల కనురెప్పలు చిలికే
నీలిమలోనూ చూసుకోవచ్చు
సహచరి చిట్లించే
కనుబొమల వంపుల్లోనూ
వ్యక్తపరచుకోవచ్చు
కన్నవాళ్ళ చిట్టివదనపు
భవితలోనూ దర్శించుకోవచ్చు
మనం పట్టించుకోంగానీ
మన చుట్టూ తిరగాడుతున్నదంతా
మనకో నిజదర్పణమే
-ఏనుగు నరసింహారెడ్డి
ఎ : 8978869183