‘‘భూమి మనకు సంక్రమించిన వారసత్వ సంపద కాదు. భావి తరాల నుంచి తెచ్చుకున్న అరువు ” We don’t inherit the earth, we borrow it from our children” అన్నదొక పాత అమెరికన్ సామెత.
జనాభా లెక్కల ప్రకారం మనిషి ఆవాసాలను పల్లెలు, పట్టణాలు, నగరాలు, వాటి అంచున మురికివాడలు, అని చెప్పటం పరిపాటి. కానీ అసలు సత్యం ఏమిటంటే, భూగ్రహంపైన వాతావరణం ఉండడం ఒక అపురూపమైన పరిస్థితి. దీని వలన దాదాపు 87లక్షల జీవరాశులతో కలసి మానవుడు జీవిస్తున్నాడు. వేల సంవత్సరాల పాటు జరిగిన జీవ పరిణామ క్రియలో మనిషి మకుటాయమానమైన శక్తిగా ఎదగడంతో మిగిలిన అన్నిటి మీద ఆధిపత్యం సాధించి, తన నివాసాన్ని సౌకర్య వంతంగా తయారు చేసుకున్నాడు. ఐతే కంటికి కనబడని సూక్ష్మజీవుల ప్రపంచం మనచుట్టూ తిరుగుతుంటుందనేది విస్మరించలేని విషయం.
కరోనా అనే ఒక ఆర్.ఎన్.ఎ వైరస్ వల్ల జరుగుతున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భీభత్సాలను చూస్తే ఇది కొంత వరకు అర్థ మవుతుంది. ఈ నేపధ్యంలో వ్యాధులు, వాటి వ్యాప్తి గురించి ముచ్చటించుకోవడం అవసరం.
క్రీస్తుపూర్వం 1200లో తొలిసారిగా నమోదైన అనారోగ్యం ఇన్ఫ్లూయెంజా. ఇది వైరస్ వ్యాధియే. పర్షియా, దక్షిణ మధ్య ఆసియా ఖండాలలో వచ్చింది. ఆ తరువాత క్రీస్తుపూర్వం 429-426 సంవత్సరాలలో రోమన్ సామ్రాజ్యాన్ని, 250లో యూరప్‍ను, 541లో యూరప్, ఆసియా దేశాలలో రకరకాల అనారోగ్యాలు కబళించి వేశాయి. ముఖ్యంగా క్రీ.పూ. 541వ సంవత్సరంలో సంభవించిన అనారోగ్యం ‘తొలి పాండమిక్’గా పేరు పొందింది. ‘పేండమిక్’ అనగా విస్తృతమైన వైశాల్యంలో అనేక దేశాలలో, ఖండాలలో వ్యాపించే వ్యాధి. దీనిని జస్టినియన్ ప్లేగు అన్నారు. ఈ జబ్బు వలన 25 నుంచి 100 మిలియన్ల వరకు మరణాలు సంభవించాయి. అంటే ఆనాటి ఐరోపా జనాభాలో సుమారుగా 50 శాతం అన్నమాట! ఆ తరువాత చెప్పుకోదగిన పేండమిక్ 1510లో ఇన్ల్ఫయెంజా వైరస్ వలన సంభవించింది. 1561లో (స్మాల్ పాక్స్) మశూచి జబ్బు వచ్చింది. 1817 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చొప్పున 1927 వరకు ఆరుసార్లు కలరా, యూరప్, తూర్పు అమెరికా, రష్యా, గల్ఫ్, ఆసియా, దక్షిణ అమెరికా అన్నింటినీ చుట్టబెట్టింది. ప్రతిసారీ, ఏళ్ళ తరబడి మరల మరల ప్రాణనష్టాన్ని కలుగ చేస్తూనే ఉంది. మిలియన్ల కొలది మనుషులు అనారోగ్యం పాలై, కోలుకోలేక, జబ్బుకు లొంగి అకాలమరణం చెందారు. ప్రధానంగ బాక్టీరియా వలన వచ్చే వ్యాధులపై ఆధునిక వైద్యం పట్టు సాధించిన తరువాత, 1915 నుండి వైరస్ వలన వ్యాధులు పెరిగాయి. 1915 లో మెదడు వాపు వ్యాధి, 1918-1920 H1N1, 1918-1922 రష్యన్ టైఫస్, 1957-58 H2N2, 1968-70 నడుమ H3N2, 1988-2018 వరకు HIV, ఈ జబ్బులన్నీ అధమపక్షం 1 మిలియన్ నుంచి 32 మిలియన్ల వరకూ మానవ ప్రాణాలను తుడిచిపెట్టేసాయి.
ఈ వివరాలు గూగుల్‍లో దొరికే సమాచారమే కదా అనుకుంటే పొరపాటు. ఇదంతా మనిషికి, అనారోగ్యాన్ని కలుగచేసే సూక్ష్మ జీవులకు మధ్య జరిగిన పునరావృత జీవన్మరణ పోరాటమే అని గ్రహించాల్సి ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 25 కోట్ల రకాల వైరస్ లు ఈ భూమిపై ఉన్నాయి. గాలి, నీరు, వాతావరణం, మట్టి, సముద్ర గర్భం అన్ని ప్రదేశాలలో, చిన్న అవకాశం వచ్చినా అనేక రకాలుగా విడిపోయే రసాయనాలనే వైరస్‍లు అని చెప్పవచ్చు.
సారాసాయర్ వైరాలజిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (బౌల్డర్) కథనం ప్రకారం, మానవుని రోగనిరోధకత కన్నా, ఆ వైరస్‍ల ఆశ్చర్యకరమైన కొన్ని లక్షణాల వల్ల కూడా అవి కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కలుగచేయగల సత్తా కలిగి ఉంటాయి. ఇవికాక మానవేతర క్షీరదాలు, పక్షులలోనే 1.7 మిలియన్ల రకాల వైరస్ లుండి, అవి ఇంతవరకూ శాస్త్రజ్ఞుల పరిశోధనకు అంతు చిక్కని నిర్మాణంతో తిరుగాడుతున్నాయట! జెమ్మాగోగెన్ (Jemma geoghehan) మెక్కైర్ (Macquire) విశ్వవిద్యాలయంలో పని చేసే వైరాలజీ పరిశోధకులు. వారు వైరస్ స్వీయ నియంత్రణతో ‘‘పొంగిపొరలే సంఘటన’’ (spill over) అని చెప్తారు.అంటే ,ఒక కొత్త జీవి లోనికి వెళ్ళినప్పుడు అదే ఉపశాఖకు చెందిన మరొక కొత్త జీవిలోకి వెళ్లి, వారిలో కూడ వృద్ధి చెందగల ‘చొరవ’ను వైరస్ కలిగి ఉంటుంది.
ఉదాహరణకు జైకా వైరస్ దాగి ఉన్న గబ్బిలం, మానవుడు ఇద్దరూ క్షీరదములే. ‘‘ఒక కొత్త వైరస్ ప్రపంచంలో వ్యాధి కలుగచేసేలా అవడానికి 80 వేరువేరు కారణాలు ఒకచోట చేరా’’లంటారు, డొరోథీ టోవర్ dorothy tovar, stanford university. అంటే, ఒక ప్రదేశంలో ఉండే ఉష్ణోగ్రత , వర్షపాతం, ఆహారపు అలవాట్లు, గృహ నిర్మాణం, నీటి వాడకం, పరిశుభ్రత, పెంపుడు జంతువులు ఇలా ఇంకెన్నో.
SARS-COVID 19 కలుగ చేస్తున్న కొవిడ్-19 మన శ్వాస నాళంలో ఉన్న ACE-2 అనే ఒక ప్రోటీన్‍ను ఆధారం చేసుకుని, దూసుకు పోగలదు. దీనినే జన్యుపరమైన సౌలభ్యత అని అంటారు. మరీ ముఖ్యంగా వైరస్‍లలో క్రోమోజోముల మార్పులు, కొత్త నిర్మాణంతో సరికొత్త వైరస్‍లుగా మారడం చూస్తున్నాం. ఎబోలా-ebola, సార్స్ SARS COVID, MRSA, జైకా zika, ఇన్ ప్లుయెన్జా influenza, SARS COVID ఇలా.. ఇప్పటిదాకా, జబ్బు వచ్చాక, ఎంతో మంది చనిపోతే తప్ప అది కలుగజేస్తున్న నిర్మాణం, దాని పనితీరు పరిశోధించటం మొదలవదు. అత్యంత తెలివైన శాస్త్రజ్ఞులు కూడ ఈ విషయంలో ఏం చేయలేరు.
అడవి- పెంపుడు జంతువులైన పందులు, గుర్రాలు, పక్షులు, తిమింగలాలు వీటన్నింటిలోనూ ఈ వైరస్‍లు ఏ అనారోగ్యం కలుగ చేయకుండా అచేతనంగా ఉండడం ఒక కారణం. అంత ప్రాధమిక దశలో దానిని పట్టించుకోం కనుక. ఈ మధ్య వచ్చిన ఈ కరోనా వైరస్ గురించి చాలా పరిశోధనలు జరిపిన తరువాత ఎలుకలు, గబ్బిలాలు, ఉడుము, చలి చీమలు తినే ఒక జంతువు వంటి మానవేతర క్షీరదాలలో మానవ సమాజానికి దగ్గరగా ఉన్న కొన్ని జంతువుల వల్ల వ్యాధి సంక్రమించవచ్చని చెబుతున్నారు. మెదడువాపు వ్యాధి ఎన్ కెఫలైటిస్ కలుగచేసే వైరస్ పందులనుండి సంక్రమిస్తుందని మనకు తెలుసు.
ప్రాచీన కాలంలో అసలు సూక్ష్మజీవి అంటూ ఉందని, అనారోగ్యం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, సమూహాలకు ఎలా ప్రబలుతుందో తెలియని రోజులలో, అనారోగ్యం అంటే దేవతలు దెయ్యాలు ఇచ్చిన శాపమని మూఢ నమ్మకాలతో, అంధ విశ్వాసాలతో కొట్టుమిట్టాడేవారు. అప్పటి కాలంలో, కొన్ని సూచనలను పాటించమని ప్రతిపాదించారు. వాటిలో అతి ముఖ్యమైనవి:
1. సబ్బుతో చేతులు కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం.
2. తాము వాడిన కంచాలు, గిన్నెలు, బట్టలు, నిత్యావసర వస్తువులు, ఆరోగ్యంగా ఉన్న వారికి తగలకుండా దూరంగా ఉంచడం.
3. పౌష్టికాహారం తీసుకోవడం
4. శరీరం నుంచి విడుదలయ్యే రక్తం, చీము, మలం, మూత్రం మొదలైనవి దూరంగా పారవేయడం వంటి సూచనలు
ఇప్పటికీ ఈ జాగ్రత్తలు అమూల్యం. ఎందుకంటే మానవుని అనారోగ్యంలో చాలా శాతం సంక్రమించే వ్యాధులే. అవి సూక్ష్మజీవుల వల్ల వచ్చేవే. కనుక పరిశుభ్రత ప్రధానం.
ఆధునిక యుగంలో సమస్య నివారణ కోసం తీసుకునే జాగ్రత్తలు తక్కువ. ఏదో ఒక మాజిక్ బుల్లెట్ అంటే సర్వ శక్తి సంపన్న ఔషధం కావాలి. సమస్యంతా పరిష్కారం కోసమే కాక, ముందు చూపు తో నివారించుట ఆవశ్యకం.
దైనందిన జీవన విధానంలో వస్తువులను వాడి -పారవేయడం, ఒక్కసారి వాడి పారవేసే వస్తువులను ఉపయోగించడం జరుగుతోంది. దీని వలన జల, వాయు, భూ కాలుష్యం పెరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత తగ్గిపోయింది. ఈనాడు సంపన్న దేశాల నుంచి పేద దేశాల వరకూ, ఉన్నత విద్య గల వారి నుంచి చేతి పనులు చేసుకునే వారి వరకూ అందరిలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పూర్తిగా అనాదరణకు నోచుకుంది. ప్రభుత్వాలు గార్బేజ్ కలెక్షన్ కోసం ఎంతో ఆర్థిక, మానవ వనరులను ఖర్చుపెట్టవలసి వస్తోంది.
2018 జనవరి 25 లెక్కల ప్రకారం మన దేశ రాజధాని కొత్త ఢిల్లీలో రోజుకు సుమారుగా 10,500 టన్నుల వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశం మొత్తం మీద, రోజుకు ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలు పేరుకుపోతున్నాయి. ఇందులో 15 వేల మెట్రిక్ టన్నులు ఆరుబయటనే ఉంటాయి. నదులు, సముద్రం పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం అయాయి.
కేంద్ర కాలుష్య నియంత్ర బోర్డు, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అమాత్యులు బాబుల్ సుప్రియో పార్లమెంటుకు ఇచ్చిన వివరాల ప్రకారం, దేశంలోని 60 నగరాలలో రోజుకు 4,059 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. 20 లక్షల టన్నుల (E-waste) ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్ధాలు తయారవుతూ ఉండగా అందులోంచి 69,414 మెట్రిక్ టన్నులు మాత్రమే సరిగ్గా రీసైకిల్ చేయబడుతున్నాయి అంటే 0.7% మాత్రమే (India’s trash bomb: India today July 21 2019.)
ఇలాటి పరిసరాలలో ఎలుకలు, పిల్లులు ఇతర జంతువులు, వాటి మలమూత్రాలు, మృత కళేబరాలు పోగై అనేక బ్యాక్టీరియా, వైరస్‍లకు నిలయాలుగా తయారయ్యాయి. అనేక రోగాలు ప్రబలడానికి కారణం ఇదే. మానవుని సగటు ఆరోగ్యం బాగా తూట్లు పడింది. ఆహార పదార్ధాలలో వాడే రంగులు, హానికరమైన క్రొవ్వు పదార్ధాలు, వాటిని జాగ్రత్త పరిచేందుకు వాడే గిన్నెలు, అతి శీతలం, అతి వేడి గల పదార్థాలు, నిల్వ ఉంచేందుకు వాడే ప్యాకింగ్, తమలపాకు, తంబాకు, మాదక పదార్థములు ఇవన్నీ మానవుని రోగనిరోధకతను తగ్గించి పలు రకాల వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇక 20వ శతాబ్దం అనారోగ్యాలుగా మధు మేహం, అధిక రక్తపోటు, కీళ్ళవాతం వాటికి వాడే అనేక రకాల మందులు మనిషిలో వ్యాధి రక్షణ వ్యవస్థను అనేక రకాలుగా బలహీనపరచేవే.
మరొక మానవ తప్పిదం. తెలిసో, తెలియకో నగరాల పరిమాణం పెరిగింది. చుట్టూ ఉన్న కొండలు, అడవులు, తోటలు నిర్మూలించి, ఔటర్ రింగ్ రోడ్, గ్రేటర్ సిటీ, శాటిలైట్ సిటీ ఇలా జనావాసం మరింత భూమిని దురాక్రమణ చేస్తోంది. అడవి, కొండ ఒక నెలలో మాయం చేసే యంత్రాలు, జెసిబిలు, పేలుడు సామాను వంటివి వచ్చాయి. అందు వలన అక్కడి వృక్ష, జంతు జాతులు మాయమై, కొత్త, అనుకోని సంబంధాలు ఏర్పరచుకుని కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి.
మరో ముఖ్యమైన అంశం ప్రయాణం. పలు కారణాల వలన దేశాల, ఖండాల మధ్య పర్యటనలు, ప్రయాణాలు పెరిగాయి. 2017కు కేవలం విమాన ప్రయాణీకులే 10 లక్షలు, అంతర్జాతీయ ప్రయాణంలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది (2019). ఇక ప్రపంచ స్థాయి పర్యాటన ఎంత పెరిగిందో ఊహించవచ్చు. అందుకే, వ్యాధి వ్యాప్తి అధికమై, కేవలం కొద్ది నెలలకే కరోనా పాండమిక్‍గా మారింది.
ఇప్పటికైనా వ్యక్తిగత, సామాజిక బాధ్యత పెరగాలి. ప్రతి ఏటా పెరిగే కాంక్రీట్ ఆవాసాల నిర్మాణం తగ్గాలి. వ్యర్ధాలను సరియైన విధంగా తొలగించాలి. ప్లాస్టిక్, ఎలక్టానిక్ వస్తువుల వాడకంలో సమూలమైన మార్పులు కావాలి. చికిత్స కన్న శుభ్రత మేలు. ఆ దిశగా ఈ తరం యువత అడుగులు వేయాలి.
15 సంవత్సరాల స్వీడిష్ బాలిక గ్రేటా థన్బర్గ్ తన పాఠశాలలో ‘‘పర్యావరణ పరిరక్షణకై విద్యార్ధి నిరసన’’ అని ఒక ప్లకార్డు పట్టుకుంది. ఆ తరువాత ఐక్యరాజ్యసమితి 2019, న్యూయార్క్ నందు నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ క్రియాశీలక సమావేశంలో ‘‘మీకెంత ధైర్యం?’’ అంటూ ప్రపంచాన్ని ప్రశ్నించిన తీరు మనందరి గుండెలలో మారు మ్రోగాలి. నిజమే! కార్బన్ వ్యర్ధాలతో కలుషితమైన వాతావరణం, అంతుచిక్కని ప్రాణాపాయ వ్యాధులతో నిండిన సమాజం ఇవేనా మనం భావి తరాలకు ఇస్తున్నాం? నోట్లకట్టలు, సిమెంటు అరణ్యాలు, ప్లాస్టిక్ సముద్రం, హానికర పరమాణువులున్న గాలి ఇవేనా తరువాతి తరాలకు మనం అందచేస్తాం?
-నాగసూరి వేణుగోపాల్, ఎ : 9440732392
-కాళ్ళకూరి శైలజ, ఎ : 9885401882