ఈ మధ్య ఓ పోలీసు ఉన్నతాధికారి పాకిస్తాన్ టీవీ చానల్‍లో జరిగిన ఓ వీడియో చర్చని నాకు పంపించారు. అది సర్ గంగారామ్ గురించి. అప్పటి దాకా ఢిల్లీలో ఉన్న గంగారామ్ హాస్పిటల్ మాత్రమే నాకు తెలుసు. ఆయన గురించి ఏమీ తెలియదు. ఆ చర్చని చూసిన తరువాత సర్ గంగారామ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రముఖ కథా రచయిత సాదత్ హసన్ మంటో కథ ‘పూలదండు’ కూడా కన్పించింది. ఆ టీవీ చర్చలో సర్ గంగా రామ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అది నిజం కూడా. ఎందుకంటే సర్ గంగారామ్ ఓ హీరోలాగా సంపాదించాడు. మహాదాతలాగా ఖర్చు పెట్టాడు.
లాలా దౌలత్‍రామ్ దంపతులకి 1851లో గంగారామ్ జన్మించాడు. అమృత్‍సర్‍లో విద్యాభ్యాసం చేశాడు. లాహోర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. ఆ తరువాత రూర్కి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నాడు. ఢిల్లీలో ఓ యాంఫీ థియేటర్ నిర్మాణం అతని మొదటి ప్రయత్నంగా జరిగింది. అమృత్‍సర్ నుంచి పఠాన్ కోట్‍కి మధ్యన రైలు నిర్మాణానికి అతను 1877లో ఫ్లాన్లు వేశాడు.
లాహోర్ మహానగరంలో అతని ముద్ర లేని కట్టడం కన్పించదు. లాహోర్ మ్యూజియమ్, ఆంగ్లకన్ చర్చి, మాయో ఆర్టస్ కళాశాల, జనరల్ పోస్ట్ ఆఫీస్, అతిసన్ కాలేజి, పంజాబ్ హైకోర్టు, లాహోర్ మాయో హాస్పిటల్, ప్రభుత్వ కళాశాల, కెమికల్ లేబరేటరీ, గంగారామ్ హాస్పిటల్ లాంటి భవనాలు అన్నీ అతను ప్లాన్ చేసి కట్టినవే. ఆధునిక లాహోర్‍కి అతను తండ్రిలాంటివాడు. అతని సేవలను గుర్తించి అతనికి 1903వ సంవత్సరంలో రాజ్ బహదూర్ అతన్ని 8 జులై, 1922వ సంవత్సరంలో కింగ్ ఎంపరర్ జార్జి-4 గౌరవించారు.

అతనికి 52 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు పదవీ విరమణ చేశాడు. అప్పుడు అతనికి కొలత భూమిని గ్రాంట్‍గా ఇచ్చారు. మెకానికల్ పద్దతులని ఉపయోగించి ఎందుకూ పనికిరాని 50,000 వేల ఎకరాల భూమిని పంట భూమిగా మార్చివేసినాడు. మూడు సంవత్సరాలలో లిఫ్ట్ ద్వారా నీటిపారుదలని ఆవిష్కరించి ఆ భూమిని పంట భూమిగా మార్చిన వ్యక్తి సర్ గంగారామ్ అగర్వాల్.
1923లో సర్ గంగారామ్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి వితంతువుల భవనాన్ని, గంగారామ్ చారిటీ హాస్పిటల్‍ని నిర్మాణం చేశాడు. కామర్స్ కాలేజీని, మహిళల కోసం మరో కాలేజీని లాహార్‍లోని తన స్వంత భవనంలో ఏర్పాటు చేశాడు. ఎన్నో ఆశ్రమాలను వృద్ధుల కోసం, అనాథుల కోసం ఏర్పాటు చేశాడు.
జులై 10, 1927లో లండన్‍లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు 1920వ సంవత్సరంలో అప్పటి పంజాబ్ గవర్నర్ సర్ ఎడ్వర్డ్ జగ్లాస్ మెక్‍లాగన్, గంగాపూర్‍లో గంగారామ్ ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఇంత నైపుణ్యంతో ఓ వ్యక్తి స్వయంగా తయారు చేసిన వ్యవసాయక్షేత్రం ఓ మహత్తులాంటిదని అభివర్ణించాడు.
భారతదేశ విభజన జరిగిన తరువాత సర్ గంగారామ్ ట్రస్ట్కి, అప్పటి భారత ప్రధాని ఢిల్లీలో 1951లో కొంత భూమిని కేటాయించాడు. అందులోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‍ని 1954వ సంవత్సరంలో నిర్మించారు.
లాహోర్ ఆధునిక నిర్మాత సర్ గంగారామ్ విగ్రహం గతంలో లాహార్‍లో వుండేది. ఇప్పుడు లేదు. దేశ విభజన సమయంలో మతపరమైన సంఘర్షణలు జరిగాయి. భారతదేశంలో జరిగాయి. పాకిస్తాన్‍లోనూ జరిగాయి. ఆ సమయంలో ఓ అల్లరి మూక లాహార్‍లో వున్న సర్ గంగారామ్ విగ్రహం దగ్గరకు చేరుకుంది. ఆ విగ్రహం మొఖానికి మసిపూశారు. విగ్రహం మీద రాళ్ళు విసిరారు. ఆ అల్లరి మూకలోని ఓ వ్యక్తి చెప్పుల దండ తీసుకొని విగ్రహం పైకి ఎక్కి విగ్రహం మెడలో ఆ చెప్పుల దండని వేశాడు. అప్పుడే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు జరిపారు. ఆ అల్లరి మూకలోని చాలా మంది వ్యక్తులు ఆ కాల్పుల్లో గాయపడ్డారు. చెప్పుల దండని సర్ గంగారామ్ విగ్రహం మెడలో వేసిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ అల్లరి మూకలోని ఓ వ్యక్తి ఇలా అరిచాడు. ‘‘అతన్ని వెంటనే సర్ గంగారామ్ హాస్పిటల్‍కి తీసుకొని వెళ్ళండి’’. ఇదీ సంఘటన.
సాదత్ హసన్ మంటో ఈ సంఘటనని కథగా రాశాడు. ఆ కథపేరు ‘పూలదండు’. మతపరంగా దేశాన్ని విడదీయడాన్ని వ్యతిరేకించాడు ఆ కథలో.
ఏ వ్యక్తి విగ్రహాన్నైతే అవమానపరుస్తారో, ఆ వ్యక్తి నిర్మించిన, అతని పేరు మీద వున్న దవాఖానాకి అతన్ని తీసుకొని వెళ్ళడంలో ఆ కథ ముగుస్తుంది. మనషుల్లోని హిపోకసీని చాలా జాగ్రత్తగా ఈ కథలో బట్టబయలు చేస్తాడు మంటో.
దేశ విభజన గుర్తుకొచ్చినప్పుడల్లా కథా రచయిత సాదత్ హసన్ మంటో గుర్తుకొస్తాడు. లాహోర్‍ని చూసిన వాళ్ళకి సర్ గంగారామ్ గుర్తుకొస్తాడు.
ఈ ఇద్దరినీ పాకిస్తాన్ టెలివిజన్ చాలా గొప్పగా గుర్తుచేయడం ఆసక్తి కలిగించే చర్చ.
ఏమైనా, ఏ దేశమైనా మంచిని సదా గుర్తు పెట్టుకుంటుంది. పెట్టుకోవాలి కూడా.
–మంగారి రాజేందర్ (జంబో)