ఏవైనా రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచమంతా రెండు సమూహాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కానీ కంటికి కనిపించని కరోనా వైరస్ అనే సూక్ష్మక్రిమిపై ప్రపంచంలోని దేశాలన్నీ తమ మధ్య నున్న బేధాభిప్రాయాలను విడనాడి కలిసికట్టుగా యుద్ధం చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పవచ్చు. గతకొన్ని మాసాలుగా భూమండలంలోని మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘కరోనావైరస్ సృష్టించిన భీభత్సం వర్ణనాతీతం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా భాసిల్లుత్తున్న అమెరికా సైతం కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నదన్నది నిష్ఠురసత్యం. ఇక మిగతా దేశాల సంగతి చెప్పనక్కర్లేదు. లాక్‍డౌన్ విధించి పటిష్టమైన నియంత్రణా చర్యలు చేపట్టడం వల్ల భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. విశ్వ వ్యాప్తంగా సామాజిక, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసి, మానవాళిని కోలుకోలేని విధంగా తన ప్రతాపాన్ని చూపిన కరోనా వైరస్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రపంచ వ్యాప్తంగా విభిన్న రంగాలపై దాని ప్రభావం ఎలా ఉంది. వాటిని ఎదుర్కోవ డానికి మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్న అంశాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు వైరస్ అంటే ఏమిటో, తెలుసుకుందాం.
వైరస్ అంటే-
వైరస్ అనే పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. ఈ వైరస్ అనే పదాన్ని డచ్ దేశానికి చెందిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త (మైక్రో బయాలజిస్ట్) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు. దిమిత్రి ఇవనోవ్‍స్కీ అనే మరో శాస్త్రవేత్త వైరస్‍ను మొదటిసారిగా కనుగొన్నాడు. వైరస్‍లు అతిసూక్ష్మంగా ఉంటాయి. ఇవి అవికల్పక పరాన్న జీవులు. అనగా సజీవుల్లో ఉన్నంతసేపూ సజీవంగానూ, నిర్జీవుల్లో నిర్జీవంగానూ లేదా నిర్జీవ పదార్థంగానూ ఉంటాయి. వైరస్‍లు వాటంతట అవి విభజన చెందలేవు. అవి తమ సంతతిని పెంచుకోవడానికి ఇతర జీవులపై దాడిచేస్తాయి. అతిథేయి జీవకణాలలోకి ప్రవేశించి ఆ కణాలలోని ఎంజైమ్‍లు మరియు కణద్రవ్య పదార్థాన్ని తీసుకొని తమలాంటి అనేక వైరస్‍లను అసంఖ్యాకంగా తయారు చేస్తాయి. వైరస్‍లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఈ రక్షణ కవచాన్ని కాప్సిడ్ అంటారు. ఒక వైరస్ రేణువును విరియన్ అంటారు. మొక్కలపై దాడిచేసే వైరస్‍లను ఫైటోఫేజ్‍లని, జంతువులపై దాడిచేసే వాటిని జూనోటిక్‍లని, బ్యాక్టీరియాపై దాడి చేసే వాటిని బ్యాక్టీరియోఫేజ్‍లని అంటారు. సాధారణంగా కొన్ని మినహాయింపు లతో ఫైటోఫేజ్‍లలో ఆర్‍ఎన్‍ఏ కేంద్రకామ్లంగానూ, జూనోటిక్ వైరస్‍లో డీఎన్‍ఏ కేంద్రకామ్లంగానూ ఉంటాయి. కాప్సిడ్ లేకుండా కేంద్రకామ్లం మాత్రమే ఉన్న వైరస్‍లను వైరాయిడ్ అంటారు. ఇదీ వైరస్‍లకు సంబంధించిన సంక్షిప్త చరిత్ర!
కరోనా- ఓ సరికొత్త వైరస్..!!
లాటిన్ భాషలో కరోనా అనగా క్రౌన్ లేదా కిరీటం అని అర్థం. కరోనావైరస్ ఉపరితాలన కిరీటంలాగా ముందుకు పొడుచుకు వచ్చిన బుడిపెల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అందుకే దీనికి కరోనా అన్న పేరు వచ్చింది. దీనిలో ఏడు రకాల ఉపజాతులున్నాయి. ఇది కరోనా విరిడే అన్న కుటుంబానికి చెందినది. సార్స్, మెర్స్ కూడా ఈ కుటుంబంలోనివే. కరోనా వైరస్‍ను తొలిసారిగా 1960లో జలుబు బాధితుల ముక్కు స్రావాల్లో గుర్తించారు. 2019 సం।। డిసెంబర్ చివరిలో చైనాలోని వుహాన్ ప్రాంతంలో కొందరు అనూహ్యంగా తీవ్రమైన న్యుమోనియా బారిన పడడం అక్కడి పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కల్గించింది. దీనికి కారణమేమిటని అన్వేషించగా కొత్తరకం కరోనా వైరస్ బయటపడింది. అందుకే దీనికి మొదట కొత్తరకం కరోనా వైరస్ (నావల్ కరోనా వైరస్) ‘ఎన్‍సీఓవీ-2019’ అని పేరు పెట్టారు, తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ఫిబ్రవరి 11న దీనికి కరోనా వైరస్ డిసీజ్ – కోవిడ్ (సీఓవీఐడీ) -2019గా పేరు మార్చింది.
కరోనా వైరస్సే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గడిచిన 50 సం।।ల్లో అనేక రకాల వైరస్‍లు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడాయి. 1967లో మర్‍బర్గ్, 1976లో ఎబోలా, 1994లో హెరా, 1998లో నిఫామ్, 2002లో సార్స్ (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), 2009లో స్వైన్‍ప్లూ, 2012లో మెర్స్ (మిడిల్‍ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), 2013లో బర్డ్ప్లూ విరుచుకుపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 762.6 కోట్ల మంది ప్రజలు ఈ వైరస్‍ల బారిన పడ్డారు. 2009లో వ్యాపించిన స్వైన్‍ప్లూ ఎక్కువ మందిని బలితీసుకుంది.
కరోనా వైరస్ జన్యు నిర్మాణం-
కరోనావైరస్ బయటి పొరపై స్పైక్ (ఎస్), ఎన్విలప్ (ఈ), మెంబరేన్ (ఎం), న్యూక్లియో కాప్సిడ్ (ఎన్) అనే నాలుగు నిర్మాణ (స్ట్రక్చరల్) ప్రొటీన్లు ఉంటాయి. కరోనా వైరస్‍లో జన్యు పదార్థంగా ఆర్‍ఎన్‍ఏ ఉంటుంది. డీఎన్‍ఏ, ఆర్‍ఎన్‍ఏలు జీవుల్లో జన్యు సమాచారాన్ని మోసుకెళ్ళే రసాయన వాహకాలు. చాలా జీవులు తమ జన్యు సమాచారాన్ని డీఎన్‍ఏలో నిల్వచేసుకుంటాయి. తద్వారా వాటి సంతానానికి అది బదిలీ అవుతుంది. అయితే కరోనా వైరస్‍లోని ఆర్‍ఎన్‍ఏ అనేది ప్రధానంగా ప్రొటీన్ ఉత్పత్తి కోసం జన్యు సంకేతాన్ని బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైన పేర్కొన్న నాలుగు ప్రొటీన్లు కరోనా వైరస్ లోపలున్న ఆర్‍ఎన్‍ఏను రక్షిస్తూ ఉంటాయి. కొత్త వైరస్ ప్రతుల విడుదల, వాటి కూర్పులోనూ ఈ ప్రోటీన్ల పాత్ర ఉంటుంది. వీటిలో ఎస్ ప్రొటీన్ వైరస్‍కు వెలుపల కొమ్ములాంటి ఆకృతులతో కిరీటంలాగా ఉంటుంది. ఈ ప్రొటీన్ యొక్క ఆకృతుల వల్లే దీనికి కరోనా వైరస్ అన్న పేరు వచ్చింది. కరోనా వైరస్ చుట్టూ చమురుతో కూడిన ఒక బుడగ ఏర్పడడానికి ఈ ప్రొటీన్ వీలు కల్పిస్తుంది. అలాగే వైరస్‍లోని వెలుపలి భాగాన్ని ఎం ప్రొటీన్ ఏర్పరుస్తుంది. ఎన్ ప్రొటీన్ వైరస్ యొక్క ఆర్‍ఎన్‍ఏను రక్షిస్తూ లోపల అది స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఈ ప్రోటీన్లే కాకుండా మరికొన్ని యాక్సెసరీ (సహాయక) ప్రొటీన్లు కూడా ఉంటాయి.
ఎలా సంక్రమిస్తుంది-
కరోనా వైరస్ గబ్బిలాలు, ఒంటెలు వంటి జంతువులలో ఆశ్రయం పొంది, జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. అందువల్ల దీన్ని జూనోటిక్ (జంతువులద్వారా సంక్రమించే) వైరస్ అంటారు. మానవులకు ఈ వైరస్ సంక్రమించే సందర్భంలో మొదట కరోనా వైరస్‍లోని స్పైక్ ప్రొటీన్ మానవ శ్వాసనాళం పై భాగంలోని నిర్దిష్ట కణాలపై ఉండే ఏసీఈ2 అనే ప్రొటీన్‍కు అనుసంధాన మవుతుంది. తద్వారా ఈ వైరస్ మానవకణంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మానవ కణంలోకి ప్రవేశించిన తరువాత స్పైక్ ప్రొటీన్ ఒక ఆర్‍ఎన్‍ఏ పోగును కణంలోకి చొప్పిస్తుంది. ఆ పోగులో కరోనా వైరస్ యొక్క మొత్తం జన్యుపటం ఉంటుంది. తరువాత మానవ కణాలను తన అదుపులోకి తీసుకొని కరోనా వైరస్ అసంఖ్యాకంగా విభజన చెందుతుంది. ఒక కణంలో తయారైన వైరస్‍లు మరొక కణంలోకి వెళ్ళడానికి వీలుగా ఓఆర్‍ఎఫ్3ఎ అనే సహాయక (యాక్సెసరీ) ప్రొటీన్ వైరస్‍లు అత్యధికంగా తయారైన మానవ కణానికి రంధ్రం చేస్తుది. దీంతో వైరస్‍లు మరొక మానవ కణానికి సులువుగా ప్రయాణిస్తాయి. ఈ సహాయక ప్రోటీన్ మానవ శరీరంలో వాపు (ఇన్‍ఫ్లమేషన్) పక్రియను కూడా ప్రేరేపిస్తుంది. ఇది చాలా ప్రమాదకర లక్షణం. అయితే వైరస్ సోకిన వెంటనే మానవ కణం రోగనిరోధక వ్యవస్థకు ఒక సంకేతాన్ని పంపుతుంది. ఈ సంకేతం రోగనిరోధక వ్యవస్థకు చేరకుండా మరొక సహాయక ప్రొటీన్ ఓఆర్‍ఎఫ్6 అనే ప్రొటీన్ నిలువరిస్తుంది. అంతేకాకుండా మానవ కణంలో వైరస్‍ను సొంతంగా ఎదుర్కొనే ప్రొటీన్ల పనితీరును కూడా ఇది అడ్డుకుంటుంది. మానవ కణం నుండి కొత్త వైరస్‍లు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మానవ కణం స్పందించి టెథెరిన్ అనే ప్రొటీన్లతో ఆ వైరస్‍లు తప్పించుకోకుండా ఉచ్చువేస్తుంది. ఈ దశలో ఇంకొక సహాయక ప్రొటీనైన ఓఆర్‍ఎఫ్7ఎ రంగప్రవేశం చేసి మానవ కణం నుండి టెథెరిన్ సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా కణం నుండి అసంఖ్యాంగా వైరస్‍లు వెలుపలికి వస్తాయి.
అంతేకాదు ఇన్‍ఫెక్షన్ సోకిన కణాలను ఆత్మహత్య చేసుకునేలా ఓఆర్‍ఎఫ్7ఎ ప్రేరేపిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. తద్వారా తీవ్రమైన జ్వరం (న్యుమోనియా), శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, జలుబు, దగ్గు, ముక్కు నుండి కారడంతోపాటు, ఊపిరిత్తులు విఫలం కావడంతో మనిషికి ప్రాణా పాయం సంభవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వల్ల మరణాల సంఖ్య లక్షల సంఖ్యలో పెరగడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) 2020 మార్చి 11న కోవిడ్-19ని మహమ్మారి (పాండమిక్)గా ప్రకటించింది. అంతేకాకుండా వ్యాక్సిన్ అందుబాటులో లేనందువల్ల మాస్క్లు ధరించడం, తగినంత భౌతికదూరం పాటించడం, చేతులను తరుచుగా సబ్బుతోగానీ, శానిటైజర్స్తోగానీ శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజలను హెచ్చరించింది. ఆర్టీ పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్) టెస్ట్ ద్వారా కరోనా వ్యాధి సంక్రమించింది లేనిది తెలుసుకోవచ్చని డబ్ల్యూహెచ్‍వో సూచించింది.
వ్యాక్సిన్ తయారయ్యే అవకాశం వుందా?
వ్యాక్సిన్ కనుగొనే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని గానీ లేదా లేవనిగానీ చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‍లలో సంభవించే ‘‘ఉత్పరివర్తనాలే’’ ఇందుకు కారణం అంటున్నారు. (వైరస్‍లలో ఆకస్మికంగా సంభవించే జన్యుమార్పులను ఉత్పరి వర్తనాలు అంటారు.) వైరస్‍లన్నీ తమ జన్యుస్వరూపాన్ని త్వరత్వరగా మార్చుకుంటూ ఉంటాయి. అలా మార్పు చెంది ఉద్భవించిన చాలా వైరస్‍లు ఒకవారం రోజులు బాధించి, ఆ తరువాత నిర్వీర్యమవుతాయి. దీన్ని బట్టి కొత్తగా మనం వ్యాక్సిన్ కనుగొన్నా, ఈ లోపే అది మరో కొత్త వైరస్‍గా రూపాంతరం చెందే విధంగా తమ జన్యు స్వరూపాన్ని మార్చుకోవడం పెద్ద సమస్యగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే జలుబుకు గానీ, హెచ్‍ఐవీకీ గానీ మనం ఇంతరవకూ వ్యాక్సిన్ కనుగొనలేక పోయామని వారు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ కూడా త్వరత్వరగా తన జన్యుస్వరూపాన్ని మార్చుకొంటూ కొరకరాని కొయ్యలాగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మొదట్లో కరోనా వైరస్ జన్యు స్వరూపం అంతు చిక్కనప్పటికీ క్రమక్రమంగా శాస్త్రవేత్తలు దాని జన్యు స్వరూపాన్ని నిశితంగా పరిశీలిస్తూ పూర్తిస్థాయి అవగాహనకు వచ్చారు. దీంతో ఎంతో మంది సైంటిస్టులు కరోనా వైరస్‍కు వ్యాక్సిన్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. ఎన్నెన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కోట్లాది రూపాయల విరాళాలతో ఈ పరిశోధనలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూరుస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం-
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువ రించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‍డౌన్ విధించి, ఉత్పత్తి కార్యకలాపాలను స్తంభింప జేయడంతో ఆయాదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలలోని ఆర్థిక వ్యవస్థలను, పేదలను కరోనా దారుణంగా దెబ్బతీసింది. కరోనా సృష్టించిన భీభత్సం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి, రవాణా స్తంభించి పోవడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన ఒడిదుడులకు గురయ్యాయని, దీనివల్ల వృద్ధిరేట్లు పడిపోతాయని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‍మెంట్) ప్రధాన కార్యదర్శి ఎంజెల్ గురియా హెచ్చరిక కొట్టిపారేయలేనిది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని, ఒక ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరై పోవచ్చని ఐక్యరాజ్య సమితి వ్యాపార వ్యవహారాల సంస్థ హెచ్చరిం చింది. కరోనా కారణంగా 25 మిలియన్ ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక తెలిపింది.
మన దేశంలో కరోనా కారణంగా అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతినింది. దేశంలో గల 90శాతం కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. రోజువారీ శ్రమతో బ్రతుకు బండిని నెట్టుకొచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీల పరిస్థితి కడుదయనీయంగా మారింది. సంపన్నులను విదేశాల నుండి తీసుకురావడానికి విమానాలను పంపించే ప్రభుత్వాలు వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చడంలో తీవ్రంగా విఫలమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. టూరిజం, వినోదం, రెస్టారెంట్లు, చలనచిత్రపరిశ్రమ, రవాణా, రిటైల్ వ్యాపారం వంటివి తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ 2020వ సం।।రానికి భారతవృద్ధిరేటును 5.7 నుండి 5.2 శాతానికి తగ్గించింది. మరో వైపు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాబోయే రెండు, మూడేళ్ళపాటు మన దేశంలో ప్రతికూల వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పడం మరెంతో ఆందోళన కల్గించే అంశం. కేరళ, ఆంధప్రదేశ్, తెలంగాణ, యూపీ, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు మాత్రమే పేదలను కాపాడడానికి ఉచిత బియ్యం, నగదు పంపిణీ వంటి చర్యలు చేపట్టాయి. మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ, అది దేశ ఆర్థిక వ్యవస్థను, రెక్కాడితే డొక్కాడని బడుగు జీవుల జీవితాలను ఎంతమాత్రం మార్చగలదన్నది వేచి చూడాలి.
చివరిగా-
ఈ భూమిమీద మానవజాతి ఆధిపత్యానికి తిరుగులేదు అన్న మానవ అహంకారం ఒక చిన్న సూక్ష్మజీవి కరోనా వైరస్ ముందు కకావికలమైపోయింది. ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రస్తుత విపత్తు మానవాళికి మంచి గుణపాఠం నేర్పింది. భూమి ఉన్నది మానవుని అవసరాలు తీర్చడానికే తప్ప, అత్యాశలుతీర్చేందుకు కాదు అన్న మహాత్మాగాంధీ మాటలను ఔదల దాల్చాల్సిన సమయం ఆసన్నమైంది. భూమి మనిషి ఒక్కడి కోసం కాదు. సమస్త ప్రాణులతో కలిసి సమిష్టిగా మనిషి భూమిని పంచుకుంటూ సహజీవన ధర్మాన్ని పాటించాలి. మనిషి చేస్తున్న దారుణాలకు పెట్టుబడి దారీ విధానాల దురాశకు వ్యతిరేకంగా నేడు భూమి పోరాడుతోందన్నది కాదనలేని నిజం. ప్రభుత్వాలు కూడా ప్రకృతి యొక్క సమతుల్యాన్ని కాపాడడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా విధానాలు రూపొందించి వాటిని కఠినంగా అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాలకు పాలక పక్షాలు వంతపాడడం ఇకనైనా విడనాడాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేయాలి. అంతిమంగా ఒక్కరికోసం అందరూ – అందరికోసం ఒక్కరు అన్న సంక్షేమ రాజ్య భావనకు గొడుగు పడుతూ, కరోనా నియంత్రణ విదేశీ అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చి ప్రజలు, ప్రభుత్వాలు సంఘటితంగా కృషి చేసి కరోనాపై విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-పుట్టా పెద్ద ఓబులేసు, ఎ : 9550290047