మౌఢ్యంతో పోరాడిన హేతువాది, న్యూక్లియర్‍ సైంటిస్ట్: డా.హెచ్‍.నరసింహయ్య

నాలుగు చెరగులా కల్ల, కపటం, ప్రచారం, కృత్రిమత్వం, వ్యాపారధోరణి డొంకదార్లు – ఇలా పరచుకుని సమాజం సాగుతున్న వేళ కొందరు పోరాట యోధుల గురించి తప్పక తెలుసుకోవాలి! అలాంటి అపురూపమైన వ్యక్తి హెచ్‍.ఎన్‍.గా ప్రఖ్యాతులయిన డా.హెచ్‍.నరసింహయ్య! పదమూడవ ఏట నుంచి ఖాదీని వదలని వ్యక్తీ, అమెరికాలో న్యూక్లియర్‍ ఫిజిక్స్లో పిహెచ్‍.డి. చేసిన వ్యక్తీ, సత్యసాయి మహిమలను పరీక్షకు నిలిపిన వ్యక్తీ, క్విట్‍ ఇండియా ఉద్యమంలో చదువు వదలి చెరసాలకేగిన వ్యక్తీ, కర్నాటక సంగీతం, సంఘసేవ, గాంధీ, వివేకానందలను అమితంగా ఇష్టపడిన వ్యక్తీ.. ఇంకా చాలా ఈ నరసింహయ్య.


హోసూరు నరసింహయ్యగా పిలువబడే హనుమంతప్ప నరసింహయ్య 1920 జూన్‍ 6న ఆంధ్ర సరిహద్దు కర్నాటక జిల్లా కోలారు గౌరిబిదనూరు దగ్గరుండే హోసూరులో జన్మించారు. తండ్రి మేస్త్రీ, తల్లి దినసరి కూలి. వీధిబడిలో కన్నడం పిల్లలకు చెప్పి తండ్రి జీవనోపాధి సంపాయించు కునేవాడు. నరసింహయ్యకు ఒక చెల్లెలుండేది. గౌరిబిదనూరు గవర్న మెంట్‍ స్కూలులో ఎనిమిదో తరగతి వరకు చదివి ఆపివేశారు – అక్కడ ఇంక ఎక్కువ చదివే అవకాశం లేనందున. ఒక సంవత్సరం తర్వాత ఆ స్కూలు హెడ్‍ మాస్టర్‍ ఎం.ఎస్‍. నారాయణరావు బెంగళూరులోని నేషనల్‍ హైస్కూలు, బసవనగుడికి బదిలి అయ్యారు. తన పాఠశాలలో చదువుకోమని సలహా చెప్పాడు. 85 కిలోమీటర్లు రెండు రోజుల్లో కాలినడకన బెంగుళూరు చేరారు నరసింహయ్య. ఇది 1935 విషయం. ఒక ఆరునెలలు టీచరు ఇంట్లోనే వుండి, పిమ్మట స్కూలు హాస్టల్‍లో చేరారు. మరుసటి సంవత్సరం బసవనగుడి నేషనల్‍ హైస్కూలుకు గాంధీ వచ్చారు. గాంధీ హిందీ ప్రసంగాన్ని కన్నడంలోకి తర్జుమా చేయమని తన ఉపాధ్యాయుడు కోరారు. ఆ క్షణం నుంచి గాంధీ ప్రభావం అతనిని వదలలేదు. జీవితాంతం ఖాదీ ధరించారు. అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఖాదీ పాంట్స్ వేసుకున్నారు అంతే! గాంధీ టోపి లేకుండా నరసింహయ్యను ఊహించలేము.


1942లో బెంగుళూరులోని సెంట్రల్‍ కాలేజీలో బి.ఎస్సి ఫైనల్‍ ఇయర్‍ చదువు తున్నారు. ఆ సమయంలో చదువు చాలా ముఖ్యమైనా, క్విట్‍ ఇండియా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తొమ్మిది నెలలపాటు ఎర్రవాడ (మహారాష్ట్ర), మైసూరు, బెంగుళూరు జైళ్ళలో కారాగారవాసం పిమ్మట తామ్రపత్రం పొందిన యువకుడుగా నిలిచారు. తర్వాత ఒక సంవత్సరానికి అంటే 1944లో బి.ఎస్సి., పిమ్మట 1946లో ఫిజిక్స్లో ఎం.ఎస్సి. పూర్తిచేశారు. అదే సంవత్సరం అదే కళాశాలలో లెక్చరర్‍గా చేరి పదేళ్ళు ఉద్యోగం చేశారు. 1957లో కొలంబస్‍ వెళ్ళి ఓహియో స్టేట్‍ యూనివర్సిటీలో ఫిజిక్స్.లో పిహెచ్‍.డి. 1960లో పూర్తి చేశారు. మళ్ళీ తన కళాశాలలో ప్రిన్సిపల్‍గా చేరి 1972 దాకా ఉద్యోగం చేశారు.


కాలేజి ప్రిన్స్పల్‍ గిరి నుంచి 1972లో బెంగుళూరు విశ్వవిద్యా లయానికి వైస్‍ ఛాన్సలర్‍ అయ్యారు. 1975లో మరో టర్మ్ పొడిగించారు. 1977లో వత్తిడి కారణంగా రాజీనామా చేసేదాకా వారు వైస్‍ ఛాన్సలర్‍గా కొన సాగారు. వారే ఆ విశ్వవిద్యా లయంలో సైకాలజి, సోషల్‍ వర్క్, డ్రామా, సంగీతం, నృత్యం విభాగాలలో కోర్సులు ప్రారంభించారు. వారు ఆజన్మ బ్రహ్మచారి. పట్టుదల గల మనిషి. ‘పెళ్ళి ఒక జూదం, లాటరి. సర్దుకుపోయే మనిషి దొరకకపోతే ఆ పెళ్ళిని ఎవరూ కాపాడలేరు’ అని భావించారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు పిల్లల హాస్టల్‍ లో ఒక గదిలోనే వుండేవారు. ఆయనకు బుద్ధుడు, గాంధీ, వివేకానంద భావనలు అంటే చాలా ఇష్టం. గౌరవం. కర్నాటక సంగీతం అంటే ప్రాణం. కర్నాటక సంగీత విద్వాంసులు ఆర్కే పద్మనాభకు మంచి మిత్రులు. డా. నరసింహయ్య గౌరవార్ధం పద్మనాభ వెయ్యిమంది సంగీత విద్వాంసులతో గోష్ఠి నిర్వహించడం విశేషం. బెంగుళూరు లలితకళా పరిషత్‍ ఏర్పడటానికి కారణం నరసింహయ్యగారే!


ఆయనకు పని అంటే ఇష్టం. ప్రశ్న అంటే ప్రాణం. ఆఫీసులో ఆయన టేబుల్‍ వెనుక ప్రశ్నార్థకం (?) గుర్తు పెద్దగా దర్శనమిచ్చేది. 1962లో ‘బెంగుళూరు సైన్స్ ఫోరం’ ప్రారంభించి వారం వారం సైన్స్ ప్రసంగాలు ఏర్పాటు చేసి సుమారు 2000 కార్యక్రమాలు జరిపించి ఉంటారు. సుమారు 500 పాపులర్‍ సైన్స్ సినిమాలు ప్రదర్శించి వుంటారు. వీరి పూనికతోనే బి.వి.జగదీష్‍ సైన్స్ సెంటర్‍ ఏర్పడింది. సైన్స్ ప్రచారానికి వీరు చేసిన సేవ చిరస్మరణీయం. ఆయన మాతృభాష తెలుగు. కానీ కన్నడం బాగావచ్చు. ‘హోరాటద హాడి’ అనే స్వీయచరిత్ర, ‘తీరెద మన’ అనే వ్యాససంపుటి కన్నడంలో ప్రాచుర్యం పొందడమే కాదు, వారికి సాహిత్య అకాడమి గౌరవాన్ని కూడా కొనితెచ్చాయి.


బాబాల మాయలు, మంత్రాలు, బాణామతి వంటి మూఢ నమ్మకాలను బట్టబయలు చేయడానికి జీవితాంతం కృషి చేశారు. మహిమలతోపాటు నమ్మశక్యంకాని మూఢనమ్మకాలను పరిశోధించి, నిగ్గుదేల్చడానికి 1976లో తన అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. అందులో ఎ.ఆర్‍.వాసుదేవమూర్తి, రొద్దం నరసింహ, వినోదామూర్తి, అనుపమా నిరంజన, వి.ఎం. ధర్మలింగం గార్లు సభ్యులు. గాలి నుంచి సత్యసాయి విభూతి, ఉంగరాలు తీయడం గురించి సవాలు విసిరి అధ్యయనం చేశారు. అలాగే తమ మహిమలతో రోగాలను నయం చేస్తామనే వారిని బహిరంగంగా చేయమని మరో సవాలు చేశారు. అప్పట్లో అది చాలా సంచలనం. 1977లో రాజకీయ ఒత్తిడిమీద ఆయన బెంగుళూరు విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍ గా తప్పుకున్నారు. ఫలితంగా ఆ కమిటీ కూడా రద్దయ్యింది.


తండ్రి చనిపోయినపుడు గుండు చేయించుకోని నరసింహయ్య గ్రహణం సమయంలో భోజనం చేస్తూ అపోహలు తొలగించారు. అప్పటి ముఖ్యమంత్రి గుండూరావు విధానమండలి సభ్యులుగా ఆహ్వానించి, కాంగ్రెస్‍ పార్టీలో చేరమన్నారు. దానిని తిరస్కరించి స్వతంత్ర సభ్యుడుగా విధానసభకు ఎన్నికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు తొలగించిన ఎమ్మెల్యేల బృందం నాయకుడుగా కూడా సేవలు అందించారు. కన్నడ భాష అభివృద్ధి సంస్థ అధ్యక్షుడుగా కృషి చేశారు. వారు సంకలనం చేసిన సైన్స్, నాన్‍-సైన్స్ పారానార్మల్‍ చాలా విలువైన వ్యాస సంకలనం.


కడు పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చిన ఈ యోధుడు కోట్లాది రూపాయలు పోగు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభించారు. పని, పని, పని అంటూ పనిని ప్రేమించిన నరసింహయ్య కర్నాటక లోనూ, తద్వారా దేశంలోనూ సైన్స్ ప్రచారానికీ, మూఢనమ్మకాల నిర్మూలనకు చేసిన కృషి విశేషమైనది. హాస్యాన్ని అమితంగా ఇష్టపడే నరసింహయ్య మృదుభాషి. అంతేకాదు పట్టుదల అనంతం. 2005 జనవరి 31న హెచ్‍.ఎన్‍. కనుమూసినా – ఆయన పోరాటశీలం, సైన్స్ దృష్టి ప్రస్తుత కాలానికీ, ఈ ఆధునిక సమాజానికీ ఎంతో అవసరం. (వీరి స్ఫూర్తిని మననం చేసుకుంటూ శతజయంతి సంవత్సరం ఇటీవలే ముగిసింది. వారి వర్థంతి సందర్భంగా సైన్స్ అండ్‍ హ్యుమానిజం వ్యాసానికి తెలుగు అనువాదం వచ్చే సంచికలో.)


నాగసూరి వేణుగోపాల్‍,
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *