నడకేరా అన్నిటికి మూలం..

 ‘‘పాలిటెక్నిక్‍లో చదివి డిప్లొమా తీసుకున్న నువ్వొచ్చి ఈ బిల్డింగ్‍ కన్‍స్ట్రక్షన్‍లో ఎలా చేరావ్‍ సుధీర్‍?’’ అడిగాడు గోపాల్‍.
‘‘నిజమే! ఒకప్పుడు పాలిటెక్నిక్‍లో డిప్లొమా ప్యాసయితే తప్పకుండా ప్రభుత్వోద్యోగం దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలిటెక్నిక్‍లో డిప్లొమా ఎన్నో కష్టాలతో పూర్తిచేశాను. స్కాలర్‍షిప్‍ వస్తుండేది. ప్రభుత్వం కూడా మనం కట్టాల్సిన ఫీజుల్ని రీయింబర్స్ చేయిస్తుండేది. అయితే డిప్లొమా పూర్తిచేసిన తర్వాత యే ఆధారం లేదు.  మా తల్లిదండ్రులే వలసకూలీలుగా యే బీహార్‍కో, గుజరాత్‍కో వెళ్తుంటారు. అందువల్ల నేనూ కొంతకాలమైనా వలసకూలీగా పనిచేసి, ఎంతో కొంత సంపాదించుకొని స్వయంగా యేదన్నా బిజినెస్‍ చేద్దా మనుకుంటున్నా. ఎలక్ట్రిసిటీలో డిప్లొమా చేశాను కాబట్టి చాలామందికి కరెంట్‍ మోటార్స్ను బాగుచెయ్యటం లాంటి పనులెన్నో ఉంటాయి. అలాంటి పనులు చేస్తానని ఒక బోర్డు పెట్టుకుంటే మన కాళ్ళమీద మనం నిలబడగల్గేంత సంపాదించుకోవచ్చు…’’ అన్నాడు సుధీర్‍.
‘‘నిజమే… నేనంటే యేమీ చదువు కోలేదు. నీలాంటి చదువుకున్నోడు కూడా ఇలా వలసకూలీగా చేరటం బాధాకరమే’’ అన్నాడు గోపాల్‍.


‘‘యేం చేస్తాం గోపాల్‍… నిరుద్యోగం అనేది అంత తీవ్రంగా ఉంది. ఇంటికో ఉద్యోగం అన్నారు… చదువుకున్నోడెవడూ నిరుద్యోగిగా ఉండే పరిస్థితి ఉండకూడ దన్నారు… తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగా లొస్తాయన్నారు… యేవీ ఆ ఉద్యోగాలు?’’ అన్నాడు సుధీర్‍.
వాళ్ళిద్దరూ వరంగల్‍లో నిర్మాణమవుతున్న ఐదారు మల్టిస్టోర్‍ బిల్డింగ్స్లో వలసకూలీలుగా పనిచేస్తున్నారు. గోపాల్‍కు రోజూ 200 ఇస్తారు. సుధీర్‍ ఆ బిల్డింగ్‍కు కావలసిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనులన్నీ చేస్తాడు. కాబట్టి అతనికి రోజుకు 400 రూపాయలు ఇస్తున్నారు. ఆ బిల్డింగ్‍ నిర్మాణంలో పనిచేస్తున్న దాదాపు 60 మంది వర్కర్స్ని ఒక షెడ్‍లో ఉంచి అక్కడే వాళ్ళకు భోజనాలు యేర్పాటు చేశారు. రోజు పనయి పోగానే వర్కర్స్ అందరూ వచ్చి ఆ విశాలంగా ఉన్న షెడ్‍లోనే పడుకోవాలి. ఆ 60 మందికి రెండే రెండు బాత్‍రూమ్స్, రెండే రెండు టాయిలెట్స్… అయినా ఆ వర్కర్స్ ఎలాగో అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు.


వాళ్ళళ్ళో చాలామంది మహబూబ్‍నగర్‍ జిల్లా నుండి వచ్చిన వాళ్ళే… వాళ్ళళ్ళో కొందరు సుధీర్‍లాగే టెక్నికల్‍గా వివిధ రంగాల పనుల్లో ట్రెయినింగ్‍ పొందినవాళ్ళే. కొందరేమో నాన్‍టెక్నికల్‍ వర్కర్లే.
