టంగ్‍ యంగ్‍

చాలా కాలం క్రితం చైనా దేశంలో టంగ్‍ యంగ్‍ అనే పదేళ్ళ కుర్రవాడు ఉండేవాడు. ఒక అవిటి తండ్రి తప్ప అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. ఆ అవిటి తండ్రి కూడా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో అవస్థ పడేవాడు. రోజంతా కుక్కి మంచంలో పడుకొని మూలుగుతూ ఉండేవాడు. దాంతో సంసార భారమంతా పాపం టంగ్‍ యంగ్‍ మీద పడింది. పసివాడయినా టంగ్‍ యంగ్‍ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాదు. తోటి పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటే, టంగ్‍ యంగ్‍ మటుకు ఎక్కడో అక్కడ కూలీ చేసి నాలుగు డబ్బులు గడించేవాడు. ఆ డబ్బుతో తం డ్రీ కొడుకుల పొట్టలు గడిచేవి. కొద్దోగొప్పో మిగిలితే అది తండ్రి మందులకు ఖర్చయి పోయేది.

కొంతకాలం ఇలా గడించింది. టంగ్‍యంగ్‍ తం డ్రికి రోగం మరీ ముదిరిపోయి ఆయన చచ్చిపోయాడు. తండ్రి అంత్యక్రియలు చెయ్యడానికి టంగ్‍ యంగ్‍ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అమ్మ డానికి కూడా ఇంట్లో ఏమీలేవు. అందుకే టంగ్‍ యంగ్‍ తన్నుతాను ఒక పొరుగూరి ధనిక వర్తకుడికి అమ్మేసుకొన్నాడు. తన దగ్గర జీతం లేకుండా మూడు సంవత్సరాలు వెట్టిచాకిరి చెయ్యాలన్న షరతు విధించి, ఆ వర్తకుడు టంగ్‍ యంగ్‍కు కావలసిన డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో టంగ్‍ యంగ్‍ తండ్రి అంత్యక్రియలు జరిపాడు. తరవాత పొరుగూరి వర్తకుడి దగ్గర బానిసగా కుదరడానికి బయలుదేరాడు. పొరుగూరికి వెళ్ళాలంటే అడవిదాటి వెళ్ళాలి. ఒంటరిగా అడవిలో నడుస్తున్న టంగ్‍ యంగ్‍కు భయం వేసింది. అడవిలో తనను ఏ సింహమో, పులో మింగేస్తుందని గజగజ వణికిపోయాడు. అలా భయంతో బిక్కచచ్చి పోయి అడుగులో అడుగు వేసుకొంటూ పోతున్న అతని దగ్గరికి ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చింది. ఆకుక్కను చూడగానే టంగ్‍ యంగ్‍కు ప్రాణం లేచి వచ్చింది.

ఆప్యా యంగా దాని మెడ కౌగలించుకొన్నాడు. కుక్క కూడా ప్రేమగా అతని చెంపలను నాకింది. అడవిలో తనకు నేస్తం దొరికినందుకు టంగ్‍ యంగ్‍ మురిసిపోయాడు. అతనికి కొండంత ధైర్యం వచ్చింది. అడవి దాటి ఆ వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. టంగ్‍ యంగ్‍తో ఉన్న కుక్కను చూసి వర్తకుడు మండి పడ్డాడు. కుక్క అతనితో ఉండటానికి ససేమిరా వల్లకాదన్నాడు. టంగ్‍ యంగ్‍కి ఏడుపు వచ్చింది. కుక్కను కూడా తనతో ఉండనివ్వమని వర్తకుడి కాళ్లావేళ్లా పడి బ్రతిమాలాడు. ‘‘నీకు నేత పని వచ్చా?’’ అడిగాడు వర్తకుడు. ‘‘మా ఊళ్లో ఉన్నప్పుడు, ఎక్కువకాలం ఒకసాలెవాడి దగ్గరే కూలీ చేశాను’’ అన్నాడు టంగ్‍ యంగ్‍.

‘‘అయితే సరే, నేను నూలు ఇస్తాను. మూడు రోజుల్లోగా నాకు 30 గజాల బట్ట నేసి ఇవ్వాలి. అలా నేసి ఇస్తే నీ కుక్క నీతో ఉంటుంది. లేకపోతే దాన్ని అడవిలోకి తరిమేస్తాను’’. అన్నాడు. 30 గజాల బట్ట నేయడం మాటలతో అయ్యేపని కాదు. ఇంకో మనిషి తోడు లేకుండా అసలు వీలుకాదు. అందుకే వర్తకుడికి ఏ సమాధానం ఇవ్వాలో, టంగ్‍ యంగ్‍కి పాలుపోలేదు. ఇంతలో కుక్క అతని అరచేతిని ప్రేమగా నాకింది. దాంతో అతని చేతుల్లోకి కొత్త శక్తి వచ్చినట్లు అయింది. వెంటనే టంగ్‍ యం గ్‍ వర్తకుడి షరతుకు ఒప్పుకొ న్నాడు. టంగ్‍ యంగ్‍ రోజంతా పొలంలో, ఇంట్లో పని చెయ్యాల్సి వచ్చేది. పగలంతా చాకిరి చేసిన టంగ్‍ యంగ్‍ రాత్రి అయ్యేసరికి బాగా అలసి పోయేవాడు. నిద్ర కూరుకుపోతున్న కళ్లతో నేత గదిలోకి వచ్చే వాడు. బట్ట నేద్దామని మగ్గం దగ్గర కూర్చునేవాడు. నిద్ర ఆపుకోలేక పోయేవాడు. మగ్గం మీద పడి అలాగే నిద్రపోయేవాడు. తెల్లగా తెల్లవారాక అతనికి మెలకువ వచ్చేది. వెంటనే పొలంలోకి పరిగెత్తేవాడు. రెండు రోజులు ఇలా గడిచిపోయాయి. తెల్లవారితే వర్తకుడికి నేసిన బట్టను ఇవ్వాలి. లేకపోతే కుక్కను తరిమేస్తాడు. టంగ్‍ యంగ్‍కి ఏం చెయ్యాలో తోచలేదు. కాసేపు కుక్కను కౌగలించుకొని ఏడ్చాడు. తరవాత నేత పని మొదలు పెట్టాడు. కాని నిద్రముంచుకు వచ్చింది. అలాగే మగ్గం మీద పడి నిద్రపోయాడు. అయితే రాత్రంతా మగ్గం తిరుగుతున్నట్టు, బట్ట తయారవుతున్నట్టు, అతను కలలు కంటూనే ఉన్నాడు. తన చెంపలను ఎవరో నాకుతున్నట్లనిపించింది టంగ్‍ యంగ్‍కి, వెంటనే అతనికి మెలకువ వచ్చింది. ఎదురుగా తన కుక్క కనిపించింది. రాత్రంతా నిద్రపోయినందుకు తనను తాను తిట్టుకొ న్నాడు. కుక్కకి తనకూ ఋణం తీరిపోతున్నందుకు, ఎక్కడలేని బాధా కలిగింది. దాన్ని కౌగిలించుకొని భోరున ఏడ్చాడు. కుక్క తన నాలికతో టంగ్‍ యంగ్‍ కన్నీళ్లు తుడిచింది. మూతితో పొడిచి అతని దృష్టిని మగ్గం వైపు మళ్లించింది. మగ్గం వైపు చూసిన టంగ్‍ యంగ్‍ ఆశ్చర్యానికి అంతులేదు. చక్కగా నేసిన బట్ట మగ్గం పక్కనే మడత పెట్టి ఉంది. ఇంతలో తలుపు చప్పుడయింది. టంగ్‍ యంగ్‍ తలుపు తీశాడు. ఎదురుగా అతని యజమాని నించుని ఉన్నాడు. అతని చేతిలో కుక్కను కట్టెయ్యడానికి ఒక గొలుసు కూడా వుంది. గదిలోకి వచ్చిన యజమాని కూడా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. మగ్గం దగ్గర ఉన్న బట్టను ఒక్క అంగలో వెళ్లి అందుకొన్నాడు. గబగబా తన మూరతో బట్టను కొలిచి చూసు కున్నాడు. సరిగ్గా 30 గజాలూ ఉంది. ఆ బట్టను చంకలో పెట్టుకొని బయటకు పోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచి పోయాయి. ఒకనాడు. వర్తకుడు టంగ్‍ యంగ్‍ను పిలిచాడు. అతనికి ఒక పెద్ద మూట అందించాడు. ‘చూడు, ఈ మూటలో పట్టుదారపు కండెలు ఉన్నాయి. వచ్చేవారం నాటికల్లా నాకు 50 గజాల పట్టు బట్ట కావాలి. అలా బట్ట తయారు చేసి ఇచ్చావో, నిన్నూ నీ కుక్కనీ వదిలేస్తాను. లేకపోతే నీ కుక్కను అడవి లోకి తరిమేస్తాను. నువ్వు మటుకు మూడు సంవత్సరాలకు బదులు 6 సంవత్స రాలు నా దగ్గర వెట్టిచాకిరి చె య్యాల్సి వస్తుంది’ అన్నాడు. టంగ్‍ యంగ్‍కి నోట మాట రాలేదు. మౌనంగా ఆ దారపు కండెలు అందుకొని వెళ్ళిపోయాడు.

వర్తకుడు సంతోషంతో చంకలు గుద్దు కొన్నాడు. ఒకవేళ టంగ్‍ యంగ్‍ 50 గజాల పట్టుబట్టను త యారు చెయ్యగలిగితే వర్తకుడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. ఎందుకంటే, ఆ బట్టను అమ్మి వచ్చిన డబ్బుతో అతను మంచి వయసులో ఉన్న 10 మంది బానిసలను కొనుక్కోవచ్చు. టంగ్‍ యంగ్‍ గనక బట్టను నెయ్యలేకపోతే అతని చేత మరో మూడు సంవత్సరాల పాటు చక్కగా చాకిరి చేయించుకోవచ్చు. ఎటు చూసిన అతనికి లాభమే. టంగ్‍ యంగ్‍కి రోజంతా ఇంట్లోనో, పొలంలోనో పనితో సరిపోయేది. రాత్రి అయ్యేసరికి ఒళ్లంతా హూనమయ్యేది. ఆవురా వురు మంటూ నాలుగు ముద్దలు తిని, నేతగదిలోకి పరిగెత్తే వాడు. ఎంత ఆపుకొందామనుకొన్నా కళ్లు మూతలు పడిపోయేవి. ఇలా ఆరు రోజులు గడిచి పోయాయి. తెల్లవారితే వర్తకుడికి 50 గజాల పట్టు బట్ట ఇవ్వాలి. లేకపోతే తను తన నేస్తం లేకుండా ఒంటరిగా ఇక్కడ ఆరు సంవత్సరాలు గొడ్డు చాకిరీ చెయ్యాలి. ఈ ఆలోచనరాగానే టంగ్‍ యంగ్‍ చెంపల మీద కన్నీళ్లు బారాయి. అతనికి తన ఊరు, నది, తండ్రి జ్ఞాపకం వచ్చాయి. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతలో తలుపు తోసుకొని అతని కుక్క ఆ గదిలోకి వచ్చింది. టంగ్‍ యంగ్‍ కుక్కను కౌగలించుకొని పెద్దగా ఏడ్చాడు. తరవాత మగ్గం దగ్గర కూర్చున్నాడు. కాస్త బట్ట నేశాడు. అది బాగా రాలేదు. కోపంతో, దుఃఖంతో జుట్టు పీక్కున్నాడు. అలాగే మగ్గం మీద పడి నిద్రపోయాడు. తలుపు దడ దడ లాడటంతో టంగ్‍ యంగ్‍కి మెలకువ వచ్చింది. బితుకు బితుకు మంటూ వెళ్ళి తలుపు తీశాడు. లోపలికి వచ్చిన వర్తకుడిని మగ్గం దగ్గర ధగ ధగ మెరిసిపోతున్న పట్టుబట్ట కనిపించింది. ఆశ్చర్యంతో అతడు తల మునలకలయ్యాడు. గబ గబా బట్టను కొలుచుకున్నాడు. సరిగ్గా 50 గజాలూ వుంది. ‘‘సరే, నేను మంచివాణ్ణి కాబట్టి అన్న మాట నిలబెట్టుకొం టున్నాను. నువ్వు, నీకుక్క మీ ఇష్టం వచ్చిన చోటికి పొండి’’ అన్నాడు. టంగ్‍ యంగ్‍కి బట్ట ఎలా తయారయిందీ అర్థం కాలేదు. అయినా దాన్ని గురించి ఆలోచిస్తూ అక్కడ నిలవ బుద్ధికాలేదు. వెంటనే కుక్కను తీసుకొని బయటకు పరిగెత్తాడు. టంగ్‍ యంగ్‍, కుక్క అడవిలో రెండు రోజులు నడిచి అతని ఊరికి దగ్గరగా వచ్చారు. ముందు నడుస్తున్న టంగ్‍ యంగ్‍ చొక్కాను, తన నోటితో లాగి కుక్క అతన్ని ఆపింది. టంగ్‍ యంగ్‍ వెనక్కి తిరి గాడు.

‘‘టంగ్‍ యంగ్‍! నేను మామూలు కుక్కను కాను. దేవలోకపు కుక్కను. నువ్వు అడవిలో భయపడుతుంటే జాలివేసి, నీకు తోడుగా వచ్చాను. వర్తకుడి మగ్గం మీద బట్టలు నేసింది కూడా నేనే’’ అంటూ కుక్క అతనికి ఒక మూట అందించింది. ఆ మూటలో 50 గజాల పట్టు బట్ట ఉంది. దాని మీద జరీ అల్లిక ఉంది. టంగ్‍ యంగ్‍ తన కళ్లను, చెవులను కూడా నమ్మలేకపోయాడు. కుక్క మెడను ఆప్యాయంగా కౌగిలించుకొని దానిని ముద్దు పెట్టుకొన్నాడు. కుక్క అతని చెంపలను నాకింది’’. టంగ్‍ యంగ్‍! ఈ బట్టను అమ్ముకొని, వచ్చిన డబ్బుతో ఏ దన్నా వ్యాపారం చేసుకో. నీలాంటి మంచి కుర్రవాడికి, ఎప్పటికీ మంచే జరుగుతుంది’’ అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.

-సురేష్‍ ఆత్మారామ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *