రాబోయే సంఘటనలకు సన్నద్ధం ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త మైఖేల్‍ బెర్క్ ప్రత్యేక ఇంటర్వ్యూ


మైఖేల్‍ బెర్క్ ప్రకృతి విపత్తుల అధ్యయనవేత్త. అలాంటి విపత్తులను నగరాలు ఎలా ఎదుర్కొంటాయనే అంశంలో బోధకుడు. 100 రెసిలియెంట్‍ సిటీస్‍ అనే లాభాపేక్షరహిత కన్సల్టెన్సీకి మాజీ డైరెక్టర్‍. ప్రస్తుతం ఆయన రెసిలియెంట్‍ సిటీస్‍ కేటలిస్ట్ వ్యవస్థాపక ప్రిన్సిపల్‍గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పదుల సంఖ్యలో స్థానిక సంస్థలతో కలసి పని చేశారు. హరికేన్స్, తుపాన్లు, కరువు, భూకంపాలు, ఉగ్రవాదుల దాడులు, మాస్‍ కాల్పులు, వ్యాధుల వ్యాప్తి, సామాజిక దిగ్భ్రాంతికర సంఘటనలు తదితరాలపై తగు సూచనలు, సలహాలు అందించారు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తరువాత వివిధ సమూహాలు తమ జీవితాలను ఎలా కొనసాగించ నున్నాయి అనే అంశంపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక కల్లోలం నేపథ్యంలో వేగంగా కోలుకోవడాన్ని ఎలా పటిష్ఠం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తు న్నారు.
సెప్టెంబర్‍ 11 ఉగ్రదాడుల అనంతరం న్యూయార్క్ నగరం ఆఫీస్‍ ఆఫ్‍ ఎమర్జెన్సీ మేనేజ్‍మెంట్‍లో ఆయన డిప్యూటీ కమిషనర్‍గా సేవలందించారు. ప్రఖ్యాత బ్యాంక్‍లో గ్లోబల్‍ రిస్క్ మేనేజ్‍మెంట్‍ చేపట్టారు. సిటీ ల్యాబ్‍కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లోని కొన్ని ముఖ్యాంశాలు:


ఒక నగరాన్ని వివిధ రంగాలలో పటిష్టం చేసేందుకు అవసరమైన కీలక అంశాలేమిటి?
లక్ష్యాల అనుసంధానమే కీలకం. వివిధ రంగాల్లో ఒక నగరాన్ని పటిష్ఠం చేసేందుకు ఒక నిర్దిష్ట ఇంటర్వెన్షన్‍ విజయం సాధిస్తుంది. వివిధ లక్ష్యాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం గురించి ఆలోచించడమే ముఖ్యం.


రెసిలియెన్స్ ఇన్‍ సిటీస్‍ భావన గురించి కాస్త వివరిస్తారా?
ఒక విపత్తు సమయంలో కోలుకునేందుకు, పురోగమించేందుకు ఒక నగరానికి గల శక్తిసామర్థ్యాలే అర్బన్‍ రెసిలియెన్స్. చలనశీలతను ప్రమోట్‍ చేసే, సుస్థిరదాయక రవాణాకు వీలు కల్పించే చక్కటి మౌలిక వసతులు కూడా అందులో భాగమే. నగరంలో ఒకదానిపై ఒకటి ఆధారపడే సమూహాలన్నీ ఇందులో భాగమే. పటిష్ఠమైన మధ్య తరగతి ఉద్యోగాల పునాదితో కూడిన వైవిధ్యభరిత ఆర్థిక వ్యవస్థ. నిర్ణయాలు తీసుకునే చోట వివిధ రంగాల వారికి ప్రాతి నిథ్యం ఉండే ఒక చక్కటి పాలన. తదుపరి సంక్షోభం ఏదైనప్పటికీ దాన్ని అధిగమించడంలో ఈ అంశాలన్నీ కూడా తోడ్పడుతాయి.
రెసిలియెన్స్.. అంటే ఓ నగరంలో వేగంగా కోలుకునేందుకు, పురోగమించేందుకు దానికి గల శక్తిసామర్థ్యాలను నిర్మించడంలో కీలకం వివిధ ఆశయాలను ఒక్కచోటుకి తీసుకురావడమే. ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నప్పుడు, వరదల నుంచి మెరుగైన రక్షణ ఎలా కల్పించగలమో కూడా ఆలోచించాలి. రవాణా గురించి మాట్లాడు కుంటున్నప్పుడు జీవవైవిధ్యం అధికం చేయడం గురించి లేదా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడం గురించి కూడా ఆలోచించాలి. సుపరిపాలన, స్థానికులకు ప్రమేయం కల్పించడం గురించి ఆలోచిస్తున్నప్పుడు సంక్షోభ సమయాల్లో ప్రజలు నాయకుల మాటవిని వారి సలహాలు, సూచనలను పాటించేలా చేసేందుకు గాను ఎన్నికైన ప్రజా ప్రతినిధులలో విశ్వాసాన్ని పెంపొందించడం ఎలానో కూడా చర్చించాలి.


కరోనా వైరస్‍ స్పందనలో మీరు ఇప్పటి వరకూ చూసిన సుపరిపాలన అంశాలకు ఉదాహరణలు?
ఇలాంటి విపత్కర సమయాల్లో మేయర్ల కంటే కూడా గవర్నర్లు మరింతగా ప్రభావం కనబరచగలుగుతారు. వివిధ పాలనా పర మైన హద్దులకు సంబంధించి వారు మరింత అధికారాలను కలిగి ఉంటారు. న్యూయార్క్ రాష్ట్రం విషయానికి వస్తే, మొదటగా కేసులు నమోదైంది న్యూ రాచెల్‍ నగరం ఉత్తరభాగంలోని వెస్ట్చెస్టర్‍ కౌంటీలో. ఇప్పుడు న్యూయార్క్ సిటీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గవర్నర్‍ మరిన్ని అధి కారాలు కలిగిఉన్నప్పటికీ, మేయర్‍ ముఖ్యమైన అధికార ప్రతినిధిగా ఉంటారు. టెస్టింగ్‍తో పాటుగా నగరంతో సహా డ్రైవ్‍-త్రూ టెస్టింగ్‍ సైట్స్ను ఏర్పాటు చేయడంలో వేగంగా స్పందించింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ స్థాయిలో స్పందించడాన్ని నేనింతకు ముందెన్నడూ చూడలేదు. ఇదో చక్కటి ఉదాహరణ.
ఓల్డ్ ఈస్ట్ కోస్ట్ నగరాలు గతంలో మశూచి, క్షయ, కలరా, ప్లేగు వంటి మహమ్మారిలను చూశాయి. కాబట్టి ఈ దఫా మేయర్లు వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో డ్రైవర్‍ సీటులో ఉంటారను కున్నాను. అయితే ఆయా కార్యక్రమాలకు గవర్నర్లు సారథ్యం వహించారు.


అమెరికా ఇప్పటి వరకూ ప్రదర్శించిన రెసిలియెన్స్కు మీరు ఇచ్చే రేటింగ్‍?
ఇలాంటి మహమ్మారులు ఎంతగా యాంటీ అర్బన్‍ (పట్టణ వ్యతిరేక) స్వభావంతో ఉంటాయో న్యూయార్క్ టైమ్స్లో మైఖేల్‍ కిమ్మెల్‍మాన్‍ చక్కగా వివరించారు. జనసాంద్రత, అనుసంధానత అనేవి మనం అత్యంతగా ప్రాధాన్యం ఇచ్చే పట్టణ విలువలు. ఇలాంటి మహమ్మారులు వ్యాపించినప్పుడు మనం అతి తక్కువగా కోరుకోవాల్సింది కూడా వాటినే. మనకు అవసరమైన అంశాలు నిర్దిష్టంగా కొన్ని ఉన్నాయి. ప్రజారోగ్య వ్యవస్థ మనుగడ సాగించడం, టెస్టింగ్‍ సామర్థ్యం. వాక్సిన్లు లేదా యాంటీ – వైరల్‍ చికిత్సలు… అవి ఏవైనా సరే వినూత్నంగా ఉండాలి, అలాంటి థెరపీలను అధికంగా చేసుకోగలగాలి. అలాంటి శక్తిసామర్థ్యాలు కావాలి. వెంటిలేటర్లు, మాస్క్లు లేదా మరిన్ని బెడ్స్… అవేవైనా సరే… ఆసుపత్రుల సామర్థ్యాలు అధికం కావాలి. రక్షణాత్మక చర్యలపై ఇచ్చే సూచనలను పాటించడంలో ప్రజల శక్తిసామర్థ్యాలు అధికం కావాలి. ఏదో విధంగా రాబోయే నెలల్లో మనం ఈ వైరస్‍ వ్యాప్తిని అడ్డుకో గలుగుతాం. ఆ తరువాత మనం మన రోజువారీ వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా మన వ్యాపారాలు లాంటివి బాగా దెబ్బతిని ఉంటాయి లేదా మూతపడి ఉంటాయి. పట్టణ పేదలు, దిగువ తరగతి వారు ఎన్నో బాధలకు గురై ఉంటారు. పూర్తిస్థాయి ఉపాధి లేని మధ్యతరగతి వారెంతో మంది మళ్లీ పనుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇన్నాళ్ల పాటు ఒంటరిగా గడిపిన వారంతా తిరిగి తమ సమూహాలను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మన సమాజంపై ఒత్తిళ్ళను గణనీయంగా పెంచేవే. ‘‘ఈ మహమ్మారి కారణంగా మనం సరికొత్త మౌలిక వసతులను పొందనున్నాం. గత తరం కంటే మెరుగ్గా వాటిని మనం రూ పొందించుకోవాల్సి ఉంటుంది’’. మరో మహమ్మారి మనపై విరుచుకుపడేనాటికి మనం ఈ అర్బన్‍ రెసెలియెన్స్ ప్రయోజనాలను చూసే దశలో ఉంటాం. పటిష్ఠమైన ఇరుగుపొరుగు వ్యవస్థలు, వైవిధ్యభరిత ఆర్థిక వ్యవస్థలు, సుపరి పాలన ఉంటాయి. ఈ విధమైన పరిస్థితుల నుంచి సత్వరమే కోలుకునేందుకు ఆ తరహా వ్యవస్థలు దోహదం చేస్తాయి. అలాంటి పటిష్ఠ కమ్యూనిటీలను నిర్మించు కోగలగాలని మనం కోరుకుందాం.
ఇప్పటికింకా మనం ఆరంభం లోనే ఉన్నాం. ఓ వారం పాటు ఇంట్లోనే ఉండడం అనేది ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోవడంగా అనిపి స్తోంది. ఇప్పటి వరకు మనం అనుభ వించింది ఎంతో కొంచెమే. అనుభ వించాల్సింది మరింకెంతో ఉంది. ఏయే కమ్యూనిటీలు ఎంతగా కోలుకునే శక్తిని, పురోగ మించే శక్తిని కలిగి ఉన్నాయో రానున్న నెలల్లో బయటపడనుంది.


రెండో దశకు సంబంధించి వివిధ కమ్యూనిటీలు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఇప్పుడే దాని గురించి మనం మాట్లాడు కోలేం. చట్టసభలు సమావేశమై ప్రజలకు, సంస్థలకు, వ్యాపార సంస్థలకు ఏవైనా సహాయాలు ప్రకటిస్తుంటే, అప్పుడు మనం మనకు గల రెసిలియెన్స్ నిర్మాణ అవకాశాల గురించి చర్చించగలుగుతాం.


ఎలాంటి అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు?
అమెరికాలో బహుశా ఉపాధి ఉద్దీపనలు ఉండవచ్చు. మనం నిర్మించబోయే కొత్త మౌలిక వసతులతో ఆ ఉపాధి అవకాశాలు లభించవచ్చు. మరింత రెసిలియెంట్‍ మౌలిక వసతులను నిర్మించుకు నేందుకు నమ్మశక్యం కాని అవకాశాన్ని ఇది మనకు అందిస్తోంది. ఈ మౌలిక వసతులు రాబోయే కొన్ని తరాలకు ఉపయోగపడతాయి. ఇదే సంద ర్భంలో మనం శీతోష్ణస్థితి మార్పుల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చిన మహమ్మారి కారణంగా మనం ఒక సరికొత్త తరపు మౌలిక వసతులను పొందబోతున్నాం. వాటిని మనం గత తరం కంటే మెరుగైన రీతిలో నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక కేంద్రాలతో కమ్యూనిటీలు విడదీయలేని హైవేలు లాంటివి.
మనం కొత్త లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవాల్సి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, వరదల నియంత్రణ లాంటి వాటన్నింటి గురించి ఏక సమయంలో ఆలోచించేందుకు అవసరమైన ఉపకరణాలు మనవద్ద ఉన్నాయి. మాన్‍హట్టన్‍లో బిగ్‍ యు తరహాలో సముద్ర మట్టాల నుంచి నగరాలను కాపాడుకునేందుకు పెద్ద పెద్ద స్వాత్‍లను నిర్మించుకోవడం లాంటి ప్రాజెక్టులను చేపట్టవచ్చు. అంతేగాకుండా ఆర్థికాభివృద్ధికి, కమ్యూనిటీ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా వివిధ సహాయ ప్యాకేజీలను ప్రభుత్వం, ఇతరులు ప్రకటించే అవకాశం ఉంది. సరైన మార్గదర్శకాలతో మనం ఆ పెట్టుబడులు బహుళ ప్రయోజనాలు కలిగేలా వినియోగించు కోవాల్సి ఉంటుంది. ఓ ఉదాహరణ చూద్దాం. హరికేన్‍ కత్రినా తరువాత న్యూ ఓర్లీయెన్స్ అటు శీతోష్ణస్థితి ప్రభావానికి, ఇటు పెట్రోకెమికల్‍ పరిశ్రమ ప్రభావానికి బాగా గురై నట్లుగా కనిపించింది. గత ఐదేళ్లుగా నగరం నీటి నిర్వహణ రంగాన్ని ఇంక్యుబేట్‍ చేసేందుకు ప్రయత్నిం చింది. ఆ తరువాత డచ్‍ తరహాలో, కీలక పోటీ సామర్థ్యాలతో ఎగుమతి చేసేందుకు ప్రయత్నించింది. అందుకే బహుళ లక్ష్యాలను సాధించేలా ఆర్థిక వ్యవస్థలను నగరాలు ఎలా వైవిధ్యభరితం చేస్తాయన్నది కూడా ఎంతో ముఖ్యమైన అంశం. అది రవాణా కావచ్చు లేదంటే ప్రజారోగ్యం కావచ్చు. ఇక చివరిగా ఒక ఆలోచన – ఈ విషయంలో నేను పెద్దగా అధ్యయనం చేయలేదు గానీ, ఎయిర్‍లైన్‍ పరిశ్రమకు బెయిలవుట్‍ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంచిదే, అయితే అందులో కొంత మొత్తం హైస్పీడ్‍ రైల్‍కు కేటాయిస్తే ఎలా ఉంటుంది? నిర్దేశించుకున్న సమయం కంటే ముందుగానే కార్బన్‍ తటస్థతను సాధించేందుకు విమానయాన సంస్థలు ఈ బెయిలవుట్‍ను వినియోగించుకునేలా చేస్తే ఎలా ఉంటుంది? శీతోష్ణస్థితి మార్పులు లాంటి సంక్షోభంలో అవే కీలపాత్ర వహిస్తున్నాయి. ఆలోచన మంచిదే. మరి చట్ట సభలు ఈ మాటలు వింటాయా?


ఈ విధమైన భారీస్థాయి మార్పులు మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవన శక్తిసామర్థ్యాలను మెరుగు పరుస్తాయి. మరి వ్యక్తులు, ఇరుగు పొరుగు మాటేంటి? సామూహికంగా మనం కోలుకోవడంలో అవి చేయగలిగేదేంటి?
చిన్నస్థాయిలో కార్యాచరణ అయినా గొప్ప మార్పును తీసుకొచ్చేదిగా ఉంటుంది. సాధ్యమైనంత చేసేందుకు ఇతరులకు అది మార్గదర్శకంగా ఉంటుంది. మనం గనుక దీర్ఘకాలిక ఆర్థికమాంద్యంలో ఉంటే దాని ప్రభావం మొదటగా అట్టడుగు తరగతులపై ఎన్నో విధాలుగా పడుతుంది. ఎక్కటి వాళ్లు అక్కడే లేదా సామాజిక దూరం ఆంక్షలను గనుక ఎత్తివేస్తే ప్రజల రాకపోకలు భారీగా పెరుగుతాయి. మన వీధులు మళ్లీ కళకళ లాడుతాయి.
ఒక ఉదాహరణ చూద్దాం. చిన్న చిన్న ప్రాంతాలను పునరుత్తేజితం చేయడం స్థానికుల్లో ఏవిధంగా మార్పు తీసుకు వస్తుందో చూద్దాం. రెండేళ్ళ క్రితం జేఏఎంఏ ఓ అధ్యయనం నిర్వహించింది. ఖాళీ స్థలాలు ఉన్న చోట తక్కువ మొత్తంతోనే వాటిని శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఇది జరిగిన తరువాత, అప్పటి వరకూ తాము డిప్రెషన్‍లో ఉన్నామని చెప్పిన వారి సంఖ్య లో 41.5 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెప్పినవారి సంఖ్యలో 62.8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఇది నిజంగా అద్భుతం. మనం తీసుకునే చిన్న చిన్న చర్యలే ఎంతో పెద్దగా పని చేస్తాయి. ప్రజలు తీసుకునే ఇలాంటి చర్యలను అభినందించాలి.


వ్యక్తులు సహాయపడగల కొన్ని ఇతర మార్గాలేంటి?

స్థానిక కార్యకలాపాలకు అండగా నిలవడంలో చేసేది ఎంతో ఉందని నేను భావిస్తాను. ఇప్పుడు అమెజాన్‍ నిజంగా ఎంతో బాగా పని చేస్తోంది. దాని గురించి చెడుగా మాట్లాడేందుకేమీ లేదు. ఇక మనం ఆలోచించాల్సింది స్థానిక చిన్న, మధ్యతరహా సంస్థల గురించి. అవి బాగా దెబ్బ తిననున్నాయి. వారికి సహాయం చేసేందుకు కొన్ని వినూత్న విధానాలు ఉన్నాయి.
100 రెసిలియెంట్‍ సిటీస్‍లో మాకొక ఆసక్తిదాయక భాగస్వామి ఉన్నారు. పేరు కొలు. అది ఒక క్రిప్టోకరెన్సీ. వివిధ రకాల ప్రవర్తనలకు గాను వివిధ మార్గాల్లో రివార్డులు అందించేందకు ఒక మార్గంగా మీరు ఒక స్థానిక వర్చువల్‍ కరెన్సీని ఏర్పాటు చేసేందుకు అది మీకు వీలు కల్పిస్తుంది. పౌర కార్యకలాపాల్లో లేదా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు క్రెడిట్స్ పొందేందుకు, ఆ తరువాత వారు ఆ క్రెడిట్స్ను స్థానిక సంస్థల ద్వారా వెచ్చించేందుకు అది వీలు కల్పిస్తుంది. ఇది టెల్‍ అవీవ్‍లో వినియోగించబడింది. దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రజల భాగస్వామ్యం లాంటి వాటిని ప్రారంభించేందుకు ఇదో ఆసక్తిదా యక మార్గం. నిజంగా ఇదెంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను.


భవిష్యత్తులో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోనున్నాం అనేది మాత్రం నిజం. అయితే ప్రస్తుత పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందనే విషయంలో కూడా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టంగా ఉంది. మానవులు, సామాజికం, భావోద్వేగం, ఆర్థిక వ్యయాలు – ఈ నష్టాలను భర్తీ చేసుకోవడం ఎంతో కష్టం. అనిశ్చితితో పోరాటం చేస్తున్న మాకు, విపత్తులను ఎదుర్కోవడంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు ఇచ్చే సలహా ఏమిటి?
ఇలాంటి ప్రజారోగ్య సంక్షోభాన్ని నేను గతంలో ఎన్నడూ చూడలేదు. అయినా కూడా నేను కొన్ని విషయాలు మాత్రం చెప్ప గలను. మొదటిది, ఇలాంటి కష్టాన్ని కలసి కట్టుగా ఎదుర్కొన్న వారిలో ఒక అద్భుత అనుబంధం ఏర్పడుతుంది. ఈ విధమైన విపత్తులో, ఆ తరువాత గుడ్‍విల్‍, కమ్యూనిటీ స్ఫూర్తి ఎంతగానో పెరుగుతాయని సోషియాలజిస్ట్ ఎన్‍రికో క్వారెంటెల్లి గుర్తించారు. ప్రజలు ఇప్పుడు ఒకరికొకరు సహాయ పడుతున్నారు. నిజంగా ఇదెంతో ముఖ్యమైంది.
మరోసారి నేను కూడా అదే విషయాన్ని చెబుతున్నాను. మనల్ని, మన కమ్యూనిటీలను, మన ఆర్థిక వ్యవస్థలను పరివర్తింప జేసుకునేందుకు ఒక అద్భుత అవకాశాన్ని పొందబోతున్నాం.
విషాదం, బాధాకరమైన అంశం ఏమిటంటే, అలా చేసేందుకు మనం చాలా తక్కువ స్థాయిలో సన్నద్ధమై ఉన్నాం. నేను చూసిన ఎన్నో విపత్తుల్లో వ్యూహాత్మకంగా ఆలోచించడం అనేది మాత్రం కనిపించడం లేదు. ఒక హరికేన్‍ లేదంటే భూ కంపం వచ్చిన తరువాత పునర్‍నిర్మాణం ఎలా అన్న విషయంలో సమగ్రంగా ఆలోచించేందుకు ఒక నిజమైన అవకాశం లభిస్తుంది. మనం మాత్రం గతంలో అవి ఎలా ఉన్నాయో అలా నిర్మించు కునేందుకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం తప్పితే మెరుగు పర్చు కోవడాన్ని మాత్రం పట్టించుకోం. మానవ స్వభావమే అంత. పోర్టారికోలో మారియా హరికేన్‍ వచ్చిన తరువాత లేదా క్రైస్ట్ చర్చ్లో భారీ భూకంపం వచ్చిన తరువాత, న్యూ ఓర్లియెన్స్లో కత్రినా తరువాత – ఈ అన్ని సందర్భాల్లో కూడా వ్యూహాత్మకంగా ఆలోచించలేకపోయారు.


పరిస్థితులను మెరుగుపర్చేందుకు మనం ఏదైనా వ్యూహాత్మక యోచన ఉందా?
అదే ఇప్పుడు మన నాయకులకు 1 ట్రిలియన్‍ డాలర్‍ ప్రశ్న. దీన్ని కాస్తంత తగ్గుస్థాయి నుంచి ఆలోచిద్దాం. ఈ విధమైన మార్పుల కోసం తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ప్రజలు ఎంతవరకు బాధ్యులుగా చేస్తారు? మరీ ముఖ్యంగా తాజా సంక్షోభం విషయానికి వస్తే, వ్యక్తి నుంచి వ్యక్తికి వైరస్‍ వ్యాపిస్తోంది. మీ పొరుగు ప్రాంతాలు మీకు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసేవిగా ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో వెనుకడుగు వేయడం తప్ప మరో మార్గం లేదు. ఇంట్లోనే ఉండడమంత సురక్షితం మరొకటి ఉండదు. పటిష్ఠమైన పౌర నెట్‍ వర్క్లు కలిగిన నగరాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి వేగంగా కోలుకుంటాయి, వేగంగా పురోగమిస్తాయి. మీరు ఉండే ప్రాంతం గురించి, అక్కడి ప్రజల గురించి మీకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత త్వరగా మరియు పటిష్ఠంగా మీరు కోలుకొని పురోగమించ గలుగుతారు.
మనం గనుక ఒకరితో ఒకరం కలసి పని చేస్తుంటే రాబోయే సంఘటనలకు మనం మరింతగా సన్నద్ధం కావచ్చు. ఒక సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకునేందుకు మనం తీసుకోబోయే ప్రతి చర్య కూడా ఎంతగానో తోడ్పడుతుంది. రాబోయే ముప్పులను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమవుతున్నంత మాత్రాన తదుపరి సంక్షోభాలు రావని కాదు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు…. జూన్‍లో హరికేన్‍ సీజన్‍ ప్రారంభం కానుంది!
(సిటీల్యాబ్‍ సౌజన్యంతో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *