తెలంగాణా ఎత్తిపోతల జలపాతం

ఎవరైనా ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే ఠక్కుమని నాగార్జునసాగర్‍ దగ్గరుందని చెప్తారు. కాని, మెదక్‍ జిల్లాలో ఉన్న జహీరాబాద్‍ దగ్గర కూడా అదే పేరుతో మరో జలపాతముందని ఎవరూ చెప్పలేరు. అందరికీ తెలిసిన ఎత్తిపోతల జలపాతం రాతి గుట్టల మీద నుంచి దూకితే మనం తెలుసుకోబోతున్న జలపాతం రాతిమట్టి గుట్టల మీది నుంచి దూకుతుంది. ఈ ఎత్తిపోతల జలపాతం మూడు జలపాతాల సముదాయం. తూర్పు నుంచి పడమర వైపు వడివడిగా ప్రయాణిస్తున్న వాగు మూడు పాయల జలపాతంగా మారగా, దీనికి కుడివైపు నుంచి జలజల పారుతున్న ఒక ఏరు మొదటి జలపాతం ప్రవాహంలోకి దూకుతున్నది. ఈ రెండు జలపాతాలు కలిసిపోయి ఒకే ప్రవాహంగా మారి ఒక ఫర్లాంగు దూరం ఎత్తైన మట్టి గుట్టల మధ్య ప్రవహించి, అక్కడ ఒక చదునైన 30 మీటర్ల పొడవైన బండ మీది నుంచి 40 అడుగుల లోతున లోయలోకి దూకుతుంది. పచ్చని ఇరుకైన లోయలో కన్పించే ఈ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. ఈ జలపాతం అంచునే కర్ణాటక రాష్ట్రం ఉంది.


ఈ ప్రాంతపు మట్టి గుట్టల మధ్య చిక్కుకుపోయినట్లు కనిపించే చెరువు, భూమినుంచే ఇటుక రాళ్ళను చెక్కుకొని వాటితోనే ఇళ్ళు కట్టుకోవడం, మెట్ట పంటలు, చిన్న చిన్న లంబాడి తండాలు… ఈ విశేషాల మధ్య చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆసక్తి, సమయం ఉన్నవారు పక్కనున్న మొగ్డంపల్లి మీదుగా పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి గొట్టంగుట్ట అనే మరో పర్యాటక స్థలాన్ని దర్శించవచ్చు. హైదరాబాద్‍ నుంచి వెళ్ళేవారు దారిలో నందికందిలో నక్షత్రాకార శివాలయం (వేయేళ్ళనాటిది) చూడవచ్చు. దేశంలో మొట్టమొదటి శాస్త్రీయ పట్టణమైన సదాశివపేటను చూడవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఆర్గానిక్‍ హోటల్‍ జహీరాబాద్‍లోనే ఉంది. కాబట్టి అక్కడ ఆర్గానిక్‍ ఫుడ్‍ లాగించేయొచ్చు. ప్రత్యామ్నాయంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ వారి హరిత హోటల్‍ కూడా అక్కడే ఉంది.


ఈ ఎత్తిపోతల హైదరాబాద్‍కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎటునుంచి వెళ్ళేవారైనా ముందు ముంబై రహదారిలో ఉన్న జహీరాబాద్‍కు రైలులోగాని, బస్సులోగాని, ప్రైవేటు వాహనంలోగాని చేరుకోవాలి. ఆ తరువాత పది కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ప్రైవేటు వాహనదారులకు తప్ప మిగతావారికి ఆటోలే శరణ్యం. జహీరాబాద్‍ రైల్వే ట్రాక్‍ దాటిన వెంటనే ఎడమ వైపుకి తిరిగి హోతి-బి, పర్వతాపూర్‍, ఉప్పు తండాలు దాటి ఎత్తిపోతలను చేరుకోవచ్చు.

ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078

(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29.
తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *