కరోనాపై లోతైన అధ్యయనాలు జరగాలి : డాక్టర్‍ బి.వి.సుబ్బారావు

పర్యావరణవేత్త డాక్టర్‍ బి.వి.సుబ్బారావుగారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

ఇక్రిశాట్‍లో సైంటిస్టు పని చేసి పదవీ విరమణ పొందిన డాక్టర్‍ బి.వి.సుబ్బారావు గారు ఏప్రిల్‍ మాసంలో దక్కన్‍ల్యాండ్‍కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ


కరోనాలాంటి విపత్కర పరిస్థితులకు కారణం ఏమని అనిపిస్తుంది?
కరోనాలాంటి విపత్కర పరిస్థితిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరిగణించాలి. ఎందుకంటే వైరస్‍లను ఇంతకు ముందు ప్లేగు, మలేరియా రూపంలో 20వ శతాబ్దంలో చాలా చూశాం. కానీ కోవిడ్‍-19 వైరస్‍ అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలో చాలా నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఇలాంటి వైరస్‍ను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వైద్య రంగంలో చాలా అధ్యయనాలు జరగాలి.
లాక్‍డౌన్‍ సమయంలో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
లాక్‍డౌన్‍ అనేది వైరస్‍ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక మార్గం. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కూడా చాలా చక్కటి నిర్ణయం. ఈ వైరస్‍ వాతావరణం, పర్యావరణ ప్రభావాల దృష్ట్యా ఇది ఒక దేశం నుండి మరో దేశానికి చాలా భిన్నంగా వ్యాపిస్తుంది. ఈ సమయంలో మనిషి సైకలాజికల్‍ ఒత్తిడికి గురవుతున్నాడు. లాక్‍డౌన్‍ వారం రోజులకో, పదిహేను రోజులకో తీసేస్తారు అంటే దానికి మనిషి కొంత తాత్కాలికంగా, మానసికంగా సన్నద్ధం అవుతాడు. అంతేగానీ నెలలు తరబడి ఉంటుంది, ఇంటి నుంచి బయటి రాకూడదు అనేటప్పటికీ మానసిక, భౌతిక ఒత్తిడులకు గురవుతాడు. ఈ లాక్‍డౌన్‍ సమయంలో మానసిక ఒత్తిడితో ఆలోచనలు వస్తాయి. ఈ లాక్‍డౌన్‍ సమయంలో అన్ని రంగాలు మూత పడుతున్నాయి. ఈ రంగాల్లో లాక్‍డౌన్‍ ఎంతకాలం పొడిగిస్తారో, ఏమౌతుందో తెలీదు. భవిష్యత్‍లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియకుండానే ఊహజనితంలో జీవిస్తున్నాం. మరి ఈ మానసిక ఒత్తిడుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మళ్ళీ ఆత్మధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతి వ్యక్తి లోను, ప్రతి కుటుంబంలోను, సామాజికంగా దేశం మొత్తంలో రావాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి భవిష్యత్‍ దేశ భవిష్యత్‍పై ఆధారపడి ఉంది. గతంలో ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఆ కార్యక్రమాలు వ్యక్తిగత, జాతీయతతో ఆధారపడి లేవు. కరోనా అనేది వ్యక్తిగత స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఒక ఉద్ధేశ్యాన్ని నిర్దేశించింది.


ప్రజలు ప్రభుత్వాలు ఏ మేరకు ఈ విపత్కర పరిస్థితిని తట్టుకోగల్గుతున్నాయి?
మన ప్రభుత్వాలు విపత్తుల నివారణలో (డిజాస్టర్‍ మేనేజ్‍మెంట్‍) చాలా బాగా చేస్తున్నాయి. తుఫాన్‍, భూకంపాలు వచ్చినప్పుడు తక్షణ సహాయం చేయడం, పునరావాసం కల్పించడం మొదలైనవి. కానీ కరోనా విపత్తు జాతీయ విపత్తే కాదు, ప్రపంచ విపత్తు. ఈ విపత్తులో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి. ఎందుకంటే ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్‍) అందరిదీ ఒకే కుటుంబం, ఒకే భూమాత, అందరి భవిష్యత్‍ ఒకటే అనుకుంటూ గ్లోబలైషన్‍ మొదలైంది. ఇతర దేశాలకు, కార్పొరేట్‍ సంస్థలకు ఏ దేశంలోనైనా వ్యాపారం చేసుకోండి అని అన్నారు. కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ప్రపంచీకరణలో ఎంతవరకు అందుబాటులో ఉంది. దీని గురించి సమీక్షించుచున్నారా. గ్లోబల్‍ సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍ (డబ్ల్యూహెచ్‍ఓ)తో మన ఆరోగ్య శరీరాలు ఎన్ని అనుసంధానం అయి ఉన్నాయి. ఈ కరోనా వైరస్‍ విషయంలో ప్రిపేర్‍నెస్‍లో ఎక్కడో పెద్ద లోపం జరిగింది. లాక్‍ డౌన్‍లో చాలా చక్కని ఆలోచన ఏంటంటే అసలు గ్లోబలైజేషన్‍ అవసరమా! ఎవరి ఇంటి వద్దనే వాళ్ళు ఎవరి దేశంలోనే వాళ్లు బ్రతకాలి. ఇంత కాలం బ్రతకలేదా. ఇది చాలా అవసరం.
ప్రభుత్వాలు వైద్యరంగంలోనూ, శాస్త్రసాంకేతిక రంగంలోను అనుసరించాల్సిన ప్రణాళికలు ఏమిటి?
వైద్యరంగంలో భారత ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వారి సలహాదారులుని మనస్ఫూర్తిగా అభినందించాలి. వైద్య రంగానికి, మిగతా రంగాలకు చాలా చక్కగా సహాయ సహకారాలు అందించారు. గత పదిహేనేళ్లుగా ప్రైవేటేజేషన్‍ అని భూమి ఊరికే ఇచ్చాం. ట్యాక్సులు ఫ్రీగా ఇచ్చాం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. కార్పొరేటర్‍ సెక్టార్‍ హాస్పిటల్స్ ఏ విధంగా ఈ కరోనాలో తోడ్పాటు అందించాయి. ప్రాణాలకు తెగించి నిలబడింది ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ వైద్య శాఖ, పోలీసు శాఖ, శానిటైజింగ్‍ శాఖ మాత్రమే. లాక్‍డౌన్‍ తరువాత మన పబ్లిక్‍సెక్టార్‍ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకో గలుగుతాం అని చూడాలి. దీనికి ముడిబడ్డదే నీటి సరఫరా. నల్లా తిప్పి పారే నీటిలో చేయి శుభ్రం చేసుకోండి అంటున్నారు. ఎంతమంది ఇళ్లల్లో నల్లా తిప్పితే నీళ్లు వస్తున్నాయి. దేశంలో కాదు, హైదరాబాద్‍లో కూడా అలాంటి సదుపాయమే లేదు. అటువంటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే వైద్య రంగాన్ని పబ్లిక్‍ ఇనిస్టిట్యూటేషన్‍ని ఎంత విధిగా అభివృద్ధి చేయగలుగు తాము అన్నది ముఖ్యం.


ప్రభుత్వాలు వైద్య సాంకేతిక రంగాలలో చేయవల్సిన కృషి ఏమిటి?
వైద్య రంగంలో వైద్యం, శాస్త్రం. ఈ రెండింటిలో సైన్స్ & మెడిషన్స్. వీటిలో కొన్ని ఏళ్లుగా క్లీనికల్‍ రీసెర్చ్ జరగలేదు. క్లీనికల్‍ రీసెర్చ్ ఎప్పుడైతే జరగలేదో పథలాజికల్‍ రీసెర్చ్, కెమికల్‍ ప్రాక్టీస్‍ పోతాయి. ప్యాథోజిన్స్ ట్రాకింగ్స్ చాలా కష్టం. ఈ రోజు గట్టి గుణపాఠం ఏమిటి అంటే మెడికల్‍ రంగంలో రీసెర్చ్ అన్నది ఒక బలమైన ఒక అంగం. దాన్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండాలి. లాక్‍డౌన్‍ అనేది కేవలం సామాన్య మానవులకే. ఈ శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాలలో, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు నేటికీ జీహెచ్‍ఎంసీలో పాత రాతి హోం పద్దతులే పాటిస్తున్నారు. ఎటువంటి చోట కూడా మనం మోడ్రనైజేషన్‍ చేయలేదు పారిశుద్ధ్యాన్ని. కరోనా వల్ల గ్యార్బేజ్‍ మేనేజ్‍మెంట్‍ను ఒక సైంటిఫిక్‍ పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. కాంట్రాక్ట్ ఇచ్చేసి మా సిటీ అంతా క్లీన్‍గా ఉందని ఎక్కడికో వెళ్లి డబ్బులు ఇచ్చి అవార్డులు తీసుకోవడం కాదు. చిత్తశుద్ధిగా పరిశుభ్రత గురించి మూడవ క్లాసులో చెప్పే వాళ్లు. నీ ఇంటి చుట్టూ పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి అని. మరి దానిని నిజంగా అమలు చేస్తామా? చేయమా అన్నది పెద్ద సవాల్‍ మన అందరి ముందు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యరంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది?
శాస్త్ర, వైద్య రంగాల్లో రీసెర్చ్ ఉండాలి. రీసెర్చ్ అనేటప్పటికీ మన దేశంలో ఫండమెంటల్‍ రీసెర్చ్ మీద కూర్చుంటారు. ఆ థిరీటికల్‍ ఫండమెంటల్‍ రీసెర్చ్లో అది ఎప్పుడు బయటకి వస్తుందో, ఏమి చేయాలో తెల్వదు. అఫ్లైడ్‍ రీసెర్చ్ మీద ఫోకస్‍ జరగాలి. ఏదైనా ఉపద్రవం జరిగితే ఏ విధంగా అరికట్టగల్గుతాం. సెంట్రల్‍ సైంటిఫిక్‍ అండ్‍ ఇండస్ట్రియిల్‍ రీసెర్చ్ (సీఎస్‍ఐఆర్‍)వింగ్స్ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల డబ్బు ప్రభుత్వం ఇస్తుంది వీటికి. నేషనల్‍ ఎన్విరాన్‍మెంట్‍ ఇంజనీరింగ్‍ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‍ (నీరీ) ఉంది. ఇవన్నీ ఏమి చేస్తున్నాయి. ఇవన్నీ ఒక సైన్స్పైన పని చేయాలి. కానీ ఈ లాక్‍ డౌన్‍ సమయంలో ఏమి నేర్చుకుంటున్నాము అన్నది చాలా ముఖ్యం. దీనిపైన ప్రతి రంగంలోనూ చర్చలు జరగాలి.


ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయా దేశాలు కరోనాను ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయాయి?

ఒకటి మనకు వచ్చిన కేస్‍స్టడీస్‍ అన్నీకూడా బాగా చలి దేశాలు. యూరఫ్‍ దేశంలో చలి మూలంగా ఈ వైరస్‍ అంత విధిగా బయట పడలేదు. రెండోది ఈ దేశాలలో మలేరియాకు సంబంధిత వ్యాధుల్నే సంవత్సరాల కిందట వాళ్లు జయించారు. వాటికి సంబంధించిన మందుల్ని కూడా ఇప్పుడు మ్యాన్‍ఫ్యాక్చర్‍ చేయడం లేదు. మనలాంటి దేశానికి అడ్వాన్‍టేజ్‍ ఏమున్నది అంటే మనకు మలేరియా ఉంది, టైఫాయిడ్‍ ఉంది, కలరా ఉంది. అన్ని రోగాలు అన్ని చోట్ల ఉన్నాయి. కనుక వైద్య రంగంలో వాళ్లు కూడా ఆ అనుభవంతో ఉన్నారు. అక్కడ ఈ సంబంధిత రోగాలు లేకపోవడం మూలంగా వైద్య రంగంలో అనుభవం లేక పోవడం. దానికి సంబంధించిన మందులు లేకపోవడం.
పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
పర్యావరణ పరిరక్షణ అంటే నాలుగు మొక్కలు నాటితే సరిపోతుంది అనుకుంటున్నారు. పర్యావరణానికి మన జీవనసరళికీ, భౌతిక ఇన్‍ఫాస్ట్రక్చర్‍కి ఎటువంటి సంబంధం ఉంది అన్నది శాస్త్రవేత్తలుగానీ, విద్యావేత్తలుగానీ గ్రహించడం లేదు. ప్రతి మెట్రో సిటీని కార్యాచరణ రూపంలోకి తీసుకు రావాలి. గత పదిహేనేళ్లుగా నా ప్రతి సమావేశంలో ఒక విషయం చెపుతున్నాను. ప్రతి మెట్రో నగరం టైం బాంబు లాంటిది అని. ఎందుకంటే మెట్రో సిటీస్‍లో జన సాంద్రత పెరిగి పోయింది. హైదరాబాద్‍ మహానగరంలోని కూకట్‍పల్లి ప్రాంతంలోనే ఒక చదరపు కిలో మీటర్‍కు లక్ష మంది జనాభా ఉన్నారు. ఒక్కరు తుమ్మితే వంద మందికి జలుబు వస్తుంది. అటువంటి ప్రదేశాలే నేడు రెడ్‍జోన్స్, కంటైన్మెంట్‍ జోన్స్ కింద గుర్తించబడ్డాయి. పర్యావరణ నియమాలు పాటించకుండా నిర్మాణమైన అన్ని మహానగరాల్లో ఇదే సమస్య. బెంగుళూరు, బాంబే, ఢిల్లీ, గుర్గాం, పూణే, హైదరాబాద్‍, న్యూయార్క్లాంటి నగరాల్లో కరోనా ఎక్కువుగా ఉంది.


పర్యావరణం అంటే ప్రత్యేక ప్రణాళిక. గతంలో పరిశ్రమలకు, గృహ సముదాయాలకు మధ్య, చెరువులకు, కాలనీలకు మధ్య బఫర్‍ జోన్‍లు ఉండేవి. ఇప్పుడు ఆ బఫర్‍ జోన్‍లు కనుమరుగైనాయి. బఫర్‍ జోన్‍ అంటే ఎన్విరాల్‍మెంట్‍ డిస్టెన్సీ. ఎన్విరాల్‍మెంట్‍ డిస్టెన్సీనే నేడు సోషల్‍ డిస్టెన్సీ అంటున్నారు. గృహాల మధ్య. చెరువుకు కాలనీకి మధ్య, చెరువు చెరువు మధ్య, నదీ నదీకి మధ్య డిస్టెన్సీ ఉండాలి. మొక్కలు నాటి తృప్తి పడకూడదు. హైదరాబాద్‍ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ మాస్టర్‍ ప్లాన్స్ అన్నిటినీ సమీక్షించాలి. ఈ ప్లాన్‍లలో ఎక్కడ కూడా మురుగు నీటికి, వర్షం నీటికి ప్రణాళిక లేదు. రేపు వర్షాకాలం తరువాత కరోనా ఏవిధంగా విజృంభిస్తుందో తెలియదు. పర్యావరణం మన జీవన విధానంలో భాగం. పర్యావరణంలో భాగస్థులం. పర్యావరణంలో ఎలా బతకాలి, జీవన మనుగడ ఎలా ఉండాలి అన్నది మనలో రావాలి. మేము పార్కులు కట్టాము అని ఊరు అవతల ఎక్కడో కడితే గాలి ఎక్కడ వస్తది. కాబట్టి అన్ని వ్యవస్థలను పర్యావరణానికి అనుసంధానం చేయాలి. అభివృద్ధి రంగాలలో పర్యావరణ పరిరక్షణ అమలు చేసే కార్యక్రమాన్ని సమన్వయ పరచాలి. పర్యావరణాన్ని ఏదో ఒక డ్రాయింగ్‍ రూంలో పెయింటింగ్‍లా భావిస్తే ఇలాంటి ఉపద్రవాలు చాలా వస్తాయి.


కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలే కారణమా?
కరోనా వైరస్‍ ల్యాబ్‍లో పుట్టింది. ల్యాబ్‍లోంచి బయట పడ్డది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పుట్టడానికి కారణం అయినా కాకపోయినా అది ఇంతగా వ్యాపించడానికి కారణం ఇప్పుడున్న చెడు పర్యావరణ పరిస్థితులే. ఎక్కడా బఫర్‍ జోన్‍, ఎన్విరాన్‍మెంట్‍ డిస్టెన్సీ లేదు. ఎక్కడా బాధ్యతగల పద్దతుల్లో పర్యావరణ శాఖలు కానీ, మిగతా శాస్త్ర రంగాలు కానీ పనిచేయడం లేదు. వైద్య రంగానికి మనం ఎటువంటి సహాయం అందివ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పర్యావరణం లేదని అన్ని పత్రికల్లో రాస్తున్నారు. గంగానది, గోదావరి, హుస్సేన్‍ సాగర్‍ శుభ్రమైనాయి అని వ్రాశారు. ఎందుకు శుభ్రమైంది అంటే లాక్‍డౌన్‍. ఇవాళ ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ అభివృద్ధికి ఈ రెండింటిని సమత్యులంగా ఎలా ప్రణాళికలు చేసుకుంటాము అన్నది నేర్చుకోవాలి. అంతేగానీ అభివృద్ధికి పర్యావరణానికి ఎటువంటి పోటీ లేదు. ఈ రెండు జతగా వెళ్లాలి. జతగా వెళ్ళిన రోజే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. సమస్థ ప్రాణులు కూడా వాటి వాటి ప్రదేశాల్లో ఉంటాయి. అది చాలా ముఖ్యం.
ప్రపంచ ఆర్థిక రంగంలో రాబోయే మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
ప్రపంచ ఆర్థిక మార్పులు అన్నది సహజం. ఉత్పత్తి వ్యవసస్థని ఎలా గాడిలో పెడతామో దాని బట్టి ఉంటుంది. చాలా వరకు పెద్దఎత్తున పరిశ్రమలకు లోన్లు ఇప్పించి పరిశ్ర మలను నిలబెడుతుంటారు. పరిశ్రమలు నిలబడినా మార్కెట్‍ కొనుగోలు శక్తి ఉండాలి. పరిశ్రమలో ఉద్యోగాలు లేకపోతే వారు ఎలా కొనగలుతారు. కాబట్టి ఓవరాల్‍గా ఆర్థికరంగాన్ని ఎలా తీసుకువెళ్లతాము అన్నది ఆలోచన చేయాలి. కేవలం పెద్ద పరిశ్రమలు గురించే ఆలోచన చేస్తారు. ఉదాహరణకు ఎయిర్‍ ఇండస్ట్రీ రంగంలో విమానాలు ముందు ఎలా ఎగరాలి అనే తపన ఉంటుంది. మన ఆర్టీసీ బస్సు ఎలా కదలాలి అన్నది ఉండదు. ఆర్టీసీ బస్సు తిప్పితే ఆదాయం కాదంటున్నారు. మరి విమానం ఎగిరితే ఆదాయం అవుతుందా.


స్థానిక ఉత్పత్తి కేంద్రాలను ఏవిధంగా పునరుద్ధరించ కల్గుతాము. స్మాల్‍ ఇండస్ట్రీ, కాటేజ్‍ ఇండస్ట్రీ, ఖాదీ అండ్‍ విలేజ్‍ ఇండస్ట్రీస్‍ని ఏ విధంగా ముందు తీసుకెళ్లగలం. చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఏ విధంగా పెంపొందించ కలుగల్గుతాం. ఏ రంగం మీద దృష్టి పెడతామో ఆ రంగంలో పూర్తిస్థాయిలో ఉద్యోగులు ఉండాలి. అలా కాకుండా మేం ఆటోమిషన్‍తో పని చేయిస్తాం అంటే ఇక్కడ కోట్లలో జనాలు ఉన్నారు. కావున ఏ రంగాన్ని తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించే దృష్టి వైపు వెళ్లాలి. ఇప్పుడు ఉత్పత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నేడు చాలా వరకు చైనాలో ఉన్న వివిధ దేశాల పరిశ్రమలు అన్ని కూడా భారత్‍కు షిప్ట్ అవుతాయి. మరి మన దగ్గర అలాంటి స్కిల్డ్ లేబర్‍ ఉన్నదా అని చూడాలి. పాలిటెక్నిక్‍, ఐటీ కళాశాల్లో కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్య శిక్షణ ఇప్పించడం చేయాలి. ఆర్థికం అంటే రూపాయి వూరికే రాదు. పనిచేసే సమర్థత, నైపుణ్యం ఉండాలి. స్థానికంగా ఎక్కడ ఎలా ఉత్పత్తి చేయగలుగుతామో చూడాలి. మొదట కాటేజ్‍ ఇండస్ట్రీస్‍పైన దృష్టి పెట్టాలి. తరువాత చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. అప్పుడు పెద్ద పరిశ్రమలు వాటంతట అవే నిలదొక్కుకుంటాయి. వాటికి ఎలాగూ ఆర్థిక సహాయం ఉంటుంది. మన దేశంలో ఉపాధి రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మన ఆర్థికరంగం పూర్తిగా కుంటుపడుతుంది.


ప్రపంచ దేశాల మధ్య సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపబోతుంది?

ఒక దేశం మరో దేశంతో ఎలా వ్యవహరిస్తుందంటే ముఖ్యంగా కోల్డ్ వార్‍ సమయంలో రష్యా వర్సెస్‍ అమెరికా యుద్ధం జరిగేది ప్రతి రంగంలో. చైనా వర్సెస్‍ అమెరికా బైపోల్‍గా అవుతుంది. ఏ దేశాలు ఎటువైపు వెళ్లతాయి అన్నది గమనించాలి. గత రెండు దశాబ్దాలుగా చైనా చాలా దూకుడుగా అన్ని దేశాల్లో చొచ్చుకు పోయింది. ఏ దేశాలు కూడా వారిని అడగలేదు. ఆఫ్రికన్‍ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్‍, మ్యాన్‍ఫవర్‍ టెక్నాలజీతో వెళ్లి పోయిన వారు ఇన్‍ఫాస్ట్రక్చర్‍ డెవలప్‍ చేస్తూ పోతున్నారు. అక్కడి మీడియా ద్వారా తెలిసింది ఏమిటంటే, మీకు పది కిలోమీటర్ల రోడ్డు వేసిస్తా మాకు ఇన్ని షిప్పుల ఐరన్‍ కావాలి అనే బార్డర్‍ సిస్టంలో చైనా ఎంటర్‍ అయిపోయింది. ఇప్పుడు చైనా వస్తువులు అనడానికి వీళ్లేదు. ఎందుకంటే అవి మల్టీ నేషనల్‍ కంపెనీలలో షేర్లు కొనుకున్నాయి. ఇండియాలోకి వచ్చిన ఉత్పత్తి కేంద్రాలు కూడా చైనా కంట్రోల్‍లో ఉన్నాయి. లాక్‍డౌన్‍ తరువాత ఏ విధంగా కాంప్రమైజ్‍ అవుతాయో చూడాలి. రాజీ ధోరణిలో సమాన హక్కులకోసం చర్చలు జరగవు. చైనా జరగనివ్వదు కూడా. ఎప్పటికీ వారి ఆధిపత్యం ఉండాలనే కోరుకుంటుంది. ఇన్నేళ్ల నుంచి భారతదేశం చాలా పద్ధతిగా యుఎన్‍ఏలో నెగ్గుకొస్తున్నది. లాక్‍ డౌన్‍ పిరియడ్‍ తరువాత కూడా అదే పద్దతితో వెళ్ళాలి. రాజీధోరణితో వెళ్ళితే మన చావును మనం కోరుకున్నట్లే. మనం నెగోషబుల్‍ కండీషన్‍లోనే వెళ్లాలి. మిగతా దేశస్థులతో పోల్చుకోలేము. ముందు దేశాన్ని కాపాడు కోవాలి. ఫ్రీ లిబరల్‍ ప్రొడక్షన్‍ లిబరల్‍ అంటే ఇక్కడి ఉత్పత్తి, ఉపాధి ఆగిపోయింది. రేపు ఏ రాజీధోరణీలోనో వేరే దేశాలకు వెళ్లుతాం. అమెరికా ఐటీ సెక్టార్‍ కూలిపోయింది అంటే లక్షల్లో హైదరాబాద్‍లో నిరుద్యోగులు ఉంటారు. కావున జాగ్రత్త పడాలి.
లాక్‍డౌన్‍ పీరియడ్‍లో ఆర్థికరంగం ఎలా వుంటుంది? ప్రజలపైన ఏ విధమైన భారం పడనుంది?
రోజువారి పనులు జరగలేదు. లాక్‍డౌన్‍లో రెవెన్యూ పడి పోయింది. మనది వ్యవసాయ రాష్ట్రం. అన్ని పనులు వేసవి కాలంలోనే జరుగుతాయి. పంటను పొలాల నుండి ఇంటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటి ఆలోచనలు చేయలేదు. వడ్డీ వ్యాపారుల్లా ప్రభుత్వాలు ట్యాక్స్ రూపంలో వచ్చే రోజువారి రాబడి మాత్రమే చూస్తున్నాయి. మన దేశంలో నేటికీ పట్టిపీడిస్తున్న అవినీతిని మొదట అరికట్టాలి. ఆర్థికరంగం దారికొస్తుంది. సామాన్య మానవుడి ఆలోచనలా ప్రభుత్వ ఆలోచన వుండకూడదు.


ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాను ఎదుర్కోవడంలో ఎందుకు విఫలం అయ్యాయి? చిన్న చిన్న దేశాలు ఎలా బయట పడ్డాయి?
అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ల పరిస్థితి వేరుగా ఉంది. యూరప్‍ దేశాల్లాంటి చిన్న చిన్న దేశాల్లో పరిస్థితి వేరుగా ఉన్నది. వాతావరణం, పర్యావరణ అభివృద్ధి, జనసాంద్రత దూరం దూరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేశాలు కరోనా అరికట్టగలిగాయి. నేటికీ డబ్ల్యూహెచ్‍వో ఇచ్చిన సమాచారం ఎంత నమ్మకం అన్నది అనుమానమే. భారత్‍లో కూడా కొన్ని రాష్ట్రాలు కరోనా లెక్కలు ఖచ్చితంగా ఇవ్వడం లేదనే అనుమానుం ఉంది. ఆఫ్రికా నుంచి ఎటువంటి సమాచారం కనబడలేదు. హెల్త్ డాక్యుమెంటేషన్‍, హెల్త్ డేటా విషయంలో తెలంగాణ రాష్ట్రం చాలా బాగా చేసింది. కుటుంబం మొత్తాన్ని ఆరోగ్య కార్డులు ఇచ్చి కరోనా సమయంలో సెంట్రలైజ్‍ డాక్యుమెంటేషన్‍ కిందకి తెస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది. ప్రపంచ మొత్తంలో ఆరోగ్య సమాచారం చాలా వెనుకబడి ఉంది అనుకోవాలి. ఈ విషయంలో అన్ని దేశాలు ఆలోచించాలి.
ఇటువంటి విపత్తులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
విపత్తులు రాకుండా ఉండడానికి ఖచ్చితమైన సమాధానం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వైద్య, విద్య, సాంకేతిక రంగాల్లో అవసరమైన రీసెర్చ్ అప్లైడ్‍కు సదుపాయాలు కల్పించాలి. ఈ రంగాల్లోకి వచ్చేటట్టు యువతను ప్రోత్సహించాలి. వివిధ రంగాల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇది బలం కాదు బలుపు. గతంలో బోలఖ్‍పూర్‍లో కలుషిత నీటితో 27 మంది ఒకేరోజు మరణించారు. కావున చిన్న తప్పు వందలు వేల మందిని మరణానికి దారి తీస్తుంది. ఇప్పుడు నేర్చుకోవాల్సింది నగర ప్రణాళికల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి. ఆల్‍ రెడీ జరిగిన అభివృద్ధిలో ఏం మార్పులు తీసుకు రాగలుగుతామో ఆలోచించాలి.
రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండ బోతుంది?
ప్రస్తుత పరిస్థితుల్లో డిస్టెన్సీ మూలంగా ఆన్‍లైన్‍ ఎడ్యుకేషన్‍ అనేది మొదలు పెట్టారు. ఆన్‍లైన్‍ ఎడ్యుకేషన్‍తో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరూ అవగాహన కలిగి ఉండాలి. భారత్‍ విద్యారంగంలో ఎక్కువగా పేదవారే. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే తరగతి గదిలో 100 మందిని కూర్చొబెట్టే బదులు టీచింగ్‍ మెథడాలజీని మార్చగలుగ తామా అని ఆలోచించాలి. కొన్ని రోజులు శని, ఆదివారాలు కూడా పని చేయాలి. ఏ సబ్జెక్టులో ఆన్‍లైన్లో చెప్పగలమో, ఏ సబ్జెక్టులు ఆఫ్‍లైన్‍లో చెప్పవచ్చునో గమనించాలి. ఎడ్యుకేషన్‍ రీసెర్చ్ అండ్‍ ట్రైనింగ్‍ ఇనిస్టిట్యూట్‍ (ఎస్‍ఈఆర్‍టీ) ద్వారా అధ్యయనాలు చేయించాలి. ప్రభుత్వ సలహాదారులు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. చీఫ్‍ సెక్రటరీగారు ‘పీపుల్స్ పార్టిస్‍పేషన్‍ ’ పుస్తకం రాసారు. వారికి ప్రజల భాగస్వామ్యం మీద గట్టి అవగాహన ఉన్నది. వీరు మిగతా రంగాలను లాక్‍డౌన్‍ పీరియడ్‍లో ఏ విధంగా ఓరియెంట్‍ చేయగలుగుతారో ఆలోచించాలి.
రేపటి ప్రపంచం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
కొన్ని కట్టుబాట్లతో సమాజం ఉండాలి. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, జాతీయ, ప్రపంచ స్థాయి కర్తవ్యాలను నిర్వహించుకోవాలి. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా, హక్కులు, బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవాలి. వీటిని సమన్వయం చేసుకుంటా వెళ్లాల్సిన అవసరం రేపటి వ్యవస్థకి చాలా అవసరం. ఇంత కాలం ఏదో గడిచి పోయింది. అలా తీసుకెళ్లడానికి రాబోయే పరిస్థితులు సహకరించకపోవచ్చు. అందుకే వ్యక్తిగత స్థాయి నుంచి సంస్థాగతపరమైన బాధ్యతలని ఎంచుకోవాలి. గాంధీజీ చెప్పినట్లు సెన్స్ ఆఫ్‍ బిలాంగ్‍నెస్‍. ప్రతి ఒక్కరికి ఈ ఊరికి, ఈ సమాజానికి భాగస్థున్ని అనే భావన ఉండాలి. అప్పుడే బాధ్యతతో వ్యవహరిస్తారు.

ఉపాధిరంగాలలో కరోనా ఎలాంటి ప్రభావం చూప బోతుంది?
కరోనాలో ఉపాధి కన్నా ఉపాధి కల్పనలో మార్పులు తీసుకు రావాలి. ఇప్పుడు ఐటీ రంగంలో ప్రతి మూడు అడుగులకి ఒక క్యూబికల్‍ ఉంది. దాన్ని ప్రతి ఆరు అడుగులకి ఒక క్యూబికల్‍గా పెట్టుకోవచ్చు. మధ్యలో అతను వర్క్ ఫ్రం హోం వచ్చు. మార్పులు చేసు కోవడానికి కరోనా చాలా ఇస్తుంది. పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితులు మాత్రం కరోనా కల్పించదు.
కరోనా ప్రభావం పారిశ్రామిక రంగంలో ఎలా ఉండబోతుంది?
ఇండస్ట్రియల్‍ రంగంలో సోషల్‍ డిస్టెన్సింగ్‍, హైజిల్‍ అన్నదే ఎక్కువ. ఇండస్ట్రీలో టోటల్‍ క్వాలిటీ, క్వాలిటీస్‍ సర్కిల్స్ ఎన్నో ఇంతకు ముందే వచ్చాయి. అనార్గనైజ్డ్ స్మాల్‍ స్కేల్‍ ఇండస్ట్రీస్‍ దగ్గరే ప్రాబ్లమ్‍ వస్తది. అనార్గనైజ్డ్ స్మాల్‍ స్కేల్‍ ఇండస్ట్రీస్‍కి, మీడియం స్కేల్‍ ఇండస్ట్రీస్‍కి, వన్‍మ్యాన్‍ షో ఇండస్ట్రీస్‍కి ప్రభుత్వ సహాయం చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఉత్పత్తి అంతా చిన్న పరిశ్రమల నుండే వస్తుంది.
మన దేశ ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
ప్రజల్లో మార్పు చాలా రావాలి. ప్రజలు ఈ రోజుకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవహరించడం. ఎన్నుకోబడ్డ నాయకులు మమ్మల్ని ఎవరూ ప్రశ్నించ కూడదు అని అనుకోవడం. ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకర వాతావరణం. వాళ్లు ప్రశ్న ఎందుకు వేస్తారు అంటే ఏదో లోపాలు ఉన్నాయన్నది. ఆ లోపాలను ఎలా సరి దిద్దుకోగలుగతాము అన్నదే ఆలోచన చేయాలి. రాష్ట్ర కేంద్రాల మధ్య ఆర్థికంగా ఇచ్చు పుచ్చుకోవడాలు ఈ ఫెడరల్‍ వ్యవస్థలో ఉండాలి. కావున దాన్ని మళ్లీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. 

(సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)
– ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *