ఇక్ష్వాకు రుద్రపురుషదత్తుని
ఫణిగిరి ధర్మచక్ర పశస్తి శాసనం
శిలాయుగంలో కొండ చరియల కింద వేసిన బొమ్మలు, గీతలతోనే తెంగాణలో తొలిసారిగా రాత ప్రారంభమైంది. తెలంగాణాలో అక్షరాలను పోలిన రాతలను, యాదాద్రి – భువనగిరి జిల్లాలోని రాయగిరి వద్ద గల ఇనుప యుగపు సమాధుల్లో బయల్పడిన కుండలపై గల గీతలు నిరూపించాయి. వాటిలో కొన్ని మౌర్యుల అక్షరమాలలోని కొన్ని అక్షరాలకు సరిపోలటం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ గుర్తుల్ని సమాచార వ్యక్తీకరణకు వినియోగించారని తెలుస్తుంది. రాయగిరి ఇనుపయుగపు సమాధుల గోడలు, మట్టి కుండలపై మొత్తం 132 గుర్తులను అప్పటి నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ, సంచాలకులు గులాం యాజ్‍దాని గుర్తించి, వాటిపై విస్త•త అధ్యయనం చేసి, మనదేశపు తొలి లిపి అయిన బ్రాహ్మీ ఇక్కడే పురుడు పోసుకుందా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ లిపి పరిశోధకులు బూలర్, వీటిల్లో కొన్ని గుర్తులు, భట్టిప్రోలు ధాతుపేటిక శాసనాక్షరాల్ని పోలి ఉన్నాయన్న విషయాన్ని ప్రతి శాసన పరిశోధకుడూ గమనించాలి. ఇదే కాలానికి చెందిన ఇలాంటి గుర్తులే ఉన్న ఆధారాలు, తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా పోచంపాడు, మునుపటి మహబూబ్‍నగర్ జిల్లాలోని ఉప్పేరు, చిన్నమారూరు, ఉప్పలపాడు, కరీంనగర్ జిల్లాలోని కదంబాపూరు, నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం వద్ద వెలుగు చూశాయి.
క్రీ.పూ. 3వ శతాబ్దిలో, తెలంగాణా కూడా, మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలోనే ఉన్నా, అతని శాసనాలు, తెలంగాణాకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధప్రదేశ్‍లలో లభించాయిగానీ, తెలంగాణాలో దొరకలేదు. కానీ మౌర్యుల చివరి కాలంలో శాతవాహనుల కంటే బాగా ముందు కాలానికి చెందిన రాజులు, తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాల్లో విడుదల చేసిన నాణేలపై గల వారి పేర్లను బ్రాహ్మీలిపిలో ముద్రించారు. నరన, గోబధ, కంవాయ, సిరివాయ, సమగోపులనే శాతవాహనుల కంటే ముందరి రాజుల నాణేలపై గల లిపి, క్రీ.పూ. 3వ శతాబ్ది చివర, క్రీ.శ. 2వ శతాబ్ది ప్రారంభ కాలానికి చెందినవని తెలంగాణాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్, నాణేల పరిశోధకులు, డా. దెమె రాజిరెడ్డిగారు పేర్కొన్న విషయాన్ని అగ్రగణ్య శాసన పరిశోధకులు కీ.శే. పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు ధృవీకరించారు. అంతేకాదు, ఆయన, నాతో ఈ విషయాన్ని తెలుగు గోష్టి సభల్లో అనేకసార్లు చెప్పారు కూడా.
నరన నాణేలపైన ‘సిరినరనస’, గోబదుని నాణేలపైన ‘రణో గోబదస’, కంవాయ నాణేలపైన ‘కంవాయ సిరిస’, సమగోపుని నాణేలపై ‘రణో సమగోపస’ అనీ బ్రాహ్మీలిపిలో వారి పేర్లు ముద్రించారు. చిన్నవైనా, పెద్దవైనా శాసనాలు శాసనాలే. సెప్టెంబర్ 13, 2020న నేను వీటి ప్రాచీనత గురించి, ప్రముఖ శాసన లిపి పరిశోధకులు, కోటిలింగాల తవ్వకాల నివేదికను పొందుపరచిన డా. ఎన్.ఎస్. రామచంద్రమూర్తి గారితో జరిపిన సంభాషణలో, ఈ నాణేలపై గల లిపి, భట్టిప్రోలు అక్షరాల మాదిరిగానే ఉన్నాయని చెప్పటం ప్రాముఖ్యతను సంతరించు కుంది.
ఆ తరువాత కోటిలింగాల తవ్వకాల్లో రాతి పలకలపై చెక్కిన దాదాపు 30వరకూ చిన్న శాసనాలు బయల్పడినవి. అవి క్రీ.పూ. 2 క్రీ.శ. 1 శతాబ్దాలకు చెందినవని ఎన్.ఎస్. రామచంద్రమూర్తిగారి నివేదికలో ఉంది. తెలంగాణా జాగృతి చరిత్ర అధ్యయన బృందంలోని శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీ, సునీల్ సముద్రాల ఇటీవల కోటిలింగాల సమీపంలోని మునులగుట్ట వద్దగల సహజసిద్ధ బౌద్ధగుహల వద్ద కనుగొన్న, పునరీక్షించిన బ్రాహ్మీశాసనాలు, శాసన పరిశోధకుల్లో గుబులురేకెత్తించాయి. హడావిడి పరిశోధనలు అక్షరప్రాచీనతకు అడ్డంకులనీ, నిశిత పరిశీలన మాత్రమే నిక్కచ్చి ఆధారాలను చలామణి చేయటానికి దోహదపడతాయని అందరూ అంగీకరిస్తున్నారు. అలానే, మొక్కట్రావుపల్లిలో బయల్పడిన శాతవాహన యువరాజు హకుసిరి శాసనం విషయంలో కూడా, హరగోపాల్ గారు కొత్త ఆలోచనలను పంచుకొన్నారు. ఇప్పటి వరకూ వెలుగు చూచిన, కోటిలింగాల నాణేలు, కోటిలింగాల, ధూళికట్ట, మొక్కట్రావుపల్లి, మునులగుట్ట, ఫణిగిరిలలో బయల్పడిన తొలి శాతవాహన శాసనాలనూ మరోసారి చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, తెలంగాణా బౌద్ధ సంగీతి అంతర్జాతీయ సదస్సు, సంచాలకులు, ఎం.ఏ శ్రీనివాసన్, డి.భానుమూర్తి, శంకరరెడ్డిల బృందం, మెదక్ జిల్లా, మల్‍తుమ్మెదలో కనుగొన్న ‘మాధవచంధ’ అన్న చిన్న బ్రాహ్మీశాసనం కూడ, శాసన పరిశోధకుల్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ శాసనంలోని ‘మ’ మౌర్యలిపిలోని ‘మ’ అక్షరానికి దగ్గర పోలిక ఉందన్నారు. ఇప్పటి వరకూ ఈ శాసనం క్రీ.పూ. 2వ శతాబ్దానిదని చెప్పిన విషయాన్ని పునరాలోచించి, క్రీ.పూ.3వ శతాబ్ద చివరి కాలానికి చెందుతుందేమోనని పరిశీ లించాల్సిన అవసరముందని తెలంగాణా చరిత్ర, శాసన పరిశోధకుల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రాంతీయ భేదాలను పక్కనబెట్టి, నిజాల నిగ్గు దేల్చటానికి ఈ పునర్మూల్యాంకనం అవసరమని, శాసన నకళ్లతో, అందరం ఒక చోట కూర్చొని, చర్చించి ముక్త కంఠంతో ప్రకటించాలని కూడా అందరూ కోరుకొంటున్నారు. త్వరలోనే ఈ ఆశ, ఆచరణలోకి వస్తుందని ఆశిస్తున్నాను. అంతేకాదు, తెలంగాణా శాసనాల ప్రారంభదశపై ఒక ప్రామాణిక పుస్తకం రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ప్రస్తుత శాసన విషయానికొద్దాం. చివరి శాతవాహనరాజైన మూడో పులుమావి (క్రీ.శ.220-225) కాలంలో స్వతంత్రులైన ఇక్ష్వ్యాకులు, శ్రీ పర్వత – విజయపురి నుంచి క్రీ.శ. 225-325 మధ్య కాలంలో ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను పాలించారు. ఈ వంశానికి చెందిన నలుగురు రాజులు, మొదటి ఛాంతమూలుడు (క్రీ.శ.225-233), వీరపురుష దత్తుడు, (క్రీ.శ. 233-257), రెండో (ఎహువల) ఛాంత మూలుడు (క్రీ.శ.257-81), రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.281-325) వరకూ పాలించారు. ఇప్పటి వరకూ, ఇక్ష్వాకులు, వారి బంధువులు, ఉద్యోగులు విడుదల చేసిన శాసనాలు 75 వరకూ వెలుగు చూశాయి. వీటిలో ఎక్కువగా నాగార్జునకొండ దగ్గరే దొరికాయి. ఇవన్నీ ప్రాకృత భాషలోనూ, బ్రాహ్మీలిపిలోనూ ఉన్నాయి. పాతగండిగూడెం రాగిరేకు శాసనం, ఇంకా నాగార్జునకొండలోని ఒకటి రెండు శాసనాలు, సంస్కృతంలో ఉన్నాయి. తెలంగాణాలోని నల్లగొండ జిల్లా ఏలేశ్వరం, గాజులబండ, ఫణిగిరి, వర్ధమానుకోట, అరవపల్లి, నాగారం, తిరుమలగిరి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, అశ్వారావుపేట (కారుకొండ), మెదక్‍జిల్లా కంది వద్ద జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు, నాణేలు, పురా వస్తువులతో పాటు శాసనాలు కూడా బయల్పడినాయి
మునుపటి నల్లగొండ జిల్లా, ఫణిగిరి బౌద్ధారామం వద్ద జరిపిన తవ్వకాల్లో బయల్పడిన బౌద్ధశిలా ఫలకాలపైన, కొన్ని శాతవాహన, ఇక్ష్వాకుల శాసనాలు కొత్తగా వెలుగు చూశాయి. వీటిలో ఇక్ష్వాకు రాజైన రుద్రపురుషదత్తుని 18వ పాలనా సం।।లో వేయించిన శాసనం, మనదేశపు ప్రసిద్ధ శాసన పరిశోధకుల దృష్టి నాకర్షించింది. ఇంతకు ముందు ఇతని 11వ పాలనా సం।।న్ని ప్రస్తావించిన శాసనం ఆధారంగా, ఇంతవరకూ ఆయన పాలనా కాలాన్ని నిర్ణయించగా, ఫణిగిరి కొత్త శాసనం వల్ల ఆయన పాలనా కాలం 18వ సం।। వరకూ పెరిగింది. అంతేకాదు, ఈ శాసనంలో ఎక్కువభాగం సంస్క•తం, మిగిలిన భాగం ప్రాకృతంలో ఉండటం గమనించాల్సిన విషయం. బౌద్ధ ధర్మ చక్రాన్ని ప్రశంసించిన తీరు అద్వితీయం.
ఫణిగిరి ధర్మచక్ర ప్రశస్తి శాసనం
సిద్ధార్థుడు, బుద్ధుడైన తరువాత, సారనాథ్‍లో పంచవర్గీయ భిక్షువులకు చేసిన మొదటి ప్రవచనాన్ని బౌద్ధ సాహిత్యంలో ధర్మచక్ర ప్రవర్తన మంటారు. తాను కనుగొన్న దుఃఖం ఉంది, దాన్ని నిరోధించ వచ్చు, అందుకొక మార్గం ఉంది అని చతురార్య సత్యాలు, ఆర్య అష్టాంగ మార్గం, ఇంకా కార్యకారణ సంబంధం, మధ్యే మార్గాల సారంగా, బుద్ధుడు తాను అనుభవ పూర్వకంగా ఎరుకలోకి తెచ్చుకొన్నాడు. ఈ ధర్మాన్ని మానవాళి, ఇంకా అన్ని జీవరాశులు, దుఃఖం నుంచి విముక్తులుగావటానికి, అందరికీ తెలియజెప్పే క్రమంలో భాగంగా వారికి బోధించి, ఇతరులకు తెలియజెప్పమన్నాడు. ఒకరి నుంచి మరొకరికి గతిశీలనంగా, ధర్మం వ్యాప్తి చెందాలని, చెప్పిన మొదటి ప్రవచనాన్ని, ధర్మచక్ర ప్రవర్తన మన్నారు. అంతటి లోకోత్తర బుద్ధుని ఆలోచనను శిల్పులు, చక్రం ఆకారాన్నిచ్చి, శిల్పాల్లో శాశ్వతం గావించారు.
ఇక్ష్వాకు చివరి రాజైన రుద్రపురుషదత్తుని రాజ వైద్యుడు, బౌద్ధోపాసకుడూ అయిన ధేమసేనుదు, ఫణిగిరిలో ఎత్తించిన ధర్మచక్రం యొక్క గొప్పతనాన్ని ఈ శాసనం ప్రశంసిస్తుంది. అందుకే దీన్ని ధర్మచక్ర ప్రశస్తి శాసనమని నేను పేరు పెట్టాను.
శాసన పాఠం :
1. సిద్ధం । సంవత్సరం 18 హేమంత పక్షం 3 దివసం 3 ప్రఖ్యాత దీప్తయ
2. శశో రజ్ఞా శ్రీరుద్ర పురుషదత్తస్య అగ్రభిషజా క్రితోయం స
3. ముచ్ఛ్రయొ ధమ్మచక్రస్య । దర్పధ్వజో యొ మకరధ్వజస్యన పాటితో
4. గో వృషభ ధ్వజేన తంపాదితమ్, సక్యకులోధ్వజేన ఇమేన చక్రేనస
5. ధర్మజెన 2 మహాత్మన కంస నిసూదనేన నసూదితో యొ మధుసూదనెన
6. స సూదితో రాగ నిసూదనెన దోషాసురొ చక్రవరేనిమెన 3. మాయాశరీరా
7. రాణిసంభవెన తేనోత్తమధ్యానగుణీంధనేన జ్ఞానా క్లేశ మహవనమ్
8. దగ్ధాని చక్రెన ఇమెన తెన 4. తం ఎరిసం చక్కం మహసెనాపతి సరమేనం
9. దింణకస దెయ ధమ్మం అపణోనివాణ సం భరధతాయధాపితం భదంత ధే
10. మసెనెన అమ్నుణితం… జాణాతుగ్లదేవాసుర మంనుసో లోకోఇతి ।।
అర్థం : సిద్ధం ! తన పరిపాలనతో ఎంతో కీర్తిప్రతిష్ఠలను గడించిన శ్రీ రుద్రపురుషుడు (దత్తుడు) అనే రాజు యొక్క అగ్రభిషగజి (రాజవైద్యుడు), ఎత్తైన ధర్మచక్రాన్ని ఎత్తించాడు. ఆ ధర్మచక్రం ఎలాంటిదంటే, దర్పధ్వజుడు, మకరధ్వజు (మన్మథుడు) నకు గానీ, గో, వృషభ ధ్వజుడైన శివునికిగానీ, పడవేయటానికి వీలు కానిది, ఈ శాక్యకుల ధ్వజు (బుద్ధుని)ని ధర్మ చక్రము. అంతేకాదు, ధర్మరాజుగానీ, కంస నిసూదనుడు, మధుసూదనుడైన శ్రీకృష్ణుడు గానీ రాగద్వేషాలు, దోషాలనే అసురలను చంపలేకపోయారనీ, శాక్యకుల ధ్వజుడు, మహానుభావుడైన బుద్ధుడు, మాయా శరీరం నుంచి పుట్టుకొచ్చిన క్లేశాలనే మహావనాన్ని తన ధ్యానబలంగల జ్ఞానం చేత దహించివేశాడనీ, ఈ ధర్మచక్రాన్ని మహాసేనాపతి నందింణకుని సహకారంతో భదంత ధేమసేనుడు ప్రతిష్ఠాపించాడు. ఈ చక్రం మనుషలోకానికి మార్గదర్శి కాగలదు.
ధర్మచక్ర ప్రశస్తి శాసనం మన దేశం మొత్తంమీద ఏ బౌద్ధస్థావరం నుంచి ఇంతవరకూ వెలుగు చూడనందున తెలంగాణ లోని ఫణిగిరి ధర్మచక్ర ప్రశస్తి శాసనం చారిత్రకంగా ప్రాముఖ్యతను సంతరించుకొంది.
శాసనాన్ని పరిశీలిస్తే సిద్ధం అన్న ప్రారంభపదం తరువాత, రుద్రపురుషదత్తుని 18వ పాలనా సంవత్సరంలో, హేమంతంలో 3వ పక్షంలో, 3వ రోజున, చ్రదునిలా వెలుగొందుతున్న, రాజు శ్రీ రుద్రపురుషుని యొక్క వైద్యుల్లో అగ్రగణ్యుడు, ఎత్తైన ధర్మ చక్రాన్ని ఎత్తించాడని చెప్పబడింది. తేనోత్తం, ధమ్మ చక్రం, తంపదితమ్, ధమ్మం, ధాపితం, భదంత అనేవి ప్రాకృత పదాలు కాగా, మిగిలినవి సంస్కృత పదాలు. ఇంతకు ముందుగా పాతగండిగూడెంలో దొరికిన ఎహువల ఛాంతమూలుని రాగిరేకుశాసనం పూర్తిగా సంస్కృత శాసనమే. బహుశ అప్పటికే సంస్కృతం బాగా ఊపందుకొన్నందున, రుద్ర పురుషదత్తుడు కూడా అదే ఒరవడిలో సంస్కృత శాసనాన్ని వేయించి ఉంటాడు.
ఇతడు 5వ పాలనా సం।।లో విడుదల చేసిన గురజాల ప్రాకృత శాసనంలో తండుకసిరి అనే వ్యక్తి తన అయువృద్ధికి హలంపురస్వామికి కొంత భూమిని దానం చేసిన వివరాలున్నాయి (ఎపిగ్రాఫియా ఇండికా, వా. 26, పే.125). ఆ తరువాత, రుద్ర పురుషదత్తుని 11వ పాలనా సం।।లో ప్రాకృతంలో వేసిన శాసనం, నాగార్జునకొండ (సైట్ నం.13)లో దొరికి, ప్రస్తుతం అక్కడి మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. ఇందులో రుద్రపురుషదత్తుని పినతల్లి, మహారాజ ఛాంతమూలని భార్య, వీరపురుషదత్తుని కోడలు, మొదటి ఛాంతమూలుని మునిమనుమరాలు అయిన మహాదేవి వమ్మ భటాదేవి మరణించగా, అందుకు స్మృతి చిహ్నంగా, ఒక ఛాయా స్థంభాన్ని ఎత్తించినట్లుగా చెప్పబడింది. ప్రస్తుత ఫణిగిరి శాసనం, రుద్ర పురుషదత్తుని 18వ పాలనా సం।।న్ని సూచించటంతో, ఇక్ష్వ్యాకుల పాలన మరో 9 ఏళ్లు పెరిగింది. ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్యాంశాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనూ మార్చాల్సిన అవసరముంది.
ఈ శాసనం 354 సెం.మీ. ఎత్తున్న ఎనిమిది పలకల పల్నాటి సున్నపురాతి స్థంభం మీద చెక్కబడింది. ధర్మచక్ర స్థంభం అని శాసనంలో పేర్కొన్న స్థంభం ఉందిగానీ, ధర్మచక్రం లేదు. మొదటి 8 పంక్తులు సంస్కృతంలోనూ, చివరి రెండు పంక్తులూ ప్రాకృతంలోనూ ఉన్నాయి. ఈ శాసన ప్రత్యేకతలు:
1. 80 శాతం సంస్కృతభాషలో ఉండటం.
2. దేవుడులేడని నమ్మే బౌద్ధంలో, శివుడు, కృష్ణుడు, విష్ణువులను ప్రస్తావించటం.
3. అది కూడా, శివుడూ, విష్ణువూ చేయలేని పనిని, బుద్ధుడు చేశాడని చెప్పటం.
4. బుద్ధుడు తన ధ్యానజ్ఞానం ద్వారా మాయా శరీరంలోంచి పుట్టిన క్లేశాలనే మహావనాన్ని దగ్ధం చేశాడని పేర్కొనటం.
ఇంతటి ప్రశస్తమైన ఈ శాసన పాఠాన్ని తొలిసారిగా విజయ కుమార్ జాదవ్ అందివ్వగా, ఆ తరువాత మునిరత్నంరెడ్డి, రమేష్, స్కిల్లింగ్ & మాన్ హినూబర్, స్టెఫన్ బౌమ్స్, అర్లోగ్రఫిత్సు, ఇంగోస్ట్రాచ్ & విన్సెంట్ టోర్నియర్‍లు పరిష్కృత పాఠాల నందించారు. వీటిలో మునిరత్నంరెడ్డిగారి శాసన పాఠం ప్రామాణికంగా గుర్తింపు పొందింది. ఇంతటి ప్రాముఖ్యత గల శాసన స్థంభం, ఫణిగిరిలోని ఒక ప్రయివేటు ఇంట్లో అనేక శిల్పశకలాల మధ్య నక్కి ఉండే కంటే, హైదరాబాదులోని స్టేట్ మ్యూజియానికి తరలించి, ప్రదర్శనలో ఉంచి అందరికీ అందుబాటులోకి తేవాలని హెరిటేజ్ తెలంగాణా శాఖను వినమ్రంగా కోరుతున్నాను.
లిపి పరంగా ఈ శాసనంలో కొన్ని మార్పులను గమనించాలి. సంస్కృత భాషను వ్యక్తం చేయటానికి వీలుగా ఉప అచ్చులు ర, ప్ర అనే రూపాలు చేరాయి. అప్పటి వరకూ ఉండీ లేనట్టుగా ఉన్న తలకట్టు ప్రస్ఫుటమై, వేరే గీతగా పరిణమించింది. కొన్ని హల్లుల రూపాల్లో మార్పులొచ్చాయి. అంతకుముందు కుడి వైపు ఉబ్బుగా ఉండే ‘ద’ అక్షరానికి, ఎడమ వైపు ఉబ్బు వచ్చింది. అప్పటి వరకూ వంపుతో ఉన్న న, ట, భ, స అక్షరాలు గుండ్రంగానూ, ముడులతోనూ కొత్త రూపును సంతరించుకొన్నాయి. అంతేకాక, అక్షరాలు ముద్దుగా, అందంగా కిందికి పొడిగించబడినట్లు, అ, క, ర అన్న అక్షరాల విషయంలో చూడవచ్చు. ద్విత్వాక్షరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దుస్సంధి, దుస్సమాసాలు, శిల్పితప్పులను అధిగమిస్తే ఫణిగిరిలో కొత్తగా వెలుగు చూచిన రుద్రపురుషదత్తుని 18వ పాలనా సం।।న్ని తెలిపే సంస్కృత శాసనం, తెలంగాణా శాసన భాష, లిపి పరిణామాన్ని తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ఫణిగిరి త్రవ్వకాల్లో వివిధ కట్టడాలేకాక నలుపు – ఎరుపు, నలుపు – గచ్చకాయ, ఎర్ర రంగుల్లో మట్టికుండలు, కప్పుకు వాడిన మట్టి పెంకులు, సున్నపు గార, సున్నపు బొమ్మలు కూడా దొరికాయి. క్రీ.శ. 1 – క్రీ.శ. 4 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన తొలి, మలి, శాతవాహన శిల్పాలతోపాటు, ఇక్ష్వాకుల శైలిలో రాతిఫలకలు, స్తంభాలు, అడ్డపట్టీలు, బుద్ధపాదాలు వెలుగుచూశాయి. మాంధాత, లోసక, చంపేయ జాతక దృశ్యాలు నాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. నిలకడైన మధుర శిల్పంకంటే, గ్రీకు – రోమను సాంప్రదాయాల మేలు కలయికకు గురైన గాంధార శిల్పంకంటే, ఫణిగిరి, బౌద్ధశిల్పాల కథనాల శిల్పం కళ్ళముందు కదలాడుతూ నాటి ఘటనలనూ, సిద్ధార్థ గౌతముని పరమోన్నత ధార్మిక జీవనాన్ని విడమరచి చెబుతూ అమరావతి శిల్పకళ అత్యున్నత దశకు అద్దం పడుతున్నాయి.
తొలి శాతవాహన కాలంలో వెలసిన ఫణిగిరిలోని ఈ బౌద్ధారామం, మలి శాతవాహన కాలానికి మనోహరమైన బౌద్ధక్షేత్రంగా విలసిల్లింది, ఇక్ష్వాకుల కాలంలో, ఆచార్యులు, భిక్షువులు, ఉపాసక, ఉపాసికలతో, వచ్చీపోయే గహపతులతో కళకళలాడింది. ఇక్ష్వాకుల నుంచి అధికారాన్ని అందిపుచ్చుకున్న విష్ణుకుండినుల కాలంలో ఆదరణ సన్నగిల్లి, క్రమేపీ బౌద్ధారామం కాస్తా శివాలయంగా మారింది. ఒక బౌద్ధ శిలాఫలకాన్ని ఉన్నఫళంగా వెనక్కి తిప్పి, శివలింగ పానపట్టంగా మలచి, ఆయక స్తంభాన్ని శివలింగంగా మార్చిన అనవాళ్ళు ఆనాటి తెలంగాణా పాలకులు, ప్రజల మత విశ్వాస ధోరణుల్లో చోటు చేసుకొంటున్న మార్పును సూచిస్తున్నాయి. 2003 తవ్వకాల్లో ఈ శాసనాన్ని వెలికి తెచ్చిన పురావస్తుశాఖ అధికారి, విజయకుమార్ జాదవ్, శాసనంలోని సంస్కృత పదాలకు అర్థాన్నందించిన డా. ఎం. శ్రీ రంగాచార్యగార్లకు నా కృతజ్ఞతలు.
-ఈమని శివనాగిరెడ్డి,
ఎ : 9848598446