ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం

తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

అల్లం నారాయణ సీనియర్‍ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ దినపత్రిక మాజీ సంపాదకులు, తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍. పత్రికా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. కరోనా విపత్తుపై ఏప్రిల్‍ మాసంలో దక్కన్‍ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.


ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉండబోతుంది?
కరోనా వైరస్‍ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ రకరకాల ఊహాగానాలు, అంచనాలు ఎక్కువుగా వస్తున్నాయి. కానీ బేసిక్‍ ఐడియా అయితే మాత్రం వుంది. కరోనా వైరస్‍ అనేది ఇంతకు ముందు వచ్చినటువంటి సార్స్ కుటుంబం నుంచి వచ్చిన వైరస్‍. ఈ వైరస్‍ అన్నిటికంటే ప్రమాదకర పాండమిక్‍గా తయారయ్యింది. ఒకర్నించి ఒకరికి సంక్రమించే పాండమిక్‍ వైరస్‍ అని అన్ని దేశాలకు తెలుసు. ఈ వైరస్‍ మీద ఉండే మిక్స్ ఎక్కువై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. చైనాలో ప్రారంభమయిన ఈ వైరస్‍ ముఖ్యంగా అమెరికాకు అతిపెద్ద సమస్యగా తయారైంది. ప్రపంచం వూహించిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవల్సి వస్తుంది. మరణాల విషయాలు చూసినప్పుడు, మొత్తం ప్రపంచ జనాభాలో మరణాల శాతం చాలా తక్కువ. సార్స్ నుండి మొదలు హెచ్‍ఐవి లాంటి చాలా వైరస్‍లు వచ్చినప్పుటికి, ఆధునిక కాలంలో వచ్చిన వైరస్‍ల అన్నిటి కంటే కరోన ప్రభావం చాలా తక్కువ. అయితే దీని స్వభావం వల్ల చాలా గందరగోళం ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థలని మాంధ్యంలోకి నెట్టేంతటి స్థాయిలో ప్రభావితం చేసింది.
ప్రజలు, ప్రభుత్వాలు ఏ మేరకు ఈ కరోనా పరిస్థితిని తట్టుకొని ముందుకు వెళ్తున్నాయి?
ప్రభుత్వాలు, ప్రజలు అంటే ప్రపంచ దేశాలలో తరతమ బేధాభిప్రాలు ఉన్నాయి. ఈ వైరస్‍ బారిన పడ్డ దేశాలల్లో వెనకబడ్డ దేశాలు చాలా వున్నాయి. వీటిలో చాలా దేశాలు వైరస్‍ను తట్టుకొని నిలబడ్డం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ప్రత్యామ్నాయం లేదు. వైద్యంలో, వైద్య సిబ్బంది అందుబాటులో ఆధునికంగా లేము. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో సగం మేరకు కూడా సరైన వసతుల్లో లేము. మనము పాటించిన ఏకైక అస్త్రం లాక్‍డౌన్‍. ఇవాళ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ లాక్‍డౌన్‍ అనేది భారత్‍లో ఇప్పటివరకు దాదాపుగా నెలపైన అయినప్పటికి కూడా వచ్చిన కేసులు చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. భారత్‍ లాక్‍డౌన్‍ అనే ఏకైక ఆయుధంతో మన ఆర్థికవ్యవస్థ దెబ్బతింటునప్పటికీ, అనేక నష్టాలు వాటిల్లుతున్నప్పటికీ, ప్రపంచంలో భిన్నమైన దేశం, ఎక్కువ జనాభా వున్న దేశం అయినప్పటికీ కూడా ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి లాక్‍డౌన్‍ వల్ల వైరస్‍ను అరికట్ట గలుగుతున్నాం. ప్రపంచం మొత్తం చూసినప్పుడు అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలు వున్న అమెరికా కుప్పకూలిపోయింది. ఈ వ్యవస్థలతో పాటుగా మనం బాగా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ వ్యవస్థల స్వభావం వల్ల పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆధునిక వసతులు ఏర్పడి కూడా, వాటి స్వభావం వల్ల హాస్పిటల్‍ల ప్రైవేటీకరణ జరిగింది. ఈ ప్రైవేటీకరణ వల్ల అనేక సమస్యలు. చాలా మందికి కేవలం బీమా సౌకర్యం మీద ఆధారపడ్డ వైద్యం. అసలు గవర్న మెంట్‍ అనేది వైద్యానికి చొరవ చూపక పోవడం అనేది అనేక కారణాల వల్ల ఆ పెట్టుబడి దేశాలే ఇవాళ కుప్పకూలి పోయిన పరిస్థితి. కానీ ఏ సౌకర్యాలు లేనప్పటికీ కూడా కేవలం భౌతికమైన దూరాన్నీ పాటిం చడం అలాగే మిగతా వ్యవస్థలనీ ప్రజల సహకారంతో మేనేజ్‍ చేస్తున్నారు. ఈ వైరస్‍ను అరికట్టాలంటే ప్రజల సహకారం ముఖ్యం, సామాజిక దూరం పాటించడం అనేది రుజువైన సత్యం.


ప్రభుత్వాలు వైద్యరంగంలోనూ, శాస్త్రవిజ్ఞాన రంగంలోనూ ఏవిధమైన ప్రణాళికలు రూపొందించాలి?
నిజానికి ఈ అనుభవం చాలా గొప్పది. వైరస్‍ వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఇదివరకు ఎప్పుడూ లేవు. ఈ అనుభవం గొప్పది. ఎందుకు గొప్పదంటే ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇవాళ ఆధునికంగా వచ్చిన కమ్యూనికేషన్‍ రెవెల్యేషన్‍ తర్వాత వచ్చిన గాడ్జెస్ట్ గానీ, ఫోన్‍ గానీ, ఇంట్లో కూర్చుంటే అన్ని పనులు చేసే సౌకర్యాలు గానీ మనల్ని రక్షించలేవని ప్రపంచానికి వెల్లడయింది. మనకు ఎంత ఆధునికత వచ్చినప్పటికీ కూడా అంతిమంగా రక్షించేది వైద్యులు, వైద్యసిబ్బంది, వైద్య సౌకర్యాలు, ఆస్పత్రులు. కనుక ప్రపంచం ఈ నేపథ్యంలో గొప్ప అనుభవంతో పెట్టుబడిదారీ దేశాలు స్వామ్యవాద దేశాలు వెనుకబడ్డ దేశాలు, ప్రజాస్వామ్యదేశాలు కూడా చేయాల్సిన పని ఏమిటంటే బడ్జెట్‍లల్లో ఇప్పుడు రక్షణ కొనుగోళ్లకీ, యుద్ధాలకీ ఎట్లాంటి ఫుజూల్‍ (వృధా) ఖర్చు పెడుతున్నారో దాన్ని తగ్గించుకుని మానవాళిని కాపాడుకోవడానికి ఇట్లాంటి వైరస్‍లు ఎప్పుడెప్పుడు వచ్చినా రక్షించు కోవడానికీ ఆస్పత్రులనీ, వైద్య సౌకర్యాలనీ పెంచుకోవడానికీ విపరీతంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే మానవాళిని రక్షిస్తదని ఇట్లాంటి వాటినుండి ఇప్పుడు ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు.
అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ కరోనా వ్యాప్తిని ఎందుకు అరికట్టలేకపోతున్నాయి?
చాలా విచిత్రమైన అనుభవాలున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలు ఒకరకంగా అనాగరిక దేశాలని చెప్తా ఉంటాయి. ఆధునిక దేశాలన్నీ కూడా జీవిత భద్రత ఎక్కువ, జీవిత భద్రతతో పాటు ఆర్థిక భద్రత ఎక్కువ, ఒక భరోసా గల దేశాలు ఇవి. యూరోప్‍లో ఉన్న దేశాలు కానీ, బ్రిటన్‍, స్పెయిన్‍, అమెరికా, ఇటలీ లాంటి దేశాలను చూసినప్పుడు వైద్య సౌకర్యాలు గానీ, ఇతరేత్ర గానీ ఫర్‍ క్యాపిటల్‍ ఒక మనిషికి ఖర్చు పెట్టేదిగానీ, ఆదాయం గానీ చాలా ఎక్కువ ఉన్న దేశాలు. చాలా ఆశ్చర్యకరంగా ఇవన్నీ కూడా పెట్టుబడి దారీ దేశాలే. ఇవి కూలి పోయినాయి. ప్రతిదేశంలో అటు యూరప్‍లో చూసినా, ఇటు అమెరికాలో చూసినా అత్యంత ఆధునిక సౌకర్యా లున్నాయి. కానీ పెట్టుబడి దారీ స్వభావం వల్ల అవి లాభాల కోసం ఏమైన చేస్తయి. అట్లాగే ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణలో చూసుకుంటే ప్రత్యేకంగా ప్రైవేట్‍ హాస్పిటల్‍ల ఊసేలేదు. ఎందుకంటే ప్రైవేట్‍ హాస్పిటల్స్ అనేవి భిన్నమైనవి. మనం ఇట్లాంటి వైరస్‍ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి పాండమిక్‍ వచ్చినప్పుడు ప్రైవేట్‍ హాస్పిటల్స్ని నమ్మలేం. అందుకే ప్రభుత్వానికి ఇవాళ గాంధీ హాస్పిటల్‍ ఒక్కటే మార్గంగా ఉన్నది. కాబట్టి ఎక్కడైనా కూడా విద్య, వైద్యం లాంటి మౌళిక వసతులన్నీ ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. కనుక పెట్టుబడిదారి దేశాలను మోడ్రన్‍ దేశాలు, ఆధునిక దేశాలు చాలా గొప్ప దేశాలమని చెప్పుకుంటున్నాం. కారణం ఏమిటంటే పెట్టుబడిదారీ విధానం వలన లాభాలను ఆశించే సంస్థలు ఉన్నందు వల్ల. ఇవాళ చాలా పెద్ద క్రైసిస్‍ ఎదుర్కొంటున్నవి. అట్లాగే సరిపడ బీమా మీద ఆధారపడ్డా ఎక్కడైనా కూడా సరిపడే హాస్పిటల్స్ ఉంటే తప్ప మీ డిమాండ్‍కు తగిన సప్లై ఉంటుంది. ఇట్లా ప్రజా ఉపయోగాల కోసం, ప్రజా అవసరాల కోసం ఉండదు. అట్లాగే చైనాలాంటి దేశాలలో వైద్యమనేది ప్రజల పరం చేయడానికి ప్రయత్నం చేసినారు. మన దగ్గర కేరళలో కూడా ఉన్నది. వీరందరికి కూడా మంచి ఫలితాలు వచ్చినవి. కేరళ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు డెవలప్‍ చేసినారు. చైనాలో పది రోజులలో పదివేల పడకల హాస్పిటల్‍ని కట్టినారు. ఇలాంటి అనుభవాలు చూసినప్పుడు అన్ని దేశాలు ఆధునిక మైనప్పటికీ ఆధునిక పరికరాలు, ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఎదుర్కోడానికి ఎందుకు విఫలమవుతు న్నాయంటే, అక్కడి పెట్టుబడిదారి స్వభావం. ప్రభుత్వాలు ఆలస్యంగా మేల్కోవడం. అక్కడి జీవన విధానం. ఉదాహరణకి స్పెయిన్‍, ఇటలీలలో ప్రజలు బయటనే ఉంటరు, బయటనే తింటరు. అలాగే అమెరికాలో శుక్రవారం దాకా పనిచేస్తారు. శుక్రవారం తరువాత ఒక్క మనిషి కనపడడు. ఇలాంటి అవుటింగ్‍ కల్చర్‍ ఒకటి ఉన్నది. ఇటువంటి దేశాలలో పాండమిక్‍గా మారి చాలా విపరీతంగా విరుసుకుపడింది. దాన్ని కంట్రోల్‍ చేయడానికి వాళ్లు చాలా తంటాలు పడుతున్నారు. ప్రజాస్వామ్య దేశాలలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అరకొరగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వైద్య వ్యవస్థలు ఇంకా కొంచెం బ్రతికి ఉండండం. ఇవాళ మనం కొంచెం మెరుగుగా ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు.


ఆర్థికరంగం ఎలా ఉండబోతుంది? మీ సూచనలు సలహాలు?
భవిష్యత్తులో అతి పెద్ద మార్పు ఆర్థికరంగం మీద పడుతున్నది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికరంగంలో పెరిగిన అసమానతలు ఇవాళ మన కండ్లకు కొట్టొచ్చినట్టుగా కనబడు తున్నాయి. భారతదేశంలో రెండు భారత్‍లు ఉన్నాయి… ఇండియా, భారత్‍. వలస కూలీలు ప్రాణాలకు తెగించి 1800 కిలోమీటర్లు పోయినవారు ఉన్నారు. ఇంకొక వైపు లోకల్‍గా ఉన్నవాళ్లు నియమాలు పాటించకుండా రోడ్లమీద తిరిగేవాళ్లు ఉన్నారు. ఇలా భిన్నమైన పరిస్థితులు ఉన్న దేశం కనుక ఆర్థికంగా విపరీతంగా నష్టపోయే అవకాశం ఉన్నది. 1930లో వచ్చిన ఉపద్రవం, తరువాత అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంధ్యం లాంటివి వచ్చే అవకాశం ఉన్నదని నిపుణుల అంచనాలు చెపుతున్నాయి. ఎందుకంటే లాక్‍డౌన్‍ పీరియడ్‍లలో అన్ని దేశాలలో దాదాపుగా 60 నుంచి 70 రోజులు, 50 నుంచి 70 రోజులు ఇలా లాక్‍డౌన్‍ ప్రకటించిన దేశాల్లో ఉత్పత్తి స్తంభించి పోయింది. ఈ ఉత్పత్తి అనేది గ్లోబలైజేషన్‍ నేపథ్యంలో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సంబంధాలు ఉన్న ఉత్పత్తి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి రంగం అనేది పూర్తిగా క్షీణించి పోయింది. ఆర్థికరంగం, సేవల రంగం పనిచేయడం లేదు. వీటి వల్ల వచ్చిన పరిణామాలు రెండు నెలలకే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆర్థికమాంద్యం దాపురించే అవకాశం కలుగుతుంది. అలాగే మనుషుల్లో వస్తున్న మార్పు. ఇవాళ్ల కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ కొనడం ఏమిటి అనే విచక్షణ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇంతకు ముందు బ్రాండెడ్‍ షర్ట్ కొంటే ఇప్పుడు మామూలు షర్ట్ కొనుక్కునే అవకాశం ఉంది. ఏవైతే లగ్జరీస్‍ అనుకున్నారో జీవితంలో వాటన్నిటి నుంచి రాజీపడే అవకాశం ఉంది. ఇవే కాకుండా కుదేలైన ఆర్థికరంగం, వస్తు ఉత్పత్తి రంగం, ఆటోమొబైల్‍ రంగం వీటన్నిటి వల్ల డిమాండ్‍, సప్లైలో తీవ్ర వ్యత్యాసం వుండే అవకాశం వుంది. అలాగే దాదాపుగా 16 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఉపాధి కోల్పోయే వాళ్ళందరికీ కూడా కొనే శక్తి నశించినందువల్ల చాలా తీవ్రమైన ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని పట్టి పీడించే అవకాశం ఉంది. భవిష్యత్తు ఇప్పుడు అంచనా వేసే దానికంటే భయంకరంగా ఉండబోతున్నది అని చెబుతున్నారు. ఇండియాలో డీ-మ్యానిటేజేషన్‍ అనేది అనవసర పక్రియ. ఆ తరువాత అనుసరించిన విధానాల వల్ల చాలా వరకు ఇండియాలో ఇప్పటికే ఆర్థికమాంధ్యం సూచనలు ఉండినాయి. దానిమీద ఒక పిడుగులాగా మళ్లీ ఈ కరోనా వైరస్‍ అనేది రెండు నెళ్ల పాటు దాదాపు దేశాన్ని మూసి వుంచినందువల్ల భారతదేశం విపరీతమైన ఆర్థిక మాంధ్యంలోకి పోయే ప్రమాదంలో కనబడుతున్నది. ఇప్పటికీ రోడ్ల మీద తమ స్వస్థలాలికి వెళ్లాలని తహతహలాడుతున్న వలస కూలీల జీవితాలను రోజూ చూస్తున్నాం. మన జీడీపీ 203 లక్షల కోట్లు. ప్రభుత్వానికి సంబంధించిన జీడీపీ 203 లక్షల కోట్లు అయితే, ఒక పది పదిహేను కార్పొరేట్‍ కుటుంబాల దగ్గర 446 లక్షల కోట్లు సంపద ఉన్నది. ఈ అసమానతల వల్ల కూడా వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. భారతదేశపు జీడీపీ కంటే దాదాపు రెట్టింపు జీడీపీ ధనం ఇవాళ కార్పొరేటర్ల దగ్గర ఉన్నది. ఉదాహరణకు ఒక వైపు కరోనా మనందరి జీవన్మరణ సమస్య అనుకుంటుంటే ఫేస్‍బుక్‍లో అంబాని గ్రూప్‍ 43వేల కోట్ల అతిపెద్ద ఎఫ్‍డీఐ ఒప్పందం చేసుకున్నది. అంటే పెట్టుబడి దారులుగా ఆ కంపెనీలు గానీ, కార్పొరేట్‍ కంపెనీలుగానీ లాభాలు ఆశిస్తే తప్ప మానవాళిని పట్టించుకోవు. ఎన్ని లోపాలు ఉన్నా మానవాళిని మళ్లీ ప్రభుత్వాలు మాత్రమే పట్టించుకోవాలి. కార్పొరేటర్లకు దోచిపెట్టే ప్రభుత్వాలు ఉన్నవి కనుక  కార్పొరేట్ల సౌకర్యాల కోసం 446 లక్షల కోట్ల సంపద పది పదిహేను మంది చేతుల్లో ఉన్న సౌకర్యాల కోసం ఖర్చు పెడితే ఈ అంతరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశం, పాకిస్తాన్‍ లాంటి దేశాలన్నీ కూడా దుర్భర దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. ఐ.రా.స. లెక్కల ప్రకారం గానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కిస్తున్న ప్రకారం గానీ దాదాపుగా మూడు కోట్ల నుండి ఆరు కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో ఆకలితో భవిష్యత్తులో చనిపోయే అవకాశం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఒక చిన్న వైరస్‍తోటే మన జీవితం ముడిపడి ఉంటది. మంచి వైరస్‍లు కూడా ఉంటవి. చెడ్డ వైరస్‍లలో ఒక చిన్న వైరస్‍ ఇవాళ ప్రపంచాన్ని అతలాకుతులం చేసిన చరిత్రను మనం చూస్తున్నాం. భవిష్యత్తు భయాన కంగా ఉండే అవకాశం ఉంది. కనుక చాలా మార్పులు వస్తాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రజల జీవన విధానాల్లో, సామాజిక జీవన విధానాల్లో కావచ్చు. ఈ మార్పులున్నీ ప్రతిబింబించే అవకాశం ఉంది.


వైద్య, ఆర్థికరంగాలలో బలమైన కొన్ని దేశాలు కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. చిన్న చిన్న దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతున్నాయి. ఎందువల్ల?
చిన్న దేశాలలో వాళ్ల మెథడాలజి చాలా బాగుంది. ఉదాహరణకి సౌత్‍ కొరియా, వియత్నం. ఈ రెండు మంచి ఉదాహరణలు. వియత్నం, దక్షిణ కొరియా అంత వెసులుబాటు ఉన్న దేశాలేమి కావు. వాళ్ల మీద విపరీతమైన ఒత్తిళ్లు, ఆంక్షాలు ఉన్నప్పటికీ ఆ రెండూ దేశాలు ఈ వైరస్‍ను సమర్థవంతంగా ఎదుర్కోగల్గినాయి. ఆధునిక వ్యవస్థలు కలిగిన పెట్టుబడిదారి సమాజంలో ఉన్నప్పటికీ జర్మనీ కొంత సమర్థంగా ఎదుర్కోగల్గింది. జర్మనీలో అనుసరించిన వైద్య విధానం. ముఖ్యంగా ఈ వైద్యవిధానం కమ్యూనిటీలో గ్రూప్‍ పరీక్షలు నిర్వహించారు. ఒకసారి ఒక శాంఫిల్స్లో 64 టెస్టులు చేసి రెండున్నర కోట్ల మంది జనాభాకి టెస్టులు చేయగలిగినారు. ఎక్కువ టెస్టులు చేసిన ప్రతి దేశంలో మంచి ఫలితాలు వచ్చినాయి. భారతదేశంలో విషాదకరం ఎక్కడంటే జర్మనీలో పది లక్షల మందిలో దాదాపు లక్షా ముప్పై ఐదువేల టెస్టులు చేస్తే భారతదేశంలో పది లక్షల మందిలో 350 టెస్టులు మాత్రమే చేశారు. ఇక్కడ కరోనా వ్యాప్తి అరికట్టడానికి, ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండడానికి ప్రధానమైనది ఏమిటంటే రోగిని గుర్తించడం. ఇలా టెస్టులు జరగని దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా మనం లాక్‍డౌన్‍ అనే ఒక ఆయుధంతో నెట్టుకు రాగలు గుతున్నాం. చిన్న దేశాలుగా చెప్పుకున్న దక్షిణ కొరియా, జర్మనీ, యూరప్‍తో చూసు కున్నప్పుడు బ్రిటన్‍, స్పెయిన్‍, ఇటలీలు నిలబడలేక పోయాయి. జర్మనీ 5 వేలకే కట్టడి చేసుకోగల్గింది. ఈ టెస్టుల వల్ల, కొన్ని వైద్య విధానాలు, సామాజిక విధానాలు, లాక్‍డౌన్‍ త్వరగా ప్రకటించడం, అలాగే ప్రజలను అప్రమత్తం చేయడం వ్యాప్తిని నియంత్రించవచ్చు. సింగపూర్‍ లాంటి దేశాలల్లో ప్రజలు ప్రభుత్వా విధానాలు, చట్టాలను పాటిస్తారు. రోడ్డుమీద ఉమ్మివేసినా జరిమానా వేస్తారు. చాలా ముఖ్యమైన ఒక క్రమశిక్షణ కనబడుతుంది. ట్రాఫిక్‍ సిగ్నల్స్ వద్ద గ్రీన్‍ లైట్స్, రెడ్‍ లైట్స్ దగ్గర ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తారు. అక్కడి ప్రజలు పొరపాటున కూడా రెడ్‍లైట్‍ ఉన్నప్పుడు వాహనాలు పోనియ్యరు. ఇటువంటి చైతన్యం, పౌరస్పృహ కల్గిన దేశం సింగపూర్‍ కాబట్టి వైరస్‍ను కట్టడి చేసింది. మొదట కొంత వెసులుబాటు ఇచ్చినా మళ్లీ లాక్‍డౌన్‍ ప్రవేశ పెట్టారు. ఇటువంటి దేశాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు వైద్య విధానంలో కొత్త పద్దతులు అనుసరించడం, వైద్య విధానంతో పాటు సామాజిక దూరాలు పాటించడం. వ్యవస్థల యొక్క గొప్పతనం, ప్రజల సివిల్‍ సివిక్‍ సెన్స్ వల్ల చాలా వరకు తగ్గింది. ఉదాహరణకు హైదారాబాద్‍ను సింగపూర్‍తో పోలిస్తే హైదరాబాద్‍లో లాక్‍డౌన్‍ ప్రకటించినప్పటి నుంచి రోడ్లు ఎప్పుడూ ఖాళీ లేవు. ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న సిల్లీ కారణాలతో బయట తిరిగేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంటే ఈ సివిక్స్ సెన్స్ అనేది ఇంతకు ముందే లేదు మనకి. హైదరాబాద్‍లో ట్రాఫిక్‍ చూసినా, ఇలాంటి సమస్యలు చూసినా మనకు అర్థమవుతది. సివిక్‍సెన్స్ ఉన్న ప్రజలు, వైద్య విధానాలు, సామాజిక విధానాలు ఈ మూడు ఉన్న దేశాలు సింగపూర్‍, వియత్నం, దక్షిణ కొరియా, జర్మనీ, యూరప్‍. ఇవి వైఫల్యం కాలేదు. ఆధునిక దేశం, సాంకేతికంగా అద్భుతమైన దేశమైనప్పటికీ అమెరికా ఇవాళ విఫలమై ఎలా విలవిల లాడుతున్నదో మనం గమనిస్తున్నాం.
ముందుగా లాక్‍డౌన్‍ నిర్ణయం తీసుకుకోవడం, దాన్ని అమలు చేయించడం, ఎక్కువ పరీక్షలు జరపడం. ఈ ఎక్కువ పరీక్షలు ద్వారా వచ్చిన కాంటాక్ట్ మళ్లీ ఇంకొకరికి సోకకుండా చూడడమనేది ఈ వైరస్‍లో ముఖ్యమైనది. ఇంకొక వైపు అంకితభావం ఉన్న వైద్యులు. అమెరికాలో మన ఇండియన్‍ డాక్టర్‍కు వాహనాలతో బారులు తీరి గౌరవం చేసినారు. ఇవాళ వైద్యులే చాలా ముఖ్యం. మన దగ్గర వైద్యుల మీద దాడులు జరుగుతున్నవి. వైద్యులకు అక్కడ వాళ్లు గౌరవం ఇస్తుంటే మనం ఇక్కడ వాళ్లమీద దాడి చేస్తున్నాం. ఈ వైద్యుల మీద దాడి చేసిన వారికి ప్రభుత్వం ఏడేళ్ల శిక్ష అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇది సివిక్స్ సెన్స్. వైద్యులు ప్రాణదాతలు అనేది గుర్తించడం. ఈ సమయాల్లో వైరస్‍ను కట్టడి చేయడానికి వైద్యులు తప్ప మరో మార్గం లేదు అని గుర్తించడం. ‘వైద్యో నారాయణో హరి’ అని ఊరికే చెప్పితే సరిపోదు. వైద్యులను, వైద్య సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవించడం. పోలీసులు కూడా చాలా ఉపయోగపడుతున్నారు. పోలీసులను గౌరవించడం నేర్చుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍గారు కూడా ఈ విషయాలను పదే పదే చెబుతున్నారు. ఆయనకు కూడా నిజానికి కృతజ్ఞులమై ఉండాలి. ఆయన సరైన సమయాలలో మొత్తం ప్రాపంచిక వ్యవహారాలన్ని చూసి, లాక్‍డౌన్‍ తీసేస్తే ఏమవుతుందో పరిశీలించి లాక్‍డౌన్‍ పెంచడం. ఈ కారణంగా తెలంగాణలో తబ్లీగ్‍ని మినహాయిస్తే వచ్చిన కేసులు దాదాపుగా కొన్ని వందలకంటే మించే అవకాశం తక్కువ. లాక్‍డౌన్‍ నిర్ణయం ముందుగా తీసుకోవడం, దాన్ని పొడిగించడం. తరువాత వైద్య సిబ్బందిని ఉపయోగించు కోవడము, హాస్పిటల్‍ సౌకర్యాలు పెంచుకోవడం వీటన్నటి వల్ల తెలంగాణ కూడా ఒక మెరుగైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు.


ప్రపంచ దేశాల సంబంధాలు ఎలా ఉండ బోతున్నాయి?
నిజానికి ఇదంతా ఊహగానాలే గానీ ఇప్పుడే మనకు బయట పడుతున్నాయి. వైరస్‍ ఎక్కడనుంచీ వచ్చింది? ఎలా వచ్చింది? అనే దాని మీద విపరీతమైన ఊహగానాలు. మీడియా కూడా ఇవాళ చాలా ఆశ్చర్యకర మైన పాత్రలో ఉంటున్నది. చివరికి మీడియా వల్ల ఏమైదంటే నోమ్‍ట్రాన్స్కిల్లర్‍ చెప్పినట్లుగా ఒక సమ్మతి తయారవుతుంది. కన్‍సెట్‍ని మేడ్‍ చేస్తది మీడియా. అంటే అందరి జన ఆమోదాల్ని పొందడానికి ఒప్పిస్తది. మీడియా ఎలా తయారవుతుందంటే చైనాలో వైరస్‍ ప్రకృతి పరంగా వచ్చిందా? గబ్బిలాలనుండి వచ్చిందా? ఎక్కడ్నుంచీ వచ్చింది? మీట్‍ షాప్‍ నుండి వచ్చిందా? మీట్‍ మార్కెట్‍ నుండి వచ్చిందా అని పట్టించు కోకుండా చైనా కావాలనే వదిలి పెట్టిందని మొదలైంది చర్చ. ఇవాళ అమెరికా ఎక్కడదాకో పోయింది. ఇరాక్‍లో ఆయుధాలు ఉన్నాయని దాని మీద దాడి చేసింది అమెరికా. కానీ అక్కడ ఆయుధాలు లేవు. ఈ విషయం అన్ని దేశాలకు తెలుసు. ఇరాన్‍ మీద దాడి చేసినప్పుడు కూడా ఇలానే. అలా చాలా గ్లోబెల్‍ ప్రచారాలు చేస్తుంటది అమెరికా. గ్లోబెల్‍ యూరప్‍లో మొదలైనప్పటికీ, అమెరికా అంతకంటే అధ్వానమైన గ్లోబెల్స్ ప్రచారాలు చేస్తుంటది. ఇలాంటివి అందుకొని చివరికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంఫ్‍ తన దేశానికి కారణమైనటువంటి వాటిని చైనా మీదికి నెడుతుంటాడు. ఇప్పుడు ఐ.రా.స., డబ్ల్యూహెచ్‍వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‍)కు నిధులు బంద్‍ చేసింది ఆమెరికా. వరల్డ్ ఆర్గనైజేషన్‍ చెబుతున్నది ఏమిటంటే. అది బయట నుంచి రాలేదు, నేచురల్‍గానే వచ్చిందని చెపుతున్నారు. అలా చెప్పినందుకు చైనా తొత్తు డబ్ల్యూహెచ్‍వో అంటుంది అమెరికా. ఇలాంటి వ్యవహారాలు ఒకదేశానికి ఇంకో దేశానికి మధ్య వుండే సంబంధాలని దెబ్బకొట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు ఇప్పటికే అమెరికా చైనా మధ్య మొదలయ్యాయి. హువాయ్‍ ఎలక్ట్రానిక్‍ సంస్థ, ఒక సాప్ట్వేర్‍ సంస్థ లేదా ఫోన్ల తయారు చేసే సంస్థ, 5జీ తయారు చేసే సంస్థ అనుకోవచ్చు. ఇట్లాంటి దానివల్ల వచ్చిన వాణిజ్య యుద్ధాలు భవిష్యత్తులో విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు భవిష్యత్తులో గ్లోబలైజేషన్‍ మీద, అలాగే అన్ని దేశాలు కూడా హెల్త్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వారి వారి బడ్జెట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రక్షణ కొనుగోళ్లు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటది. ఎందుకంటే బడ్జెట్‍లన్నీ వీటికి పోవల్సి వస్తుంది. కానీ ఈ రక్షణ కొనుగోళ్లు పోతే మళ్లీ ఇక్కడ యుద్ధాల కలహాలను సృష్టించే అమెరికా లాంటి దేశాలు దెబ్బ తింటాయి. ఆయుధాలు అమ్ముకొని బతికే దేశాలు ఇవన్నీ. అమెరికా, ఫ్రాన్స్, యూరఫ్‍ దేశాలన్నీ కూడా. ఇవన్నీ మనకు ఆయుధాలు అమ్మే దేశాలు. కాబట్టి ఈ వ్యాపా రాలు పోకుండా ఉండడానికి కూడా యుద్ధాలు సృష్టించే అవకాశం ఉంది. ఇలా గ్లోబలై జేషన్‍ నేపథ్యంలో ఉండే నెట్‍వర్క్లన్నీ దెబ్బతినే అవకాశం ఉంది.


ఇవాళ గ్లోబలైజేషన్‍ అనేది మళ్లీ కుగ్రామం వైపుకు, కమ్యూనికేషన్‍ రెవెల్యూషన్‍లో, ఇంటికి సామానులు తెచ్చుకునే మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. మళ్లీ మన కిరాణ దుకాణం మనకు గొప్పగా కనబడు తున్నది. కిరాణా దుకాణంలో అన్నీ కొనుక్కుంటున్నాం. ఇంటి ముందుకు వచ్చే కూరగాయల బండి గొప్పదనిపిస్తుంది. మాల్స్ కల్చర్‍ పోతుంది. ఇవన్నీ కూడా ఎగుమతి చేసినవారు ఎవరు? గ్లోబలైజేషన్‍లో చాలా అభివృద్ధి, లేదా సాంకేతి కంగా అభివృద్ధి చెందిన దేశాలు. చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు. ఈ ఎగుమతులన్నీ రద్దయినప్పుడు మళ్లీ దేశీయ విధానం పుంజు కున్నప్పుడు, వ్యవసాయం లాంటివి పుంజుకున్నప్పుడు భవిష్యత్తులో మరిన్ని ప్రచ్ఛన్న యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఐరాసను ధిక్కరిస్తున్నారు. హూవాన్‍ను ధిక్కరిస్తున్నారు. వీటన్నింటి వల్ల తీవ్రమైన మార్పులు అంతర్జాతీయంగా జరిగే అవకాశం ఉందని భావించాలి.


వలస కార్మికుల దుస్థితికి కారణాలేమిటి? ప్రభుత్వాలు వాటిని ఎలా పరిష్కరించాలి?   
వలస కార్మికుల సమస్య భారతదేశంలో అతి గొప్ప సమస్య. భారతదేశం ఒక మహొన్నతమైన దేశం అని చెప్పుకుంటుండే ఎవరైనా కూడా మొదట ఆలోచించాల్సింది మన భారతదేశంలో ఉన్న రోడ్ల మీద, రోడ్డు పక్కన, ఫ్యాక్టరీల పక్కన, కన్‍స్ట్రక్షన్‍ వర్కర్స్గా నిర్మాణాల పక్కన అరకొర వసతులతో జీవిస్తున్న మూడు కోట్ల మంది వలస కూలీలను మొదలు పట్టించుకోవాల్సి ఉంది. మన దగ్గర అనుకోకుండా లాక్‍డౌన్‍ ప్రకటించారు. ఒక నిర్ణయం ప్రకటించే ముందు అంతకు ముందు చేయాల్సిన ఏర్పాట్లు ఏమీ చేయకుండా, వలస కూలీలను ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలిండం లాంటివి కానీ, మూడు నాలుగు రోజులు సమయం ఇచ్చి వుంటే గానీ, ఎక్కడివి అక్కడ సర్దుకుని ఉండేది. కానీ అన్నిటిని లాక్‍డౌన్‍ చేయడం వల్ల వలస కూలీలు అందరి కంటే ఎక్కువ ఇబ్బందిపడ్డారు. ఈ వలస కూలీలు ఈవాళ భారతదేశంలో రోడ్ల మీద వందలాది కాదు, వేలాది కాదు, లక్షలాది కదలిపోవడాన్ని, వందల కిలోమీటర్లు, వేలుపైన కిలోమీటర్లు నడవడం గురించి, గర్బిణీలు చనిపోవడం గురించి వార్తలు వస్తున్నాయి. ఈ వలస కూలీలు నిజానికి ఇంత దుర్భరవ్యవస్థలో ఉండవల్సిన అవసరం లేదు. అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించి 36వేల కోట్ల రూపాయలు మూలుగు తున్నాయి. వాటిని ఏమీ పట్టించుకోలేదు. భారతదేశంలో అతి గొప్ప ప్రణాళికలు వేస్తున్నా రెండుమూడు వేల కోట్లు అని చెబుతున్నారు. కానీ వలస కార్మికుల గురించి ఒక్క పైసా కేటాయించిన అవకాశలు లేకుండా పోయినాయి. రేషన్‍ కార్డులు లేని వాళ్లు కానీ, గుర్తింపు లేని వాళ్లు వుంటే వాళ్లకు కనీస సాయం కూడా అందడం లేదు. రూ.500 వందలు జనధన్‍ ఖాతాలో వేస్తే భారతదేశం బాగుపడుతుంది అనుకోవడం భ్రమే. వలస కార్మికులకు ఈ పరిస్థితి ఉంటే వాళ్లు కోల్పోయిన ఉపాధికి సంబంధించి భవిష్యత్తు ఒక భయంకరంగా ఉంటున్నది. రోజువారి పనిచేసి బతికేవాళ్లకు, అతి ముఖ్యమైనది వనరులు పోతే రేపొద్దున ఏమిటి భవిష్యత్తు అనేది తెలియదు. కనుక ముందు ముందు అతిపెద్ద సమస్య వలస కార్మికులు. ఈ 3కోట్ల మంది వల్ల అసలు సమస్య వచ్చే అవకాశం ఉందని భావించాల్సి ఉంటుంది.


పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
వైరస్‍ల పుట్టుకలు కొత్తవి ఏమీ కావు. ప్లేగు వ్యాధి నుంచి హెచ్‍ఐవి, సార్స్ వరకు వీటన్నిటి వల్ల అనుభవంలో ఉన్న వాళ్లమే. కానీ సాంకేతికంగా గెలుచుకుంటూ వచ్చినం. కరోన వైరస్‍ ఒక చిత్రమైనది. ఈ వైరస్‍ చాలా చిత్రంగా ప్రవర్తించడం వల్ల మనకు చాలా సమస్యలు కనబడుతున్నాయి. ప్రకృతిలో ఈ వైరస్‍ల పుట్టుక సహజం. కానీ ఏ జీవరాశిని, ఆ జీవరాశిగా బతకనివ్వటం చాలా ముఖ్యం. సమస్య ఎక్కడ వస్తున్నది అంటే ప్రకృతిని ధ్వంసం చేయడం. మనుసులు మాత్రమే ప్రకృతిని ఆక్రమించు కోవడం. దురాక్రమణ చేయడం. మొత్తం ప్రకృతి వనరులను కొల్లగొట్టడం. ప్రకృతిలో ఉన్న జీవసమతుల్యను దెబ్బతీయడమనేది ఇవాళ అతిపెద్ద చేరువుగా, అతిపెద్ద భయంకరమైన వ్యాధిగా నిర్ధారణమైంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ లాక్‍డౌన్‍ కాలంలోనే ప్రతి నగరం కూడా ఢిల్లీనగరం ఫొటోలు కూడా వచ్చినవి మీడియాలో. నిర్మలాశంగా కనబడుతుంది. ఢిల్లీలో జీవించడం సాధ్యం కాదని వెహికల్స్ను కంట్రోల్‍ చేసినారు. ఒకరోజు ఒక వెహికల్‍ ఇంకోరోజు ఇంకో వెహికల్‍ అని. ఇలాంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. ప్రకృతి విధ్వంసం వల్ల ఒక వైపు వర్షాకాలపు, వానల, నీటి వనరుల కొరత ఎదుర్కొంటూ, రెండో వైపు ఈ విధ్వంసానికి మనమే మూల కారణం అవుతున్నాం. జీవ రాశుల్లో మనం ఒక భాగం. ఈ భూమి మొత్తం మనదే కాదు. ఈ భూమి అనేక జీవరాశులకు నిలయం. వాటిని బతకనియ్యాలి, మనం బతకాలి అనే ఒక సమతుల్యతను మనం కోల్పోడం వల్ల వచ్చిన పరిణామాలు చాలా వున్నాయి. భవిష్యత్తుల్లో దీని మీద కూడా విపరీతంగా ఆలోచించాల్సి వస్తుంది. దాంతో పాటు కృత్రిమ మార్కెట్‍ మనకు అలవాటు అయిపోయింది. ఉదాహరణకు మనిషిలో సహజంగానే రోగనిరోధక శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఆదిలాబాద్‍లో ఇసుక చెలిమిలోంచి నీళ్లు తెచ్చుకునేవాళ్లు, బావులలో నీరు త్రాగేవాళ్లు ఇప్పటికీ బతుకుతూనే ఉన్నారు. కానీ మనం ఏమి చేసినాం ఇరవై రూపాయల నీళ్ల బాటిల్‍ తాగితేనే ఇమ్యూనిటీ. మీరు హొటల్‍లో చేతులు పెట్టిన నీళ్లు తాగితే చచ్చిపోతారు. హొటల్‍ నీళ్లు తాగలేరు. బయటికి పోతే నిజంగానే చచ్చి పోతారనే సెన్స్ ఉంది. నిజమే వాటర్‍ బౌండ్‍ డిసీజ్‍ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక రోగనిరోధక శక్తి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి కరోనా అందరికీ సోకుతలేదు. ఒక ఫ్యామిలీలో కొందరికి సోకుతలేదు. కారణం ఏమిటంటే రోగనిరోధక శక్తి. దీన్ని పెంచడానికి ప్రయత్నం జరగాలి. ఇది నేచురల్‍గా ఉండాలి. రెండో వైపు ఈ మార్కెట్‍ను మనం నమ్మితే ఇప్పుడు నీళ్లు తాగిస్తున్నది. అన్నీ తాగిస్తున్నది. కోకో కోలా మార్కెట్టే తాగిస్తున్నది, కోకో కోలా అనేది అత్యంత ప్రమాదకరమైన పురుగుల మందు. అది మనతోటి తాగిస్తది. మంచినీళ్లు మనతోటి తాగిస్తది. ఇరవై రూపాయలు పెట్ట మంటది. గ్లాసు నీళ్లు. మన ఇంట్లో మనం తాగే నీళ్లు. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో చేతులు కడుక్కోవడం క్యాంపెన్‍లో ఒక ముఖ్యమైన విషయంగా చెప్పుతాం. మనము చేతులతో ఒక చెత్త బుట్టను పట్టుకుంటేనే చేతులను విపరీతంగా కడుక్కోవాలి. ఎందుకంటే విపరీతమైన బ్యాక్టీరియా వుంటది దానిలో. కానీ పారిశుద్ధ్య కార్మికుల సంగతి ఏమిటి? వాళ్లు బతుకతలేదా. ఇవన్నీ ఇమ్యూనిటీకీ సంబంధించినవి. ఇవాళ మనదేశంలో ఈ వైరస్‍ ఎక్కువ వ్యాప్తి కాకపోవడానికి మనం తీసుకున్న టీకాలు కూడా ఒక కారణంగా వున్నాయి. ఈ స్వభావాన్ని మరిచిపోయి మనం అనేక రకాలుగా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాం. మరో వైపు మనల్ని మనం మార్కెట్‍కు మలచుకుంటున్నం. కాబట్టి ఇవాళ నేచురల్‍గా ప్రకృతి సిద్ధంగా ఉండే విషయాలన్నిటిని మరిచిపోయినం. కాబట్టి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ వైరస్‍ పుణ్యాన ఇప్పటికైనా సహజ జీవనం, సహజ జీవితం, సామాజిక బంధం, సామాజిక జీవితం, కుటుంబ జీవితం మొత్తం ప్రపంచ దేశాలన్నిటితో సంబంధం పునశ్చరణ చేసుకొని ఒక కొత్త మానవుడు ఆవిష్కృతుడు అవుతాడు.


వైరస్‍కు ప్రకృతి వైపరిత్యాలే కారణమా?
వైరస్‍ పుట్టుకకు ప్రకృతి వైపరిత్యాలే కారణమని ఎప్పుడూ అనలేము. ఎందుకంటే ఇవాళ ఇది కొత్త వైరస్‍ కాదు. నిజానికి చాలా ఆశ్చర్యంగా కొన్ని పరిణామాలు ఉంటాయి. అమెరికన్‍ సైన్యం ఆఫ్రికాని ఆక్రమించుకొని కొన్ని కొన్ని దేశాలలో తిష్ట వేసి ఉన్నప్పుడు. వాళ్లు చాలా ప్రకృతి విరుద్ధమైన పనులు చేశారు. జంతువులతో సంపర్కాలు చేశారు. దరిద్రులు గొరిల్లాలతో కూడా సంపర్కాలు చేసినారు. వీటన్నిటి వల్ల హెచ్‍ఐవి సోకింది. ఇది ప్రకృతికి విరుద్ధమైనది. కానీ వైరస్‍లు చాలా వరకు వైరస్‍ పుట్టుకంతా కూడా ప్రకృతిలో భాగమే అది. కాని కొన్ని వైరస్‍లను పుట్టించడమనేది ఉన్నది బయలాజికల్‍ వార్‍లో. ఈరోజు చైనా వారి తిండి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ్టిది కాదు చైనా తింటున్న ఆ తిండి. మనకు ఇష్టం లేకపోవచ్చు. మనం కప్పల్ని, పాముల్ని తిన్నామంటే అసాధ్యమనే అనుకోవచ్చు. కుక్కల్ని తిన్నామంటే ఇంకా అసాధ్యం అనవచ్చు. మన దేశంలో కూడా ఉన్నారు నాగాలాండ్‍లో కుక్కల్ని తింటారు. అవన్నీ వేరే విషయాలు. ఆహారపు అలవాట్లు. కానీ వైరస్‍ పుట్టుక అనేది మీట్‍ మార్కెట్‍లో పుడితే వాళ్ల తప్పు కొంత ఉన్నట్టే. ఎందుకంటే రకరకాల జంతువులు తిన్నట్టు. ఇట్లాంటివి కొన్ని వున్నవి కానీ, ప్రకృతి విరుద్ధంగా వైరస్‍లు ఉండవు నిజానికి. కానీ ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడు పైలాయిస్తుంటది. అంటే ప్రకృతి దానికి ఒక రక్షణ. ప్రకృతి ఉన్నది ఉన్నట్టుగా ఉంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తి సజీవంగా ఉంటది. కాబట్టి అది పని చేస్తుంటది. మనకు ఇది ప్రకృతి సిద్ధమైనది కానప్పటికీ కూడా ప్రకృతిని రక్షించుకుంటే ఇట్లాంటి వైరస్‍ల నుంచి మనల్ని మనం కాపాడుకునే స్వయంశక్తి వచ్చే అవకాశం వుంటుంది.


‘లాక్‍ డౌన్‍’ పీరియడ్‍లో కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?

ముప్పై రోజులు ఇండ్లల్లోనే ఉన్నారు. ప్రపంచమేమీ మునిగి పోలే. ఆకాశం కింద పడలే. ఓజోన్‍ పొర చినిగి పోలేదు. అంతా మామూలుగానే ఉంది. కాకపోతే కొందరికి మందు అలవాటు ఉన్న వారికి మందు దొరకలేదు. వాళ్లు కొంత సఫర్‍ అవుతున్నరు. మళ్లీ బయటికి పోయి తాగుతారు కావచ్చు. ఇవాళ కాకపోతే రేపు తాగుతారు. వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లో సౌకర్యాలు లేని వాళ్లు ఉండవచ్చు. అట్లాగే రిలేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని రావొచ్చు. కానీ ఇళ్లంత సుఖం, ఇళ్లంత హాయి, ఒంటరితనం అంత సుఖం ప్రపంచంలో ఏదీ లేనేలేదు. ఎందుకంటే నిన్ను నీవు తెలుసుకోవడానికి. నిన్ను నీవు చూసుకోవడానికి. నీలోకి నీవు తొంగి చూసుకోవడానికి. ఏమి చేసినము, ఏమి చేస్తున్నం, ఏం చేయబోతున్నాం ఇవన్నీ అంతర్మధనం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాక్‍డౌన్‍ పిరియడ్‍ అనేది నిజానికి ఎన్నో ఏండ్ల తరువాత వచ్చిన ఒక సదావకాశంగా తీసుకోవాలి.
మన దేశంలో ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉన్నది?
ఫెడరల్‍ వ్యవస్థ అనేది మన దేశంలో పేరుకే ఉన్న వ్యవస్థ అని మరొకసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వం ఎంత కంజ్యూష్‍ అంటే చివరికి మనకు వచ్చే డబ్బులకు కూడా కోత బెట్టింది. 219 కోట్లు మనకు కోతబడ్డది. అంటే రాష్ట్రాలకు న్యాయంగా రావల్సిన వాటాను కోతప్టెడాన్ని ఫెడరల్‍ సిస్టం అనే పేరుమీద చెలామణీ అవుతున్నది. నీతి ఆయోగ్‍ద్వారా తమకిష్టమైన రాష్ట్రాలకు విపరీతమైన నిధులు ఇవ్వడం, తమకు నచ్చని రాష్ట్రాలని విపరీతంగా నష్టపరచడం. చాలా రాష్ట్రాలను కనీసం పట్టించుకోక పోవడం. పశ్చిమ బెంగాల్‍ అంటే పడదు, తెలంగాణ అంటే పడదు. తనుకు అనుకూలంగా ఉంటేనేమో అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇలా రూపానికే ఫెడరల్‍ స్టేట్‍ గానీ ఆక్చువల్‍గా ఆచరణలో ఇది కేంద్రక ప్రభుత్వంగానే ఉన్నది. యునైటెడ్‍ గవర్న మెంట్‍గానే ఉన్నది. ఫెడరల్‍ ప్రభుత్వం అంటే ఇప్పటికే రాష్ట్రాలు కనీసం మూడు సార్లు సంఘీభావం తెలిపాయి. ప్రధాని మోది మూడు సార్లు పిలుపు ఇచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టమన్నరు కొట్టినం. ఒకసారి దీపాలు వెలిగించమన్నారు వెలిగించిండ్రు. కొందరు ఇంకేదో చెయమన్నరు చేసిండ్రు. ఇప్పటి వరకు రాష్ట్రాలకి కనీసం ఒక పైసా ఇచ్చి ఆదుకోని ఏకైక ప్రభుత్వం ఇండియన్‍ గవర్నమెంట్‍. ఇవన్నీ లొసుగులు. ఫెడరల్‍ గవ్నమెంట్‍ లక్షణాలు ఏమీ లేవు దీనికి. నిజానికి రాష్ట్రాలను అణచివేస్తున్నది కేంద్రం ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్య యుతంగా మనం రాజ్యాంగంలో నిర్మించుకున్న అంబేద్కర్‍ చెప్పిన ఫెడరల్‍ సిస్టమ్స్ని, ఫెడరల్‍ లక్షణాలని పుణికి పుచ్చుకొని అన్ని రాష్ట్రాలని కరోనా వైరస్‍ నేపథ్యంలో వస్తున్న నష్టాలని ఆదుకోవాలి. హెలికాప్టర్‍ మనీ అంటే తెల్వదు. హ్యువీ నిధులు అంటే తెల్వదు. గోదాంలలో మొత్తం కూలీలను ఏడాదిపాటు పోషించగల్గిన దానికంటే ఎక్కువ ధాన్యం మూలుగుతుంది. వాటి నిల్వలన్నీ బద్దలుకొట్టి వాళ్లకి సపోర్ట్ చేయండి. వాళ్లని బతకనీయండి. ఆకలి చావులకు గురికాకుండా చూడండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యాంకులకు 50వేల కోట్లు, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు 50వేల కోట్లు ఇట్లాంటి ప్రకటనలు చేసినవి గానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క పైసా ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా కూడా తగ్గించి కేంద్ర ప్రభుత్వం నిరంకుషంగా ఉన్నది. రాజ్యాంగంలో అంబేద్కర్‍ పేర్కొన్న టూ ఫెడరల్‍ సిస్టమ్‍ని అమలుపర్చి రాష్ట్రాలని కరోనా నేపథ్యంలో ఆదుకోవాలి. 

(సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)
– కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *