పైఠాన్ తవ్వకాల్లో (Exlavations at paithan – 1996-97 by ASI, SSAS) దొరికిన ముద్రమీద ‘బ్రాహ్మీలిపి’లో ‘రాజామచ మహాసేనదవుస’ అని వుంది (Godbole, 2002-03 P.11, 111)
కోటిలింగాల, కొండాపూర్‍లలో శాతవాహనుల నాణేలతో పాటు శాతవాహన పూర్వరాజుల నాణేలు, మహారథి, మహాసేన, మహా తలవరుల నాణేలు కూడా దొరికాయి. మహాసేనులు శాతవాహనుల సమకాలికులని, వాళ్ళు శాతవాహనుల వివిధ హోదాలలో పనిచేశారని తెలుస్తున్నది.
అందువల్ల పైఠాన్‍లో దొరికిన రాజామాత్య మహాసేనదత్తుని ముద్రకు సంబంధం ఉందని చెప్పవచ్చు. కోటిలింగాలకు సమీపంలో ఉన్న ‘మొక్కట్రావుపేట’లో దశాబ్దాల కిందే గుర్తించబడ్డ బ్రాహ్మీశాసనం ఇటీవలనే వెలుగులోకి వచ్చింది. ఈ శాసన నివేదిక 2019-20లో ASI వారి శాసనశాఖ సంపుటంలోకి ఎక్కిందని తెలుస్తున్నది. ఇంత విలువైన శాసనం వెలువడడానికి ఇంత కాలం ఎందుకు పుట్టిందో ఎవరినడుగలేం.
మొక్కట్రావుపేట మూడు పంక్తుల ‘బ్రాహ్మీలిపి’ శాసనం. క్రీ.పూ. 1-2 శతాబ్దాలకు చెందిన లిపి అని చెప్పవచ్చు. శాతవాహన తొలిపాలకుల కాలానికి సరిపోతుంది.
ఈ శాసనం
‘‘అహిమకానభతి బాలి(ల)కాయ మహపురిస దతాయ
అమాచపుతస సివవటుసస ఉపాఠాయకినియ చ దేయ
చథ బాల(లి)కాయ హకుసిరియ ఈదేయ నాగసిరియగోపియ’’ అని ప్రాకృతభాషలో రాయబడివుంది.
ఈ శాసనంలోని తొలిపదం ‘అహిమక’ అంటే అస్మకనే చరిత్రలో తొలిసారి షోడశ జనపదాల్లో ఒకటైన ‘అశ్మక’ పేరు శాసనబద్ధమై ఇక్కడ అగుపిస్తున్నది. రెండవది ‘మహాపురి’ అనే పురంపేరు. ఆపురం నిస్సందేహంగా సెరివనిజ జాతకకథలో పేర్కొన్న ‘ఆంధ్రపురం నామనగరం’ ఇదేనని చెప్పడానికి ఈ శాసనమే సాక్ష్యం.
హకుసిరి శాసనంలో మూడవ పదం ‘దయా అమాచ’ – దత్తుడనే అమాత్యుడు పైఠాన్ మట్టి ముద్రమీదున్న రాజామాత్య మహాసేనదత్తుడు ఒక్కరే ననిపిస్తున్నది. కోటిలింగాల, పైఠాన్ నగరాల నడుమ పాలనా సంబంధాన్ని నిరూపించే ముద్రకు, శాసనానికి లంకెవుంది.
ఈ శాసనంలోని 4వ పదం హకుసిరి. మొదటి శాతకర్ణి, నాగానిక సంతానంలోని కుమారరాజు (యువరాజు) హకుసిరి. ఈ శాసనంలోని ఐదవమాట నాసిరియ గోపియ కోటిలింగాల బరైకుంట ప్రాంతంలో లభించిన అతి పెద్ద లేబుల్ శాసనం ‘నాగగోపనికాయ’కు పై మాటకు సంబంధముంది. రెండూ ఒకరిపేరే. శాతవాహన పాలనాకాలంలో వృత్తిశ్రేణులు-వాటికై ప్రధాన నగరాలకు ఉపగ్రహ గ్రామాలు (శాటిలైట్ విలేజెస్) వుండేవి. అట్లాంటిదే ఈ ‘నాగగోపనికాయ’ – ‘నాగసిరి గోపయ’ ‘నికాయం’ బౌద్ధ ధర్మ సంఘమో, వృత్తి కళాకారుల శ్రేణో అయివుంటుంది.
ఒక్కశాసనం పెక్కు రుజువులనందిస్తున్నది. హకు సిరి శాసనంలోని ‘అస్మక’, ‘అమాత్యదత్తుడు’, ‘మహాపురి’ నగరం, ‘కుమార(బాలర్) హకుసిరి’, నాగసిరిగోపయలు అన్నీ శాతవాహన రాజ్య సంబంధమైనవే. తెలంగాణాలో అస్మక ప్రాంతాన్ని పాలించింది శాతవాహనులని తెలిపే శాసనం. శాతవాహనుల కాలంలో ‘కుమార’ రాజ్యాలుండేవన్న సాక్ష్యమిది. కోటిలింగాల పొరుగున ‘శేణీ’ నగరమందనే నిదర్శనం. మహాసేనులు శాతవాహనులకు అమాత్యులుగా వుండేవారని బలంగా నిరూపిస్తున్న శాసనం మొక్కట్రావుపేట శాసనం.
ఆధారాలు :
1. హకుసిరి (మొక్కట్రావుపేట) శాసన బింబం
2. పైఠాన్ తవ్వకాల నివేదిక (Exlavations at paithan – 1996-97 by ASI, SSAS)
– శ్రీ రామోజు హరగోపాల్
ఎ : 9505646046