వాతావరణ మార్పులు – వైద్య రంగం

దేశంలో అందరికీ ఆరోగ్యం అందించాలంటే, సమస్యను పరిష్కరించడంలో చీకట్లో బాణాలు వేయడం మానాలి. అన్ని రకాల వైద్యవిధానాల సాయంతో దేశ ఆరోగ్యవ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఇందుకు డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సహాయం తీసుకోవాలి అంటూ ప్రభుత్వ కర్తవ్యాన్ని వివరిస్తున్నారు సామాజికోద్యమ కార్యకర్త ప్రొఫెసర్‍ డాక్టర్‍ కె. సత్యలక్ష్మి


ప్రతీ రోగానికీ ఓ మందు ఉంటుందనేది పాత నానుడి. అరకొర పరిశోధనలు, వ్యాధిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల రోగాన్ని వెంటాడి వేటాడి గుర్తించడం… దాన్ని హతమార్చడం చేస్తున్నాం. మరి అదేనా అసలైన చికిత్స? కానే కాదు.
ప్రతీకారం తిరిగి ప్రతీకారాన్ని కోరుతుంది అని అంటారు. దీన్నే మరో విధంగా విధంగా చెప్పాలంటే, మనం ఓ వ్యాధికి చేసే చికిత్స మరో వ్యాధికి దారి తీస్తుంది. అలా ఆ వ్యాధి మనపై ప్రతీకారం తీర్చు కొంటున్నది. అత్యాధునిక ఔషధాలేవీ కూడా సమాజంపై రోగాల భారాన్ని తగ్గించలేకపోతున్నాయి. పైపెచ్చు, అవి ఓ వ్యక్తిని శాశ్వతంగా రోగిగానే ఉంచుతున్నాయి. అంతు లేని మెడికల్‍ చెకప్‍లు, ల్యాబ్‍ టెస్ట్లు, ఆసుపత్రి బిల్లులు… మందుల బిల్లులు అన్నీ రోజురోజుకూ కొండలా పెరిగిపోతూనే ఉన్నాయి. రకరకాల ఇన్‍ఫెక్షన్లు, పోషకాహార లోప సంబంధిత వ్యాధులపై ఇంకా నియంత్రణ సాధించ లేదు. పైగా మధుమేహం, హైపర్‍టెన్షన్‍ (హైబీపీ), కీళ్ళనొప్పులు, క్యాన్సర్‍ లాంటి వ్యాధుల బారిన పడుతున్నాం. ఎన్నో వ్యాధుల కారణాలు అంతుచిక్కనివిగా మారుతున్నాయి. ఎన్నో వ్యాధులు నేడు జీవనశైలితో సంబంధం ఉండేవిగా మారుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, ఒకే ఒక్క ఆశాకిరణం… తెలివైన, హొలిస్టిక్‍ ఆరోగ్యసంరక్షణ ప్రదాతలు. ఇక్కడ ‘తెలివైన’ అనేది ‘సానుకూల రీతిలో పొందిన గత అనుభవానికి మరియు విజ్ఞానానికి’ సంబంధించింది. అలాగే ‘హొలిస్టిక్‍’ అనేది విభిన్న వైద్య విధానాలను ఒక్కటిగా చేసి, అమలు చేయదగ్గ రీతిలో, ఆరోగ్యసాధన ధ్యేయంగా పని చేయించడం. భారత్‍ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్యసమస్యల పరిష్కారా నికి సమగ్ర హొలిస్టిక్‍ విధానాన్ని అనుసరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతగా సూచించినప్పటికీ, ఆ దిశలో తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో భారత్‍లో ఇప్పటికే ఉన్న సమస్యలను రెట్టింపు చేసేలా మరో కొత్త ఉపద్రవం ముంచుకొచ్చింది. అదే క్లైమేట్‍ ఛేంజ్‍. వాతావరణ మార్పు!


వాతావరణ మార్పు
ఒకప్పుడు వాతావరణ మార్పు అనేది భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా ఉండింది. ఇప్పుడలా కాదు. అది వర్తమాన సమస్యగా మారిం ది. మన కళ్ళ ముందే మన మీద తన ప్రభావం కనబరుస్తోంది. అకాల వర్షాలు, తుపానులు, వరదలు, దీర్ఘకాలం పాటు కొనసాగుతున్న కరువు కాటకాలు, పంట ఉత్పత్తిలో, ఉత్పాదకతలో తగ్గుదల లాంటి వాటన్నింటి నీ మనం చూస్తున్నాం. ఆహార కొరత కారణంగా ఆకలి చావులూ చోటు చేసుకునే అవకాశం ఉంది.
గోధుమ ఉత్పత్తుల మిగులు దేశాలుగా ప్రసిద్ధి పొందిన ఆస్ట్రేలియా వంటి దేశాలు కొన్నేళ్ళ కిందట కరువు కాటకాలను చవిచూశాయి. స్వయం సమృద్ధి దేశాలుగా పేరొందిన థాయ్‍లాండ్‍, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా కరువుతో లేదా దిగుబడులు తగ్గడం తోనో సతమతమయ్యాయి. అధిక జనాభా కల భారత్‍, చైనా, బంగ్లాదేశ్‍ లాంటి వాటి చోట్ల కరువుదాడులు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆహార కొరతను వెన్నంటే పోషక లోపాలు, కొన్ని సందర్భాల్లో మరీ ముఖ్యంగా పేదవర్గాల్లో ఆకలి చావులు కూడా ఉంటాయని మనకు తెలుసు. తరచూ వచ్చే వరదలు, కరువులు లాంటివి వ్యాధులను పెద్ద ఎత్తున కలిగిస్తాయి. దేశం ఇప్పటికే బర్డ్ ఫ్లూ / స్వైన్‍ఫ్లూ కోరల్లో చిక్కుకుంది. ఏ సమయంలోనైనా అవి ప్రబలే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికే బర్డ్ఫ్లూ కారణంగా లక్షలాది పక్షులను, కోళ్ళను వివిధ రాష్ట్రాల్లో హతమార్చిన ఉదంతాలు మనకు తెలిసినవే. వాతావరణ మార్పుల కారణంగా దిగువ పేర్కొన్న విపరిణామాలు చోటు చేసుకో వచ్చునని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేసింది. (ఐపీసీసీ-ఇంటర్‍ గవర్నమెంటల్‍ ప్యానెల్‍ ఆఫ్‍ క్లైమేట్‍ ఛేంజ్‍-రిపోర్ట్ 2001 వాటిల్లో ముఖ్యమైనవి: ఉష్ణోగ్రత సంబంధిత అనారోగ్యాలు / మరణాలు, తీవ్రమైన వాతావరణ సంబంధిత ఆరోగ్య ప్రభావాలు, వాయు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలు, నీరు, ఆహార సంబంధిత వ్యాధులు, ఆహారం, నీటి కొరత కారణంగా ప్రబలే ఆరోగ్య సమస్యలు, మానసిక, పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు.


ముగింపు: సమస్యను పరిష్కరించడంలో చీకట్లో బాణాలు వేయడం మానాలి. అన్ని రకాల వైద్యవిధానాల సాయంతో దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఇందుకు డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సహాయం తీసుకోవాలి. ఇందులో హొలిస్టిక్‍ ధోరణి అనుసరించాలి. చికిత్స కన్నా నివారణ మేలు అన్నట్లుగా ఆరోగ్య రంగ ఉద్యమకారులు ఈ విషయంలో సమాజంలోని అన్ని వర్గాల వారిని చైతన్యపరచాలి. సరళమైన, ప్రభావపూరితమైన పరిష్కార మార్గాలను అందించాలి. దీనికి సంబంధించి ఆయుష్‍ (ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, యునాని, సిద్ధ, హొమియోపతి) వైద్యులు కీలకపాత్ర వహించాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, సమగ్రమైన, హొలిస్టిక్‍ వైద్యసేవలు అందించడంలో వారి సేవలు ఎంతో ముఖ్యం.


వాతావరణ మార్పుల కారణంగా చోటు చేసుకునే సాధారణ ఆరోగ్య సమస్యలకు వారు చిరుధాన్యాల ఆధారిత ఆహారం, ఆమ్ల తదితరాల ఆధారిత ఔషధాలు లాంటి స్థానికంగా లభించే వనరులతో, జీవనశైలిలో మార్పులతో వారు చికిత్స చేయగలుగుతారు. నేడు దేశానికి కావాల్సింది కూడా అదే.


(2012 సెప్టెంబర్‍ మాసం దక్కన్‍ల్యాండ్‍లో ప్రచురితమైన వ్యాసం. ఎనిమిది సంవత్సరాల క్రితమే దక్కన్‍ల్యాండ్‍ పత్రికలో పర్యావరణం, వైద్యం, వాతావరణ మార్పులపై ప్రత్యేక శీర్షికలు ప్రచురితమైనాయి.)


-ప్రొఫెసర్‍ డాక్టర్‍ కె. సత్యల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *