స్త్రీ విముక్తిని కోరే జ్వలిత ‘సంగడిముంత’

‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ అక్షరాలను వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గులు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో ఏమిటో తెలిసిపోతుంది.


జ్వలిత గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంలో కవయిత్రిగా రచయిత్రిగా రాణిస్తున్నారు. ఈమె 2007 నుంచి ‘‘కాలాన్ని జయిస్తూ నేను’’ అనే మొదటి కవితా సంపుటితో మొదలు పెట్టి ‘‘సుదీర్ఘ హత్య’’, ‘‘అగ్ని లిపి’’ ‘‘సంగడి ముంత’’ అనే నాలుగు కవితా సంపుటాలను, రెండు కథా సంపుటాలను, వ్యాసాలు, అనువాదాలు కలిపి మొత్తం ఎనిమిది పుస్తకాలను రచించి, ముద్రించారు.


జ్వలిత ఆధునిక కవయిత్రి. ఆధునిక భావాల వ్యాప్తి కోసం శ్రమిస్తున్న రచయిత్రి. ఈమె ఏ ఒక్క వర్గానికో కులానికో కాకుండా, సమాజాభిద్ధివృద్ధికి అడ్డు వచ్చే వాటన్నిటినీ తన కలం ద్వారా ఎదిరిస్తోంది. ముఖ్యంగా స్త్రీస్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కలం పట్టినట్లు ఈమె రచనలు చదివితే తెలుస్తుంది. ఇటు సాహిత్యోద్యమంలో, అటు సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళల వైపు దళిత బహుజనుల వైపు గొంతెత్తి మాట్లాడుతుంది. అందుకే కవిత్వంలో ఆవేశం, ఆగ్రహం, కసి, ప్రతిఘటన స్పష్టంగా కనపడతాయి.


ఈ ‘‘సంగడి ముంత’’ కవితా సంపుటిలో నలబై ఒక్క కవితలున్నాయి. ఈ కవితలన్నీ జ్వలిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. సాహిత్య దృక్పధాన్ని చూపిస్తాయి. కులవృత్తులలో స్త్రీ పురుషుల శ్రమ ఇమిడి ఉంటుందని తెలియ చేస్తాయి.
ఈ సంపుటిలో ఏ కవితను స్పృసించినా సమస్యను తీవ్రస్థాయిలో ఆలోచించడం, బాధ్యతాయుతంగా స్పందించడం, కళాత్మకంగా మలచడం కనపడుతుంది. ఎక్కడ ఏ ఉద్యమంలో లోపాలు ఉన్నా వెంటనే ముక్కు సూటిగా స్పందించడం ఈమె స్వభావం. ప్రస్తుతం నడుస్తున్న బీసీల ఏకీకరణ, రాజకీయ వాటా కోసం ఉద్యమిస్తున్న తరుణంలో మోసపోకండని ‘‘భావజాల వ్యాప్తి బహురూపులెత్తి /బానిసత్వాన్ని అంగీకరించి ఆమోదిస్తుంది/ నిన్నటి అన్నదమ్ములు అమ్ముడుపోయి/ వర్గ శత్రువుకు ఆయుధాలు ఇచ్చారని’’ కొందరు బీసీ నాయకులు చేసిన మోసాలను ఎత్తి చూపుతుంది. అదే కవితలో ‘‘ఓ బీసి బిడ్డలారా/ స్పర్ళలేని చర్మం హానికరం / అదొక రోగ లక్షణం’’ అని హెచ్చరిస్తుంది.


కోట్ల ప్రజల దుఃఖాన్ని కడిగి వేయడానికి జ్వలిత కలం పట్టారు. ఒక్క బీసీ నేతలనే కాదు ఎవరెవరు ఎక్కడ లొంగిపోయారో వాళ్ల అసలు ముఖచిత్రాలను కరపత్రాలుగా పంచుతారు. ఈ రోజు మహిళా రిజర్వేషన్‍ వల్ల అగ్రవర్ణ స్త్రీలు అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఒక చోట

‘‘ఓ మనువారసుల్లారా/ ఆకాశంలో సగం అవకాశాలు పొంది/ విశృంకల విహంగమైన ఆధునిక స్వార్థ సాధికార తల్లులారా/ మీ కోరికల స్వేచ్ఛ తీవ్రత/ శూన్యపు చితులను పేరొస్తున్నది నాకు’’ అంటూ ప్రశ్నిస్తుంది. జ్వలిత స్త్రీ స్వేచ్ఛ విముక్తి సమానత్వం అనే పైపై మాటలతో పాత అలంకరణలతో కవిత్వం రాయదు. ఇప్పటికీ మహిళల అణిచివేతల వెనుక గల బలమైన చారిత్రక సాంస్కృతిక ఫ్యూడల్‍ భావజాలాన్ని పెకిలించే భూమికను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే రాజ్యం నుంచి ప్రభుత్వాల నుంచి సమాజం నుంచి పురుషాధిక్యం నుంచి అగ్రవర్ణాల దౌర్జన్యాల నుంచి మహిళల్ని విముక్తి చేయడమే తన కవిత్వ ఉద్దేశ్యంగా పెట్టుకున్నది. దీనికి తగిన దళిత బహుజన దృక్పథం ఏర్పర్చుకున్నారు. ‘‘నేను శత్రు శిబిరంలో శరణార్థిని/నా జీవితం నిర్ణయాత్మక వెలివాడ/ నా గళం అనివార్య యుద్ధాల నడుమ/ ఆత్మగౌరవ గీతాలాపన’’ అంటుంది. వేధించే విష సంస్కృతి వారసత్వంగా వస్తున్నది దీనిని పటాపంచలు చేయడమే వర్తమాన దళిత బహుజన కవుల కర్తవ్యమని ‘‘చండాలిక రాజ్యం’’ అనే కవితలో ‘‘వారసత్వాన్ని విశ్వసించని రావణ సంతతి నేను/ పడగ విప్పిన వర్ణసర్పాలు శ్రీరంగనీతుల ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాయి’’ అంటూ మొదటి పాదంలోని రావణ వారసత్వాన్ని చాటి చెబుతున్నది కవయిత్రి. ఇంకా అదే కవితలో ‘‘కాంక్రీట్‍ అరణ్యంలో వేటాడబడుతున్న / తారకా మహా సమూహాలు/ లోహపు తెరల మాటున/ సంహరించ బడుతున్న శంభూకులు’’ అంటూ గడిచిన, నడుస్తున్న మనువాద సంస్కృతిని ఘాటుగా వ్యక్తీకరించారు. అనుభూతితో అక్షరాలకు కవితాత్మను చేకూర్చారు. ‘‘ఏమి చేయను/ పొద్దటి నుంచి వానపామోలె /తెగిన కాడే పెరగడం నేర్చుకున్న దాన్ని /బల్లి తోకోలె తెంపినప్పుడల్లా పెరుగుతనే ఉన్నా’’ మామూలు కవయిత్రులకు ఇటువంటి వాక్యాలు రాయడం చాలా కష్టం. ఈ కవయిత్రి జీవితాన్ని ఉద్యమంగా జీవిస్తున్నది కాబట్టి ఇంత తడి.


కుల వివక్ష జీవితాలను కథలు కవితలుగా అద్భుతంగా మలుస్తున్నారు. వివిధ పక్రియల ద్వారా దళిత బహుజనులను సంఘటితం చేస్తున్నారు. వ్యవస్థను ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి మేధావి వర్గం వాళ్లకు చెవిలో జోరీగలుగా మారారు. ఈ మేధావుల్లో ఒకరైన ఆచార్య కంచ ఐలయ్యను వేధించిన తీరును, ఐలయ్య ఉక్కు సంకల్పాన్ని అద్భుతంగా చిత్రించారు కవయిత్రి ‘‘వెలివాడ అవుతల నాలుగు దారులు కలిసిన చోట /బాధితులు బహుజనులు అంత కలిసిపోతున్నారు / ఐలయ్య అంటే నామవాచకం కాదు/ ఐలయ్య అంటే పూలే అంబేద్కర్‍ల/ జ్ఞాన జ్యోతుల కాంతి పుంజం’’ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు.

సామాజిక ఉద్యమాలలో కులం మతం సంస్కృతుల పేరుతో అణిచి వేసే శక్తులనే ప్రశ్నించడం నిలదీయడం జరుగుతున్నది. కానీ వీటిని పెంచి పోషిస్తున్న రాజ్యాన్ని ప్రభుత్వాలను మాత్రం ఉదారంగా చూస్తున్నారు. కానీ జ్వలిత మాత్రం అవసరమున్న చోట రాజ్యాన్ని ప్రభుత్వాలను ‘‘నిలువెత్తు విగ్రహాల తల కొబ్బరికాయల విజయాలు కావు/ విస్మరణలను విరగదన్నే విజయ బావుటా నువ్వు కావాలి’’ అంటూ తెలంగాణ రాష్ట్రావతరణ తరువాత పరిస్థితులను వివరిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటలకు మోసపోవద్దని ప్రజలను చైతన్యపరిచే ఒక కార్యకర్తగా ‘‘రాగద్వేషాలు లేని/ రాజ్యాంగ అవగాహన ఉన్నదాన్ని/ అంగూటిఛాప్‍ అమ్మలకు/ హక్కుల వాటా పాఠం చెప్పేదాన్ని/బుజ్జి బుజ్జి పావురాలకు /ఓటు ఆయుధం పదును నేర్పేదాన్ని/ యుద్ధ విద్యలు నేర్పుగా కూర్చే దాన్ని’’ ఇలాంటి సాహిత్య సామాజిక కార్యకర్తలు ఏ కాలానికైనా అవసరమే.


కవయిత్రులు రచయిత్రులు మేధావులు వర్తమాన కుల మత రాజకీయ దుర్మార్గాలను దౌర్జన్యాలను నిలదీస్తున్నారు. ఇది మతోన్మాదులకు దోపిడీ వ్యవస్థకు మింగుడు పడడం లేదు. ఇందులో భాగమే కల్బుర్గి, గౌరీ లంకేష్‍ హత్యలు. ఒక జర్నలిస్టు వాస్తవాలు ప్రకటించినందుకు హత్య చేశారు. ఈ విషయానికి తీవ్రంగా చలించి ‘‘హత్యా రాజకీయ సుఖ రోగాల సన్నాసుల్లారా/ కలం పట్టి నిలబడ్డ ఆమెను చూస్తే భయమేసిందా’’ అంటూ ‘‘ఆమెను చూసి భయపడుతున్న సన్నాసులు’’ అనే కవితలో తీవ్రంగా స్పందించారు.


దళిత సాహిత్య ఉద్యమం ఏకలవ్యుడు, శంబూకుడు నుంచి కారంచేడు, చుండూరు, రోహిత్‍ వేముల దాకా జరిగిన హత్యలను ప్రశ్నించింది. రోహిత్‍ వేముల ఆత్మహత్యకు తీవ్రంగా స్పందించి ‘‘మనువాదం పేనిన ఉరి అని నిరూపించిన వాడా /ఆ పరోక్ష ప్రత్యర్థి యుద్ధంలో /మరణ మై గెలిచిన అమరుడా ‘‘అంటూ మరణాన్ని గొప్ప చరిత్రగా అక్షరీకరించారు. ‘వద్దు కన్నీళ్ళ కవిత్వం రాయద్దు’ అని ఓ విప్లవ కవి అన్నట్లు. ఉద్యమ కవయిత్రి మరణాన్ని అమరత్వంగా కవితాక్షరాలతో చెక్కింది. అది ముందు తరాలకు కొండంత స్ఫూర్తి కావాలనుకుంది.
నిబద్దత గల కవుల కవితలలో అసలు కవితా వస్తువు అంతర్గతంగా ప్రసరిస్తూంది. అదే కవితా భూమిక. ఇక్కడ జ్వలిత కూడా ప్రతిరోజు మనం చూసే గోడ గడియారాన్ని కూడా స్త్రీల వేధింపులు చెప్పడానికి ప్రతీకగా తీసుకున్నారు. ‘‘నిత్యం అంకెలకు దూరంగా నిలబడుతూ /సమయాన్ని కచ్చితంగా చూపగల సెకండ్ల ముల్లు యజమాని ‘‘అని సెకండ్లముల్లు యజమానిగా నిమిషాలు ముళ్ళు గంటల ముళ్ళను వేధిస్తున్నదని విలక్షణంగా చెప్తుంది. ఇంటిని కూడా ఇదే తరహాలో ఇల్లంటే ఇద్దరు పిల్లలు వారి పెద్దలు నాలుగు గోడలు కదా అనుకుంటాం. ఇవి వట్టి గోడలే కాదు/ స్త్రీల వేదింపులతో నిత్యం కుళ్ళుతో కొనసాగుతూ /కదిలే సత్రం ఇల్లు’’ అంటారు. కదిలే సత్రం అనడంలోనే లోతైన అర్థం దాగి ఉంది.


చిన్న పిల్లల్ని కూడా పశువుల కంటే హీనంగా హింసించే లోకంలో ‘‘పాలుగారే చెక్కిళ్ళు/ పువ్వులాంటి దేహాలు/ యుద్ధ బీభత్సం రుధిర క్షేత్రాలుగా మారుతున్నాయి’’ అంటారు. ఎంత వేదనకు గురయితే ఇటువంటి ఘాటు పాదాలువస్తాయి.
నిజానికి జ్వలిత కవిత్వమంతా జీవితానుభవం నుంచి, పోరాటాల నేపథ్యం నుంచి వచ్చింది. ఈమె స్త్రీవాద కవిత్వాన్ని ఎంత బలంగా గాఢంగా అల్ల గలదో, ఇతర అంశాలను కూడా అంతే వాడిగా వేడిగా మలచ గలదు. ఆమె అక్షరాలన్నీ వేల ఏళ్ల దౌర్జన్యాలను వెలికితీసే కంచు కాగడాలు. ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే పకడ్బందీ ఎత్తుగడను పసిగట్టి ‘‘అవసరమైన ప్రశ్న’’ అనే కవితలో ‘‘కొండలన్నీ ధ్వంసమై రోడ్లపై గురుకుల పెడుతున్నాయి చెరువు అన్ని నీ మాయమై యముని నిర్మాణాలు అవుతున్నాయని దండకారణ్యం రక్తపుటేరులు అవుతున్న /హక్కుల రెక్కలు నరికి హింస రాజ్యమేలుతున్నా /అంటూ గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని హ•ద్యంగా చిత్రీకరించారు.


నిజానికి జ్వలిత కవిత్వమంతా కోట్లాది ప్రజల జీవన కాంక్ష . ఆధిపత్యం కింద బతుకులీడుస్తున్న వాళ్లకు తరగని యిమ్మతి. ఈ కవితా సంపుటిని మొత్తంగా పరిశీలిస్తే ఈ ‘‘సంగడి ముంత’’ను దీర్ఘకవితగానో, కావ్యంగానో మలచవచ్చు. ఒక నిబద్ధతతో, సుదీర్ఘ ఉద్యమ అనుభవంతో, దళిత బహుజన స్త్రీవాద కవిత్వాన్ని అందించిన జ్వలిత అభినందనీయులు. ఈ సంపుటిని పూర్తిగా చదివేశాక కొంచమైనా ఆలోచించకుండా ఉండలేరు పాఠకులు. కదిలించేదే కవిత్వం కదా!

ప్రతులకు: ‘‘సంగడి ముంత’’ (కవిత్వం)
రచన: జ్వలిత,
పుటలు:100,
వెల: రూ.200/-
సాహితీవనం, 15-21-130/2,
బాలాజీనగర్‍, కూకట్‍పల్లి, హైదరాబాద్‍-72

మొబైల్‍ : 9989198943
-డాక్టర్‍ ఉదారి నారాయణ
ఎ : 9441413666

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *