తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని మణికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు.
పల్లా దుర్గయ్య గారి స్వగ్రామం ఈ మణికొండే. దుర్గయ్యగారు 25-5-1914 తేదీన పల్లా నర్సమ్మ పాపాయ్య దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు 5వ సంతానం. తండ్రిగారికి వ్యవసాయం, ఉంది. పౌరోహిత్యం కూడా చేసేవారు. కాని దుర్గయ్యగారికి పౌరోహిత్యం అబ్బలేదు.
దుర్గయ్యగారి 3వ అన్నగారైన మడికొండ సత్తెయ్యగారు మంచి హరికథకులుగా పేరుగాంచినారు. ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రంలో అర్థశతాబ్దికి పైగా హరికథలు వినిపించారు.
దుర్గయ్యగారికి వారి తల్లిగారి వల్ల చదువుపట్ల శ్రద్ధ గలిగింది. పైగా బాల్యమిత్రులైన కాళోజి సోదరులు, వానమామలై సోదరులు దుర్గయ్య గారిని ప్రోత్సహించడం వల్ల కూడా దుర్గయ్యగారు విద్యపట్ల శ్రద్ధ వహించారు.
బిరుదురాజు రామరాజుగారు, అనుమల కృష్ణమూర్తి గారు మిత్రులే ఐనప్పటికీ- దుర్గయ్యగారి కంటె చిన్నవారు. కాని వారి స్నేహం గొప్పది.
దుర్గయ్యగారు మడికొండలో ప్రాథమిక విద్యసభ్యసించి, హనుమకొండలో హైస్కూల్ వరకు చదువుకున్నారు.
మడికొండకు, హనుమకొండ 12 కి.మీ. దూరం. ప్రతిరోజు నడిచి వెళ్లవలసి వచ్చేది బడికి ప్రయాణ బడలికవల్లనూ, ఆర్థికంగా పేదవారు కావడం వల్లనూ బాల్యంలోనే దుర్గయ్యగారు అనారోగ్యానికి గురుయ్యారు. ఐనా దుర్గయ్య గారు పట్టువిడువని విక్రమార్కులై చదువులో అందరికంటె మిన్నగా రాణించారు.
దుర్గయ్యగారి మీద బహుభాషాకోవిదులైన వానమామలై వెంకటచార్యుల ప్రభావం ఉంది. దుర్గయ్యగారికి మెట్రిక్యులేషన్లో ఉండగానే పెళ్లైంది. ఐనా దుర్గయ్యగారు వరంగల్‌లో ఇంటర్ చదివి, హైదరాబాదులో పరీక్ష రాసి పాసైనారు. ఆ తర్వాత 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ.లో చేరి 1940లో అందులో ఉత్తీర్ణులయ్యారు. ‘వందేమాతరం’ ఉద్యమం కారణంగా ఒక సంవత్సరం వృథా అయింది.
అదే సంవత్సరం తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర తరగతులు మొదలుకావడం, అందులో దుర్గయ్యగారు విద్యార్థిగా చేరిపోవడం జరిగింది. అంతేకాక, 1942లో జరిగిన ఎం.ఏ. తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులై మొత్తం విశ్వవిద్యాలయంలోనే పట్టభద్రులైన తొలి ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా కీర్తికెక్కారు.
మడికొండ నుంచి హనుమకొండకు వెళ్లడమే కష్టమైన రోజుల్లో హనుమకొండ నుండి హైదరాబాదుకు రావడం ఇంకెంతో కష్టం. ఐనా దుర్గయ్యగారు హైదరాబాదుకు వచ్చి చదువుకోవడంలో వారి మూడవ అన్నగారైన సత్యనారాయణ గారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. అన్నగారు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో దుర్గయ్యగారు కూడా గయుని వేషం వేయవలసి వచ్చింది. వచ్చిన డబ్బుతో మొదటిసారి హైదరాబాదుకు వచ్చి అప్పటి తెలుగు శాఖ అధ్యక్షులైన రామప్రోలు సుబ్బారావుగారిని కలుసుకోవడం, వారి సహాయంతో ఫ్రీషిప్ రావడం, చదువుకొనసాగడం దుర్గయ్యగారి విద్యభ్యాసంలో మరువలేని సంఘటనలు.
దుర్గయ్యగారు 1943లో చాదర్‌ఘాట్‌లో కొత్తగా మొదలైన జూనియర్ కళాశాలలో మొదట పార్ట్‌టైం లెక్చరర్‌గా చేరి ఆ తర్వాత పూర్తికాలపు లెక్చరర్‌గా 13 ఎండ్లు పనిచేశారు. ఆ తర్వాతనే ఉస్మానియా యూనివర్శిటీ నిజాం కళాశాలలో ఆచార్యులుగా నియమితులై 1976లో పదవీ విరమణ చేశారు.
దుర్గయ్యగారి ఇల్లు కవులతో, పండితులతో నిండి సరస్వతీ నిలయంగా భాసించేది. ప్రతిరోజు ఏవో సాహిత్య గోష్ఠులు జరిగేవి. వాటిలో దాశరథి, రామరాజు, నారాయణ రెడ్డి, కాళోజి, వానమామలై మొదలైన ఉద్ధండ పండితులు పాల్గొనేవారు. ఇంకా ప్రముఖ కవి చిత్రకారులు డి. రామలింగంగారు, భాస్కరభట్ల కృష్ణారావుగారు సమావేశాలలో పాల్గొనేవారు.
మరొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వట్టికోట ఆళ్వారు స్వామి స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల దుర్గయ్యగారి ఇంట్లోనే నడిచేది. సమావేశాలకు, గ్రంథాలయానికి వచ్చే ప్రముఖులతో డా।। దుర్గయ్యగారి ఇల్లు ఎప్పుడు చూసినా సందడిగా ఉండేది.
దుర్గయ్యగారు పిహెచ్.డి. పరిశోధనకి తీసుకున్న అంశం ‘ప్రబంధవాఙ్మయ వికాసము- రాయల యుగము’’ అనేది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజినం గారు పర్యవేక్షకులు. వారు రచించిన పిహెచ్.డి. సిద్ధాంతగ్రంథానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని తెలియజేసే సంఘటనను వివరించక తప్పదు.
‘‘సమగ్రాంధ్ర సాహిత్యం ‘రూపకల్పనలో తలమునకలైన ఆరుద్రగారు ఒక రోజు పల్లా దుర్గయ్యగారింటిలో ప్రత్యక్షమయ్యారు. వారికి తోడుగా దాశరథిగారు, గుమ్మడి వెంకటేశ్వరరావుగారున్నారు.
పల్లాదుర్గయ్య గారింట్లో ఎవరు వెళ్లినా రుచికరమైన భోజనం, ఫలహారాలు లభించేవి. ఆరుద్రగారు కూడా ఫలహారం స్వీకరించి ‘‘మీ సిద్ధాంత గ్రంథం చూసి ఒక పావుగంటలో ఇస్తాను’’ అని థీసిస్ తీసుకొని దుర్గయ్యగారి స్టడీరూంలోకి వెళ్లారట. ఉదయం 8 గం।।ల నుంచి మధ్యాహ్నం, 12 గంటల దాకా ఆరుద్ర రూం నుంచి బయటకు రాలేదట. బహుశా ఆరుద్రగారికి దుర్గుయ్య గారి పరిశోధన గ్రంథం ఎంతో నచ్చిందని వేరుగా చెప్పవలసిన పనిలేదు.
దుర్గయ్యగారి మీద కళాశాలలో ప్రభావం చూసిన ఆచార్యులు రాయప్రోలువారు, ఖండవల్లివారు. వీరితో పాటు నవ్యాంధ్ర సాహిత్య వీధులు కూరుగంటి సీతారామయ్యగారు కూడా ప్రభావం చూపారు. రాయప్రోలువారు పద్యపాఠం చెప్పేటప్పుడు కుర్చీలో కూర్చొనేవారు కాదు. నిలబడి పద్యాన్ని గొంతెత్తి చదివేవారు. వారి ప్రభావం దుర్గయ్య గారి మీద కూడా పడింది.
ఆ రోజుల్లో ఉర్దూలో బి.ఏ. చదివే ఏర్పాటుండేది. దుర్గయ్యగారు బి.ఏ. దాకా ఉర్దూ మీడియంలోనే చదివారు. తెలుగు ఐచ్ఛికాంశం మాత్రమే. తెలుగు భాషది విచిత్రమైన దుస్థితి. ఇంటర్లోను, ఎంఏ.లోను ఒక్కరంటే ఒక్కరే తెలుగు విద్యార్థి. వారే దుర్గయ్యగారు. ఇక బి.ఏ.లో మాత్రం వారికి ఒక తోడు దొరికింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారే ఆ తోడు.
తెలుగు చదివి ఏం చేస్తారని హేళన చేసేవాళ్లు ఆ రోజుల్లో ఉన్నారు. ఉర్దూకు గౌరవం. ఐనా, తెలుగులో చదివి, తెలుగు గౌరవాన్ని ఇనుమడింప జేసిన దుర్గయ్యగారు ‘దుర్గమే’ అని చెప్పవచ్చు.
తెలుగును ఐచ్ఛికంగా చదివి, తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు చాదర్‌ఘాట్ కాలేజీలో నెలకు వారికి లభించే జీతం అనండి, భృతి అనండి కేవలం 66 రూపాయలే. ఐనా శాశ్వతోద్యోగాన్ని విడిచి కళాశాల ఉద్యోగానికి రావడం వారదృష్టంగానే భావించినారు.
దుర్గయ్య గారికి ఆంధ్ర సాహిత్య చరిత్రను బోధించడమంటే ఎంతో ఇష్టం. దానితో పాటు విమర్శ అన్నా పద్య కవిత్వం – వచన కవిత్వమన్నా, ఛందస్సు, అలంకార శాస్త్రం అన్నా వారికెంతో ఇష్టమైన బోధనాంశాలు. పరిశోధనలో ఉద్దండులైన దుర్గయ్యగారి దగ్గర చేరిన పరిశోధకులలో మాదిరాజు రంగారావుగారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారున్నారు. దుర్గయ్యగారిలో ఒక గొప్ప పరిశోధకులే కాదు, గొప్ప సృజనాత్మక కవి కూడా.
వారి ‘‘ప్రబంధ వాఙ్మయవికాసం-రాయల యుగం’’ అనే పరిశోధన గ్రంథం అటు పండితులకు ఇటు పరిశోధకులతో పాటు, సాహిత్య విద్యార్థులకు నేటికీ ఒక ఆధార గ్రంథంగా భాసిస్తుంది. కుమార సంభవం, శృంగార నైషధం, శృంగార శాకుంతలం వంటి ప్రబంధ పూర్వయుగకావ్యాలలో ప్రబంధ లక్షణాలున్నవి. ఐనప్పటికీ అవి అనువాదాలు కనుక ప్రబంధాలుగా లెక్కింపబడలేదని దుర్గయ్యగారు తెలియజేశారు.
రసవంతములైన, స్వోపజ్ఞములైన స్వతంత్రకావ్యాలే తెలుగులో ప్రబంధాలని, ఐతే, కిరాతార్జునీయం ఆధారంగా మనుచరిత్ర, మాఘకావ్య ఆధారంగా పారిజాతాపహరణం రచింపబడినాయని వివరించారు.
దుర్గయ్యగారు సృజన్మాతక కవి, వారి లేఖిని నుండి ‘పాలవెల్లి’, ‘గంగిరెద్దు’ అనే రెండు సృజన్మాతక రచనలు వెలువడ్డాయి. పాలెవల్లి పద్యగేయ సమ్మిశ్రితమైన కవితా సంపుటి. విద్యార్థి దశ మొదలుకొని జీవితంలోని అనేక సందర్భాలను పద్యాలలో, గేయాలలో వర్ణించిన తీరు పాలవెల్లిలో వెల్లి విరిసింది.దుర్గయ్యగారి అసల్పకల్పనాశక్తి, వర్ణనాపటిమ, దేశీయులు, స్వభాషలోని అందచందాలు అనేవి ‘గంగిరెద్దు’ అనే ఖండకావ్యంలో కనిపిస్తాయి.
సంప్రదాయబద్ధమైన ఛందస్సులో రచింపబడినప్పటికీ, కథావస్తువు సవ్యమైంది. ఎవరూ అంతవరకు స్మృశించనిది. మొత్తం కావ్యం కరుణరస ప్లావితమై పాఠకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని ‘సంక్రాంతి’ పద్యాలు తెలుగువారి నాలుకల మీద నాట్యం చేశాయి. తెలంగాణ పల్లెపట్టులను గూర్చి ఇంత సహజసుందరంగా చిత్రించే ఖండకావ్యం మరొకటి లేదనిపిస్తుంది. ఈ కావ్యరచన వల్లనే దుర్గయ్య గారికి ‘పల్లెకవి’ అనే పేరు స్థారకమైంది.
దుర్గయ్యగారి రచనలలో ‘‘చతుర వచోనిధి’’ ఉత్తమ విమర్శన గ్రంథం. మనుచరిత్రలో పెద్దన చూపిన చతురవచోనిధిత్వం. ఎన్నో వ్యాసాలలో ఇందులో నిరూపితమైంది. ‘‘మను చరిత్ర’’ సమగ్రంగా దర్శనమిస్తుంది ఇందులో.
దుర్గయ్యగారి సృజనాత్మక రచనలలో ఒకటి ‘పారిజాతా పహరణం’ అనే గేయ కృతి. ఇది వారి శతజయంతి సందర్భంగా ప్రచురితమైంది…
‘‘ఏ వేళల ఏ సుందరి
ఏ విలాసములు గోరిన
ఆ వేళల ఆ సుందరి
నా విలాసముల దేల్చును’’ అని శ్రీకృష్ణుని లీలలను చక్కగా గానం చేశారు దుర్గయ్య గారీ కావ్యంలో.
అధ్యాపకులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ, అటు పరిశోధనలోనూ, ఇటు సృజనాత్మక రచనలోనూ తనదైన ముద్రవేసిన పల్లా దుర్గయ్యగారు తెలంగాణ రచయితలలో అగశ్రేణికి చెందినవారని చెప్పక తప్పదు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-ఆచార్య మసన చెన్నప్ప