అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-2 విష్ణుకుండి గోవిందవర్మ తుమ్మలగూడెం రాగిరేకు శాసనం (క్రీ.శ.450)

తెరవెనుక
క్రీ.పూ. 3వ శతాబ్దిలో జంబూద్వీపమని పిలువబడిన యావద్భారతదేశం, మౌర్యచక్రవర్తి అశోకుని సర్వసత్తాక పాలనలో ఉంది. మౌర్యసామ్రాజ్యానంతరం జంబూద్వీపంలోని వివిధ భూభాగాలు, వివిధ స్థానిక, పరాయి రాజుల చేత పాలింపబడినాయి. కొంచెం ఆలస్యమైనా, అదే కాలంలో, తెలంగాణాలో, స్థానికులైన గోబద, కంవాయ, నరన, సమగోపులు తెలంగాణాలోని కోటిలింగాల నుంచి పాలించిన తొలి తెలుగు రాజులుగా గుర్తింపు పొందారు. అదే కోటిలింగాల నుంచి క్రీ.పూ. 1 శతాబ్దిలో, శాతవాహన రాజ్యస్థాపకుడైన ఛిముక శాతవాహనుడు, మళ్లీ స్వతంత్ర పాలకుడైనాడు. ఇలా తెలుగునేలపై, స్వతంత్ర పాలనకు పురుడు పోసిన తెలంగాణా, శ్రీపర్వత విజయపురి (నాగార్జునకొండ) నుంచి పాలించిన ఇక్ష్వాకుల అనంతరం యాభై ఏళ్ల తరువాత, విష్ణుకుండినులనే మరో రాజవంశానికి పుట్టిల్లైంది. వీరు ముందుగా, మునుపటి నల్లగొండ జిల్లా, రామన్నపేట తాలూకా, తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) నుంచి, తరువాత రంగారెడ్డి జిల్లా, కీసరగుట్ట నుంచి, క్రీ.శ. 375 నుంచి క్రీ.శ. 570 (కొందరు పరిశోధకుల ప్రకారం క్రీ.శ.612) వరకు, దక్షిణాన పెన్నానది, ఉత్తరాన రేవా (నర్మదా)నది, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన బనవాశీ వరకూ పాలించారు.


ఇప్పటి వరకూ విష్ణుకుండినుల శాసనాలు 12 దొరికాయి. తుమ్మలగూడెం-I రాగిరేకు శాసనం (మొదటి గోవిందవర్మ క్రీ.శ. 459, ఎపిగ్రాఫియా ఆంధ్రిక, (ఎఆ), వా.2, పే. 9-13), వేల్పూరు రాతి శాసనం (రెండో మాధవవర్మ, క్రీ.శ.499, ఎపిగ్రాఫియా ఇండికా (ఎఇ), వా. 36, పే.128-29), ఈపూరు-I రాగిరేకు శాసనం (రెండో మాధవవర్మ క్రీ.శ.499, ఎఇ-17, పే.334) ఖానాపూర్‍ రాగి రేకు శాసనం (రెండో మాధవవర్మ, క్రీ.శ.499-502), ఎఇ-27, పే.316-17), ఈపూరు-II రాగిరేకు శాసనం (మూడో మాధవవర్మ క్రీ.వ.510, ఎఇ-17, పే.338), రామతీర్థం రాగి రేకు శాసనం (ఇంద్రవర్మ, ఎఇ-17, పే.134), చిక్కుళ్ల రాగి రేకు శాసనం (రెండో విక్రమేంద్ర వర్మ, క్రీ.శ.564, ఎఇ. పే.196-97), తుండి రాగిరేకు శాసనం (రెండో విక్రమేంద్ర వర్మ క్రీ.శ.569, ఎఇ-36, పే.10-12), పాలమూరు రాగిరేకు శాసనం (నాలుగో మాధవవర్మ, క్రీ.శ.612, జేఏహెచ్‍ఆర్‍ఎస్‍-6, పే.19-21), గోవిందవర్మ చైతన్యపురి రాతి శాసనం (గోవిందవర్మ, జెఇఎస్‍ఐ, వా.10-పే.24), పాతగండి గూడెం రాగి రేకు శాసనం, (మాధవవర్మ, బుద్ధిస్ట్ ఇక్స్క్రిప్షస్స్ ఆఫ్‍ ఆంధ్రదేశ, ఆనంద బుద్ధవిహార, 1998, పే.208); ఇంకా వారి సామంత, సమకాలిక పాలుకుల శాసనాలైన, గోదావరి రాగిరేకు శాసనం-I (పృధ్వీమూలుడు, క్రీ.శ.535, జెబిబిఆర్‍ఏఎస్‍-16, పే. 116-17), గోదావరి రాగి రేకు శాసనం-II, (పృధ్వీ మూలుడు, ఏపీజిఏఎస్‍-నం.6, పే.241-42, చూడు. హరివర్మ, కట్టు చెరువు రాగి రేకు శాసనాలు), జిర్జింగి రాగిరేకు శాసనం (తూర్పు గాంగ ఇంద్రవర్మ, ఎఇ-25, పే.286), తాండివాడ రాగిరేకు శాసనం (పృధ్వీ మహారాజు, ఎఇ-35,పే.222) మరుటూర రాగిరేకు శాసనం (తూర్పు చాళుక్య మొదటి జయసింహుడు, క్రీ.శ.646, జెఏహెచ్‍ఆర్‍ఎస్‍-4, పే.74), విష్ణుకుండిన రాజుల వంశావళిని తెలియజేస్తున్నాయి. విష్ణుకుండినుల శాసనాలపై హెచ్‍.కృష్ణశాస్త్రి, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, బి.ఎన్‍.శాస్త్రి, వి.వి. మిరాశి, డీసీ సర్కార్‍, కెఏ నీలకంఠశాస్త్రి, ఎం. రామారావు, ఎస్‍.శంకర నారాయణన్‍, ఎన్‍. వెంకటరమణయ్య, బి.వి. కృష్ణారావు, కె.గోపాలాచారి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఆర్‍.ఎస్‍.పంచముఖి, ఆర్‍. సుబ్రహ్మణ్యం, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, అజయ్‍మిత్రశాస్త్రి, పి. సోమసుందరరావు, ఆదిత్యశర్మ, కె. రామమోహన రావు, ఎన్‍.ఎస్‍. రామచంద్ర మూర్తి, వి. సుందరరామశాస్త్రి, జె.కృష్ణ ప్రసాదబాబు, ఈమని శివనాగిరెడ్డి వ్యాసాలు, పుస్తకాలను రాశారు.

తెరముందు

విష్ణుకుండిన గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనాన్ని ప్రముఖ శాసన, చరిత్ర పరిశోధకులు, బి.ఎన్‍. శాస్త్రి గారు కమ్మగూడెంకు చెందిన పి. రాజారావు, ఆంజనేయులు, రమా మనోహరరావుగార్ల ద్వారా సేకరించి, భారతి మాసపత్రిక (జూన్‍, 1965)లో తొలిసారిగ ప్రచురించి, విష్ణుకుండిన వంశావళిని అప్పటికి స్థిరపరిచారు. రెండు తుమ్మలగూడెం శాసనాలు (బి.ఎన్‍. శాస్త్రి విష్ణుకుండిన గోవింద వర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనము, భారతి, 1965, జూన్‍ సంచిక, పే.14-28; విష్ణుకుండిన విక్రమేంద్రభట్టారకవర్మ ఇంద్రపాలనగర శాసనము, భారతి, 1966, జులై సంచిక, పే.2-14) కొత్త కాలక్రమణికను తెలిపి సంచలనాన్ని సృష్టించాయి.
ప్రస్తుత గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం, అతని 37వ పాలనా సం।।లో విడుదల చేయబడింది. బుద్ధ భగవానుని స్థుతితో ప్రారంభమై, విష్ణుకుండి వంశప్రశస్తిని, ఇంద్రవర్మ, మాధవవర్మ, ప్రస్తావన, గోవింద వర్మ గురించిన వివరాలున్నాయి. గోవిందవర్మ ప్రధాన పట్టమహిషి పరమ మహాదేవి నిర్మించిన మహా విహారానికి, ఎర్మదల, పెంకపఱు గ్రామాలను దానం చేసిన వివరాలున్నాయి. ఈ రెండు గ్రామాలు, యాదాద్రి – భువనగిరి జిల్లా, గుండాల మండలంలోని వెల్మజాలను ఎర్మేదలగా, మోత్కూరు మండలంలోని పనక బండను పెన్కపఱుగా శ్రీరామోజు హరగోపాల్‍ గుర్తించారు. ఐదురేకులూ (ఒక్కొక్కటి 25.8 సెం.మీ × 5.5 సెం.మీ.) కడియానికి బిగించబడి, 1 కిలో బరువు వున్నాయి. మొదటి రేకు రెండో పక్క 5, రెండో, మూడో రేకుల మొదటి, రెండో పక్కలు 6, నాలుగో రేకు మొదటి పక్క 3 కలిపి మొత్తం 32 పంక్తుల్లో, సంస్కృత భాషలో శాసనం చెక్కబడింది (ఊర్ల పేర్లు తెలుగులో ఉన్నాయి).



శాసనంలోని విషయాలు
సిద్ధం. కరుణామయుడు, నిర్వాణ మార్గాన్ని చూపించిన భగవత్‍ సంబుద్ధునకు విజయం (1). పాలన మొదలు పెట్టిన దగ్గర నుంచి విజయవంతంగా వృద్ధి చెందుతున్న, 37వ సం।। వైశాఖ పున్నమి నాడు (13), గొప్పదైన, మచ్చలేని విష్ణుకుండి రాజవంశానికి ఆభరణం లాంటి, శక్తి, సత్యం, త్యాగాలతో ఉన్నత వంశంలో పుట్టిన, జ్ఞానము, వినయము, పట్టుదల, మొదలైన మంచి గుణాలతో, పరాక్రమంతో రాజ్యాన్ని పొంది, అనేక దానాల వల్ల ఎంతో కీర్తిని గడించిన (2, 3) మహారాజు ఇంద్రవర్మ మనుమడు, మహారాజు మాధవవర్మ కుమారుడు అయిన గోవింద వర్మ(4), తన భుజబలం, పట్టుదల, అనురాగం, శౌర్య, ధైర్య, ప్రతాపాలతో, శతృరాజ్యాల్లో చొరబడిన వాడూ, దానం, గౌరవాలతో, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్న పరిజనులతో, వేలకొద్దీ గ్రామాలు, పొలాలు, వెండి, ఏనుగులు, గుర్రాలు, గోవులు, ఎడ్లు, శయనాసనాలు, వాహనాలు, ఆహార పానీయాలు, భవనాలు, బట్టలు, ఆభరణాలు, కన్యలు, దాసీ, దాసులను దానం చేసిన వాడూ, రాజ్యమంతటా కొత్తగా అనేక దేవాలయాలు, విహారాలు నిర్మించి, చెరువులు, బావులు, తవ్వించి, తోటలు వేయించి, పాతవాటిని మళ్లీ కొత్త వాటిగా సుందరీకరించిన వాడూ, న్యాయబద్ధంగా పొందిన అపార ధనరాశులను భిక్షువులు, బ్రాహ్మణులు, అడుక్కు తినేవారు, రోగులు, నిస్సహాయులు, అణగారినవారు, నిర్భాగ్యులు, అనుభవించేలా పంచిన వాడూ, తన సంపదనంతా మళ్ళీ మళ్లీ త్యాగం చేసిన వాడూ, అన్ని శాస్త్రాల అర్థాలను విని, పొందిన జ్ఞానం వల్ల, ఈలోకం, పరలోకాల్లో సాటిలేని దూరదృష్టిగల వాడూ, తన చుట్టూ ఎప్పుడూ విద్వాంసులు, శూరులు, మంచి పుట్టకగల వారితో ఉన్న వాడూ, అన్ని జీవరాశుల రక్షణ (నిర్వాణం) కోసం, మూడు కుశల మూలాల్లో ఒకటైన, మహాబోధి చిత్తాన్ని అలవరచుకొన్న వాడునూ (5-12), నాలుగు దిక్కుల నుంచి వచ్చే ఆర్యభిక్షు సంఘ అవసరాలకి కావలసిన వస్తువులను సమకూర్చటమనే పుణ్యకార్యాన్ని చేసే ఉద్దేశం గలవాడునూ (20), అభిసంబోధి, అసవక్షయం, నీవరణ, పునర్భవాలనుంచి విముక్తి అనే నాలుగు విషయాల్లో విశారదుడు, (ఏది సంభవం, ఏది అసంభవమో, కర్మ విపాకం, జీవుల ఉన్నత, హీన గుణాలు, జీవుల ప్రవృత్తులు, ప్రపంచ నిర్మాణం, అనేక గతులకు దారితీసే మార్గాలు, విమల-మలిన ప్రవర్తన, ధ్యానస్థితుల సమాపత్తి, జీవుల మరణం, పునర్జీవం, అసవిక్షయం ద్వారా విముక్తి అనే పది అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని (బలాల్ని పొందిన) దశ బలుని లాంటి బలాల్ని కలగిన (అభిసంబోధి ఆసవక్షణం, నీవరణ, పునర్భ వాల నుంచి విముక్తి అనే నాలుగు విషయాల్లో విశారదుడు; బుద్ధునికున్న అసామాన్య లక్షణాలైన (బుద్ధుడు తప్పులు చేయడు, పెద్దగా అరవడు, కేకలు వేయడు, మతిమరుపు, ఏమరు పాటు లేక మనస్సు నిశ్చలంగా నిలుపుకొంటాడు, అందరినీ సమానంగా చూస్తూ, ఎవరిపట్లా ఉపేక్ష చూపకుండా, అభిరుచి, వీర్యత, విముక్తి, స్మృతులు, సమాధి, ప్రజ్ఞలను కోల్పోక, మనో, వాచక, కాయక కర్మలు ముందే తెలుసు కొని, గత, వర్తమాన, భవిష్యత్‍ విషయాలు ఏవీ ఆయనను ఆటంక పరచని వాడూ, అనే అష్టాదశ ఆవేణిక లక్షణాలు, బుద్ధుని ధర్మాలలోనిండిన మూర్తిమత్వంతో, 32 మహాపురుష లక్షణాలను కలిగి, పుట్టుక, ముసలితనం, శోకం లాంటి సంసారచక్ర దుఃఖంలో మునిగిన జీవరాశికి విముక్తి కలిగించటానికి, అనేక కల్పాల పాటు సంతరించుకొన్న పుణ్య, జ్ఞానాలతో, రాగం, మోక్షం, జననం, మరణం లాంటి దుఃఖాల నుంచి విముక్తి కలిగించే సంయక్సం బుద్ధత్వమనే పరమజ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధ భగవానుని మార్గంలో విరాగం, శీలం, శిక్ష(ణ) అనే మూడు గుణాలను అధ్యయనం చేస్తూ, వింటూ, భావనా, ధ్యాన, సమాధి, సమాపత్తి అనే గుణగణాలతో అనుత్తర పుణ్యక్షేత్రానికి (సాటిలేని పుణ్యానికి ఆలవాలమైన బౌద్ధ సంఘానికి), శ్రావక, ప్రత్యేక బుద్ధ, బోధిసత్వ (మహా) యానాలనే త్రియానాలలో పయనిస్తూ సకల జీవరాశల దారిద్య్రం, దుఃఖాల ఉపశమనం కోసం తన అగ్రమహిషి పరమ మహాదేవి నిర్మించిన విహారానికి దీప, ధూప, గంధ, పుష్ప, ధ్వజ, పాన, భోజన, శయన, ఆసన, గ్లాన, ఔషదాలు, వైద్యం, విహారాన్ని బాగు చేయుట కోసం, ఎర్మెదల, పెంకపఱు గ్రామాలను, నిధులు, ఉపనిధులు, దండ, కర, ఉచ్ఛిష్ట, భాగ, భోగాలతో (నేరస్తులనుదండించే, పన్నులు వసూలు చేసే అధికారాలతో, భాగ, భోగ అనే పన్నులు చెల్లించనక్కరలేకుండా; ఉచితంగా సేవలను, సేవకులను పొందేట్లుగా ధారాపూర్వకంగా దానం చేశాడు. అంతేకాదు, ఆ గ్రామాల్లోకి, చారులు, భటులు, దూతలు, వల్లభులు, రాజపురుషులు ప్రవేశించకుండా, అన్ని విధాల పరిహారాల నుంచి విముక్తి కలిగించి, విష్ణుకుండి వంశాభివృద్ధి కోసం ఈ దానం చేయబడిందనీ, ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారు పంచమహా పాతకులై, నరకంలో దుఃఖిస్తారని, ప్రేతాలుగా జీవిస్తారని, ఈ దానానికి ఎవరూ అపకారం చేయకుండా, భూమి, సూర్య, చంద్ర, వాయు దేవులున్నంత వరకూ అమలౌతుందని ఇది విష్ణుకుండినుల శాసనమని పేర్కొనబడింది.

మొదటి రేకు – రెండో వైపు

1.సిద్ధం! స్వస్తి జితం భగవతా తేన సంబుద్ధేన కృపాత్మనా నివ్వా ణ ప్రాప్తయే యేన (స)ద్యోమాగ్గ : ప్రదర్శితః ।। సత్వస్య

2.(త్యాగాభిజన) నయ వినయోత్సాహాది గుణగణ సంపదాం స్వయం అధిగత రాజ్యానం సమ్యక్ప్రజాపాలనాత్ప్ర

3.ధి తావదాత పృథు యశసాం రాజ్ఞాం విష్ణుకుణ్డీనా మమల విపుల సకల కుల తిల

4.కేన శ్రీమహారాజేన్ద్ర వమ్మ సత్పౌత్రేణ మహారాజశ్రీ మాధవవమ్మ ణః సుపుత్రేణ స్వత(న)య

5.భుజబలోత్సాహ ప్రభావానురాగా వాప్త స్వరాజ్యేన శౌయ్య ప్రతాపానుభావా ద


రెండో రేకు – మొదటి వైపు

6.న్య సామన్తాక్రాన్త రాజ్యాన్తరేణ దానమానాదిభి రనురక్త వర్ణాశ్రమ స్వజన పరిజనేన గ్రామక్షేత్ర

7.హిరణ్య ద్విరద తురగ గో బలీవద్ద శయనాసన యాన పానభోజన భాజన భవన వసనాభరణ కన్యా

8.దాసీదాస సహస్రాణాందాత్రా అనేక దేవాయతన విహార సభా ప్రపాతడాకోదపానా

9.రామ ప్రతి సంస్కారా పూవ్వ కరణేనాలంకృత సకల దిగన్తరేణ భిక్షుద్విజానాథ (యా)చక వ్యా

10.ధిత దీన కృపణజనోపభుజ్యమాన న్యాయాధిగత విభవ ధన సముదయేనా సకృద సకృత్సవ్వ

11.స్వత్యాగినా సకల శాస్త్రార్థ శ్రవణ పరిజ్ఞానాదిహాపరత్ర చానన్యచక్షుషా విద్వచ్ఛూర మహా


రెండో రేకు – రెండో వైపు

12.కులీనజన సమాశ్రయేణ సకల సత్వధాతు త్రాణాయోత్పాదిత మహాబోధి చిత్తేన మహారాజశ్రీ

13.గోవిన్దవమ్మ ఆత్మనః ప్రవర్థమాన విజయరాజ్య సంవత్సరేసప్తత్రింశత్కే వైశాఖ పౌర్ణమాస్యాం భగ

14.వతో దశబలబలినః చాతువ్వై శారద్య విశారదస్యా ష్ఠాదశావేణిక బుద్ధధమ్మ సమలంకృ

15.తమూత్తై ద్ద్వాత్రింశన్మహాపురుషలక్షణ వరోపలక్షితస్య జాతి జరామరణ శోకాదిషు బహు

16.సంసార దుఃఖ నిమగ్న సవ్వ సత్వోత్తారణా యానేక కల్పాసంఖ్యేయోపచిత పుణ్యజ్ఞాన సంభారభార

17.స్యాపగత రాగద్వేష మోహ జనన మరణ దుఃఖస్యా ప్రతిహతా నావరణ సకలజ్ఞేయ జ్ఞానా


మూడో రేకు – మొదటి వైపు

18.త్సమ్యక్సంబుద్ధస్య బుద్ధస్య మాగ్గ మభిప్రపన్నం నివ్వి ద్వి రాగశీల శిక్షా (ద్భు) తగుణాద్ధ్యయన శ్రవణ చి

19.స్తన భావన ధ్యాన సమాధి సమాపత్త్యాదిభి రుణగణైరన్తు•రం పుణ్యక్షేత్రం త్రియానయాయినం చాతుద్ది

20.శ మార్యసఞ్ఘముద్దిశ్య త్యాగ పరిభోగాన్వయ మౌపధికాంచ పుణ్యక్రియా వస్త్వభి నివ్వ త్త

21.యిష్యతా మాతాపిత్రోః సవ్వ సత్వానాంచ నిఖిల దారిద్య్ర దుఃఖోపశమ హేతోః స్వస్యా అగ్ర

22.మహిష్యాఃపరమ మహాదేవ్యా విహారస్య దీప ధూప గన్ధ పుష్ప ధ్వజ పాన భోజన శయనాసనగ్లాన

23.భైషజ్య ఖణ్డస్పుటిత శీణ్ణ సంస్కారాది కుశల మూలాను వచ్ఛేదా ద్వావేమ దలపెణ్కపఱు


మూడో రేకు – రెండో వైపు

24.నామధేయౌ గ్రామౌ ఉదక పూర్వకం మతిసృష్టౌ సనిధి సోపనిధి సదణ్డకర విష్టిస్వోచ్ఛిష్ట భాగ

25.భోగప్రదేయా చార భట దూత వల్లభ రాజపురుషైర ప్రవేశ్యా విముక్త సకల పరిహారౌ విష్ణుకుణ్డి

26.కులవంశ్యైరాజభి స్సంరక్షణీయౌచ స్థితి రేషా స్థాపిత స్థిత్యతి క్రమే పన్చ

27.మహాపాతకయోగః ప్రవృత్త పుణ్యక్రియా విచ్ఛేదేచానన్త దుఃఖ భూయిష్ఠేనరకే తియ్యా

28.క్ప్రేతగతిష్వ నిష్ఠ కమ్మ ఫలోపభోగమను భవతి ।। భవన్తి చాత్ర మనుగీత శ్లోకాః।।

29.షష్టిం వర్ష సహస్రాణి స్వగ్గే వసతి భూమిదః ఆచ్ఛేత్తాచానుమన్తాచ తాన్యేవ నరకే వసేత్‍.


నాలుగో రేకు – మొదటి వైపు

30.స్వదత్తాం పరదత్తాం వా యో హరేత వసున్థరామ్‍ స విష్టాయాం క్రిమిర్భూత్యాం పితృభి స్సహ పచ్యతే

31.బహుభివ్వ సుధా దత్తా బహుభిశ్చానుపాలితా యస్య యస్య యదాభూమిస్తస్య తస్య తదా

32.ఫలమ్‍।। భువి మేరూదధీయావద్దివీన్దు రవి మారుతా తావచ్ఛ్రీ విష్ణుకుణ్డినాం పృథివీం శస్తు శాసనం।।

శాసనభాష
దానగ్రామాల పేర్లు ఎర్మదల, పెంకపఱు అనే రెండు తెలుగు పదాలు తప్ప మొత్తం శాసనం సంస్కృత భాషలో ఉంది. శాసన రేకులపైన గల ఒకటి, రెండు, మూడు అంకెలు 3, 33, 333గా చెక్కబడినాయి. సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం ద్విత్వంగా రాయబడింది. ఉదాహరణకు నివ్వా ణం, మాగ్గ, మాధవవమ్మ , శౌయ్య , థైయ్య , వద్ధన, పూవ్వ సవ్వ , మూత్తి , చాతువ్వై , శారద్య, చాతుద్ది శ, నివ్వ త్త శీ(జీ)ణ్ణ తియ్య , కమ్మ , బహుభివ్వ సుధా అనే పదాలు. గ్రామం పేరు – పెణ్క పఱులో బండి‘ఱ’ రాయబడింది. కుదిరనచోటెల్లా సంధి చేయబడింది. కొన్ని అక్షరాలు కుదురుగా, మరికొన్ని ఎడమ వైపుకు వంగినట్లుగా, కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దగా ఉన్నాయి. గ, వ, య అనే అక్షరాలు దాదాపుగా తెలుగు అక్షరాలకు దగ్గరౌతున్నాయి. అక్షరాలను గుండ్రంగా అలంకారంగా రాయటం బాగా అభ్యాసంలో ఉన్నట్లు తెలుస్తుంది. బ్రాహ్మీలిపి గురించి క్రీ.శ. 5వ శతాబ్దినాటి బాగా పరిణామం చెందుతున్న తెలుగు లిపికి సూచికగా ఉంది.

శాసనం కాలం
ఈ శాసనాన్ని కనుగొన్న బి.ఎన్‍.శాస్త్రి, గోవిందవర్మ కాలాన్ని క్రీ.శ.418-455గానూ, శంకర నారాయణన్‍, క్రీ.శ. 422-462గానూ, నేలటూరు వెంకటరమణయ్య క్రీ.శ. 408-445గానూ, చైతన్యపురి ప్రాకృతశాసనం ద్వారా పి.వి. పరబ్రహ్మశాస్త్రి క్రీ.శ. 360-400గానూ నిర్ణయించారు. దొరికిన అన్ని శాసనాలు, సమకాలీన రాజులు, సామంతుల శాసనాలను పరిశీలించిన అజయ్‍మిత్ర శాస్త్రి, తుమ్మలగూడెం శాసనాన్ని విడుదల చేసిన మొదటి గోవిందవర్మ క్రీ.శ.435-75 మధ్య కాలంలో పాలించాడని అందరికీ ఆమోదయోగ్యమైన కాల నిర్ణయం చేశారు. ఈ శాసనం వెలువడకముందు, విష్ణుకుండి (ను)లు, శైవులనీ, వైదిక మతావలంబులనీ భావించారు. ఈ శాసనంలో గోవిందవర్మ, అతని పట్టమహిషి బౌద్ధాభిమానులనీ, గోవిందవర్మ, బుద్ధుని గుణగణాలను సంతరించుకొని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్నాడనీ చెప్పబడింది. శాసనమంతా బౌద్ధపదజాలంతో నిండి ఉంది.
ఈ శాసనం ద్వారా, విష్ణుకుండి తొలి రాజుల కాలాన్ని, మతాన్ని, పాలనను, భాష, లిపులను గురించిన అంతకు ముందు తెలియని కొత్త విషయాలను అందించినందున అలనాటిమేటి తెలంగాణా శాసనంగా పేర్కొనవచ్చు. ఈ శాసనాన్ని తొలిసారిగ ప్రచురించిన కీ.శే. బి.యన్‍.శాస్త్రిగారికి కృతజ్ఞతలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *