బాదామీ చాళుక్య విజయాదిత్యుని అలంపురం ప్రశస్తిశాసనం

అలంపూరు అనగానే నాకు ఒళ్లంతా పులకరింపు. నేను 1978 జులై 1వ తేదీన దేవదాయశాఖలో ఉద్యోగంలో చేరిన రోజు. నా కుటుంబానికి ఆసరా దొరికిన రోజు. ఉద్యోగం ఉందిగాబట్టి ఎవరో ఒకరు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారన్న నమ్మకం కుదిరిన రోజు. చేరిన మొదటిరోజే నవబ్రహ్మలయాలను చూచి, నేను తిరుపతి శిల్పకళాశాలలో నాలుగేళ్లపాటు ఆలయ వాస్తు-శిల్పంపై తీసుకున్న శిక్షణకు సార్ధకత దక్కిన రోజు. అన్నింటికీ మించి ఆదరణ, ఆప్యాయతల మాగాణం, తెలంగాణ భూభాగంలో తొలిసారిగ అడుగుపెట్టిన రోజు. పవిత్ర తుంగభద్రానదిలో మొదటి సారిగా స్నానం చేసిన రోజు. ఆరోజు నాకు బాగా జ్ఞాపకం. నేను బాలబ్రహ్మేశ్వరాయలంలోని శిల్పాల్ని తదేకంగా చూస్తుండగా ఒక పెద్దాయన ఎవరో ఒకరిద్దరు పెద్దవాళ్లకు అలంపురం చరిత్రతోపాటు బాదామీ చాళుక్యుల గురించి, అక్కడి శాసనాల గురించి వివరిస్తున్నారు. ఆయన ఎవరని పూజారిని అడిగితే, గడియారం రామకృష్ణశర్మగారని మెల్లగా చెప్పాడు. అప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదుగాబట్టి, మిగిలిన ఎనిమిది ఆలయాలనూ చూచి, తెగ సంబరపడి పోయాను. అపుడపుడూ, ఆలయాలకు వెళ్లటాన, గడియారం రామకృష్ణశర్మగారిని పరిచయం చేసుకోగలిగి, వారు నిర్వహించే ‘రసభారతి’ కార్యక్రమాలకు హాజరవుతుండే వాణ్ణి.


ఏదో ఒక పండుగనాడు బాలబ్రహ్మశ్వరాలయానికి వెళ్లాను. ఆరోజు మళ్లీ అదే ఆలయం మండపస్థంభంపై గల శాసనాన్ని చదివి, ఒక పెద్దాయనకు వివరిస్తున్నారు గడియారం వారు. ఆ రెండో పెద్ద మనిషి ఎవరని అడిగితే ఉండవెల్లి రామేశ్వరరెడ్డి అనే ఒక పెద్ద రైతని చెప్పాడు పూజారి. నేను కూడా గడియారం వారు చెబుతున్న రెండో పులకేశి, వినయాదిత్య, విజయాదిత్యుల గురించి వింటూనే ఉన్నాను. ఇదొక ప్రశస్తి శాసనమని ఆయన చెప్పిన విషయం జ్ఞాపకముంది గానీ ప్రశస్తి అంటే ఏమిటో తెలియదు. వాళ్లు వెళ్ళిన తర్వాత ఆ శాసనంపైన నా అరచేతితో తాకాను. ఏదో తెలియని అనుభూతిని పొందాను. శిల్పాలను చెక్కానుగానీ, అక్షరాలను చెక్కకపోతినే అన్న వెలితిని కూడా అనుభవించాను. ఆ తరువాత నేను శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవళాల తరలింపులో అలంపురం నుంచీ కొల్లాపూరు, జటప్రోలు, మంచాలకట్ట, ప్రాగటూరు, మారమునగాల గ్రామాల్లోని ఆలయాలను ఊడదీసి ఎగువన కట్టాను.


దేవళాలను ఊడదీసే క్రమంలో నేను, కొల్లాపురం మండలంలోని కృష్ణాతీర గ్రామం మల్లేశ్వరంలో ఉండే వాణ్ణి. ఊరు కూడా తరలిపోతుందిగాబట్టి కరెంటు లేదు. రోడ్లు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. అయితే మాత్రం ఏం, మనుషులు మంచివాళ్లు, స్నేహశీలురు. రాత్రిళ్లలో పెట్రోమాక్సు లైట్ల వెలుతురులో ఆలయాల ప్లాన్లు గీచి, అంచనాలు తయారించే వాళ్లం. సాయం వేళల్లో ఒక్కోసారి కృష్ణానది ఒడ్డునే ఉన్న మల్లేశ్వరం దేవాలయాల దగ్గర, ఇంకోసారి పొలాల్లో వేరుశెనక్కాయలు (బుడ్డలు) తింటూ, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, కాలం గడుపుతుంటే, మళ్లీ మళ్లీ గడియారం రామకృష్ణ శర్మగారు చెప్పిన వినయాదిత్య, విజయాదిత్యులు గుర్తుకొచ్చే వాళ్లు.


దక్షిణకాశీగా పేరుగాంచిన అలంపురంలో బాదామీ (లేక) తొలి పశ్చిమ చాళుక్యులు విలక్షణ రేఖా నాగర ప్రాసాదరీతిలో నిర్మించిన అపురూప ఆలయాలు తొమ్మిది ఉన్నాయి. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, క్రీ.శ.543లో బాదామీ పట్టణం రాజధానిగ, మొదటి పులకేశి, చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత మొదటి కీర్తివర్మ, (క్రీ.శ. 566-507), మంగళేశుడు (క్రీ.శ.598-608) రాజ్యం చేశారు. క్రీ.శ.609లో అధికారం చేపట్టిన రెండో పులకేశి, వనవాసి కాదంబులు, అలూపులు, లాటులు, పశ్చిమగాంగులు, కొంకణ మౌర్యులు, ఝార్జరులను జయించి చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అదేవరవడిలో, హర్షవర్ధనున్ని ఓడించిన రెండో పులికేశి, కోసల, కళింగ, ఆంధప్రాంతాలపై దండెత్తి వశపరచుకొన్నాడు. క్రీ.శ. 621లో తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనున్ని, వేంగి సింహాసనంపై కూర్చుండ బెట్టి, తాను వెనుదిరిగి వెళ్లి పోయాడు. ఇప్పటి తెలంగాణాలోని మహబూబ్‍నగర్‍, ఇంకా కర్నూలు నుంచి పశ్చిమ భాగాన్ని బాదామి నుంచే పాలించాడు. తరువాత మొదటి విక్రమాదిత్యుడు (క్రీ.శ.654-687), వినయాదిత్యుడు (క్రీ.శ. 681-696), విజయాదిత్యుడు (క్రీ.శ.696-733), రెండో విక్రమాదిత్యుడు (క్రీ.శ.733-745) చివరగా రెండో కీర్తివర్మ (క్రీ.శ. 745-755) చాళుక్య రాజ్యాన్ని పాలించారు. రెండో పులకేశి కాలం నుంచి చివరి రాజుదాకా, అలంపూరు ఆలయ నిర్మాణానికి అందరూ చేయూత నిచ్చారు. క్రీ.శ.696 నుంచి క్రీ.శ.733 వరకూ పాలించిన విజయా దిత్యుడు క్రీ.శ.713 నుంచి క్రీ.శ.718 వరకూ అలంపురంలోనే
ఉండి ఆలయ నిర్మాణాలను పర్యవేక్షించాడని కొందరు చరిత్రకారులు పేర్కొనగా, మరికొందరు అంగీకరించని మాట కూడా నిజం.


అలంపురంలోని నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరాలయంలో గల విజయాదిత్యుని ప్రశస్తి శాసనం శాసన పరిశోధకుల దృష్టినాకర్షించింది. ఎందుకో గానీ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పురావస్తు శాఖ ప్రచురించిన మహబూబ్‍నగర్‍ జిల్లా శాసన సంపుటాల్లోగానీ, తెలంగాణా శాసన సంపుటాల్లోగానీ ప్రశస్తి శాసన పూర్తి ప్రసక్తి లేకపోవటం విడ్డూరమే. ప్రస్తుత చర్చనీయాంశం బాదామీ చాళుక్య విజయాదిత్యుని అలంపుర ప్రశస్తి శాసనమే.


విజయాదిత్యుడు క్రీ.శ. 697లో మహారాష్ట్రలోని జమల గ్రామంలో తొలి శాసనాన్ని విడుదల చేశాడు (ఎ.ఇ.36,పే.313). తరువాత అనంతపురం జిల్లా నిట్టూరులో రెండు శాసనాలు (ఎ.ఇ.38, పే.335), కొత్తపల్లె (ఎ.ఇ.38, పే.337), మాయలూరు రాగిరేకు శాసనాలు (ఎ.ఇ.38, పే.311), కొత్తూరు (ఎ.ఇ-30, పే.69), అలంపురం శాసనాలు (ఎ.ఇ.35, పే.121), బేతపల్లి (ఎస్‍ఐఐ.9, పే.47), ఇంకా శంఖబస్తిదాన శాసనం (ఎస్‍ఐ.20, నం.6), షిగ్గామ్‍ రాగి రేగి శాసనాలు (ఎఇ.32, పే.317), అరకట వేముల (ఎస్‍ఐ.10, పే.604), నేరూరు రాగి రేకు శాసనం (ఎ.ఇ.9, పే.132), ఉల్చాల (కె.వి.రమేష్‍, చాళుక్యాస్‍ ఆఫ్‍ వాతాపి, 1984, పే.151) శాసనాలు ముఖ్యమైనవి. వీటన్నిటి కంటే అలంపురం ప్రశస్తి విజయాదిత్యుని గుణగణాలకు అద్దం పడుతుంది. ఈ శాసనం (ఏఆర్‍ఐఇ – 1976-77లో బి.17) పైన కె.వి.రమేష్‍, ఎండి. సంపత్‍, ఎస్‍ఎస్‍ రామచంద్రమూర్తి, ఎన్‍.ఎస్‍. రామచంద్రమూర్తి, ఎస్వీ పాడిగర్‍ లాంటి పరిశోధకుల దృష్టి నాకర్షించింది.


అలంపురం విజయాదిత్యుని ప్రశస్తి శాసనం
మొదటి పక్క

1-8 అక్షరాలు చెరిగిపోయాయి
9.వంశే మహతి విఖ్యాతే రాజా రాజీవలోచనః
10.నామ్నాశ్రీ విక్రమాదిత్యః శ్రీరోద చంద్రమాః
11.జ్వలత్‍ ప్రతాపజ్వలన జ్వాలాలీటారికాననః
12.ప్రాజ్యత్రైరాజ్య వినితావక్త్రాంభోజ హిమాగమః
13.అన్యావనతోత్సిక్త కాంచీ శమకుటార్చిషా
14.సమర్పిత పదం భోజః శచీపతిరివోద్యతః
15.సింహళైః కేరళైః చోలైః పాండ్యపల్లవంశజైః
16.సేవ్యమానశ్చిరం రేజేరాజా ధర్మయశఃపరః
17.తత్సూనుర్వినయాదిత్యః వినీతస్సాధువత్సలః
18.ధస్యోవీరః ప్రభుర్వాగ్మి దాతాజేతాగుణాధికః
19.విమ్రాదిత్య భూపస్య స్వగురో శ్శాసనం గురు
20.ప్రాప్యలఘ్వీతి మన్వానః ప్రయాతో దక్షిణాందిశం
21.పాణ ప్రతాప సంపన్నం శౌర్యశాలిన ముత్థితం
22.బలాన్జిత్వాగ్రహీదాసు మధురావనితా కరమ్‍
23.కుమారీద్వీపమాక్రామన్తదీశ్వర క్రమాన్వశే
24.కృతవాన్యౌ వరాంగ ధ్వైయం యశోదిక్షు క్షిపనృపమ్‍

రెండో పక్క

25.ప్రాప్త సామ్రాజ్య లక్ష్మీకః ద్విషస్సర్వాస్సముద్ధరమ్‍
26.లాట లక్ష్మీలతా భంగకరం వజ్ర ఠామాహవే
27.పరాజిత్య హృతానేక మాణిక్య గజ సాధనమ్‍
28.పఢఢక్కా మహాశబ్దలోల పాళిధ్వజాదికమ్‍
29.పుండరీకాత పత్రంచమూర్తం యశిఇవస్వయం
30.పరమేశ్వర చిహ్నంవో జగ్రాహ పరమేశ్వరః
31.త్రైరాజ్య (పల్లవం జే)తుం ప్రయతే స్వపితామహే
32.తదాజ్ఞయా (స్వరాజ్యం) యః ప్రారక్షధ్వం నితద్విషమ్‍
33-44 (అక్షరాలు చెరిగి పోయాయి)
45.దుర్ధరో నిరవద్యశ్చ సమస్త భువనాశ్రయః
46.కృత్వాఖ్యాతిమర్యిం శాంతిం వ్యజానద్భువి విస్తృతాం
47.- – – – – – – – – – – – – – – – – –
48.- – – – – – – – – – – – – – – – – –


మూడో పక్క

49.ధర్మార్ధం వ్యస్సృజద్భూరి బ్రాహ్మణేభ్యః సహస్రశః
50.దీనానాధదరిద్రేభ్యః మహాదానాని న ప్రభుః
51.సోవ్యాద్భ గవతా న్బౌద్ధాజ్ఞినేన్ద్రమతమాశ్రితాన్‍
52.స్వధర్మ క్రియయా విశ్వం తీర్ధ్యన్సన్తర్పయన్నృపః
53.స్థానే స్థానేచ సత్రాణి దరిద్రానాధతృప్తయే
54.పశూనాం రోగతప్తానాం ప్రీత్యాచాస్థాపయన్యపః
55.చిరసంప్రాప్త జీర్ణానాం ఖండస్ఫుటిత సంస్కృతే
56.సంగీతార్థం చ యో గ్రామాన్‍ ప్రాదాద్దేవకులేఘచ
57.తటాకా బహవస్తేన దేశే దేశేచ కారితాః
58.- – – – – – – – – – – – – – –
59.స్వపూర్వజాద్విజాతిభ్యః గ్రామక్షేత్రాణ్యయః పురా
60.సుగ్రామణి పురాణ్యేవ తేభ్యః ప్రాదాదయం నృపః
61.తులాపురుష దానాని బహు కృత్వాది శత్తయా
62.హిరణ్యగర్భాం పృధివీం హస్తియుక్త రధానిపి
63.అన్యేచాపి శ్రుతి స్మృత్యోరుక్తాన్థర్మానవర్తయత్‍
64.అన్యేరకృతపూర్వాస్థాను తదాశాస్త్రానురోదితాన్‍
65.కరహాటపురాధీశసేంద్రకాన్వయ జన్మనః
66.విష్ణురాజస్యదుహితా మహదేవీ పతివ్రతా
67.సమస్త పృధివీ పత్నీ సపత్నీ శ్రీరివస్వయం
68.కీర్తిర్మూర్తైరివయారాజ్ఞోవామేహృది సుస్థితా
69.తయా సహసమారోహత్‍ తులాం స్వర్ణాభనయం
70.మహాలక్ష్యా శేషశయ్యాం యధాహరిః
71.స్వయం కృత్వాప్య సంతుష్టః తయా కారితవాన్‍ ముహుః
72.ధర్మానాత్మికృతే భ్యోపి విశిష్టానాగమోచితాన్‍

అలంపురంలోని బాలబ్రహ్మేశ్వరాలయం లోపలి మండప స్థంభంపైన గల విజయాదిత్యుని ప్రశస్తి శాసనం 72 పంక్తుల సంస్కృత శాసనం. మొదటి 8 పంక్తుల అక్షరాలు అరిగి పోయాయి. 9వ పంక్తి నుంచి, విజయాదిత్యుని తాత, విక్రమాదిత్యుని గుణగణాలు, ఆయన సింహళ, కేరళ, చోళ, పాండ్య, పల్లవ రాజుల చేత సేవలందుకొన్న వాడుగనూ, త్రైరాజ్యాలను జయించిన వాడునూ, ఇంతకు ముందెన్నడూ, ఎవరికీ తలవంచని కంచిరాజు చేత వినమ్ర నమస్కారాలు పొందిన వాడునూ, అతడు మిక్కిలి పరాక్రమవంతుడై, దాక్షిణాత్య యుద్ధాల్లో ఎదురు తిరిగిన పాండ్యరాజును చిత్తుచేసి, మధుర నగరాన్ని స్వాధీనం చేసుకొని, కన్యాకుమారిద్వీపం వరకూ రాజ్యాన్ని విస్తరించాడనీ, చక్రవర్తి అయిన తరువాత, వజ్రటుని సైన్యాన్ని స్వీకరించి, అతని నుంచి వజ్ర వైడూర్యాలను, ఏనుగుల్ని, పఢ, ఢక్కా (భేరీ)లను, రాజ (పాళీ) ధ్వజాన్ని, ఛత్రాన్ని పొందినట్లు చెప్పబడింది. తరువాత 23 పంక్తుల్లో ఆయన కుమారుడు, వినయాదిత్యుని గురించి, విజయాదిత్యుని పుట్టుక, బాల్యం, యువరాజు, చక్రవర్తిగా ఒనరించిన ఘనకార్యాల వివరా లున్నాయి. విజయాదిత్యుని పుట్టుకకు సంబం ధించిన పంక్తుల అక్షరాలు చెరిగిపోయాయి.


చక్రవర్తిగా, విజయాదిత్యుని విజయాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి 14 పంక్తుల్లో వివరించబడింది. తాత విక్రమాదిత్యుడు, త్రైరాజ్య యుద్ధాల్లో మునిగి, రాజధానికి వెలుపల ఉన్నప్పుడు, విజయాదిత్యుడు, రాజధానిని కాపాడటమే కాక, ప్రజల బాగోగుల్ని చూచుకున్నాడని, అందరి రాజులచే సమస్త భువనాశ్రయునిగా కీర్తించబడినాడనీ, బ్రాహ్మణులకు, దరిద్రులకు వేలకొద్ది కానుకలను ఇచ్చాడని, భాగవతులు (విష్ణుభక్తులు), బౌద్ధ, జైన మతావలంబులను సమాదరించాడనీ, రాజ్యమంతటా దరిద్రులకోసం సత్రాలను కట్టించి, పశువులు, రోగుల కోసం అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాడని, ఆలయ జీర్ణోద్ధారణ, నిర్వహణ, సంగీత కచేరీల కోసం, గ్రామాల్ని దానం చేశాడని, అన్ని ప్రాంతాల్లోనూ చెరువులు తవ్వించాడనీ, తన పూర్వీకులు, బ్రాహ్మణులకు గ్రామాలు, ఇళ్ల స్థలాలను మాత్రమే ఇస్తే, విజయాదిత్యుడు శ్రేష్టమైన గ్రామాలు, పట్టణాలను దానం చేశాడనీ, చెప్పబడింది. అంతేకాదు, అనేక తులాపురుష, హిరణ్యగర్భ, ఏనుగులు పూన్చిన రథాలను దానం చేశాడని, హతులు, స్మృతులను బాగా విని ధర్మాన్ని ఆచరించాడని, కరట నగరాధిపతి, సేంద్ర కవంశీయుడైన విష్ణురాజు కుమార్తె మహాదేవిని, తన మహారాణిగా కలిగిన వాడుగనూ, ఆ రాజదంపతులు శేషనాగునిపై పవళించిన శ్రీహరి, మహాలక్ష్మిలా భాసిల్లారనీ, అనేకసార్లు వాళ్లిద్దరూ కలసి, తూగి, తమ ఎత్తుబంగారాన్ని, కానుకల్ని దానం చేశారని విజయాదిత్యుడు ఆగమశాస్త్ర ప్రకారం అన్ని ధర్మ కార్యాలను నిర్వహించి, అందర్నీ సంతుష్టుల్నిగావించాడని ఈ శాసనం పేర్కొంటుంది (ఇక్కడ శాసనం అర్ధాంతరంగా ముగిసింది).


నిజానికి ఇది విజయాదిత్యుని ప్రశస్తి శాసనంగా గుర్తింపు పొందినా, విజయాదిత్యుని తాత, విక్రమాదిత్యుని ప్రశస్తి, విజయాదిత్యుని తండ్రి వినయాదిత్యుని ప్రసక్తిగల శాసనంగా చెప్పుకోవచ్చు. క్రీ.శ.696లో సింహాసన మెక్కిన విజయాదిత్యుడు, తాత, తండ్రి దగ్గర యువరాజుగా శిక్షణ పొంది, సాహిత్యం, కళలు, రాజవిద్యలు, రక్షణ వ్యహారాలు, యుద్ధ వ్యూహాలు, దానధర్మాలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అశోకుడు, కలింగ ఖారవెలులను గుర్తుకు తెచ్చాడు. తాను శైవుడైనా, భాగవత, బౌద్ధ, జైన మతాలను కూడా ప్రోత్సహించాడు. మనుషులతో పాటు పశువులకోసం వైద్య సదుపాయాలు కల్పించాడు. సనాతన సంప్రదాయాల్ని గౌరవించాడు. ఆలయ నిర్మాణం ఆసక్తితో చేపట్టాడు. పట్టదకల్‍లో తన పేర విజయేశ్వరాలయాన్ని, అలంపురంలోని గరుడబ్రహ్మ, విశ్వబ్రహ్మ ఆలయాలను, ఆలయాల చుట్టూ అతని 18వ పాలనా సం।।లో, తన కిష్టమైన బిరుదు ‘నిరవద్య’ పేరిట ఈశానా చార్యుని చేత ఒక ప్రాకారాన్ని నిర్మింపజేశాడు. సత్యాశ్రయ, శ్రీపధివీవల్లభ, మహారాజాధిరాజ, పరమేశ్వర భట్టారన్‍ బిరుదులను పొందాడు.


విజయాదిత్యుని అలంపురం ప్రశస్తి శాసనం, అలనాటి మేటి తెలంగాణా శాసనాల్లో ఒకటి. మొదటి సారిగ, తెలుగులో ఇక్కడే ప్రచురిత మౌతుంది. ఈశాసనం వల్ల ఆనాటి శాసన భాష (సంస్కృతం), లిపి (తెలుగు, కన్నడ), క్రీ.శ.654 నుంచి క్రీ.శ.714 వరకూ గల చరిత్ర, క్రీ.శ.700 నాటి సమకాలీన చరిత్ర, విజయాదిత్యుని విక్రమ, పరాక్రమాలు, దాతృత్వ, సౌభాతృత్వాలు, దయార్ధ్ర హృదయం తెలుస్తున్నాయి. ఈ ప్రశస్తి వల్ల విజయాదిత్యునికి, మహాదేవి అనే మరో రాణి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. శాసనాక్షరాలు బాగా అరిగిపోవటాన, ప్రస్ఫుటంగా కనిపించే కొన్ని అక్షరాలు, పొందికలో, క్రీ.శ.733 నాటి బాదామీ చాళుక్య రెండో విక్రమాదిత్యుని తిప్పలూరి శాసనాక్షరాల మాదిరిగా ఉన్నాయి. ఈ శాసన విషయ సేకరణలో నాకు సహకరించిన భారతీయ పురావస్తు సంస్థ శాసన విభాగానికి చెందిన డా. వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి, శ్రీరామోజు హరగోపాల్‍, ప్రముఖ శాసన పరిశోధకులు డా. ఎన్‍.ఎస్‍. రామచంద్రమూర్తి, ఎస్వీపాడిగర్‍ గార్లకు నా ధన్యవాదాలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *