ప్రకృతి నేర్పే పాఠాలు అర్థం చేసుకోవాలి… ఆచరించాలి..

ఓల్గాగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు రచయిత్రి పోపూరి లలిత కుమారితో కోవిడ్‍-19పై ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాగా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి రాజకీయ, సామాజిక, సాహిత్యరంగంలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయిత్రి. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, అస్మిత రిసోర్స్ సెంటర్‍ ఫర్‍ విమెన్‍కు అధ్యక్షురాలిగా, జనరల్‍ సెక్రటరీగా పనిచేసారు. వీరు కరోనాపై ‘దక్కన్‍ ఛానెల్‍’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.


లాక్‍డౌన్‍ పిరియడ్‍లో కరోనా వైరస్‍ వ్యాప్తికి కారణం?
ప్రకృతిని మనం చాలా దుర్విని యోగం చేశాం. ప్రకృతిని విధ్వంసం చేసి, ఎంతో నిర్లక్ష్యాన్ని, ఆలసత్వాన్ని ప్రదర్శించాం. ఈ ప్రపంచీ కరణలో ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోతే మానవ సంబంధాలు బావుంటాయని అనుకున్నాం. కానీ దానికి ఇంకొక వైపు కూడా ఉంది అనేది మనం మరిచి పోయాం.
సంపాదనలో అసలైన మానవ సంబంధాల గురించి మర్చిపోయాం. అందువల్ల ప్రపంచీకరణ నెగటివ్‍ ఎఫెక్ట్ ప్రకృతి విధ్వంసం. ప్రకృతితో సహజీవనం చేయాలనేది మర్చిపోయి, ప్రకృతిని మనం కంట్రోల్‍ చేయగలం, ప్రకృతిని కంట్రోల్‍ చేసి మనం ఏదో సాధించగలం అని అనుకోవటం.
కరోనా పుట్టుకకు ప్రకృతి వైపరీత్యాలే కారణామా?
ప్రకృతి వైపరీత్యాలకు రకరకాల కారణాలు కావొచ్చు. ప్రకృతి సహజంగా ఎలా ఉంటుందో అలా ఉండనివ్వకుండా ప్రకృతిని దారి మళ్ళించి దాని మీద ఆధిపత్యం చెలాయించి, దానిని ఆక్రమించు కోవాలనుకోవడంతో ఎక్కువ అపకారం జరిగింది.
ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ప్రభుత్వాలు, ప్రజలు అందరు కలిసి పనిచేయాల్సిన సందర్భం. అప్పుడే దీన్ని మనం నియంత్రించు కోగల్గుతాం. ఎప్పుడంటే అందరికి సమానమైనటువంటి అవకాశాన్ని, సమానమైనటువంటి గౌరవాన్ని ఎప్పుడు ఇస్తామో అప్పుడు ప్రజలు, ప్రభుత్వం కలిసి దీనిని నివారించు కోగల్గుతూ, నియంత్రించు కుంటాం. అలా కాకుండా సమాజంలో ఉండేటువంటి తేడాలు, వర్గాలు, పేదవాళ్లు, ధనికులు, కులాలు, మతాలు వీటినన్నింటిని మనం వెంట బెట్టుకుని పోరాటం చేయాలంటే చాలా కష్టం. మనం జయించలేం. మనందరం బేసిక్‍గా మనుషులం. అందరం ఒకటి. అందరికి ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి ఒక పద్ధతిలో దీన్ని ఎదుర్కొవాలని పనిచేస్తే ఎదుర్కొగల్గుతాం.
కరోనా వైరస్‍ వ్యాప్తి ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
కొంతమంది భయపడ్డం నేర్చుకున్నారు. కొంతమంది ప్రేమించటం నేర్చుకున్నారు. ఇంకొంతమంది భయపెడుతున్నారు. మూడు అడుగుల దూరం, లేదా ఆరు అడుగుల దూరంలో అని. ఇంకొక వైపు నావాళ్ళు ఎక్కడున్నారో, నావాళ్లు ఏమైపోతారో అని బెంగపడ్డం నేర్చు కున్నారు. ఇది ఒకరకమైనటువంటి ఉద్వేగ కల్లోల పరిస్థితి కదా. కొంచెం ఇది తగ్గిన తరువాత మనుషులు మనుషుల విలువ తెల్సుకుంటారని తమ తోటి వారిని ప్రేమించటం నేర్చుకుంటారని నాకు ఆశగానే ఉంది.


ప్రజలు, ప్రభుత్వాలు ఏ మేరకు ఈ పరిస్థితిని తట్టుకోగల్గుతాయి?
ఒకే వేలో పనిచేయగలగాలి. ప్రభుత్వాలు ప్రజలందరు సమానమని చూడగలగాలి, ప్రజల్లో పేదవాళ్లు, ధనికులు, ఈ మతం ఆ మతం ఇవన్నీ తేడాలన్ని తీసేసి ప్రజలకు ఏది మేలు, ప్రజలను ఎట్లా మంచిగా ఉంచాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి అలా ఆలోచించే ప్రభుత్వాలకు ప్రజలు సహకరిస్తారు. ఈరెండు జరిగినప్పుడు దీన్ని తప్పకుండా మనం తట్టుకోగల్గుతాం.
రాబోయే రోజులల్లో ఇకొన్ని వర్గాలపై ఏమైనా తేడాలు చూసే ఆస్కారంముందా?
కొన్ని చోట్ల జరగొచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయం ఏ వర్గ ప్రజలను ఎలా తాకుతుంది. అనేది ఆలోచించి తీసుకోవాలి దాన్ని అలా తీసుకునే సందర్భాలు ఇంతవరకు మనకు కన్పడలేదు.
ప్రభుత్వాలు వైద్యరంగంలోను, విజ్ఞాన శాస్త్ర రంగంలోను అనుసరించవలసిన ప్రణాళికలు ఏమిటి?
వైద్యరంగంలో పెద్ద మార్పులు తీసుకురావాలి. పబ్లిక్‍ హెల్త్ అంటే ప్రజారోగ్యాన్ని మనం చాలా సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేసుకుంటూ వస్తున్నాం. కనీసం 60వ దశాబ్దంలో ఉన్నటువంటి ప్రజారోగ్య పాలసీలు కూడా ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. పూర్తిగా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టేశాం. డబ్బు గుంజుకోవటం అనేది తప్ప ప్రైవేటు వాళ్లు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించలేదు. ఏ పథకాలు పెట్టినా అది ప్రైవేటురంగానికే వెళ్ళేటట్లుగానే ఉన్నాయి. కాబట్టి అది సమూలంగా మార్పు చెందాలి. విద్య వైద్యం ఈ రెండు కూడా సంక్షేమరంగాలు. ఈ రెండు రంగాలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలందరికి సమానంగా అందేలా చూడాలి. అలాంటి ప్రణాళికలు వేసుకొని వెళ్తే తప్ప ఇలాంటి విపత్తులను ఎదుర్కొలేం.
కార్పొరేట్‍ వ్యవస్థపై మీ అభిప్రాయాలు?
కార్పొరేట్‍ రంగాలు ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇవాళ అందరికి తెల్సినటువంటి సత్యం. కార్పొరేట్‍ రంగాల కోసమే ప్రభుత్వాలు చాలా వరకు పనిచేస్తున్నాయి. ఆరెండింటి మధ్య ఉన్న సంబంధం చాలా వరకు విడదీయరానిది. ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా తెగుతుందో తెలీదు. కానీ కార్పొరేట్‍ వ్యవస్థ తన లాభాల కోసం, కొంతమంది ధనికుల లాభాల కోసం వేలాదిమంది ప్రజలని అభద్రతలోకి, అనారోగ్యంలోకి, అవిద్యలోకి నెట్టిపారేశారు.


కార్పొరేట్‍రంగాలను ఏ విధంగా నిర్మూలించాలి? దానికి ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి?
నిర్మూలించటం అనేది చాలా పెద్ద మాట. నిర్మూలించటం కంటే కనీసం నియంత్రించటం చేయాలి. మనకి చట్టాలు ఉన్నాయి. కార్పొరేట్‍ రంగాలకు రుణాలు విపరీతంగా ఇచ్చేసి ఆ రుణాలను మళ్లీ పట్టించుకోకుండా, అలాగే అవి ఏమి ఉత్పత్తి చేస్తున్నాయి. అవి ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువుల వల్ల, ప్రొడెక్ట్ వల్ల ప్రజలకు ఎట్లాంటి మానసికమైన అనారోగ్యాలు వస్తున్నాయి, ఎట్లాంటి శారీరకమైన అనారోగ్యాలు వస్తున్నాయని గమనించాలి. ఇవాళ విశాఖపట్నంలో గ్యాస్‍ ఫ్యాకర్టీ లీకేజీ మూలాన అప్పటికప్పుడు ఒక పెద్ద ప్రళయం లాగా వచ్చిపడింది. ఒక ఐదారు కిలోమీటర్ల మేర ఎవరు బాధ్యులు దీనికి. వాళ్ల దగ్గర డబ్బు ఉంది. పలుకుబడి ఉంటుంది. ఏమైనా చేస్తారు ఎంతైనా నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రజల ప్రాణాలు తీస్తారు. ఎప్పుడో భోపాల్‍ గ్యాస్‍ సంఘటన జరిగింది. మనం అప్పటినుంచి ఇప్పటి వరకు ఏమన్నా నేర్చుకున్నామా? ఫ్యాక్టరీలను పొల్యూషన్స్ కంట్రోల్‍ వాళ్లో, ఇంకోరో నిరంతరం నిఘాలో ఉంచాలి అనేదాన్ని మనం పట్టించుకున్నామా కార్పొరేట్‍ రంగాన్ని నియంత్రించగల్గినా, నిర్మూలించటం అనేది ఇప్పుడు అసాధ్యం గానీ, నియంత్రించి వాళ్లకు చక్కని బ్యాలెన్సింగ్‍ పెడుతూ వాళ్లకి తప్పులు జరిగితే పనిష్‍మెంట్‍ ఇస్తు ముఖ్యంగా వాళ్లు ఏదో రుణమో ఏదో ఇస్తున్నప్పుడు వాళ్లను ఆపి వాళ్లని జైలుకి పంపించి వాళ్ల ఆస్తులన్ని స్వాధీనం చేసుకుని వాటిని ఆరంగాలల్లో పనిచేస్తున్న వర్క్ర్స్కి, కార్మికులకి పంచిపెట్టి వాళ్లకి ఎలాంటి లోటులేకుండా చేయాలి. ప్రైవేట్‍ రంగాన్ని ఇప్పటికి ఇప్పుడు నిర్మూలించమని కూడా ఎవరు అనరు. దాన్ని సరిగ్గా నడపండి మీరు ఉన్నది ఎందుకు? ప్రైవేట్‍ చెప్పుచేత్తల్లో మీరు నడవడానికి కాదుకదా మీ చెప్పుచేతల్లో అది నడవాలి. ప్రజల కోసం అవి పనిచేయాలి. ప్రజలకోసం జరగాలి, ప్రజల ఆరోగ్యం కోసం జరగాలి.


ఇండ్రస్టీయల్‍ పాలసీ ప్రకారం అసలు ఇండ్రస్టీస్స్ అనేది జనసంచార ప్రాంతంలో ఉండకూడదు? మరి అట్లాంటి వాటికి ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నాయి?
ప్రభుత్వాల్లో ఉన్న వాళ్లకి వాళ్లకి ఉన్న సంబంధ బాంధవ్యాల మూలానా పర్మిషన్స్ ఇస్తాయి. పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మేము చచ్చిపోము కదా అనుకుంటారు వాళ్లు. ఇవాళ కరోనా గురించి ఇంత గోల ఎందుకు చేస్తున్నారంటే వాళ్లు కూడా చచ్చిపోవచ్చు. ఫ్యాక్టరీకి పొల్యూషన్స్ వస్తే ఆ కార్మికులు చచ్చిపోతారు. మేము కాదుకదా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనిషి నుంచి మనిషికి వస్తుంది. ఎలా వస్తుందో తెలియలేదు. అమ్మో కరోనా అని చెప్పి భయపడుతున్నారు. అంటే మనదాకా వస్తే తప్ప ప్రాణం విలువ తెలియని మనుషులు ఉన్నటువంటి కాలం ఇది. దీన్ని పూర్తిగా మార్చనిదే ఇట్లాంటి విపత్తులు ముందుముందు కూడా రాక తప్పవు.
ప్రపంచ ఆర్థిక రంగంలో రాబోయే మార్పులు ఏమిటి?
ఆర్థికరంగంలో చాలా సంక్షోభం రావొచ్చు. ఎందుకంటే నిరుద్యోగం విపరీతంగా ఉన్నది ఇప్పటికే. ఇంకా నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంక్షోభం తప్పనిసరి. కాకపోతే దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవటం కూడా ఇప్పుడు బహుశా లేట్‍ అవొచ్చు, టెక్నాలజీ వల్ల గానీ, ఇంకొకదాన్ని వల్ల గానీ ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ద సమయంలో వచ్చిన దాన్ని నివారించాలంటే చాలా కాలం పట్టింది. ఇప్పుడు అంతకంటే తొందరగా దాని బాగు చేసుకోగలమేమో. చిత్తశుద్ధి ఉండి, స్వార్థం లేకుండా ఉంటే స్వలాభాపేక్ష లేకుండా ఉంటే కొంచెం బాగు చేసుకోగల్గుతాం.
ఎలాంటి ఆహార పదార్థాలు ఉంటే బావుంటుంది?
ఆరోగ్యకరమైనది, రుచికరమైన ఆహారం. వెస్ట్రన్‍ ఫుడ్‍ అంతా అనారోగ్యకరమైనదని అభిప్రాయాన్ని మనం వ్యాపింప చేయకూడదు. అక్కడ కూడా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి. అమ్మలు అమ్మమ్మలు చేసి పెట్టేటువంటివి మనకి ఉన్నాయి. రుచిగా ఉండాలి, తాజాగా ఉండాలి మన శరీరానికి శక్తిని ఇవ్వాలి. ఇదే ఆహారంలో ఉండే రహస్యం మన శరీరం దేనినైనా తట్టుకోగల్గినటువంటి శక్తి ఉండాలి. అట్లాంటి శక్తి ఉన్నటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. మనదేశంలో, ఏదేశంలోనైనా ఉంటాయి.


వలస కార్మికుల ఇబ్బందుల పరిష్కారానికి ఏమి చేయాలి?
వలస కార్మికుల ఇబ్బందుల పరిష్కారానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అంటే వాళ్లకి ముందే మీరు ఉన్న చోట ఉండండి మీరు పని చేసినా చేయకపోయినా కొన్ని రోజుల పాటు మీ జీవన భృతికి, మీ ఆరోగ్యానికి మేము గ్యారంటీ ఇస్తాము అని వాళ్లు పనిచేస్తున్న కంపెనీలు, ప్రభుత్వం కలిసి హామి ఇచ్చిన్నట్లైతే ఇంత విపత్కర పరిస్థితి వచ్చేది కాదు. ఆ హామీ ఇవ్వలేకపోయాం అందరం కూడా. వాళ్లు అలా రోడ్డు మీద నడుస్తుంటే దుఃఖపడటం తప్ప, కొంతమంది చేయగల్గినంత సహాయం చేయటం తప్ప ఏది చేయలేకపోతున్నాం. వాళ్లు వెళ్ళిపోయిన తరువాత పనులు చేసేవాళ్లు లేక ఆయా రంగాలు కూడా దెబ్బతింటాయి.
ఇన్ని రోజులు వలస కార్మికులు ఇన్‍సెక్యూర్‍గా ఫీలయ్యారా?
వాళ్లు ఎంత అల్లాడిపోతున్నారో మీడియాలో చూస్తున్నాం. ఇండ్లలో కూర్చుని బయటికి అడుగుపెట్టాల్సిన అవసరం లేని వాళ్లు కూడా భయంతో అల్లాడిపోతుంటే, నడిరోడ్డుమీదో, షెల్టర్‍ హోంలోనో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్న వలస కార్మికులకు ఎంత అభద్రత ఉంటుందో ఆలోచించండి.
ఎలాంటి పాలసీ విధానాలను వలస కార్మికుల కొరకు ప్రభుత్వాలు తేవాలి?
వలస కార్మికులకులైనా, ఒక ప్రొడక్షన్‍లో ఉన్నారు వాళ్లు వాళ్ల శ్రమ చాలా విలువైనది. వాళ్ల శ్రమే మన సంపద. సమాజపు సంపద అనే విషయం గుర్తించి వాళ్లకు కావాల్సినటు వంటి సౌకర్యాలన్నీ సమకూర్చాలి. ఒకప్పుడు ప్రభుత్వరంగంలో పనిచేసే టువంటి కార్మికులకి, చిన్న ఉద్యోగస్తులకి కూడా చాలా సౌకర్యాలు ఉండేవి. బిహెచ్‍ఇఎల్‍, ఇసీఎల్‍ ప్రభుత్వ రంగ సంస్థలు బోలెడు ఉండేవి. అప్పుడు ఆ సంస్థల్లో పనిచేసేవాళ్లకి క్వాటర్స్ ఉండేవి. బస్సులు నడిపేవాళ్లు, వాళ్లకి హాస్పటల్స్, స్కూల్స్, కాలనీలు ఎంతో చక్కగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలని మూసి పారేసి ఏ సౌకర్యాలు కల్పించని, ఏ లేబర్‍ చట్టాలు వర్తించనీయకుండా చేయగల్గినటువంటి ప్రైవేట్‍ సంస్థలకి, కార్పొరేట్‍ సంస్థలకి కట్టబెట్టారు. పనిచేసేటువంటి కార్మికులందరికి కనీస గృహ, వైద్య, విద్య ఆరోగ్య సదుపాయాలన్నీ ఉండాలి అనేటువంటిది ఒక పాలసీగా తీసుకొని ఇది సంఘటిత రంగం లోనే కాదు అసంఘటిత రంగంలో కూడా వాళ్లు అక్కడ పనిచేస్తున్నంత కాలం కల్పించాలి.


పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?
పర్యావరణ పరిరక్షణ గురించి పర్యావరణ శాస్త్రవేత్తలు దాంట్లో పనిచేసే వాళ్లు ఎంతో కాలంగా మొత్తుకుంటున్నారు. అడవులు నరికి వేయకండి, అడవులను పెంచండి, నదులను కాపాడుకోండి, తరువాత కాలుష్యాన్ని తగ్గించుకోండి కర్బన వాయువులను విడుదల చేయకుండా చేయండి అని చెప్పి, కరోనా రాకముందు కూడా గ్లోబల్‍ వార్మింగ్‍ మీద చాలా మంది పనిచేస్తున్నారు. చాలా పరిశోధనలు చేసి ఎంతో మెటిరియల్‍ ఉంది మన దగ్గర. అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడేందుకు ఆ అంతర్జాతీయ ఒప్పందాలను ఏ దేశము ఖాతరు చేయదు. సంపన్న దేశాలు అసలే ఖాతరు చేయవు. ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని, అడవులను నాశనం చేసుకుంటూ పోయాం. నదులను కాలుష్యం చేసుకుంటూ, ఎండగట్టుకుంటూ పోయాం. కాలుష్యరహితగాలి తప్ప మంచి గాలి లేని నగరాల్ని నిర్మించుకుంటు పోయాం.
టెక్నాలజీ పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
టెక్నాలజీకి, పర్యావరణానికి వైరుధ్యం ఉండకుండా చూసుకోవాలి మనం. టెక్నాలజీని మరీ ప్రకృతిని ధ్వంసం చేసేంతగా పెరగనీయవద్దు. మనకి కొన్ని తెలిసి కూడా చేస్తాం. ఉదాహరణకి అణుబాంబు వల్ల ఎలాంటి విధ్వంసం జరుగుతుందో తెలిసి బాంబులు తయారు చేస్తాం. వేస్తాం. యుద్ధం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలిసి యుద్ధాలు చేస్తాం. ఇట్లా తెలిసి చేస్తున్నటువంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి మానవులు. కాబట్టి పర్యావరణానికి, టెక్నాలజీకి కూడా ఒక స్నేహాన్ని కల్పించాలి. పర్యావరణాన్ని ఇది పాడు చేస్తుంది, ఇది ప్రకృతిని దెబ్బ తీస్తుంది అని అనుకొంటే ఆ టెక్నాల జీని ఉప సంహరించు కోవాలి. అట్లాంటి ఒప్పందాలు తీసుకోవాలి దేశాలు.
పర్యావరణం కొరకు ఎలాంటి మార్గదర్శకాలు ఉంటే బావుంటుంది?
పర్యావరణ సమతుల్యత గురించి ఒక మంచి అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. యునైటెడ్‍ నేషన్‍తో ఆ ఒప్పందంపై చాలా దేశాలు సంతకాలు పెట్టాయి. అట్లాంటి ఒప్పందాలను ప్రజలందరికి పంచిపెట్టి వాటిని అమలు చేసేటట్లుగా చేస్తే చాలు.


ప్రపంచదేశాల మధ్య సంబంధాలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపబోతున్నది?
ప్రపంచ దేశాల మధ్య సంబంధాల గురించి చెప్పలేము. ఒక దేశానికి ఒక దేశం సహకరించుకుంటే ఈ విపత్తు నుంచి బయట పడవచ్చు. సహకరించుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఒక దేశాన్ని నిందించటం. అంటే చైనాని కరోనా అక్కడి నుంచి వచ్చిందని నిందిస్తున్నారు. ఇట్లాంటివి కొన్ని రోజుల పాటు జరగొచ్చు. కొన్ని దేశాలను, కొన్ని జాతులను నిందించటం అవన్నీ క్రమంగా పోతాయనే అనుకుందాం.
విద్యావ్యవస్థపై కరోనా ఎట్లాంటి ప్రభావాన్ని చూపబోతోంది?
విద్యా వ్యవస్థ ఇప్పుడు బాగోలేదు. కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపినా ఈ విద్యా వ్యవస్థ మారితే చాలు. ఈ విద్యా వ్యవస్థ మేలు చేసేది లాగా లేదు. ప్రైవేట్‍ రంగంలోకి వెళ్ళిపోయి కొన్ని స్కూల్స్, కాలేజీలు విపరీతంగా సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. పాఠశాలలు ఏవీ సరిగ్గా పనిచేయట్లేదు. ఎట్లాగో వీళ్లు డిగ్రీలు తీసుకొని బయటికి వస్తున్నారు కానీ, అది మంచి విద్య కాదు. కాబట్టి ఈ రకమైన విద్యా విధానం పోవాలి. ఇది కరోనా వల్ల పోతుందా ఇంకో దాని వల్ల పోతుందా అనేది ప్రక్కన పెడితే ఈ విద్యా విధానం సమూలంగా మార్పు చెందేటటువంటి అవకాశం వస్తే మంచిదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇట్లా పాఠాలు చెప్పలేం. అందరు స్కూల్స్కి రావటం కుదరదు. కాబట్టి ఒక సార్వత్రిక విద్య టెలివిజన్‍ ద్వారా గానీ, ప్రసార మాధ్యమాల ద్వారా గానీవ్వండి ఎక్కువ మందికి సమానమైన విద్య కల్పిస్తే చాలా మంచిది.
అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థ ఎందుకిలా ఉంది?
నిజం చెప్పాలంటే మా చిన్నప్పుడు కొద్దిమందే చదువుకొనేవాళ్లం. అందరు అక్షరాస్యులని చెప్పలేను. కానీ మా క్లాసులో చాలా ధనికులు ఉండేవారు. చాలా పేదవాళ్లు, మధ్య తరగతి వాళ్ళు అందరు కలిసి చదువుకునేవాళ్లం. అన్ని కులాలు, మతాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమౌతుందంటే ఒక వర్గం వారందరికి ఒక రకమైన స్కూల్‍, పేదవాళ్ల అందరికి ప్రభుత్వ పాఠశాలలు. ఇలా ప్రభుత్వ రంగం నిర్వహించాల్సిన సంక్షేమ రంగమైనటువంటి విద్యను ప్రైవేట్‍ రంగంకు అప్పచెప్పటంతోనే ఈ బెడద వచ్చి పడింది.
ప్రైవేట్‍ రంగం అంటే ఎలాంటి విద్యా విధానాలు ఉండాలి?
అందరికి సమానమైనటువంటి జ్ఞానం, విలువతో కూడినటు వంటి విద్యా ఉండాలి. ఆ విలువలు లేని విద్యా వాళ్లను బట్టి పట్టించేసి మళ్లీ వాటిని పరీక్షల్లో ప్రాక్టీస్‍ చేయించి దానికి మార్కులు వేయించి అక్కడ బోలెడన్ని అవినీతి బాగోతాలు, పేపర్స్ లీకేజీ, దిద్దటంలో తప్పులు, అంతా పతనమైపోయింది.
ఇప్పుడున్న కరోనా ప్రభావం అనేది తరగతి గదులలో ఒక క్లాస్‍ టీచర్‍కి ఒక స్టూడెంట్‍కి ఏ విధంగా ఉండబోతుంది?
తరగతి గది ఉంటే గనక మామూలుగానే ఉంటుంది. కొంచెం దూరం పాటించాలి కొన్ని రోజుల పాటు. అంతే కానీ పెద్ద మార్పులేమి ఉండవు. డిజిటల్‍ అంటే మళ్లీ అందరికి ల్యాప్‍టాప్‍లు. పేదవాళ్లకి అవన్నీ కుదురుతాయా, కుదరవా ఆలోచించాలి. టెలివిజన్‍లో కొన్ని గంటలు పిల్లలకి పాఠాలు చెబితే ఎలా ఉంటుంది. ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అట్లా ఉంటే టీచర్‍ కనపడదు కదా మనకి ఎక్కడో ఉండి చెబుతూ ఉంటారు. కాకపోతే మరీ అప్పుడు టీచర్‍ మీద ఎక్కువ ప్రేమ కలగొచ్చు. కొట్టడు, తిట్టడు కాబట్టి.


స్టూడెంట్‍కి ఏమైనా డౌట్స్ వస్తే టీచర్‍ని డైరెక్ట్గా వెళ్ళి కలిసేవారు. డిజిటల్‍ విద్య వస్తే అలాంటి అవకాశాలు ఉంటాయా?
ఉండొచ్చు. ఇవాళ ఒక లెసన్‍ చెబుతారనుకోండి రెండవ రోజు ఒక అరగంట సేపు డౌట్స్ కోసం కేటాయించాలి. రెండవ రోజు చెప్పిన పాఠం మూడవ రోజు. అందువల్ల సందేహాలకి సమయం అనేది ఇవ్వాలి పిల్లలకి. ఆ సమయంలో సందేహాలు అడిగితే ఆ టీచరు సమాధానాలు ఇస్తారు.
వలస కూలీల పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలకే వెళతారు! అలాంటి వారికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది?
వాళ్ళకి మంచి విద్య అందించాలి. వారికి విశాలమైనటు వంటి తరగతి గదులు, మనిషికి మనిషికి కొంత దూరం ఉండేలాగా గాలి వెలుతురు బాగా వచ్చేలాగా, తరగతి గదులు పరిశుభ్రత, బాత్‍రూం ఇలాంటివి అన్నీ ఉండేలాగా చేయగల్గితే మంచిదే.
ఇటువంటి విపత్తులు రాకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?
ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ అట్లాంటివే. కేవలం ప్రభుత్వాలే కాదు పౌరుడిగా మనం కూడా కొన్ని చేయాలి. మరీ ముఖ్యంగా మధ్యతరగతివాళ్లు, ఎగువ మధ్యతరగతివాళ్లు ఎంత నీటిని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఎంత నీటిని వాడుతున్నాం. అట్లాగే మనం అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక్కొక్క ఇంట్లో ఎన్ని కార్లు ఉంటున్నాయి. వాటిని వేసుకుని రోడ్ల మీద విచ్చల విడిగా తిరిగి గాలిలో కార్బన్‍ మోనాక్సైడ్‍ రిలీజ్‍ చేస్తున్నాం. ఇట్లాంటివి చాలా మంది ఆలోచించుకోవాలి. అవి నియంత్రించుకోవాలి.


లాక్‍డౌన్‍ తరువాత కరోనా అనేది ప్రపంచంలో గానీ, దేశంలో గానీ ఎలా ఉండబోతుంది?
చాలా విపరీతంగా పెరుగుతుంది. డాక్టర్లు, సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఎలాగు పెరుగుతుంది పెరిగి హార్ట్ ఇమ్యూనిటి అనేది వస్తుంది. అంటే అత్యధిక శాతం జనాభాకి ఇమ్యూనిటి వస్తే అప్పుడు క్రమంగా తగ్గుతుంది. అప్పటి వరకు పెరుగుతుందని, అలాగని ఎన్ని రోజులు కూర్చుంటాం, దాన్ని ఎదుర్కోవటానికి మన ఇమ్యూనిటిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి.
రేపటి ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
చాలా మార్పులు వస్తాయని మాత్రమే చెప్పగలం. పాఠాలు మాత్రం ప్రకృతి నేర్పుతోంది. ఈ ప్రకృతి నేర్పే పాఠాలని కొంత జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మనం వాటిని ఆచరించాలి.
ఆర్థిక సాంకేతిక అభివృద్ధి కల్గిన దేశాలు కరోనాను ఎదుర్కోవటంలో ఎందుకు విఫలమైనాయి? చిన్న చిన్న దేశాలు ఈ పరిస్థితి నుండి ఎలా బయట పడతాయి?
అంటే కొంత సోషలిస్టు దేశాలు బయట పడ్డాయి. ఇప్పుడు క్యూబా గానీ, ఒకప్పుడు సోషలిస్టు దేశంగా ఉన్నటువంటి యూరప్‍ దేశం గానీ పబ్లిక్‍ హెల్త్ మీద చాలా ఖర్చుపెట్టాయి. ఆ పబ్లిక్‍ హెల్త్ మీద పెట్టిన ఖర్చు వాళ్లకి ఇప్పుడు అక్కరకొచ్చింది. వాళ్లు కొంచెం నిరోధించుకోగలిగారు. మిగిలిన పెద్ద దేశాలకు ఏం కతరు లేదు పబ్లిక్‍ హెల్త్ మీద. వాళ్ల దగ్గర ఏమీలేవు ప్రజలను ఆదుకోవటానికి ఆరోగ్య పరంగా. అందువల్ల ఆ దేశాలు ఎక్కువగా దెబ్బ తిన్నాయి.

(సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)
– ఎసికె. శ్రీహరి,
ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *