2019 సంవత్సరం చివరి రోజు, డిసెంబర్ 31న మానవాళి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనుకుంటూ ఉండగా, 2020 లీపు సంవత్సర ఉదయం పట్టుకుని వచ్చిందొక అనూహ్య పరిణామం.మొత్తం మానవ జాతికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి.
కంటికి కనబడదు. ఈగ, దోమ ఎత్తుకు రావు. పెంపుడు జంతువుల వలనో, దురలవాటో కారణం కాదు. ప్రకృతి వైపరీత్యం అంతకన్నా కాదాయె! నెలలు, వారాలు, రోజులు కాదు… గంటల్లో – పట్టణాలను, ఆ తరువాత మహా సముద్రాలను దాటి ఖండాలను, దేశాలను కబళించింది. అదే కోవిడ్-19 అనే ఒక కరోనా వైరస్.
కోవిడ్-19 అనే ఈ (RNA) ఆర్‍ఎన్‍ఏ వైరస్, పేద-ధనిక స్త్రీ – పురుష వయో భేదాలను వేటిని ఖాతరు చేయకుండా సార్వజనీనమైన వ్యాధిగా ప్రబలి పోయింది. చైనాలో వూహాన్ నగరం నుంచి వచ్చిన ఈ వ్యాధి అతి తక్కువ సమయంలో ప్రపంచ వ్యాధిగా మారింది.
ముందుగా మేల్కొన్న చైనా, ఇది గాలిలో తుంపరల ద్వారా (డ్రాప్ లైట్స్ వల్ల), మనిషి నుంచి మరొక మనిషికి, వ్యాప్తి చెందుతున్నట్టుగా పసిగట్టి, హుటాహుటిన నగరాలను వేరుపరచి, గాలిని శుభ్రపరచి, రహదారులను కడిగి, అప్పటికే వ్యాధి సోకిన వారిని దూరంగా పెట్టి, రాత్రింబవళ్ళు దానిపై యుద్ధం ప్రకటించింది.
అయితే, రోజులు గడుస్తూ ఉండగా ఆ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచంలో పెరుగుతూ వస్తోంది. మూడు నెలల్లో ఒక మిలియన్ కేసులు, అందులో 53 వేలకు పైగా మరణాలు సంభవించాయి. (ఈ వ్యాసం వ్రాసే సమయానికి).
తన జన్యువులో రూపాంతరం చెంది, ఈ కరోనా వైరస్ మనిషి పై తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఈ ఆటలో మొదటి రెండు నెలలు కరోనా వైరస్‍దే పూర్తి విజయం.
మార్చి 24 నుంచి మూడు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్‍ను, కొవిడ్-19 వైరస్ వ్యాధిని నియంత్రించడానికి ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత ప్రభుత్వం తీసుకుని, తన తొలి స్పష్టమైన అడుగు వేసిందని చెప్పుకోవాలి.
కర్మాగారాలు, వాహనాలు, భవన నిర్మాణం, కళాశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, వ్యాపార కేంద్రాలు ఒకటేమిటి సర్వంసహా అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.
మొట్టమొదటిసారిగా భారత దేశంలోని రైల్వే, విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రార్ధన మందిరాలను మూసివేశారు. ఒక సమయంలో సెక్షన్ 144 విధించారేమో అనిపించేంతలా వీధులన్నీ నిర్మానుష్యం అయ్యాయి.
ఇది చాలా బలమైన, ముఖ్యమైన నిర్ణయం. కోవిడ్-19 వైరస్ స్వైర విహారానికి, ఎదురు నిలవడం అంటే ‘‘నివారణ ఒక్కటే మార్గమని’’, రోగ తత్వశాస్త్ర ఆచార్యులు, ఎపిడిమియాలజిస్ట్లు, వైద్యులు అందరూ చెప్పిన తరువాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు.
1.3 మిలియన్ల ప్రజల సామూహిక ఆరోగ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం తీసుకోక, నిర్లక్ష్యం చేసిన, ఇటలీ, ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా వంటి దేశాలలో రెండు వారాల తరువాత పెరుగుతున్న మరణాల సంఖ్య ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది.
లాక్ డౌన్ ప్రకటన తర్వాత భారత దేశ పౌరులు ప్రతిస్పందించిన తీరు కూడా అత్యంత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. వైద్యులు, నర్సింగ్ ఉద్యోగులు, పోలీసు వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్తు బోర్డు ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, మీడియా వారు, విపత్తు రక్షణ కమిటీలో ఉన్నవారు వీరందరూ ప్రతిస్పందించిన తీరైతేనేమి, పూర్తిస్థాయి క్రమశిక్షణతో, సేవా దృక్పథంతో, తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న విధానం ఐతేనేమి చాలా విశిష్టమైనది.
లాక్‍డౌన్ ప్రకటించిన తరువాత కూడా అవిరామంగా విద్యుత్, మంచినీటి సరఫరా అవుతూనే ఉన్నాయి. టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. దీనివల్ల నవతరం యువకులు అందరూ తమ తమ ఉద్యోగాలను ‘వర్క్ ఫ్రం హోమ్’ పద్ధతిలో నిర్వహించుకుంటూ ఉన్నారు. పాఠశాలల యాజమాన్యం, చిన్నారులకు విద్యా బోధనను సరికొత్త మాధ్యమంలో తరగతి గదిలో కన్నా ఎక్కువ వ్యక్తిగత శ్రధ్ధను చూపుతూ బోధన కొనసాగిస్తూ ఉన్నాయి. లాక్ డౌన్ ప్రకటించి నప్పటికీ, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు, అన్ని యధావిధిగా దొరికేటట్లుగా వ్యక్తిగత భౌతిక దూరం పాటించ డానికి, వృత్తాలను గీసి, ప్రజలకు అలవాటు చేయడం భారత దేశంలో వినూత్నమైన ప్రయత్నం అని ప్రపంచ దేశాలలో కొనియాడారు.
ఇవన్నీ ఇలా ఉండగా, రోజు కూలీ కార్మికులు, అసంఘటిత కార్మికులు, లెక్కపెట్ట లేనంత మంది చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, ఆటోలు-క్యాబ్‍లు, అద్దె కార్లు, రిక్షాలు వంటి వాహనాలు నడుపుకునే వాహనచోదకులు, నిర్మాణ రంగంలో ఉండే తాపీ పనివారు, వారితో పనిచేసే శ్రామికులు, పెయింటర్లు, ప్లంబర్లు, రోజు కూలీలు అందరూ ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. మన ఇంటి ఎదురుగా పళ్ళు అమ్ముకునే ముసలమ్మ దగ్గరనుంచి, ఇడ్లీలు వేసి-పానీపూరి చేసే బండి వ్యక్తి వరకు, మన పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ నుంచి ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు-పుస్తకాలు-ఫ్యాన్సీ సామాను అమ్ముకునే వారి వరకు అందరి జీవితాలు ఉన్నట్టుండి ఖాళీ అయ్యాయి.
ఆదివారం వస్తే సండే బజారులో బట్టలు- పిన్నీసులు, పాత పుస్తకాల దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎన్నో రకాల వస్తువులు అమ్ముకునే వ్యాపారులంతా ఏమైపోయారు?అని తలుచుకుంటే గుండె చెరువవుతుంది.
ఇక వలస కార్మికుల గురించి తలచుకుంటే, హృదయం ద్రవించక మానదు. కూటి కోసం, కూలి కోసం, పొట్ట చేత పట్టు కుని, పుట్టిన ఊరి నుంచి నగరాల వైపు వెళ్లిన అనేక మంది రోజు కూలీలు అక్కడ ఉద్యోగాలు తాత్కాలికంగా నిలిపి వేయడం వలన రెప్పపాటులో అనాధలై పోయారు. వీరితో పాటు పైచదువుల కోసం తమ ఊరి నుంచి పట్టణాలు, నగరాలకు వెళ్ళిన వేల మంది విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయించడంతో రోడ్డున పడ్డారు. వారంతా గుంపులు గుంపులుగా వేరే ప్రయాణ సాధనం లేక సొంత ఊరికి వందల కొలది మైళ్ళు నడిచి మరీ రావడాన్ని చూస్తే, తారుమారైన జీవన చిత్రం మనలను భయపెడుతుంది.
ఇంతే కాదు. చేతికి అంది వచ్చిన పంటను కోసుకోవడానికి వీలులేకుండా, మామిడి – అరటి – సపోటా వంటి పండ్ల తోటలకు నీరు పెట్టడం, పురుగుల మందు కొట్టడం వంటి పనులన్నీ స్తంభించిపోయాయి. కాయగూరల సాగు నిత్యకృత్యం. దానికి కావలసిన మనుషులు దొరకక, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు రైతు ఆశ్చర్యంతో, అప్రతిభుడైపోయి, ఏదీ పాలుపోని పరిస్థితిలో ఉన్నాడు. మార్కెట్‍లో వస్తువుల వినిమయం తగ్గి,ఉద్యోగుల జీతభత్యాలు ఇవ్వవలసిన స్థితిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు క్రుంగిపోయాయి. పర్యాటకులు లేక ఆ రంగం, సినీ పరిశ్రమ దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇవన్నీ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల మధ్య అంతర్గతంగా కళ్ళకు కనబడే సమాజం అనుభవిస్తున్న లోటుపాట్లు. ఇక అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చాలా దిగులు కలిగించే విషయం ఏమంటే ఇతర దేశాలకు వెళ్ళి, అక్కడ, ఉండలేక- తిరిగి రాలేక, భారతీయ సంతతికి చెందిన ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
ఇంతటి విపత్కర పరిస్థితులలో కొన్ని మంచి సంఘటనలు కూడా కనబడుతున్నాయి.
దేశమంతా ఒకే తాటిపై నిలబడి నిత్యావసర వస్తువుల కోసం ఎగబడకుండా క్రమశిక్షణతో ఉండటం, పారిశుద్ధ్య కార్మికులకు- పోలీసులకు సహకరించడం చూస్తున్నాం. 1.3 మిలియన్ల జనాభా మొత్తం, ఆ దేశపు లా అండ్ ఆర్డర్ చట్టాన్ని గౌరవించడం అనేది ఆ దేశ సామూహిక క్రమశిక్షణను తెలియచేస్తోంది. ఇది భారత దేశానికి గల ప్రత్యేకించి ఉన్న, వేరెవ్వరూ దోచుకోలేని సంపద.
పర్యావరణ కాలుష్య విషయానికి వస్తే వాహనాలు, కర్మాగారాలు మూతబడిన తరువాత మార్చి నెల 20 నుంచి 27 వరకు జరిపిన పరిశోధనలో ఒక్క వారం లోనే వాతావరణ కాలుష్యం 76 శాతం తగ్గినట్టు ఆ శాఖ నిపుణులు తెలియ జేస్తున్నారు. ముఖ్యంగా సహజ వనరులైన పెట్రోలు- డీజిల్ -గ్యాస్ ఆధారంగా నడపబడే వాహనాలను వాడే భారతదేశంలో కార్బన్ ఉద్గారాలు బాగా తగ్గాయి. గాలిలో నైట్రోజన్ డై ఆక్సైడ్ కూడా తగ్గింది. పార్టికులేట్ మేటర్ PM అని చెప్పే వాయు కాలుష్యం పరిమితి (W.H.O)డబ్ల్యూహెచ్‍వో 25 కన్నా ఎక్కువ ఉంటే హానికరం అని తెలియజేస్తుంది. ఇది ఢిల్లీలో 91 ఉండేది.
వారం రోజుల్లోనే 26కు తగ్గింది. ఇదే తరహా మార్పులను బ్రిటన్ – ఇటలీ- చైనాలలో గమనించారు. ఆకాశం మరింత నీలంగా మారింది. ఎక్కడెక్కడి పక్షుల కూతలు, ఉడుతల చప్పుళ్ళు వినబడుతూ ఉన్నాయి.
పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో, జన సంచారం లేని కారణంగా చెట్ల నీడన కొంగలు, నెమళ్లు, ఇతర జంతువులు సమూహాలుగా కనబడుతున్నాయట.
వెనిస్ నగరంలో ప్రవహించే కాలువల నీరు తేటపడి, కొంగలు, బాతులు, చేపలు ప్రశాంతంగా విహరిస్తున్నాయట! మన దేశంలో మధ్య ప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక,తమిళనాడు లాంటి రాష్ట్రాలలో అటవీ ప్రదేశాలకు సమీపంలో ఉండే రహదారుల పైన అనేక వన్యప్రాణులు సేద తీరుతున్నాయట!
అవునా? ఇది నిజమేనా?
ఊహించలేని వేగంతో సాగిపోతున్న ఆధునిక జీవితం, 21 శతాబ్దపు వ్యాపార ఆధారిత, కంప్యూటర్ యుగం ఒక్కసారిగా ఉరుకులు, పరుగులు ఆపి నిదానించినట్టయింది. కుటుంబం అంతా కలిసి గడిపే సమయం పెరిగింది. కుటుంబ సభ్యులకు అవగాహన పెరిగింది. ఇరవై నాలుగు గంటలు పరుగు తీసినా- తీయకున్నా గడిచిపోతాయి. కానీ విశ్వమంతటా వాతావరణ కాలుష్యం తగ్గడం, ఒకరిపై ఒకరికి నమ్మకం పెరగడం చూస్తే, ఈ కరోనా వైరస్ విధించిన కర్ఫ్యూ ‘శాపంలా కనబడే వరమే’ అనుకోవచ్చు.
సూక్ష్మ జీవశాస్త్ర ప్రకారంగా, వైరస్ సోకిన మనుషులలో 10 శాతం మంది మరణించవచ్చు. వ్యాధిగ్రస్తుడు ఎదుట పడినప్పుడు అతడు 4-6 మందికి ఈ వ్యాధిని సంక్రమింప చేయవచ్చు. ఈ సమయం 14 రోజులు. మన దేశపు లాక్‍డౌన్ సమ యం 21 రోజులు. ఒక పక్క వైరస్‍తో పోరాడే సిబ్బందికి వ్యక్తిగత భద్రత ఇచ్చే మాస్కులు – డ్రెస్సులు సరిపడేటన్ని దొరకటం లేదన్న నిజం ఉంది. ఏ కారణం చేతైనా వైరస్ వల్ల వచ్చే అనారోగ్యం తీవ్రమైతే వ్యాధిగ్రస్తునికి అందించవలసిన మందులు, శ్వాసను అందించవలసిన వెంటిలేటర్ సదుపాయాలు బాగా తక్కువగా ఉన్నాయన్న భయం వెంటాడుతూనే ఉంది.
అయినా, ప్రతి రోజు ఆశా వర్కర్లు, వాలంటీర్లు వ్యాధిగ్రస్తులను, విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే సాయం కోసం తరలించడం జరుగుతూనే ఉంది. డిజిటల్ మీడియా గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన కారణంగా నగదు లావాదేవీలు ఫోన్ ద్వారానే ఆన్లైన్‍లో జరగడం, జనసామాన్యానికి అందుబాటులో ఉండేలా కరోనా వైరస్ వ్యాధి గురించి సహాయం అందించే మొబైల్ యాప్‍లను తయారు చేయడం, వాటిని వినియోగంలోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, కోవిడ్ వైరస్ కోసమై, వెబ్ సైట్‍ను తెరిచి నిజాయితీగా గణాంకాలను అందించడం వంటివి చూస్తూంటే మన దేశం కూడా ముందడుగు వేసిందన్న భరోసా కనబడుతోంది.
ఇంకా ఎంతో దూరం ఉంది, ఇంకా కరోనా వ్యాధి భారం ఉంది. దినకూలీలు, వలస కార్మికుల రోదనలు వినబడుతున్నాయి. పరిశోధనలు జరగాలి. కోవిడ్ వైరసు జన్యుక్రమం తెలుసు కోవాలి.ఈ వైరస్ కోసం మందులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. చెదురుమదురు సంఘటనలలో చట్ట ఉల్లంఘనం, వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగించేలా రోగులు- వారి బంధువులు సహనాన్ని కోల్పోయి దాడికి దిగడం, సరిహద్దు ప్రాంతాలలో ప్రజలు చలి, చీకటికి-ఆకలి-దప్పికలకు రోదించడం… జరుగుతూనే ఉన్నప్పటికీ, ఈ సున్నితమైన అంశాలపై యంత్రాంగం ప్రతి స్పందించే ప్రయత్నం చేస్తోంది.
స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామ స్థాయిలో సైతం దయార్ద్రహృదయులైన వారంతా అనాధలను, వృధ్ధులను, రోజు కూలీలను ఆదుకుని ఉచితంగా ఆహారం, వస్తువులు ఇస్తూనే ఉన్నారు. టాటా గ్రూపు వంటి పెద్ద సంస్థలు, ప్రముఖులు ఎన్నో కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి తమ ఉదారత చాటుకుంటున్నారు.
కరోనా లాక్ డౌన్ మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, జీవితం వ్యాధి-మరణం పక్క పక్కనే ఉండవచ్చని.
వారాంతాలలో పూర్తిగా కదలికలను ఆపితే మన పర్యా వరణాన్ని మనం రక్షించుకోవచ్చునేమోనని. మనుషులపై సహానుభూతి కలిగి ఉండాలని.
ప్రమాదం వస్తే ఒక్కరుగా కాక, సంఘటితంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం అదనపు విలువగా ఇచ్చింది. మానవత్వం పెంచింది. కుదేలైన పరిశ్రమల గురించి ఒక్క మాట చెప్పుకోవాలంటే ప్రతి దేశం విదేశీ ఉత్పత్తులను కాక తమ దేశంలో తయారు చేసిన వస్తువులను వినియోగించడం, బ్రాండ్ ఆధారిత ఆధునికతను కాక లోకల్ వ్యాపారులను ప్రోత్సహించడం, విదేశీ ఆహార వ్యాపార సంస్కృతి కన్నా సౌహార్ద్రపూరిత అంతఃకరణ గలిగిన సంఘమే శాశ్వతమైనది – అనే పాఠం సూచి స్తోంది.
త్వరగా కరోనా వైరస్ రాక మునుపు ఉన్న జీవితం వస్తే బాగుం టుంది, అందరూ ప్రాణ భయం లేని ఆరోగ్య జీవనం గడిపి లాక్ డౌన్ ఎత్తివేసి, ఇదివరకటి జనజీవన స్రవంతి మరల వచ్చేయాలని కోరు కుందాం.
కాని, ఆ కరోనా రాక పూర్వం ఉన్న ఏ లోటుపాట్లు, ఎలాంటి మానవ తప్పిదాలు ఉన్నాయో గ్రహించి వాటిని చక్కదిద్దుకోవాల్సి ఉంది. ప్రతి వ్యక్తీ, ప్రతి దేశం… మానవ సమాజం యావత్తు.
-నాగసూరి వేణుగోపాల్
ఎ : 919440732392
-కాళ్ళకూరి శైలజ
ఎ : 9885401882