సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం

2019 సంవత్సరం వెళ్తూ వెళ్తూ తెలుగువారి విద్వత్తును ప్రశంసిస్తూ సంస్కృత భాషలో ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని రచించిన ఆచార్య పెన్నా మధుసూదన్‍కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‍పల్లి ప్రాంతవాసి మధుసూదన్‍ విద్యాయానం, సాహిత్య వ్యాసంగం అనేక మలుపులు తిరుగుతూ సాగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మధుసూదన్‍ది పురోహిత కుటుంబం. పెన్నా నర్సింహాశర్మ, పెన్నా భారతీ దేవి దంపతులకు ఐదవ బిడ్డగా జన్మించిన వీరు బాల్యంనుండే భాషా, సాహిత్యాలపట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే అక్కెనపల్లి గ్రామానికి చెందిన పండితులు అక్కెనేపల్లి అయోధ్యా రామయ్యగారి వద్ద వేద విద్యను నేర్చుకున్నారు. ఆ తరువాత పదవ తరగతి మహబూబ్‍ నగర్‍ జిల్లా బాదేపల్లిలో చదువుకోవాల్సి వచ్చింది. ఇంట్లోని ముగ్గురు అన్నయ్యలు, ఒక సోదరి సైన్స్ విభాగంలోకి వెళ్ళిపోయారు. ‘సంస్కృతం నేర్చుకుంటావా’ అని తండ్రి అడగగానే నేర్చుకుంటానని మధుసూదన్‍ అనడం వల్ల నేడు ఈ ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు.


ఉపాధ్యాయుడు కూడా అయిన తండ్రి తన కొడుకు ఏ రంగంలో రాణిస్తాడనేది ఆనాడే పసిగట్టగలిగారు. తండ్రి అంచనాలకు మించి ఎదిగిన సంస్కృత జ్ఞానశీలిగా డా. పెన్నా మధుసూదన్‍ ఈనాడు నిలబడ్డారు. డా. పెన్నా మధుసూదన్‍ సంస్కృత విద్యాధ్యయనం సికిందరాబాద్‍లోని బోయిన్‍పల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్దినీ సంస్కృత కళాశాలలో పి.డి.సి మరియు బి. ఏ. న్యాయశాస్త్ర అధ్యయనంతో వేగం పుంజుకుంది. ఆ విద్యాకాలం వారి జీవితాన్ని స్వర్ణయుగంగా మార్చుకోవడానికి దారి చూపింది. బ్రహ్మశ్రీ మరిగంటి శ్రీ రంగాచార్య, బ్రహ్మశ్రీ కందాడై రామానుజాచార్య స్వామి వారిని ఆదర్శంగా తీసుకొని, ఆ గురువుల అద్భుత బోధనలతో సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేసారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో  సంస్కృత శాఖలో ఎం.ఏ, ఎం. ఫిల్‍ పూర్తి చేసి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం విశేషం. ఎం. ఫిల్‍ పరిశోధనలో భాగంగా అభినవగుప్తుల గీతాభాష్య గ్రంథాన్నివిస్తృతంగా అధ్యయనం చేశారు.


ఎం.ఫిల్‍ పూర్తికాగానే సంస్కృత భాషా ప్రచారానికి పూనుకున్నారు. మహర్షి మహేశ్‍ యోగి గారి వేదిక్‍ యూనివర్సిటీ నెదర్లాండ్స్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే కొత్త మార్గంలో వెళ్ళడానికి కావలసిన అధ్యాత్మిక ఆలోచనలకు బీజం పడింది. భావాతీత ధ్యానం నేర్చుకొని యోగ మార్గంలోకి ప్రవేశించారు. తనదైన అధ్యాత్మిక ప్రపంచాన్ని రూపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానం దొరికిన శిక్షణాకాలంగా భావించారు. నిరంతరం తత్త్వచింతన చేసే ఒక స్వభావం సంతరించుకున్న మనిషిగా రూపుదిద్దుకున్నారు. నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి వచ్చిన తరువాత సంస్కృతంలో పి.హెచ్‍ డి చేయడానికి యోగశాస్త్రాన్ని ప్రధాన పరిశోధనాంశంగా తీసుకున్నారు.

పతంజలి యోగసూత్రాలపై, వ్యాసభాష్యం, నారాయణ తీర్థుల యోగ వ్యాఖ్యానం ప్రధానంగా స్వీకరించి లోతైన పరిశీలనల చేసి వ్యాఖ్యా నించారు. 1996లో పి.హెచ్‍ డి పట్టాను అందుకున్నారు. సిఫెల్‍ నుండి జర్మన్‍ భాషలో డిప్లమాను కూడా సాధించారు. హైద్రాబాద్‍ అరోరా డిగ్రీ కాలేజ్‍లో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తూ సాయం కాలాల్లో రామకృష్ణ మఠంలో సంస్కృతాన్ని బోధించేవారు.


డా. పెన్నా మధుసూదన్‍ ప్రైవేట్‍ అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రచనావ్యాసంగాన్ని కొనసాగించారు. అవధాన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవ ప్రేరణతో శ్లోకరచన వేగాన్ని పెంచారు. ‘మద్గల చరిత’ మనే రూపకాన్ని రచించారు. ఇదివారి తొలి సంస్కృత కృతిగా చెప్పవచ్చు. బ్రహ్మశ్రీ పుల్లెల వారి ఆదేశంతో స్కంధ పురాణం మొదటి భాగం అనువాదాన్ని, వారితో కలిసి ఆధ్యాత్మ రామాయణం అనువాదాన్ని పూర్తిచేశారు. అదే కాలంలో బ్రహ్మశ్రీ పాతూరి సీతారామంజనేయులుగారి చెంత శాస్త్ర సంప్రదాయాన్ని గ్రహించారు. బ్రహ్మశ్రీ జ్ఞాన సరస్వతి కందాడై రామానుజాచార్యుల వద్ద ఋషి హృదయాన్ని గ్రహించే మెలకువలను నేర్చుకున్నారు. 2000 సంవత్సరంలో మహారాష్ట్రలోని రామ్‍టెక్‍లో కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍గా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగిగా, సాహితీవేత్తగా మరింత ఉన్నతంగా ఎదగడానికి గొప్ప వేదికగా నిలిచింది. ఆ విశ్వవిద్యాలయ వైస్‍ ఛాన్స్ లర్‍గా, రిజిస్టార్‍ గాను బాధ్యతలను నిర్వహించిన స్థాయికి చేరారు. ప్రస్తుతం అక్కడే భారతీయ దర్శన విభాగం డీన్‍గా విధులు నిర్వర్తిస్తున్నారు.


సాహిత్య పురస్కార గ్రంథం ‘ప్రజ్ఞాచాక్షుషం’ :
మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని ఒక కుగ్రామంలో 1881లో జన్మించిన ‘గులాబ్‍ రావు మొహోడ్‍’ అనే జన్మత: అంధుడి జీవిత ఇతివృత్తమే ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యం. ఒక రైతు కుటుంబంలో ఏ మాత్రం అక్షర గంధంలేని ఇంట్లో నుండి వచ్చిన గులాబ్‍ రావు మొహోడ్‍ తొమ్మిదవ నెలలో ఒక వ్యాధి బారినపడి చూపు కోల్పోయారు. చిన్నతనం నుండే దైవచింతనలో మునిగిపోయారు. వేద వేదాంతశాస్త్రాలను కేవలం వినడం ద్వారానే నేర్చుకున్నారు. అంతః ప్రజ్ఞతో అన్ని శాస్త్రాలసారాన్ని గ్రహించారు. ఆ తత్వశాస్త్ర వెలుగులో నూటా ముప్పైనాలుగు గ్రంథాలను వివిధ భాషలలొ రచించారు. ముప్పైనాలుగో ఏట తుదిశ్వాస విడిచారు. అతి తక్కువ వయసులో విలువైన గ్రంథాలను అందించడంతో పాటు భక్తి సంప్రదాయాలకు, మానవీయ విలువలకు చైతన్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చిన గులాబ్‍ రావు మహారాజ్‍ జీవితాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఆశయంతో ఈ ప్రజ్ఞాచాక్షుషం కావ్యరచనకు పూనుకున్నారు. ఎనిమిది వందల యాబై శ్లోకాలతో, పద్దెనిమిది సర్గలు (అధ్యాయాలు)తో కవితాత్మక రీతిలో చెప్పిన ఈ కావ్యం ఈ పురస్కారానికంటే ముందే ఎందరో సహృదయలను ఆకర్షించింది. కావ్యమనేది స్వాత్మానందానికీ అన్నది నిజమైనా, సమాజం కోసం దాని విలువ చాలా ఉంది. తాను ఆనందిస్తూనే, సమాజంలో ఇతరులకు ఏ జీవనవిలువలను చూపగలిగే కావ్యాన్ని రచించగలిగినా దాని ప్రయోజనం నెరవేరుతుంది. ఈ ఆశయంతోనే డా. పెన్నా ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని మొదలుపెట్టారు. ఇది సంస్కృత సాహిత్యంలో ప్రసాదగుణభరితంగా వైదర్భీరీతిలో సాగిన రచనగా పండితుల మన్ననలు పొందింది. గులాబ్‍ రావ్‍ మహాత్ముని తత్త్వజ్ఞానం అందరికి సరళంగా సుబోధకమయింది. అటువంటి విశిష్టమైన గ్రంథానికి అకాడెమీ పురస్కారం లభించడం ప్రశంసనీయం.
‘ప్రజ్ఞాచాక్షుషం’ కంటే ముందే తెలుగు ప్రాంతానికి చెందిన గణపతిముని గారి జీవితం ఆధారంగా ‘కావ్యకంఠ చరిత’ మనే 21 సర్గల మహాకావ్యాన్ని పెన్నా మధుసూదన్‍ రచించారు. 2012లో చిన్మయ ఇంటర్‍ నేషనల్‍ కేరళ వారి ద్వారా ప్రచురితమైన ఈ కావ్యం కూడా పాఠకాదరణను పొందింది. ‘రాహుల్‍ సాంకృత్యాయన్‍’ జీవితంపై రాసిన లఘుకావ్యం విమర్శకుల ప్రశంసలను అందుకుంది.


డా. పెన్నా మధుసూదన్‍ మొత్తం 37 గ్రంథాలను రచించారు. వీటిలో తొమ్మిది లఘు కావ్యాలున్నాయి. సంస్కృతం నుండి తెలుగులోకి, సంస్కృతం నుండి ఆంగ్లంలోకి, మరాఠి నుండి సంస్కృతానికి అనేక గ్రంథాలను అనువదించారు. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో అరవైకి పైగా ప్రామాణిక పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఎన్నో విలువైన గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతను తీసుకున్నారు. రీసెర్చ్జర్నల్స్కు ఎడిటర్‍ గాను పనిచేస్తున్నారు.


డా. మధుసూదన్‍ పై బాణభట్టు, భవభూతి, కాళిదాసు, శేవడే వంటి మహాకవుల కావ్యాల ప్రభావం ఉంది. సంస్కృతం, హిందీ, మరాఠీ, జర్మన్‍ భాషలలొ ప్రావీణ్యం సంపాదించారు. వీరి పర్యవేక్షణలో 5 గురు పి.హెచ్‍ డి, 30 మంది ఎం.ఫిల్‍ పట్టాలను అందుకున్నారు. ప్రస్తుతం ఎనిమిదిమంది పరిశోధక విద్యార్థులు పి.హెచ్‍ డి, అయిదుగురు ఎం.ఫిల్‍ పరిశోధన చేస్తున్నారు. డా. మధుసూదన్‍ గారు ఈ అకాడెమీ పురస్కారం కంటే ముందు అనేక అవార్డులను అందుకున్నారు. మహారాష్ట్ర సాహిత్య అకాడెమీ వారి ప్రతిష్టాత్మకమైన సాత్వలేకర్‍ అవార్డ్, పండిట్‍ లత్కర్‍ శాస్త్రి మెమోరియల్‍ అవార్డ్, పండిత్‍ ఘాటాటే మెమోరియల్‍ అవార్డ్, శ్రీ వంగీపురం రామానుజాచార్య స్మారక పురస్కారం. గుజరాత్‍లోని సోమనాథ్‍ ట్రస్ట్ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు ‘యువ విపశ్చిత్‍’ బిరుదు, శ్రీ గోళ్వాళ్కర్‍ గురుంజీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా సంస్కృత భారతి వారి ‘సంస్కృత పండిత్‍’ పురస్కారాన్ని పొందారు. 2018లో కెనడాలో జరిగిన ‘విశ్వ సంస్కృతి సదస్సు’లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మధుసూదన్‍ కృషివెనక భార్య రాజేశ్వరి గారి ప్రోత్సాహం మరవలేనిది. కూతుర్లు శ్రీవరేణ్య, హాసికలు కూడా ఉత్తమ విద్యార్జన మార్గంలో పయనిస్తున్నారు. నిరంతర సాహిత్య అధ్యయనం రచనా వ్యాసంగాలతో పాటు ఉత్తమ బోధకుడిగా, పరిపాలనా దక్షకుడిగా రాణిస్తున్న ఆచార్య పెన్నా మధుసూదన్‍ నేటి తరానికి ఆదర్శనీయ వ్యక్తిగా భావించవచ్చు.


డా. ఎస్‍. రఘు, 9848208533

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *