దక్కన్ అకాడమీ (హిమాయత్‍నగర్) చంద్రం భవనంలో ‘వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం-పారిస్ ఒప్పందం తదనంతర కార్యాచరణ’ అంశంపై గత ఏడాది జరిగిన టీఆర్‍సీ టాక్ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ తిమోతి మార్క్ క్యాడ్‍మ్యాన్ (కీ సెంటర్ ఫర్ ఎథిక్స్, లా, జస్టిస్ అండ్ గవర్నెన్స్ అండ్ లా), ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ కె. బాబురావు, చేతన సొసైటీ డైరెక్టర్ డాక్టర్ డి.నర్సింహారెడ్డి, తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టిఆర్‍సి) చైర్మన్ యం.వేదకుమార్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు.
భూతాపం తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. భూతాపం తగ్గించేందుకు ఆయా దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారిస్ సదస్సు పూర్వాపరాల గురించి డాక్టర్ తిమోతి వివరించారు. భూతాపం తగ్గించడానికి ఎవరెలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంత మేరకు తగ్గించాలి అనే విషయమై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. మొత్తం మీద 177 నిర్ణయాలు తీసుకున్నారని, 29 అంశాలు ఉన్నాయని అన్నారు. ఆ చర్యల పురోగతిని ఈ పాలనా వ్యవస్థ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుందన్నారు. వీటి అమలు సరిగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలని, అవగాహన పెరగాలని సూచించారు. పలు దశలు, పలురూపాల్లో ప్రజలు పాల్గొనే విధంగా ప్రతీ దేశం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూతాపం తగ్గించు కోవాలంటే కార్బన్ ప్రింట్‍ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ తిమోతి అన్నారు. ఇప్పటి విధానాల ప్రకారం తగ్గించు కుంటూ పోయినా, కొన్నేళ్ళకు భూమిపై ఉష్ణోగ్రత 3.8 డిగ్రీలు పెరుగుతుందని, అలా కాకుండా ఉండాలంటే కార్బన్ ప్రింట్‍ను మరింతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను శిలాజ ఇంధనాలు గాకుండా ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని అధికం చేసుకోవాలని సూచించారు.
ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే, కరువులు, తుఫానులు, సముద్ర మట్టం పెరగడం, వరదలు లాంటి ప్రకృతి విపత్తుల నుంచి మనం ఏమీ నేర్చుకున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం
ఉందన్నారు. పెట్రోలియం నిల్వలు తగ్గుతున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్‍లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
చేతన సొసైటీ డైరెక్టర్ డాక్టర్ డి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవాణిజ్య సంఘం ఆధ్వర్యంలో చేసుకున్న కొన్ని ఒప్పందాలు పర్యావరణ అనుకూల నిర్ణయాలు తీసుకోకుండా అడ్డంకులుగా మారుతున్నాయన్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ధనిక దేశాల మీద సంధించిన ప్రశ్నలు అంతర్గతంగా మనదేశంలో కూడా సంపన్నవర్గాలకు వర్తిస్తాయన్నారు. అత్యధికం గా ఉన్న పేదలకు అందకుండా ప్రకృతి వనరుల యాజమాన్యం నిర్వహణ, వినియోగం కొద్దిమంది సంపన్నవర్గాల చేతుల్లో ఉండడం వల్ల అసమానతలు పెరిగి సంఘర్షణ పూర్వక వాతావరణం ఏర్పడు తోం దన్నారు. ఆహారం, నీటి కొరతతో పర్యావరణ విధ్వం సం మొదలైంద న్నారు. వివక్షాపూరిత వ్యవస్థ వల్లనే పర్యావరణ విధ్వంసం చోటు చేసు కుంటున్న దన్నారు. ఈ వ్యవస్థను మార్చినప్పుడే పర్యావరణం బాగు పడుతుందని, పేదరికం తగ్గుతుం దని అన్నారు. మన దేశంలో ఉన్న సంప్రదాయ ఉత్పత్తి వనరులను కాపాడుకుంటే మనం ధనిక దేశాల టెక్నాలజీ కోసం అర్రులు చాచాల్సిన పని లేదన్నారు. చేనేత లాంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తే పర్యావరణం, ఉపాధి, ఆర్థిక వ్యవస్థలు బాగుపడతాయన్నారు.
టిఆర్‍సి చైర్మన్ యం.వేదకుమార్ మాట్లాడుతూ సౌరశక్తి, వాయుశక్తి లాంటి ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సామాజిక సంస్థలు మరింతగా ముందుకు రావాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ తరహా కార్యక్రమాలు విజయవంతం కాగలవన్నారు.
- ఆదర్శ్, ఎ : 94945 4130