సుధీర్‍ కొస్తున్న రోజుకూలీ 400 రూపాయల్లో ఎక్కువగా పొదుపు చేసుకునే అవకాశం ఉంది. మహబూబ్‍నగర్‍లోని ఒక బ్యాంకులో సుధీర్‍కు సేవింగ్‍ అకౌంట్‍ ఉంది. తను సేవ్‍ చేస్తున్న డబ్బునంతా తన ఎకౌంట్‍కు ట్రాన్స్ఫర్‍ చేస్తున్నాడు.
కొంత డబ్బు కూడబెట్టాక తనకు స్వయంగా కరెంట్‍కు సంబంధించిన వస్తువుల్ని రిపేర్‍ చేసే షాపును ప్రారంభించాలని ఉంది. ఆ షాపు తనకు తప్పకుండా గిట్టుబాటవుతుందన్న నమ్మకం ఉంది.
ఇప్పుడు నిర్మాణమవుతున్న ఈ అపార్ట్మెంట్స్లో తన పని కరెంట్‍ పైపుల్ని అమర్చటం. ఈ బిల్డింగ్స్లో రేపు కరెంట్‍ ఫిట్టింగ్స్ను అమర్చటానికి ఈ పైపులే ఆధారమవుతాయి.
ఈ నిర్మాణాల్ని పర్యవేక్షిస్తున్న మేస్త్రీ రాజమౌళి మంచివాడే. కొందరు మేస్త్రీలు యేదన్నా పొరపాటు జరిగితే నోటికొచ్చినట్లు బూతులు తిడుతుంటారు. కానీ ఇతడు యేది చెప్పినా మర్యాదగానే చెబుతాడు. చాలా ఓపికమంతుడే. కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా యేరోజుకారోజు ఇస్తుంటాడు.
కూలీలకు యేర్పాటు చేసిన షెడ్‍ కూడా మరీ అధ్వాన్నంగా యేమీలేదు. ఎవరి బెడ్‍ని వాళ్ళనే తెచ్చుకొమ్మన్నారు. వాళ్ళు పెడ్తున్న భోజనాలు కూడా కాస్త బాగానే ఉంటున్నాయి. ఈ బిల్డింగ్‍ పనులు పూర్తి కావడానికి కనీసం ఇంకో రెండు సంవత్సరాలైనా పడ్తాయి. ఆలోగా తన సంపాదన కొన్ని వేలౌతుంది. ఈ పని పూర్తికాగానే తను తన స్వంతూరికి వెళ్ళి కరెంట్‍ అప్లయన్సెస్‍ రిపేర్‍ షాప్‍ని ఒక షాపు ఓపెన్‍ చేసుకోవాలి.


గోపాల్‍ తనకు మంచి మిత్రుడే అయ్యాడు. అతని వ్యధకథ తనతోనూ, తన వ్యధకథ అతనితోనూ చెప్పుకుంటున్నారు.
తన అమ్మానాన్నలు ముంబైలో ఉంటున్నట్టు తెలిసింది.
వాళ్ళు కూడా తనలాగే బిల్డింగ్‍ వర్కర్స్గానే పనిచేస్తున్నారట. వాళ్ళతో మాట్లాడి చాలా రోజులయ్యింది. రేపొకసారి వాళ్ళతో ఫోన్‍లో మాట్లాడాలి.
పనిమీంచి దిగి షెడ్‍కు రాగానే పడుకునే ముందు తన వర్క్కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాడు. షెడ్‍లో ఒక టీవీ కూడా ఉంది. టీవీలో ముఖ్యంగా వార్తల్ని చూస్తుంటాడు.
ఒకరోజు టీవీలో వార్తలు చూస్తోంటే చైనాలో కొత్తగా యేదో జబ్బు వ్యాపిస్తోందని, దాంతో చైనాలో చాలాచోట్ల ప్రజలు చనిపోతున్నారన్న వార్త ప్రసారమయ్యింది.
‘‘చైనావాళ్ళు పాముల్ని, కప్పల్ని, గబ్బిలాలను తింటారట… అందుకే వాళ్ళకా జబ్బొచ్చిందట’’ అన్నాడు గోపాల్‍.
‘‘కావచ్చు… ఇలాంటి జబ్బులు ప్రపంచంలో యేదో ఒక దేశంలో వస్తుంటాయి… పోతుంటాయి… దీన్ని గురించి మనం పెద్దగా దిగులు పడాల్సిందేమీ లేదు’’ అన్నాడు సుధీర్‍.
‘‘ఇది మామూలుగా అన్ని జబ్బుల్లాగ వచ్చిపోయే జబ్బు కాదుట… చాలా భయంకరమైన అంటువ్యాధిట… ఇంకో షాకింగ్‍ న్యూసేమిటంటే దీనికింకా మందే లేదుట… ఈ వ్యాధి వచ్చిన వాడు బతికే అవకాశమేలేదుట…’’ అన్నాడు గోపాల్‍.
‘‘అది నిజం కాకపోవచ్చు… మందులేని జబ్బంటూ యేదీ లేదనుకుంటాను… అన్నీ ర్యూమర్సే… మనం నమ్మకూడదు’’ అన్నాడు సుధీర్‍.


అప్పుడప్పుడు టీవీలో చైనాలో ఈ వ్యాధి అంతకంతకూ వ్యాపిస్తున్నదని, దీన్ని కరోనా వైరస్‍ అంటారని, ఇది చైనా పక్కదేశాలైన జపాన్‍, సౌత్‍ కొరియా, నార్త్ కొరియా లాంటి దేశాలక్కూడా వ్యాపించవచ్చునన్న వార్తలు కూడా ప్రసారం కాసాగాయి.
‘‘మనదేశానికేం ప్రమాదం ఉండదులే. మనది వేడి దేశం… అందులో వేసవికాలం ప్రారంభమౌతున్నది… టెంపరేచర్‍ 40 డిగ్రీల పైదాకా పోతుంది. అంతటి వేడి దేశంలో ఈ వైరస్‍ చచ్చిపోతుంది. నథింగ్‍ టు వర్రీ’’ అన్నాడు సుధీర్‍.
సుధీర్‍ చెప్పిన విషయాన్నే కొందరు ముఖ్యమంత్రులు కూడా సమర్ధించారు.
‘‘మనది వేడి దేశం… 20 డిగ్రీలు దాటితే ఆ వైరస్‍ చచ్చి పోతుందట. మన దేశంలో వేసవిలో 45 డిగ్రీల దాకా పోతుంది. చైనాలో వచ్చిన జబ్బు మనదాకా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. జ్వరమో, దగ్గో వస్తే ఒక పారాసిట్మల్‍ టాబ్‍లెట్‍ వేసుకుంటే సరిపోతుంది’’ అన్నాడో ముఖ్యమంత్రి.
‘‘చైనావాళ్ళు గబ్బిలాలు, పాములు తింటారు కాబట్టి వాళ్ళకీ జబ్బొచ్చింది. మనం వాటిని తినం కదా… మన ఫుడ్‍హాబిట్స్ చాలా బెటర్‍. మన ఫుడ్‍లో రోగనిరోధకశక్తి
ఉంటుంది. అందుకని మనం ఈ కరోనాకు, గిరోనాకు భయపడ వలసిన అవసరమే లేదన్నా’’డు మరో ముఖ్యమంత్రి.
మొత్తమ్మీద దేశమంతా ఇవే చర్చలు. రోజూ ఇవే వార్తలు… ‘కరోన’ చైనాలోనే కాదు, వేరే దేశాలకు కూడా విస్తరిస్తున్నదన్న వార్తలు రావడం ప్రారంభమైంది. రష్యా, జపాన్‍, కొరియా లాంటి చైనా పక్క దేశాల్లోనే కాక ఇండియా, పాకిస్తాన్‍ లాంటి దేశాలకు కూడా కరోనా కేసులు దిగుమతి అవుతున్నాయన్న వార్తలు రావడం మొదలైంది.
తుమ్ములు, దగ్గు, ముక్కు బ్లాక్‍ కావడం లాంటి సింప్టమ్స్తో ప్రారంభమై ఈ వైరస్‍ ఊపిరితిత్తులకు వ్యాపిస్తుందని నుమోనియా లాంటి వ్యాధిలాంటిదే ఇదని, ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా… కేవలం స్పర్శ ద్వారానే వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పసాగారు. క్రమంగా ఈ వ్యాధి ఇండియాలోని ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రానికి వ్యాపించ సాగింది. దాంతో దేశమంతా గగ్గోలు పుట్టింది.


సుధీర్‍ ఈ వ్యాధిని పెద్ద సీరియస్‍గా తీసుకోలేదు. మీడియా వాళ్ళు దీన్ని బాగా ఎగ్జాజిరేట్‍ చేస్తున్నారనుకున్నాడు.
బిల్డింగ్‍ పనులు యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. ఒకరితో ఒకరు రాసుకుపూసుకు తిరగొద్దని, షేక్‍హాండ్‍లివ్వటం మాను కోవాలని, కొంచెం దూరం ఉండి నమస్కారం పెట్టటంతో ఊరుకో వాలని, పదేపదే చేతులు కడుక్కోవాలని… ఈ సూచనలన్నీ ఇవ్వడం మొదలెట్టారు.
ఇలా ఉండగా ఒకరోజు ప్రధానమంత్రి గారు జాతి నుద్దేశించి ప్రసంగిస్తారన్న వార్త వెలువడింది.
అందరూ ఊపిరి బిగబట్టుకొని ప్రధానమంత్రిగారేం చెబుతారో నని ఎదురుచూడసాగారు.
ప్రధానమంత్రి గారు చాలా గొప్ప ‘ఆరెటర్‍’ కదా… ముందు ఎలాంటి నోట్స్ గాని, పేపర్‍ గాని పెట్టుకోకుండానే అరగంటసేపు మాట్లాడాడు.
ఇప్పుడు మనం కరోనా అనే ఒక మహమ్మారిని ఎదుర్కొంటున్నామని, ఇది అత్యంత ప్రమాదకరమైన జబ్బని, దీన్ని తక్కువ అంచనా వెయ్యటానికి వీల్లేదని, భారత్‍లో కూడా ఈ జబ్బు ప్రవేశించిందని, దీన్నుండి మనల్ని కాపాడుకోవటానికి ఒకటే మార్గం ఉందని, అదేమిటంటే: ఎవరింట్లో వాళ్ళు ఉండిపోవటమే… ఎవరూ ఇళ్ళళ్ళోంచి బయటకు రావొద్దు… నేను మూడువారాల పాటు దేశమంతటా ‘లాక్‍డౌన్‍’ ప్రకటి స్తున్నాను. అన్నీ ఆగిపోతాయి. బస్సులు, ట్రెయిన్లు, విమానాలు… అన్నీ ఆగిపోతాయి. మీటింగులు, పెళ్ళిళ్ళు, మతపరమైన మీటింగులు.. సినిమాహాళ్ళు, సినిమా షూటింగులు.. అన్ని పరిశ్రమలు, అన్ని షాపులు… అన్నీ ఆగిపోతాయి. ప్రజావసరాలైన కొన్ని మందుల షాపుల్లాంటివి తప్ప అన్నీ ఆగిపోతాయి. కొందరు ఒకచోట చేరే యేపనైనా ఆగిపోవాల్సిందే… బిల్డింగ్‍ నిర్మాణాలు, పెళ్ళిళ్ళు, సభలు, సమావేశాలు అన్నీ ఆగిపోతాయి. ప్రజలు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలి’’ అన్నాడు పీ.ఎం. గారు.
బిల్డింగ్‍ కన్‍స్ట్రక్షన్‍ పనులు కూడా ఆగిపోతాయన్న మాట సుధీర్‍కు అశనిపాతంలా తగిలింది.
ఇలా అకస్మాత్తుగా తను చేస్తున్న పని ఆగిపోతే తనేమయి పోవాలి. రేపో మాపో మేస్త్రీ వచ్చి ‘‘మీకిక పనేమీలేదు… ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చునంటే యేం చెయ్యాలి. వెళ్ళి పోవటానికి బస్సులు గానీ, ట్రెయిన్లుగానీ లేవు కదా? యేం చెయ్యాలి?
సుధీర్‍, గోపాల్‍ ఆ రాత్రంతా ఈ విషయం గురించే చర్చించారు.
‘‘అలా యేం పోమ్మనరు. పొమ్మంటే మాత్రం మనం ఎలా పోతాం. బస్సులో, ట్రెయిన్లో లేవుకదా… యధా ప్రకారం మనం ఇక్కడే ఇదే షెడ్‍లో ఉండిపోతాం…’’ అన్నాడు గోపాల్‍. అలా ఉండనివ్వరు… యేం పని లేకుండా వాళ్ళు మనకు తిండిపెట్టి పోషిస్తారా? వెళ్ళిపొమ్మంటారు’’ అన్నాడు సుధీర్‍.
‘‘వెళ్ళిపొమ్మంటే మనం ప్రొటెస్ట్ చేద్దాం… మీరే బస్సుల్ని అరేంజ్‍ చేసి పంపించండి అందాం’’
ఇలా చాలాసేపు వాళ్ళు వాదించుకుంటుండగానే తెల్లారి పోయింది.
ఆ మర్నాడే మేస్త్రీ యాదగిరి షెడ్‍లో వర్కర్స్ అందర్నీ సమావేశపరచాడు.
‘‘విన్నారుగా నిన్న పీ.యం. గారు యేం చెప్పాడో… మొత్తం అన్నీ బంద్‍… మాక్కూడా నోటీసులొచ్చాయి… బిల్డింగ్‍ పనులు ఆపేయండి అంటూ. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మేమేం చెయ్యలేం. నిర్మాణం ఇవ్వాళ్టి నుండి ఆపేస్తున్నాం. మీరు ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఇదంతా పోయాక మళ్ళీ పిలిచినప్పుడు రండి’’ అన్నాడు మేస్త్రీ.
అందరూ ‘‘ఆఁ!’’ అంటూ పెద్దగా అరిచారు. ‘‘అకస్మాత్తుగా మమ్మల్నిలా పొమ్మంటే ఎక్కడికి పోతాం. బస్సులు… ట్రెయిన్లు… యేమీ లేవుకదా… ఎలా వెళ్ళమంటారు? మేం ఎక్కడకూ వెళ్ళం… ఇక్కడే ఉంటాం… ఎప్పటిలాగే మీరు మాకింత తిండి పెట్టాల్సిందే…’’ అన్నారందరూ యేకకంఠంతో.
‘‘ఎలా వెళ్ళాలి? బస్సులు బంద్‍, ట్రెయిన్లు బంద్‍ కదా అని మమ్మల్ని అడిగేబదులు అన్నింటినీ బంద్‍ చేయించిన గవర్నమెంట్‍ను అడగండి. గవర్నమెంటే మీకేమన్నా అరేంజ్‍ చేస్తుందేమో చూడండి. రేపట్నించి మీరెవరూ ఈ షెడ్‍లో ఉండొద్దు. వెళ్ళాలి… మేం కూడా గవర్నమెంట్‍కు చెబుతాం. మిమ్మల్ని ఆదుకోవాలని. వాళ్ళు మీకోసం యేమైనా చేస్తారేమో చూద్దాం…’’ అంటూనే మేస్త్రీ అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
‘‘ఇప్పుడు మనం యేం చేద్దాం, అంటే యేం చేద్దాం?’’ అని వాళ్ళళ్ళో వాళ్ళు చాలాసేపు వాదించుకున్నారు. అందరూ కలిసి ఆ ఏరియాకు సంబంధించిన మినిస్టర్‍ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించు కున్నారు.
సుధీర్‍ మినిస్టర్‍ దగ్గరకు వెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదని అనుకున్నాడు… అతని మైండ్‍లో ఒక ఆలోచన మెరిసింది.
‘‘మనం నడిచి హైదరాబాద్‍ దాకా వెళ్దాం గోపాల్‍… హైదరాబాద్‍లో నాకో ఫ్రెండున్నాడు… ఆర్ధికంగా కాస్త బాగానే ఉన్నాడు. పాలిటెక్నిక్‍ చదువుతున్నప్పుడు వాడు నా క్లాస్‍మేట్‍. మనం వెడితే వాడింట్లో ఉండొచ్చు’’ అన్నాడు సుధీర్‍. ‘‘హైదరాబాద్‍ దాకా నడిచివెళ్ళటమా? అది సాధ్యమయ్యే పనేనా? నిన్ను చూస్తే గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయే వాడిలా ఉన్నావు… హైదరాబాద్‍ దాకా నడుస్తావా? సాధ్యమయ్యే పనేనా?’’ అన్నాడు గోపాల్‍ .
‘‘సాధ్యమౌతుంది గోపాల్‍… నేను చూడటానికిలా ఉన్నాను గానీ నాకు స్టామినా బాగానే ఉంది. ఒకసారి నేను ఆలేర్‍ నుండి హైదరాబాద్‍ దాకా నడిచాను తెలుసా? యేదో పనుండి ఆలేర్‍కు వెళ్ళాను. రిటర్న్లో బస్సులు లేవు. యేదో కారణంతో ఆర్‍టిసి
వాళ్ళు స్ట్రేౖక్‍ చేశారు… దాంతో నాకు ఆలేర్‍ నుండి సిటీ దాకా నడవాల్సి వచ్చింది’’ అన్నాడు సుధీర్‍.
‘‘ఆలేరు నుండి నడవొచ్చు… కానీ వరంగల్‍ నుండి హైదరాబాద్‍ దాకా అంటే… అదీ తిండీ తిప్పలు లేకుండా…’’
‘‘యేం కాదులే గోపాల్‍…
వెళ్తున్నప్పుడు జనగాంలోనన్న, ఆలేరులోనన్న ఒకరాత్రి ఆగుదాం… యే జనగాంలోనన్నా, ఆలేరులోనన్న ఎవరైనా తిండి పెట్టరంటావా?’’ అన్నాడు సుధీర్‍.
‘‘ఎవరూ పెట్టరు… మనమే ఇక్కడ్నించే యేదైనా తీసికెళ్ళాలి…’’ అన్నాడు గోపాల్‍.
ఆ మర్నాటి ఉదయమే ఇద్దరూ వాళ్ళ బ్యాగులు సర్దుకొని బయల్దేరారు… దార్లో ఒక కిరాణాషాపులో నాల్గు బిస్కెట్‍ పాకెట్స్ కొనుక్కున్నారు.
గణపురం దాకా హుషారుగానే నడిచారు… అక్కడ్నించి వేసవి కాలపు ఎండ ప్రారంభమయ్యింది. ఆ ఎండలోనే నడవటం.. కొంతదూరం నడిచి ఓ చెట్టుకింద కాస్సేపు కూర్చోవటం… బిస్కట్లు తిని వాటర్‍బాటిల్స్లో తెచ్చుకున్న నీళ్ళు తాగి మళ్ళీ నడవటం… పది కిలోమీటర్లు నడవగానే కాళ్ళు జివ్వున గుంజటం… గోపాల్‍ బాగానే నడుస్తున్నాడు, కానీ సుధీరే నడవలేక పోతున్నాడు. అక్కడక్కడ కూర్చుంటూ నాల్గింటి వరకు జనగాం చేరుకున్నారు.
‘‘ఇక నేను నడవలేను బాబోయ్‍!’’ అన్నాడు సుధీర్‍… జనగాం ఆర్‍టీసీ బస్సు స్టేషన్‍లో రాత్రి పడుకున్నారు. బిస్కట్లతో కడుపు నిండలేదు. చుట్టుపక్కలున్న ఐదారు ఇళ్ళళ్ళోకి వెళ్ళి యేదన్నా పెడ్తారా అని కాళ్ళావేళ్ళా పడదామంటే ‘‘ఎవరూ రావద్దని’’ ఇంటిముందు బోర్డులు… వీధులన్నీ పూర్తిగా నిర్మానుష్యమైపోయాయి. చిన్నచిన్న టీషాప్స్, డబ్బా దుకాణాలు… అన్నీ బంద్‍…
యేమీ తినకుండానే వాళ్ళు మళ్ళీ నడవటం మొదలెట్టారు… కాళ్ళళ్ళో కాళ్ళు వేసుకుంటూ పది కిలోమీటర్లు నడిచాక ఒకచోట… ఒక చెట్టుక్రింద ఒక ముసలామె మొక్కజొన్న కంకులు కాలుస్తూ, ఉడకబెడ్తూ కనిపించింది.
బ్రతుకుజీవుడా అనుకొని ఇద్దరూ చెరో రెండు ఉడికించిన స్వీట్‍కార్న్ కంకులు కొనుక్కొని తినేశారు. కొంచెం శక్తి వచ్చినట్టని పించింది.
భోనగిరి చేరుకున్నారు. బస్‍స్టేషన్‍లో ఓ గంటసేపు కూర్చొని మళ్ళీ నడవటం మొదలెట్టారు… ఎండ… నిప్పులు చెరుగుతున్న సూర్యుడు…
ఈ ఎండలో నడిస్తే చచ్చిపోతాం… ఎట్లా? యేం చేద్దాం’’ అన్నాడు సుధీర్‍.
‘‘నాకేం ఫరవాలేదు. ఈ ఎండ నన్నేం చెయ్యదు… కానీ నువ్వే పూర్తిగా నీరసించిపోయావు… నిన్ను చూస్తే భయమేస్తోంది. ఈ భోనగిరిలోనే ఆగిపోదాం సుధీర్‍…’’ అన్నాడు గోపాల్‍.
‘‘వద్దు… ఇంకొంచెం కష్టపడ్తే మనం చేరాల్సిన చోటికి చేరుకుంటాం…’’ అన్నాడు సుధీర్‍.
భోనగిరి దాటి మెల్లగా వంగపెల్లి చేరుకున్నారు. వంగపెల్లి ఊర్లో అడుగుపెడ్తూనే సుధీర్‍ కుప్పకూలిపోయాడు.
‘‘అయ్యో సుధీర్‍, పడిపోయావా?’’ అంటూ గోపాల్‍ సుధీర్‍ను నీడకు చేర్చే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు… ఒకతడు మోటారుసైకిల్‍ మీద వెడ్తూ కనిపించాడు. అతన్ని ఆగమన్నట్టుగా సైగచేస్తే ఆగాడు.
‘‘యేమైంది? కరోనా కేసా?’’ అన్నాడతడు…
‘‘కాదు… ఎండ… వడదెబ్బ…’’ అని గోపాల్‍ పెద్దగా అరిచినా అతడు వినిపించు కోకుండా వెళ్ళిపోయాడు.
గోపాల్‍ అతికష్టంగా సుధీర్‍ను ఓ చెట్టుకిందకు చేర్చాడు.
‘‘దాహం… దాహం…’’ అంటూ సుధీర్‍ చేత్తో నోరు చూపించాడు. వాళ్ళ దగ్గరున్న రెండు వాటర్‍బాటిల్స్లో నీళ్ళెప్పుడో అయిపోయాయి.
‘‘నీళ్ళు తెస్తానుండు’’ అని చెప్పి గోపాల్‍ దగ్గర్లో ఎక్కడైనా హ్యాండ్‍బోర్‍ ఉందేమోనని వెతుకుతూ వెళ్ళాడు.
ఒక ఇల్లు తెరచి ఉంటే ఆ ఇంటి ముందుకెళ్ళి ‘‘కొంచెం మంచినీళ్ళివ్వండమ్మా… ఒక మనిషి చచ్చిపోయేట్టున్నాడు’’ అన్నాడు. లోపలున్న ఓ మధ్యవయస్కుడొచ్చి ‘‘చచ్చిపోయేట్టు న్నాడా? కరోనా కేసా?’’ అన్నాడు.
‘‘కాదు… కాదు… వడదెబ్బ… చల్లటి మంచినీళ్ళుంటే బతుకుతాడు… దయచేసి కొంచెం నీళ్ళివ్వండి’’ అన్నాడు.
అతడు మంచినీళ్ళు తెచ్చి గోపాల్‍ చేతిలో ఉన్న బాటిల్స్లో పోశాడు.
ఆ బాటిల్స్ పట్టుకొని గోపాల్‍ వెంటనే సుధీర్‍ను పడుకోబెట్టిన చెట్టు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. సుధీర్‍ను పడుకోబెట్టిన చెట్టుకు కొంచెం దూరంలో ఆరుగురు వ్యక్తులు నిల్చొని సుధీర్‍కేసి చూడసాగారు.


గోపాల్‍ పరిగెత్తుకొని వచ్చి సుధీర్‍ మొఖం మీద నీళ్ళు చల్లాడు. సుధీర్‍లో చలనం లేదు. సుధీర్‍ చెయ్యి పట్టుకొని నాడికోసం వెతికాడు… లేదు… నాడి దొరకలేదు…
‘‘సుధీర్‍! సుధీర్‍!’’ అంటూ పిలిచాడు. చలనం లేదు.
సుధీర్‍ పోయినట్టున్నాడు అనుకున్నాడు గోపాల్‍. అతన్నిప్పుడేం చెయ్యాలో అతనికర్థం కాలేదు.
దూరంగా నిల్చున్న వాళ్ళళ్ళో ఒకతడు ‘‘పోయిండా?’’ అని అడిగాడు.
‘‘పోయినట్టే అనిపిస్తున్నది’’ అన్నాడు గోపాల్‍ మరోసారి సుధీర్‍ నాడిని దొరకబట్టటానికి ప్రయత్నిస్తూ…
‘‘కరోనాతోటేనా?’’ అన్నాడతడు మళ్ళీ…
‘‘కాదు… కరోనా కాదు… వడదెబ్బ…’’ అన్నాడు గోపాల్‍.
‘‘వడదెబ్బ కాదు… పాడు కాదు. నువ్వు అబద్దం చెబుతున్నావు… ఈ చచ్చిపోయిన మనిషి ఇక్కడుంటే మనూరు మొత్తానికి ఈ వ్యాధి అంటుకుంటుంది…. ఈ శవాన్ని పోలీసుల కప్పగించాలి… దగ్గర్లోనే పోలీస్‍ చెక్‍పోస్టు ఉంది… ఫోన్‍ చెయ్యండి…’’
‘‘వాళ్ళు ఫోన్‍ చెయ్యగానే వస్తారా? ఈ శవం ఇక్కడుండ కూడదు… అతనితో ఉన్న ఈ మనిషి కూడా ఇక్కడుండ కూడదు… మా ఇంట్లో నా మోటార్‍సైకిల్‍ ట్యాంకు నిండా పెట్రోల్‍ ఉంది. పెట్రోల్‍పోసి ఇద్దర్నీ తగుల బెడదాం… వీళ్ళ కారణంగా మన ఊరంతా శవాలుగా మారే ప్రమాదం ఉంది…’’ అంటూ ఆ వ్యక్తి అక్కడికి దగ్గర్లోనే ఉన్న వాళ్ళింటికెళ్ళి మోటార్‍ సైకిళ్ళో
ఉన్న పెట్రోలంతా తీసుకొచ్చాడు.
‘ఇతడు కరోనాతో చావలేదు… వడదెబ్బ వల్ల చచ్చిపోయిండు… నా మాట నమ్ముండ్రి…’’ అని గోపాల్‍ ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు.
‘‘ఆ శవాన్నే కాదు… నిన్ను కూడా ఆ శవంతో పాటే తగులబెడ్తాం’’ అన్నారు వాళ్ళు.
అంటూనే వాళ్ళళ్ళో ఓ ఇద్దరు ముక్కులకు మాస్క్లు ధరించి పెట్రోల్‍ క్యాన్‍తో శవం దగ్గరకు వస్తున్నారు.
తనను కూడా వీళ్ళు చంపేలా ఉన్నారని గోపాల్‍ అక్కడ్నించి వెంటనే పరిగెత్తాడు. దగ్గర్లోనే రైలు పట్టాలమీద ఒక గూడ్స్ ట్రెయిన్‍ ఆగి ఉంది. ఆ గూడ్స్ ట్రెయిన్‍లోని ఒక డబ్బాను పట్టుకొని వేలాడుతుండగా ట్రెయిన్‍ కదిలింది.
వ్ళాచ్చి పెట్రోల్‍ పోసి సుధీర్‍ శవాన్ని తగులబెట్టేశారు.
‘‘నడకేరా అన్నిటికి మూలం’’అంటారు కదా… ఆ నడకే వాళ్ళిద్దరిపాలిటి శత్రువైంది.


– అంపశయ్య నవీన్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *