అభివృద్ధి హోమంలో ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరొందిన అటవీ సంపద ఆహుతి అవుతున్నది. దీనికి ఆజ్యం పోస్తున్నది మనిషే. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నట్టుగానే ప్రపంచానికి ప్రాణ వాయువును ఇచ్చే అడవులను నెమ్మది నెమ్మదిగా వ్యవసాయం పేరుతొ, జీవనోపాధి పేరుతో కొల్ల గొడుతున్నాము. ఈ అడవులు ప్రకృ తి వైపరిత్యాలకు కొంత , మనిషి స్వార్ధానికి కొంత అగ్నికి కాలి బూడిద అవుతున్నాయి. ఇప్పటివరకు 43 శాతం అడవులు అంతరించి పోయినవి.
NASA వారి terra శాటిలైట్ ఉపయోగించి మోడరేట్ రిజొల్యుషన్ ఇమేజింగ్ స్పెక్ట్రోరేడియోమీటర్ (MODIS) అనే సాంకేతిక పరికరం ద్వారా ప్రపంచం మొత్తం ఎక్కడ కార్చిచ్చులు రగులుతున్నాయో ప్రపంచ పటంలో నెలకోసారి పంపించే చిత్రాల ద్వారా పరిశీలిస్తారు.
గత నెల రోజులుగా అమెరికాలోని ఆరిజోనాలోని పర్వత ప్రాంతాలలో, చిట్ట డువులలో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ మంటలు మూడు అతిపెద్ద పట్టణాలకు దగ్గరలో ఉండటంతో ఆ ప్రాంతాలలో పరిస్థితి గంభీరంగా ఉందని అక్కడి వాతావరణ సంస్థ తెలిపింది. ఈ ఒక్క సంవత్సరం లోనే 4,32,000 ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతం ఈ కార్చిచ్చులో దగ్ధమైంది. ఈ మంటలలో అత్యంత తీవ్రమైనవిగా పేర్కొనబడేవి మూడు రకాలు. అవి బుష్ ఫైర్స్, బిగ్ హార్న్ ఫైర్స్, మాంగం ఫైర్స్. ‘‘ఇదే సమయంలో కరోన (COVID-19) మహమ్మారి అక్కడి ప్రజల్లో ప్రబలుతుండడం వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మంటలను ఆర్పే సిబ్బంది పనిచేయడం కష్టంగా ఉంది’’ అని ఆరిజోనా అటవీ మరియు అగ్నిమాపక శాఖ ప్రతినిధి తెలిపారు.
ఈశాన్య ఫీనిక్స్లో జూన్ 13, 2020 రోజు ఒక వాహనం మానవ తప్పిదం వల్ల అగ్ని ప్రమాదానికి గురి అవడంతో బుష్ ఫైర్స్ అంటుకుని ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. 28.6.2020న 1,93,455 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం మొత్తం కాలిపోయింది. దక్షిణ ఆరిజోనా ప్రాంతంలోని పర్వత ప్రాంతం 1,04,690 ఎకరాలు (45%) మంటలకు ఆహుతైనది. వీటిని ఆర్పడానికి సుమారు 1200 మంది అగ్నిమాపక సిబ్బందిని పురమాయించారు. కైబాబ్ నేషనల్ ఫారెస్ట్ 71,450 ఎకరాలు అంటే 51% మంటల (మాంగం మంటలు) పాలైంది. జాకబ్ సరస్సు, హౌస్ రాక్ రోడ్ ప్రాంతాలలోని నివాసులను అక్కడనుండి రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. తూర్పు ఆరిజోనా ప్రాంతంలో 22,903 ఎకరాల అపచే సిటీ గ్రీవ్స్ నేషనల్ పార్క్లో మెరుపులు, పిడుగులు వల్ల మంటలు (బిగ్ హార్న్ మంటలు) ఏర్పడి కాలిపొయినాయి. ఈ మంటలు ప్రతీ ఏడు జూన్ – జూలైలో అత్యంత వేడి వాతావరణం, తక్కువ ఆర్ద్రత (గాలిలో నీటి ఆవిరి) ఉండటం వల్ల సాధారణమే అయినప్పటికీ పెరిగే వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత వాటి తీవ్రతను పెంచుతున్నాయి.
అమేజాన్ అడవులు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ప్రపంచ జీవవైవిద్యంలో 10శాతం ఈ అడవుల్లోనే ఉంది. 20 శాతం ఆక్సీజన్ని ప్రపంచానికి అందించేది ఈ అడవులే. బ్రెజిల్ స్పేస్ సెంటర్ గుర్తించిన ప్రకారం ఒక్క 2019 సంవత్సరంలోనే 73 వేల సార్లు మంటలు వ్యాపించినవి. బ్రెజిల్ లో రోరైమ, అక్రే, రోన్దోనియ, అమెజానోస్ రాష్ట్రాల్లో అగ్ని కీలల్లో దగ్ధమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంలో బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అమేజాన్ మంటల్లో తగలబడటం పట్ల ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎమ్మన్న్యుయేల్ మక్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంటలను ఆర్పటానికి అంతర్జాతీయ సమాజం మొత్తం బ్రెజిల్ని కోరుకుంది.
కార్చిచ్చు లేదా మంటలు అంటుకోడానికి కారణాలు:
- పెరుగుతున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్)
- వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్)
- వేడి గాలులు వీయడంతో పాటు, పొడి వాతావరణం ఉండడం.
- ఆకాశంలో మెరుపులు, పిడుగుపాటుకు గురి కావడం వలన
- మానవ తప్పిదాలు, అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు వలన
- వ్యవసాయ స్థలం కోసం సహజ వనాలను కాల్చడం వలన ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గిర ఈ చెట్లు, అడవులు మంటలకు ఆహుతి అవుతూనే ఉన్నాయి.
ఈ మంటల వలన కలిగే పరిణామాలు:
- ఈ మంటలతో పెద్దమొత్తంలో పొగ ఏర్పడి చుట్టూ వ్యాపిస్తుంది
- ఈ మంటలనుండి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల అయి మన ఆవరణ వ్యవస్థని పాడుచేస్తాయి.
- పచ్చని చెట్లు మంటలకు అంటుకొని గాలిలోని ప్రాణ వాయువు తగ్గిపోతుంది.
- వర్షాలు తగ్గుతాయి.
- భూతాపం(గ్లోబల్ వార్మింగ్) ఎక్కువవుతుంది
- అడవులే నివాసంగా ఉండే ఎన్నో ప్రాణులకు ఉండే నీడ దూరమై మనుషులు తిరిగే ప్రాంతాలలో ఉండలేక చనిపోతాయి. దానితో ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి.
- చుట్టు ప్రక్కల నివాసమేర్పరుచుకున్న ఎంతో మంది నిర్వాసితులు కావడం, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతు ఉంటాయి.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూస్తూ బాధపడటం కంటే ఆ సమస్య రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై పరిశోధనలు చేయటం, చర్యలు తీసుకోవటం ఏంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో అడవులు మంటలకు అంటుకోకుండా, వ్యాపించకుండా ఉండాలంటే తీసుకోవలిసిన కొన్ని చర్యలపై శాస్త్రవేత్తలు ఆలోచించాల్సిన సమయం ఇది.
- భూతాపాన్ని పెంచే గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయటం
- మంటలకు అంటుకోకుండా తట్టుకునే మొక్కలను సృష్టించటంపై జెనెటిక్ ఇంజనీరింగ్ పరిశోధనలు చేయడం.
- అడవుల మధ్యలో ఈ మంటలకు అంటుకోకుండా తట్టుకునే చెట్లు పెంచటం, లేదా భౌతికమైన అడ్డంకులు ఏర్పాటు చేయటం అంటే అడవి మధ్యలో అక్కడక్కడా గోడలు కట్టడం , అక్కడక్కడా నీటి చెరువులు, కాలువలు తవ్వించడం మొదలైనవి చేయడం. ఇలా చేయడం ఖర్చుతో కూడుకున్న పనే అయినా ఒకసారి ఏర్పాటు చేస్తే కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి.
- పెద్ద మంటలను త్వరగా ఆర్పే పర్యావరణ హిత వాయువులు లేక స్ప్రే లను కనుక్కో గలగాలి. వాటిని వాయు రవాణా మార్గాల ద్వారా సమర్ధవంతంగా ఉపయోగించగలగాలి.
- అడవుల దగ్గరలో నిప్పు వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. బాణసంచా, టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధించాలి.
- అక్కడ నివసించే గిరిజనులు, రక్షణ సిబ్బందికి ఫైర్ ప్రూఫ్ ఇల్లులు మాత్రమే ఉండేటట్టు చూడాలి. అంటే లోపల మంట బయటికి రాకుండా.
- ప్రభుత్వ అటవీ అధికారులు, రక్షణ సిబ్బంది ఆహారం బయట తాయారు చేసి వారికి చేరవెయ్యాలి.
- పొగ త్రాగేవారిని అనుమతించ వద్దు.
- వీలయినంత వరకు కొట్టేసిన అటవీ ప్రాంతాన్ని భర్తీ చేయటానికి తిరిగి చెట్లు నాటాలి. అలా చేసే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించి అందించాలి.
- వ్యవసాయం చేయటానికి అడవులను నరకటానికి అనుమతించ వద్దు. వారికి మైదాన ప్రాంతంలో భూమిని చూపించాలి.
- అటవీ భూమి విస్తీర్ణాన్ని వీలైనంత ఎక్కువగా పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. విస్తీర్ణాన్ని తగ్గించే పనులను గట్టిగా వ్యతిరేకించి అరికట్టాలి.
- అడవులలో అగ్ని ప్రమాదాలకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి.
- అటవీ సంరక్షణకు కొత్త చట్టాలను, పాలసీలను ఎప్పటికప్పుడు తయారు చేయాలి. అమలు పరచాలి.
– డా।। హిమబిందు