కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం మొత్తం మార్చి 16 నుండి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించి విద్యార్థులు బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. తక్షణమే మార్చి 22 నుండి లాక్డౌన్ అమలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు అందు బాటులో ఉండేలా ప్రయత్నించారు. రేషన్ కార్డ్ కలిగిన ఒక్కో కుటుంబానికి 1500 రూపాయలు, ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యం పంపిణీ చేసి పేదలు, బడుగు జీవులకు బాసటగా నిలిచారు. వైరస్‌పై యుద్ధం చేయాలంటే ప్రజలు సహకరించాలని నిత్యం విజ్ఞప్తి చేస్తూనే అవగాహన కల్పించారు. తెలంగాణ చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేసి వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వైరస్ ఆరంభంలో 10 వేల ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి సంఖ్యను క్రమంగా 22 వేలకు పెంచింది. తాజాగా వాటి సంఖ్య లక్ష దాటించారు. ఇప్పుడు తెలంగాణలో లక్ష మందికి కరోనా వచ్చినా వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండటం గర్వకారణమనే చెప్పాలి. కరోనాపై యుద్ధంలో డాక్టర్లు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమైంది. ఇదంతా కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందుండి కృషి చేయడం వల్లే వ్యాధి అదుపులో ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆదేశాలను పాటించడంలోనూ, చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
అటు కేంద్ర ప్రభుత్వం సైతం వైరస్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్ విషయంలో ప్రజల మేలుకోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇతర దేశాల విమానాలు ఇండియాలోకి రాకుండా అడ్డుకట్ట వేశారు. రైళ్లు, బస్సులు నడపొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సైతం పేద ప్రజల కోసం 1.70 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. జన్‌ధన్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి 500 జమ చేశారు. రేషన్ కార్డ్ కలిగిన ఒక్కో సభ్యునికి 5 కేజీల బియ్యం లేదా గోధుములు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. ఇంత పెద్ద దేశంలో వైరస్ చాలా వరకు కంట్రోల్లో ఉండడమంటే మాటలు కాదు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి డాక్టర్ల సేవలకు గుర్తుగా ప్రజలతో క్లాప్స్ కొట్టించడం, దీపాలు వెలిగించడం వంటి పలు ఉత్సాహవంతమైన టాస్క్‌లు చేయించి ఐక్యతను చాటి చెప్పారు.
- కట్టా ప్రభాకర్, ఎ : 8106721111