దళిత బహుజన మేధావి, ప్రజాస్వామికవాది ఉ.సా.

దళిత బహుజన మేధావి, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా. జులై 25న కరోనాతో మరణించడం అత్యంత విషాదకరం. ఉ.సా. అసలు పేరు ఉప్పుమావులూరి సాంబశివరావు. ఉ.సా. గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరులో ఉన్నత మధ్యతరగతి, వైద్యరంగ కుటుంబంలో జన్మించారు. ఆ కుటుంబం ఆయుర్వేద వైద్యంలో ఆ చుట్టు పక్కల ప్రాంతమంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది. ఉ.సా.ను మెడిసన్‍ చదివించాలనేది కుటుంబ ఆకాంక్ష.


1968లో ఉ.సా. పి.యు.సి. విద్య కోసం తెనాలి వి.ఎస్‍.ఆర్‍. కాలేజీలో చేరే టప్పటికే నాస్తికవాది, హేతువాది. తెనాలి విద్యార్థి ఉద్యమ ప్రభావంతో మార్కిస్టుగా మారాడు. 1973 చివరిలో తెనాలిలో ఏర్పడిన అరుణోదయ సాహితీ సాంస్కృతిక వేదిక (ఇప్పుడున్న అరుణోదయలకు సంబంధం లేదు)కు కన్వీనర్‍గా ఎమర్జెన్సీ వరకు పనిచేశాడు. అరుణోదయ ప్రతివారం నిర్వహించిన చర్చావేదికల ద్వారా, రాత్రి పాఠశాలల ద్వారా చాలామంది విప్లవ రాజకీయాలతో మమేకమయ్యారు. ఉ.సా. ఎమర్జెన్సీ సమయంలో పూర్తి విప్లవకారుడిగా జీవితాన్ని ప్రారంభించి కొండ మొదలు తదితర ప్రాంతాలలో ఉద్యమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆ సమయంలోనే కవిగా, గాయకుడుగా సాంస్కృతిక సేనానీ అయ్యాడు. ఉ.సా. రాసిన పాటలు, రచనలు ఇవ్వాళ్టికీ ప్రజలను చైతన్య పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ చేయబడి రాజమండ్రి జైలులో ఉన్నారు.


1986 వరకు విప్లవోద్యమంలో పనిచేసారు. 1981లో మంగళగిరిలో జరిగిన చేనేత కార్మికుల మహోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కొండ మొదలులో జరుగుతున్న గిరిజన భూపోరాటాల్లో కొన్ని నెలలున్నారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేసారు. లోవోల్టేజి సమస్యపై రైతులను కదిలించి వేలాది ఎడ్ల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. తరిమెల నాగిరెడ్డిగారి చివరి రోజులలో అత్యంత సన్నిహితంగా వుండి వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.


కారంచేడు, చుండూరు, వేంపెంట సంఘటనలు ఉ.సా.ను అస్తిత్వ ఉద్యమాల వైపు నడిపింది. ఇది వర్గ, కుల సమాజం అనే ప్రతిపాదనతో తన మార్గాన్ని పునఃప్రారంభించాడు. 1986 నుంచి ఉ.సా. ఒక ప్రభంజనంలా ఎదిగాడు. తన ప్రతి ఆలోచానా, ఆచరణా దళిత, బహుజనుల, మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వాలకు ఒక దిక్సూచి. వివిధ శ్రేణులుగా ఉన్న దళిత, బహుజన మైనార్టీల ఐక్యత కోసం, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఉ.సా. గొప్ప ప్రజాస్వామిక వాది. పీడిత ప్రజలపై నిరంతరం జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆయా శ్రేణులను సమీకరించడంలో ఎనలేని కృషి చేసాడు. వివిధ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నారు.


దళిత ఉద్యమ చరిత్రను రణనిన్నాధం పేరుతో రికార్డు చేసారు. ముఖ్యంగా మలి తెలంగాణా ఉద్యమంలో వివిధ సంఘాలతో కలిసి పనిచేసాడు. భౌగోళిక తెలంగాణాతో పాటు సామాజిక తెలంగాణాను ఆకాంక్షిం చాడు. తెలంగాణా సాధన కోసం జరిగిన అనేక చర్చల్లో, నిరసనల్లో, ధర్నాలలో, ప్రముఖ పాత్ర వహించాడు. అభిప్రాయ బేధాలతో సంబంధం లేకుండా ఉద్యమాలపై జరిగిన అన్ని రకాల అణచి వేత చర్యలకు వ్యతిరేకంగా, అన్ని సంఘాలతో కలిసిపని చేసాడు. దళిత బహుజన తాత్విక వేత్తగా, నిజాయితీ పరుడుగా, నిరాడంబరుడుగా, ప్రజాస్వామిక వాదిగా వివిధ శ్రేణుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.


మహాత్మాపూలే, పెరియార్‍, అంబేద్కర్‍ భావనలను, మార్క్సిజంతో మేలవించిన ఒక సమగ్ర ఆలోచనతో పనిచేసారు. కరోనా నేపథ్యంలో వివిధరంగాలలో కృషిచేస్తున్న నిష్ణాతులైన ప్రముఖులను దక్కన్‍ల్యాండ్‍ ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఉ.సా.ను 9.5.2020న ఇంటర్వ్యూ చేసింది. పలు అంశాలపై ఆలోచనాత్మక విశ్లేషణలు చేసారు. దీన్ని జులై 2020 సంచికలో ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూను ప్రచురించిన కొద్దికాలంలోనే అదే కరోనాతో ఉ.సా. మరణించడం విచారకరం. సోషల్‍ మీడియాకి ఉ.సా.గారి చివరి ఇంటర్వ్యూ యిది.

ఉసాగారి మరణానికి వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ సహచరులకు దక్కన్‍ల్యాండ్‍ తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నది.
– జుగాష్‍విలి, ఎ : 9848266384

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *