దేశంలో సుమారు 5 కోట్లమంది హస్తకళాకారులు, నిపుణులైన వృత్తి పనివాళ్లు ఉన్నారు. సరైన గుర్తింపు, సాయం లేనిదే వాళ్లు ఇప్పుడు జీవనం గడపలేకపోతున్నారు. ఎంతోమంది ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. వారసత్వ కళలు అంతరించి పోనున్నాయి. భారతదేశంలోని అన్ని విభాగాల హస్తకళాకారులు విస్మరణకు గురయ్యారు. వారంతా తమను తాము కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున జీఎస్టీ తాకిడి. వారంతా కూడా పేదరికాన్ని, ఆదాయపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారే. అయినా కూడా…. ‘‘హస్తకళాకారులు, వృత్తిపనివాళ్లు, చేనేత కార్మికులు, ఇంట్లో నుంచే పని చేసే నైపుణ్య స్వయం ఉపాధి’’ వారి గురించి ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీలో ఒక్క మాట కూడా ప్రస్తావించక పోవడం విషాదం. వారు ప్రసుత్తం ఎవరి దృష్టికీ రావడం లేదు. ఎవరికీ కనబడకుండా, నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ వారు నిజానికి వలస కూలీల కన్నా, ఇతర అణగారిన వర్గాల కన్నా తక్కువేమీ కాదు. ఒక ప్రముఖ వెబ్ సైట్‍లో వచ్చిన ఒక సానుభూతి వ్యాసం తమ కథలు వినిపించిన వారికి నేరుగా కొన్ని విరాళాలు అందేలా చేసింది. కొందరికి ఎన్జీవోలు సాయం చేశాయి. అయితే ఈ కళాకారుల తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం భారీ స్థాయి ప్రణాళికలు అవసరం.
దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో హస్తకళాకారుల కుటుంబాల విభిన్న పరిస్థితులను పరిశీలించేందుకు వివిధ వర్గాలను క్రమం తప్పకుండా కలుసుకోవాల్సి ఉంటుంది. చేనేత వర్గాలు, మహిళా ఉత్పత్తి సంఘాలు, వివిధ రకాల హస్తకళాకారులు, కుమ్మరులు, బుట్టలు అల్లే వాళ్లు, తివాచీలు నేసే వాళ్లు, సంప్రదాయక కళాకారులు ఈ వర్గాల్లో ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉండే కళాకారులు.
మేము గమనించిన కొన్ని అంశాలు:
- లాక్ డౌన్ ప్రారంభం నాటికి కొందరు 15 రోజులకు సరిపడా మాత్రమే ముడిసరుకులను కలిగి ఉన్నారు.
- బల్క్ ఆర్డర్లు రద్దయిపోయాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కొందరు సరిపడా ఆహారనిల్వలు కలిగిఉన్నారు. పట్టణాల్లో ఉన్నవారు నెలవారీ సరుకులను మాత్రమే కొంటారు. వారికి ఇప్పుడు ఆదాయం లేదు. ఉత్పత్తి చేసేందుకు వర్కర్లు లేరు.
- పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారని, కఠినంగా వ్యవహరిస్తున్నారని, ప్రతీ చోటా ఉంటున్నారని ప్రతీఒక్కరూ చెబుతున్నారు.
- కళల్లో, వృత్తిపనుల్లో పని చేసే రోజువారీ కార్మికులకు లేదా జాబ్ వర్క్ పని వారికి తగిన సరఫరాలు ఉండడం లేదు.
- జూన్ లేదా జులై నాటికి వారు ముడిపదార్థాలను పొంద గలుగుతారు. మార్కెటింగ్ సీజన్‍కు తగినంతగా ఉత్పత్తి చేయగలుగుతారు.
- మార్కెట్లు ఇప్పటికే మాంద్యంతో ఉన్నందున భారీగా విక్రయాలు ఉండకపోవచ్చు.
- చేనేత కార్మికులకు ఇంట్లో మగ్గాలు ఉన్నాయి. కానీ నేసేందుకు యార్న్ లేదు. పేద చేనేత కార్మికులు ఎంతో మంది వారి కింద పని చేస్తుంటారు. వారికి తక్షణం చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇది తీవ్రసమస్యగా మారింది.
- ఇ-కామర్స్తో ప్రస్తుతం పెద్దగా సాయం లభించడం లేదు. డెలివరీలు ప్రారంభమైనా కూడా పెద్దగా ఆశపడలేం. ఎందు కంటే లాక్ డౌన్ కాలంలో ముడిసరఫరాలు నిలిచిపోయాయి, సామూహికంగా చేయాల్సిన పనులు ఆగిపోయాయి.
వృత్తిపనివాళ్లు ఇప్పుడు వడ్డీ రహిత రుణాలు కోరు కుంటున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5,000 నుంచి రూ.10,000 దాకా కనీసం రెండు నెలల పాటు ఇవ్వాలి. బడ్జెట్ కేటాయింపులు లేనందున నేరుగా ప్రభుత్వమే ఈ మొత్తాలను అందించాలి. వారసత్వ కళలతో కూడిన కళాకారులు, వృత్తిపనివారు మార్కెట్‍కు అవసరం. కశ్మీర్‍లో మాదిరిగా హస్తకళాకారులు ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడ్డారు. డిమాండ్‍ను అధికం చేసేందుకు వారికి ఒక సమ్మిశ్రిత ప్రణాళిక అవసరం. తద్వారా వారు రాబోయే పండుగ సీజన్ వైపు ఆశగా చూడవచ్చు. కార్పొరేట్ రంగం ఆగస్టు నాటికి తమ క్లయింట్లకు ఇచ్చే బహుమతుల ఆర్డర్లకు సంబంధించి ఈ హస్తకళాకారులకు అడ్వాన్సులు ఇవ్వాలి. తేలికపాటి నిబంధనలతో బ్యాంకులు సత్వరమే రుణాలు ఇవ్వాలి. దాంతో వారు లాక్ డౌన్ అనంతరం అవకాశం లభించగానే, ముడిపదార్థాలు కొనుగోలు చేయగలుగుతారు. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ తక్షణం దేశంలోని వివిధ ప్రాంతాల నిర్దిష్ట అవసరాలను గమనించాలి. నూలు వడికే వాళ్లకు, నేత కార్మికులకు కేవీఐసీ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు.
ప్రస్తుత ఇన్‍ఫెక్షన్లు దసరా నాటికి తగ్గితే అది చెడుపై మంచి సాధించిన విజయమే అవుతుంది. భారతదేశవ్యాప్తంగా కుమ్మరులకు మట్టిని అందించవచ్చు. ఈ ఏడాదికి పేడతో సైతం ప్రమిదలు చేసుకోవచ్చు. దిగుమతి చేసుకున్న దీపాల స్థానంలో వీటిని వాడుకోవచ్చు. ఇళ్లలో, ప్రార్థనా స్థలాల్లో, దుకాణాలు, కార్యాలయాల్లో లక్షలాది అగరుబత్తీలను వెలిగిస్తుంటారు. నేడు సుమారుగా రూ.400 కోట్ల విలువైన వెదురు ముక్కలను చైనా, వియత్నాంల నుంచి ఐటీసీ, సైకిల్ బ్రాండ్, పతంజలి లాంటివి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు సమృద్ధిగా లభిస్తుంది. అక్కడి వారికి కావాల్సింది తాగే స్ట్రాలు మొదలుకొని పాత్రలు, కట్టింగ్ బోర్డస్, ఫ్లోర్ బోర్డస్, ఫర్నీచర్ దాకా బల్క్ ప్రొడక్షన్ కు తగిన సాంకేతికతలు. ప్రధానమంత్రి పేర్కొన్నట్లుగా చేనేత కార్మికులు అందించే మల్టీపర్పస్ హ్యాండ్ లూమ్ గంచా (దస్తీలు, టవల్స్ లాంటివి)ను మాస్క్లుగా ఉపయోగించుకోవచ్చు.
ఆర్గానిక్ విధానాలతో ఉత్తేజితం చేయబడిన గ్రామీణ పరిశ్రమలు కార్బన్ ఫుట్ ప్రింట్‍ను తగ్గిస్తాయి. వలసలను నిరోధిస్తాయి. సుస్థిరదాయక జీవనోపాధులతో సుమారు 5 కోట్ల మంది నైపుణ్య వృత్తిపనివారికి గుర్తింపు, అండ అందించకుంటే వారసత్వ కళలు మాయమైపోయే అవకాశం ఉంది. నైపుణ్యాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వారు తయారు చేసేవన్నీ మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా కూడా. ప్రభుత్వ సాయం వారికి మెరుగైన దీర్ఘకాలిక భవితను అందిస్తుంది.
- జయా జైట్లీ