చందాల కేశవదాసు పాటలు
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లడిల్లిన పాట. తల్లి చేయి పట్టుకొని ఊరూర తిరిగిన పాట. అన్న తపోదీక్షతో జీవితాన్ని అవగాహన చేసుకున్న పాట. భక్తి తత్వాన్ని, పరమార్థిక చింతనను గానం చేసిన పాట. మదినిండ శ్రీరామ తత్వాన్ని నింపుకొని తమ్మర సీతారామచంద్ర స్వామికే అంకితమైన పాట. దేహమే దేవాలయంగ ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన పాట. హరికథా సుగంధాలను వెదజల్లిన పాట. మొట్టమొదటి మాటల సినిమాకు పాటలు రాసిన తొలి తెలుగు సినీ గేయకవి చందాల కేశవదాసు గురించి నేటి మన ‘అలుగెల్లిన పాట’లో…
క్రీ.శ. 18వ శతాబ్ధంలో కేశవదాసు పూర్వికులు గుంటూరు జిల్లాలో గల చందవోలు గ్రామాన్ని విడిచి ఖమ్మం జిల్లా గంగదేవి పాడుకు చేరుకున్నరు. క్రమంగా చందవోలు చందాలగా మారి వీరు అక్కడే చందాలవారిగా స్థిరపడ్డారు. చందాల లక్ష్మీనారాయణ – పాపమ్మ దంపతులకు వెంకట్రామయ్య, కేశవదాసు అనే ఇద్దరు కొడుకులు కలిగిండ్రు. 1876 జూన్ 20న జక్కేపల్లిలో జన్మించిన కేశవదాసుకు పసితనం నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈయన తండ్రి వద్దనే ప్రాథమిక విద్యను పూర్తిచేసిండు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి పాపమ్మ కేశవదాసును గంగదేవిపాడులోని ఒక పంతులు దగ్గర చదువుకోసం పంపింది. మూడు నెలలకు కలిపి 25 పైసలు ఇచ్చేది. ఆ డబ్బు కూడా లేకపోవడంతో అనేక బాధలు పడ్డది. అప్పటికే తపోజీవితాన్ని గడుపుతున్న పెద్దకొడుకు వెంకట్రామయ్య వద్దకు తీసుకొచ్చింది. అన్నవద్దనే కేశవదాసు ఉపాసన విద్యను, అవధాన విద్యను అభ్యసించిండు. రామ నామ మంత్రాన్ని ఉపదేశించింన అన్నకు కేశవదాసు అనుంగు శిశ్యుడిగా మారిపోయిండు. అయితే తనలాగ తమ్ముడు బ్రహ్మచర్యం పాటించ కూడదని ఆశించిండు. గృహస్థ జీవితం గడపమని ఆజ్ఞాపించిండు. ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి బంధువుల అమ్మాయిని పెండ్లి చేసుకుండు. ఆమె రామకవి అనే కుమారునికి జన్మనిచ్చి చనిపోయింది. రామయ్య కూతురు చిట్టెమ్మను పెండ్లి చేసుకుండు. చందాల కేశవదాసు – చిట్టెమ్మ దంపతులకు కృష్ణమూర్తి, సీతారామయ్య, అండాలు అనే ముగ్గురు పిల్లలు కలిగిండ్రు.
భక్తి తత్వాన్ని అలవర్చుకున్న కేశవదాసు మనుషులంతా సమానమనే భావనతో పల్లెపల్లెకు తిరుగుతూ, తన ఇష్ట దైవమైన శ్రీరాముని కీర్తిస్తూ ఉండేవాడు. 1907లో కేశవదాసు నేలకొండపల్లిని దాటి శ్రీరామనవమి ఉత్సవాలు జరిగే తమ్మర గ్రామానికి చేరుకుండు. ఆలయ ప్రధాన అర్చకుల కోరిక మేరకు కేశవదాసు రాముని మీద ‘స్తవమాలిక’ను రాసి ఇచ్చిండు. ఆలయ ప్రధానార్చకుడు, కవి పండితుడైన నరహరి నర్సింహాచార్యులు దగ్గర వైష్టవ తత్వ రహస్యాలను తెలుసుకుండు. కవితా నిర్మాణ విశేషాలను, పౌరాణిక రచనా లక్షణాలను నేర్చుకుండు. ఆయననే గురువుగా స్వీకరించి జీవన గమనాన్ని కొనసాగించిండు.
చందాల కేశవదాసు శ్రీరాముని సేవలోనే శ్రీరామదండకం, పంచముఖ ఆంజనేయ దండకం, మంగళహారతలు, జోలపాటలు హెచ్చరికల వంటి ఎన్నో భక్తి గీతాలను రాసిండు.
చందాల కేశవదాసు రచించిన మంగళహారతులు అనేక దేవాలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందినవి దేవాలయ వేడుకలలో చివరిదైన ఊంజల సేవకు సంబంధించి ఆయన ఎన్నో పాటలు రాసిండు. ఉత్సవ విగ్రహాలను, ఊరేగింపు అనంతరం తిరిగి దేవాలయాలలో ప్రవేశప్టెడాన్ని ‘వేంచేపు’ అంటరు. ఈ సందర్భంలో అర్చకులు చతుశ్లోకి, అష్టశ్లోకి వంటి స్తోత్రాలను చదువుతరు. ఈ సందర్భంలో పాడే పాటలను ‘హెచ్చరికా’ అంటరు. చందాల కేశవదాసు ఈ సందర్భానికి తగ్గట్టుగా అనేక హెచ్చరికా గీతాలను రాసిండు. పొద్దునే దేవున్ని నిద్రలేపే సమయంలో ఆలపించే ‘మేలుకొలుపు’ గీతాలనే ప్రభాత గీతాలని, వైతాళిక గీతాలని కూడ అంటరు. తమ్మర సీతారామచంద్ర స్వామిని మేలుకొలిపే పాటలను చందాల కేశవదాసు రాసిండు.
చందాల కేశవదాసు పెండ్లీలలో సరదాగా ఆటపట్టించే తలుపుల పాటను కూడ రాసిండు.
‘‘శ్రీజానకి తలుపుల బంధనమును జేసితి వేటికి
భామా పూజిత సద్గుణ గణధామా’’
ఈ పాట అతి తేలికైన పదాలతో సరదాగ సాగిపోతది. అత్యంత ఛమత్కారంతో కూడిన ఈ పాట నూతన వధూవరుల జీవితంలో మరిచిపోలేని ఒక అధ్భుతమైన ఆనందకరమైన సంఘటనగా, సన్నివేశంగా మిగిలిపోతది. చందాల కేశవదాసు రచనల్లో ఒకే ఒక్క శివనామ స్తోత్రం కనిపిస్తది.
1910లో యాదగిరిగుట్ట బ్రహ్మత్సవాలలో పాల్గొన్నారు. ఆ సంవత్సరం నుంచి వీరి కోరిక మేరకు స్వామివారి బ్రహ్మత్సవాలలో భాగంగ సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేశవదాసు రాసిన ప్రార్థనా గీతం నాటక సమాజాలలో ఎంతో ప్రసిద్ధి చెందింది. మొట్ట మొదట ‘సురభి’ నాటక సంస్థ వారు దీన్ని ప్రార్థనా గీతంగా పాడుకున్నరు. దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత 1937లో విడుదలైన ‘భక్తదృవ్’ అనే హిందీ సినిమాలో టైటిల్స్ నేపధ్యగీతంగా కేశవదాసు పాటను వాడుకున్నరు. నెల్లుట్ల గ్రామానికి చెందిన రామనర్సింహారావు ప్రోత్సాహంతో 1911లో ‘కనక్తార’ అనే నాటకాన్ని రాసిండు. 1912లో ‘రుక్మాంగధ’ అనే నాటకాన్ని రాసిండు. ‘‘శ్రీరామ నామామృతం’’ అనే 108 చరణాల గీతాన్ని రాసిండు. 1913లో కేశవ నామాన్ని మకుటంగా చేసుకొని మరో 108 చరణాలతో ‘కేశవశతకం’ రాసి శ్రీరామునికి అంకితం ఇచ్చిండు.
మైలవరం గ్రామానికి చెందిన ‘బాలభారతి’ అనే నాటక సమాజంలో ప్రాంప్టరుగా చేరుతడు. 1915లో ‘నాగదాసు చరిత్ర’ అనే హరికథను రాసి, ఒక గొప్ప సాహితీ కళాఖండంగ తీర్చిదిద్దుతడు. మహాభారతంలోని ‘విరాటపర్వాన్ని’ అదే పేరుతో హరికథాగానం చేస్తడు. దీనినే ‘పాండవ అజ్ఞాతవాసం, అజ్ఞాతవాసం, నర్తనశాల’ అనే వేరువేరు పేర్లతో పిలుస్తుంటరు. ఈ కథాగానంలో 19 పద్యాలు 21 పాటలు ఉంటయి. జనం కరువు కాటకాలు సంభవించిన సమయంలో ఈ పాటలు ఎక్కువగా పాడుకునేది. 1922లో ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ అనే నాటకానికి కేశవదాసు పాటలు రాసిండు. ఈ పాటలకు పాపట్ల బాణీలను సమకూర్చిండు. ఇవి ఎంతో ప్రసిద్ది చెందినవి. ఈ పాటలు ఎక్కడ పాడిన ఆ రోజుల్లో కనకవర్షం కురిసిందంటే అతిశయోక్తి కాదు.
‘‘బలే మంచి చౌక బేరము / ఇది సమయము మించినన్
దొరుకదు త్వరన్ గొనుడు / సుజనులారా…’’ అనే పాట ఆ నాటకంలో పదిహేనవది. శ్రీ కృష్ణున్ని అమ్మకానికి పెట్టిన సందర్భంలో వచ్చే పాట. దీంతో పాటు ‘‘మునివరా తుదకిట్లు’’ అని నారదున్ని సంబోధించి పాడుకునే పాట, ‘‘కొట్టు కొట్టండిరా బుర్ర పగుల కొట్టండిరా’’ వంటి పాటలు బహుళ ప్రచారాన్ని పొందినవి.
1923లో చందాల కేశవదాసు తన సంగీత గురువు పాపెట్ల లక్ష్మీకాంతయ్య చనిపోయినపుడు రాసిన ‘‘స్వరనిధి స్వరపంజరమును స్వరపేటి స్వరాలయంబు స్వరమూర్త్యనుచున్’’ అను పాట ఆర్ద్రత నిండిన పదాలతో, ఆవేదనతో ఆలపించిన ఈ గీతం అందరినీ కదిలిస్తది. ఇట్ల చందాల కేశవదాసు రచనలు చేస్తూ, నాటకాలు ప్రదర్శిస్తూ అనేక ప్రాంతాలు పర్యటించిండు. ‘కనక్తార, రంగూన్‍రౌడి’ వంటి నాటక ప్రదర్శనల కోసం బాంబాయి, మద్రాసు, కలకత్తా, బెంగుళూరు, బర్మా వంటి నగరాలను సందర్శించిండు. తిరిగి 1925లో తమ్మరలో సప్తాహాన్ని ఏర్పాటుచేసి రామనామ సంకీర్తన చేయించిండు.
పానుగంటి లక్ష్మీనర్సింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకం కోసం కేశవదాసు అనేక పాటలు రాసిండు. 1930 ప్రాంతంలో చనిపోయిన మోతీలాల్ నెహ్రును గురించి కేశవదాసు కొన్ని పద్యాలు రచించిండు. బహుశా రాజకీయ నాయకుల మీద తెలుగులో వచ్చిన మొట్టమొదటి రచన కూడ ఇదే కావచ్చు. ఇదే కాకుండ చందాల కేశవదాసు ‘‘దేశమాత దిగులేల’’ అనే గీతాన్ని సాలురి రాజేశ్వర్‍రావుతో కలిసి రికార్డు చేసిండు.
చందాల కేశవదాసు గాంధీజీ ఉద్యమస్ఫూర్తిని, పోరాట పటిమను, దేశ స్వాతంత్య్రకాంక్షను రంగరించి పాట రాసిండు. ఈ పాటను కూడ సాలూరి రాజేశ్వర్‍రావు బెంగుళూరులో పాడి రికార్డు చేసిండు. 1931లో జగ్గయ్యపేటలో ‘విరాటపర్వం’ కథను హరికథాగానం చేస్తున్న సందర్భంలో సుప్రసిద్ద కథారచయిత శ్రీపాద కృష్ణమూర్తి లేచి అదే వేదిక మీద చందాల కేశవదాసును ‘అభినవసూత’ అనే బిరుదుతో సత్కరించిండు. రంగస్థలం మీద ఎన్నో నాటకాలను రక్తికట్టించిన కళాకారులు రఘుపతి వెంకయ్య ప్రోత్సాహంతో క్రమంగా సినిమా వైపు అడుగులు వేసిండ్రు. 1931లోనే తొలి తెలుగు మాటల సినిమాకు అంకురార్పణ జరిగింది. మొదట ఆధ్యాత్మిక, పౌరాణిక నాటకాలనే సినిమాలుగా నిర్మించే ప్రయత్నం చేసిన వాడు హెచ్.యం. రెడ్డి. ఆ రోజుల్లో ధర్మవరం రామకృష్ణాచార్యులు, బళ్ళారి రాఘవ వంటి ప్రముఖులలో ఒకరైన చందాల కేశవదాసుకు సినిమాలో పాటలు రాయడానికి హెచ్.ఎం. రెడ్డి నుంచి ఆహ్వానం అందింది.
ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన నాటకాలలో చిత్రనళీయం, విషాద సారంగధర, ప్రహ్లాద, నాటకాలు అత్యంత ప్రసిద్ది చెందినవి. వీటిలో భక్తిరస ప్రధానమైన ‘ప్రహ్లాద’ ను ‘‘భక్తప్రహ్లాద’’ అనే పేరుతో సినిమాగా తీయాలని, బొంబాయిలోని ‘ఇంపీరియల్ ఫిల్మ్ స్టూడియో’ సహకారంతో కృష్ణా ఫిలింస్ ఆధ్వర్యంలో సినిమాను ప్రారంభించిండ్రు. హెచ్.యం. రెడ్ది దర్శకత్వంలో మొదటి టాకీ సినిమాకు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీతాన్ని సమకూర్చిండు. ధర్మవరం నాటకంలోని మాటలు, పాటలు యధాతథంగ సినిమాలోకి తీసుకున్నప్పటికీ మరికొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడ పాటల అవసరం ఏర్పడింది. వివిధ నాటకాలలో ఎన్నో సుప్రసిద్ద గీతాలు రాసిన చందాల కేశవదాసును దర్శకుడు. తాను తీస్తున్న తొలి తెలుగు టాకీ సినిమాకు పాటలు రాయాల్సిందిగా ఆహ్వానించిండు. నాటకంలోని పాటలు కాకుండ సినిమాలోని సన్నివేశానికి తగ్గట్టుగ పాటలు రాసిన చందాల కేశవదాసు తొలి తెలుగు సినీ గేయ రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిండు.
ఈ మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా ‘భక్తప్రహ్లాద’ 1932 ఫిబ్రవరిలో విడుదలైంది. తర్వాత ఇవే పాటలను ‘సురభి’ నాటక సంస్థవారు వారి ‘ప్లహ్లాద’ నాటకంలో చేర్చుకొని ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నరు. సోమరాజు రామానుజ రావు రచించిన ‘సతీసక్కుబాయి’ నాటకాన్ని 1935లో ‘సతీసక్కుబాయి’అనే పేరుతోనే సినిమా తీసిండ్రు. ఈ సినిమాకోసం చందాల కేశవదాసు రాసిన ఐదు పాటలు బహుళ ప్రజాదరణ పొందినయి.
‘‘నీ పదములనింక నే విడువ జాల’’ వంటి పాటలు జనం నాలుకల మీద నాట్యం చేసినయి. పొద్దున్లేస్తే ఈ పాటలతోనే పల్లె తెల్లారేది. సందర్భానుసారంగ పాడుకొని జనం సరససల్లాపాల్లో తేలియాడేవారు.
1935లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ కృష్ణతులా భారం’ సినిమాలోను చందాల కేశవదాసు పాటలన యథాతథంగ వాడుకున్నరు. 1966లో సురేష్ ప్రొడక్షన్స్వారు ‘శ్రీ కృష్ణతులాభారం’ అనే సినిమాను ఎన్.టి.ఆర్ హీరోగా నిర్మించిండ్రు. ఇందులో చందాల కేశవదాసు మూడు పాటలను వాడుకున్నరు. కాని పేరు వేయలేదు. ఇది గమనించిన కేశవదాసు కుమారుడు కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించడంతో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. 1971లో తిరిగి ఆ సినిమా ప్రింట్లలో చందాల కేశవదాసు పేరును చేర్చడం జరిగింది.
1935లో తమ్మరలో భాగవత సప్తాహం నిర్వహిస్తున్న రోజుల్లోనే కేశవదాసు వామనావతార చరిత్రను ‘బలిబంధనం’ అనే పద్యనాటకంగా రాసిండు. ఈ నాటకంలో ‘‘గుండగొయ్య రకం’’ అనే మాట గాని, ‘కులాసాగా బతికినారు’ అనే తెలుగు, హిందీ పదబంధాల సమ్మిళితం గాని తెలంగాణ భాషాఔన్యత్యాన్ని చాటిచెప్పినట్లయితది. ఈ నాటకంలో ఇంకా అనేక సామెతలు చోటుచేసుకున్నయి. ఇదే సమయంలో చందాల కేశవదాసుకు కలకత్తాలోని ప్రముఖ నటి దాసరి కోటిరత్నం నుంచి ఆహ్వానం అందింది. ఆమే నటించి నిర్మించిన ‘సతీ అనసూయ’ సినిమాకు కేశవదాసుతోనే కథ, మాటలు, పాటలు రాయించుకుంది.
1936 లో సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన ‘లంకాదహనం’ సినిమా కోసం చందాల కేశవదాసు కథ, మాటలు, పాటలు రాసిండు. ఇవే కాకుండ కేశవదాసు ప్రసిద్ద నాటకం ‘కనక్తార’ 1937లో ‘కనకతార’ సినిమాగ వచ్చింది. ఇందులోని ఈ పాటలు పూర్తి జానపదశైలిలో ఉండడంతో అమితమైన జనాదరణ లభించింది. ఈ సినిమాను 1956లో రజనీకాంత్ దర్వకత్వంలో వచ్చినప్పుపడు కూడ కేశవదాసు పాటలను యథాతథంగ వాడుకున్నరు. వీటిని ఘంటసాల స్వరపరిచిండు.
1941లో బేతవోలు జమీందారు పర్సా నారాయణరావు వంటి ప్రముఖుల ఆర్థిక సహకారంతో ‘కనక్తార’ నాటకాన్ని చుట్టుపక్కల గ్రామాలలో లెక్కలేనన్ని సార్లు ప్రదర్శించిండ్రు.
ఈ క్రమంలోనే చందాల కేశవదాసు ‘రాధాకృష్ణ’ లంకాదహనం’ వంటి సినిమాలకు పనిచేసి, 1946లో తిరిగి జక్కేపల్లికి చేరుకుండు. కుటుంబ పోషణ నిమిత్తం అనేక బాధలు పడ్డడు. జక్కేపల్లిలోని చందాల కేశవదాసు ఇంటిపై డాడిచేసిన రజాకార్‍లు సర్వస్వం ధ్వంసం చేసిండ్రు. గాయపడ్డ మనసుతో చందాల కేశవదాసు ఉన్న భూమిని కౌలుకిచ్చి, పెట్టెబేడ సర్దుకొని ఖమ్మం పట్టణానికి చేరుకుండు. పెద్దకొడుకు వైద్యవృత్తికి అనువైన ప్రదేశం కోసం వెతికి సూర్యాపేట దగ్గరలోని నాయకన్‍గూడెం చేరుకొని, అక్కడే స్థిరపడ్డడు. 1948లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్‍రావు, ఎస్. వరలక్ష్మీ నటించిన ‘బాలరాజు’ సినిమాలో చందాల కేశవదాసు ‘రాధాకృష్ణ’ నాటకం కోసం రాసిన పాటలను కొన్నింటిని వాడుకున్నరు.
చందాల కేశవదాసు చివరి రోజుల్లో నాయకన్‍గూడెంలో పెద్దకొడుకు దగ్గర ఉన్న సమయంలో మునగాల కళాకారుల్లో ఒకడైన గంధం నర్సయ్య నటనాకౌశలం కేశవదాసును ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన మాటతీరును, ప్రవర్తనను పరిశీలించిన కేశవదాసు 1955లో తన బిడ్డ ఆండాలును గంధం నర్సయ్యకు ఇచ్చి వివాహం చేసిండు. అనంతరం తమ్మరకు వెళ్ళిన కేశవదాసుకు తన మిత్రులు ఎవరు తారసపడలేదు. ‘‘నేను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అంతా పోయారు. నేను ఏకాకిని’’ అంటూ నిరాశ. నిస్పృలకు లోనై కుప్పగూలిపోయిండు. తెలంగాణ కీర్తిని ప్రశస్త్యం చేసిన చందాల కేశవదాసు ఒక్కసారి కుటుంబ సభ్యులందరిని కండ్లనిండ చూసుకొని కండ్లు మూసిండు. 1956 మే 14న శాశ్వతంగ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిండు.
-అంబటి వేకువ,
94927 55448