(అక్టోబర్ సంచిక తరువాయి)
5జీ (భవిష్యత్ తరం) :
5జీ ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధిదశలో ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్లు చైనా, దక్షిణ కొరియాలాంటి దేశాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టాయి. 4జీతో పోలిస్తే, 5జీ చాలా మెరుగైనది మరియు వినియోగదారులకు మరింత వేగవంతంగా సేవలు అందించగలదని సాంకేతిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు :
4జీ తో పోలిస్తే 5జీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వేగం విషయానికొస్తే 5జీ వేగం, 4జీ కన్నా 35 రెట్లు ఎక్కువ. 5జీ ద్వారా లక్షించిన గరిష్ఠ వేగం 35-46 జీబీపీఎస్. అయితే ఒక ప్రభుత్వ కమిటీ అధ్యయనం ప్రకారం నెట్‍వర్క్ రద్దీగా ఉన్న సమయంలో డేటా వేగం 2-20 జీబీపీఎస్‍గా ఉంటుందని అంచనా. ఇదే సమ యంలో 4జీ వేగం మన దేశంలో 6-7 ఎంబీపీఎస్‍గానూ, విదేశాలలో 25 ఎంబీపీఎస్‍గానూ ఉంటుందని తెలిపింది.
4జీ లేటెన్సీ 200 ఎమ్‍ఎస్ (మిల్లీ సెకండ్స్) కాగా, 5జీ లేటెన్సీ కేవలం 1 ఎమ్‍ఎస్ మాత్రమే. ఈ విధమైన లక్షణాల వల్ల మనం 5జీ ద్వారా అంతర్జాలం నుండి దేన్నైనా త్వరితగతిన డౌన్లోడ్ (దిగుమతి) మరియు అప్లోడ్ (ఎగుమతి) చేయవచ్చు.
ఒకే పౌనఃపున్యం వద్ద అసంఖ్యాకంగా వినియోగదారులు 5జీ సేవలను పొందవచ్చు. (Higher connection density) 4జీలో డిజిటల్ వేవ్ సిగ్నల్స్ను వినియోగించగా, 5జీలో మిల్లీమీటర్ వేవ్ సిగ్నల్స్ని వినియోగించారు. ప్రతి నిర్దిష్ట ప్రాంతాన్ని కొన్ని చిన్న చిన్న విభాగాలుగా (Small Cells)విభజించి ప్రతి చిన్న ప్రాంతాన్ని కూడా చేరే విధంగా 5జీలో వినూత్న సాంకేతికతను పొందుపరిచారు. అదేవిధంగా Massive Mimo (Multple input and multiple out put) లై-ఫై (Li-fi) తదితర అధునాతన సాంకేతికతలను ప్రవేశపెట్టారు.
మరెన్నో ప్రయోజనాలు :
5జీ యొక్క సైబర్ – ఫిజికల్ నెట్‍వర్క్ అనేది కేవలం ప్రజలను ఒకరితో మరొకరిని అనుసంధానించడమే కాకుండా యంత్రాలు (Machines), వస్తువులు (objects), పరికరాలను (objects) కూడా ఒకదానితో మరొకటి అంతర్గత అనుసంధానం చేయడంతో పాటు, వాటిని నియంత్రించడం వల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసి కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తాయి.
5జీ టెక్నాలజీ ఇంటర్నెట్ అఫ్‍థింగ్స్ (IOT), రోబోటిక్స్, మెషిన్ లర్నింగ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) తదితర సమకాలీన టెక్నాలజీలన్నిటికి వెన్నెముకగా వ్యవహరిస్తుంది. తద్వారా ఈ క్రింది రంగాల్లో బహుళ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
ఆరోగ్యరంగం :
5జీ ద్వారా ఔషధ తయారీ రంగంలోని పరిశోధన మరియు అభివృద్ధి ఖర్చులను తగ్గించవచ్చు. ప్రమాదకరం కానీ జబ్బుల చికిత్స కొరకు వైద్యులను ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారా కలిసి సలహాలు, సూచనలు పొందవచ్చు. రోబో టిక్స్ విధానంలో శస్త్రచికిత్సలను మరింత అభివృద్ధి పరచవచ్చు. శారీరక సామర్థ్యం మరియు ఆరోగ్య సూచికలను (Health and fitness moniters) మరింత సమర్థవంతంగా పరిశీలించవచ్చు.
ఆకర్షణీయ నగరాలు మరియు గృహాలు :
5జీ ద్వారా ఇంటి నుండే సుదూర ప్రాంతాల్లోని స్నేహితులు, బంధువులతో ఎలాంటి అవరోధాలు లేకుండా దృశ్యసహితంగా (వీడియోకాలింగ్) మాట్లాడు కోవచ్చు. ఇంటిలోని వివిధ వస్తువులను, పరికరాలను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. 5జీ ఆధారిత టెలివిజన్ సెట్లు ఈనాటి హెచ్‍డీ, 4కే టీవీలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పిక్సెల్‍లతో నాణ్యమైన ప్రసారాలు అందిస్తాయి.
రవాణా రంగం :
వాహనాలను ట్రాఫిక్ సిగ్నల్స్ నుండి, రోడ్డు ప్రక్కనున్న సూచికల నుండి వచ్చే సమాచారాన్ని స్వీకరించే విధంగా అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. మంచి సామర్థ్యంతో పనిచేసే ట్రాకర్స్ (మార్గ సూచీలు)తో 5జీని జీపీఆర్‍ఎస్ విధానంతో అనుసంధానించి వాటిని విభిన్న వాహనాలకు అమర్చడం ద్వారా ప్రజాభద్రతను మెరుగుపరచవచ్చు.
వాహనం నుండి వాహనానికి, వాహనం నుండి వస్తువులకు సమాచారాన్ని 5జీ ద్వారా అనుసంధానించడం వల్ల డ్రైవర్ రహిత వాహనాలతో పాటు, అనేక ఇతర కొత్త ఆవిష్కరణలు వాస్తవరూపం దాలుస్తాయి. రోడ్డు భద్రతను కూడా గణనీయంగా మెరుగుపరచవచ్చు. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ అసోసియేషన్ వారి (జీఎస్‍ఎమ్) అధ్యయనం, 5జీని ప్రవేశపెట్టడం ద్వారా ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల సంఖ్య 2025 నాటికి ఇప్పుడున్న దానికి మూడురెట్లు అనగా 25 బిలియన్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
అతి తక్కువ విద్యుత్ వినియోగం :
అతి తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ ఫలితాలు సాధించడం 5జీ విశిష్టత. ఉదాహరణకు 4జీతో 300 హెచ్‍డీ సినిమాలను డౌన్‍లోడ్ చేయడానికి ఒక కిలోవాట్ అవర్ (కేడ్‍బ్ల్యూహెచ్) విద్యుత్ అవసరమైతే 5 జీలో ఒక్క కేడబ్ల్యూహెచ్‍తోనే 5000 అల్ట్రా హెచ్‍డీ సినిమాలు డౌన్‍లోడ్ చేయవచ్చు.
వ్యవసాయరంగం :
నేలలో అమర్చే సెన్సర్లు 5జీ సాంకేతికతను వినియోగించుకొని భూసారాన్ని అంచనా వేస్తాయి. తెగుళ్ళను కూడా అరికడతాయి.
విద్యారంగం :
విద్యారంగంలో 5జీ రిమోట్ బోధనాభ్యాసాలను సుల భతరం చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం తమ ఉపాధ్యాయులతో తక్షణం సంభాషించగలుగుతారు. అచ్చం తరగతి గదిలో ఉన్న అనుభూతిని 5జీ ఇస్తుంది. కాబట్టి కొత్త తరహా టెలీ బోధనాభ్యాసాలు అంకురిస్తాయి. దూరవిద్య కొత్త పుంతలు తొక్కుతుంది. వర్చువల్ రియాలిటీ విస్తరించి ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పటిష్టమైన సంబంధం ఏర్పడుతుంది.
పర్యావరణ హితకారిణి :
5జీ పర్యావరణానికి ఇతోధికంగా మేలు చేకూరుస్తుంది. నేటి ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో ప్రతి చిన్న పనికీ అంతర్జాలం అవసరమౌతోంది. రానున్న రోజుల్లో అంతర్జాల వినియోగం మరింత పెరగనుంది. ఈ గిరాకీని తీర్చేది 5జీ మాత్రమే. మొబైల్ ఫోన్ల ద్వారా సంభాషణకు, వేలాది పరికరాల అనుసంధానానికి 5జీ సేవలు అనివార్యం కానున్నాయి. ఈ సేవలు పర్యావరణానికి మేలు చేకూరుస్తాయి. వీటి వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) విస్తరించి కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. జల, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. 5జీతో పనిచేసే ఐఓటీ 2030 కల్లా కర్బన ఉద్గారాలను 15 శాతం తగ్గిస్తుందని ఎరిక్‍సన్ నివేదిక తెలిపింది.
భారత్‍లో 5జీని ప్రవేశపెట్టేందుకు గాను తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ‘‘ఎజె పాల్‍రాజ్’’ అధ్యక్షతన ఒక కమిటీని 2017లో నియమించగా, ఈ కమిటీ 24 ఆగస్టు 2018 నివేదిక సమర్పించింది. 5జీని ప్రవేశపెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మేరకు లబ్ధి కలిగే అవకాశం ఉందని ఈ కమిటీ తెలిపింది. టెలికాంగ్రూపు ఎరిక్‍సన్ వారి నివేదిక ప్రకారం 5జీ ఆధారిత డిజిటలైజేషన్ రెవెన్యూ 2026 నాటికి ఒక్క ఇండియాలోనే 27 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది.
ప్రతికూలతలు :
ఖర్చుతో కూడిన అవస్థాపక సౌకర్యాలు :
5జీని వినియోగదారులకు అందించాలంటే క్షేత్ర స్థాయి నుండి సమాచార ప్రసార వ్యవస్థలో మౌళికమైన మార్పులు తీసుకురావాలి. సుదూర ప్రాంతాలకు 5జీ రూపంలో డేటాను ప్రసారం చెయ్యాలంటే మెరుగైన మౌళిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందన్నది సాంకేతిక రంగ నిపుణుల అభిప్రాయం. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక 5జీకి కావలసిన ఆధునిక మౌళిక వసతులను మెరుగు పరిచేందుకు 60-70 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులు అవసరమని పేర్కొంది. ఇవి మన దేశానికి ఆర్థికంగా మరింత భారంగా మారవచ్చు.
సంక్లిష్టమైన నిర్వహణావ్యవస్థ :
5జీ నిర్వహణలో ఎన్నో విస్తృతమైన అనువర్తనాలు (Aplications) ఉన్నాయి. వాటి నిర్వహణ ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. ఈ కారణంగానే 5జీలో కొన్నిసార్లు నెట్‍వర్క్ విఫలం కావడం, నెట్‍వర్క్ను అదుపులోకి తీసుకొని సైబర్ దాడులకు పాల్పడడం వంటి హానికరమైన దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. 5జీ నిర్వహణా వ్యవస్థలో విభిన్న రకాల యంత్రాలు, వాటి విడి భాగాలు (Body of Systems), నెట్‍వర్కస్ మరియు వాటికి సంబంధించిన మౌలిక వసతులనేవి నిరంత రాయంగా సేవలందిస్తూ ఒకదేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజారోగాన్ని మరియు భద్రతను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
5జీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా సింహభాగం చైనాకు సంబంధించిన కంపెనీలే నియంత్రిస్తున్నాయి. ఇలాంటి కీలక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనాపై ఆధారపడి నట్లయితే దేశ భద్రత విషయంలో రాజీ పడినట్లేనన్న ఉద్దేశ్యంతో అమెరికా, చైనాకు చెందిన హువావి కంపెనీకి చెందిన 5జీ కాంట్రాక్టులన్నీ తమ దేశంలో రద్దు చేసింది. మన దేశం కూడా ఇటువంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది.
ఆర్థికపరమైన అవరోధాలు :
సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI)5జీ వల్ల టెలికాంరంగ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే ప్రమాద ముందన్న ఆందోళనను వ్యక్తీకరించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 5జీ సాంకేతిక పరిజ్ఞానం పొందాలంటే దక్షిణ కొరియా, అమెరికాలతో పోలిస్తే మనదేశంలో 30 నుండి 40% అధిక ధరను వెచ్చించాలని సీఓఏఐ (COAI) పేర్కొనడం గమనార్హం. అసలే అప్పుల్లో మునిగిన భారతీయ టెలికాంరంగ ఆర్థికవ్యవస్థ మరింత భారాన్ని ఎలా మోయగలదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు :
ప్రస్తుతమున్న 4జీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ ఫోన్ల కన్నా మరింత మెరుగైన ప్రత్యేకతలు అనగా 5జీ ఫోన్లలో అగుమెంటెడ్ రియాలిటీస్ (AR), వర్చువల్ రియాలిటీస్ (VR) అనువర్తనాల (Applications)తో పనిచేసేందుకు అదనపు కెమెరాలు మరియు సెన్సార్లు ఆవసరం. తద్వారా 5జీ ఫోన్లు 4జీ ఫోన్ల కన్నా మరింత ప్రియం కానున్నాయి.
ఇంటర్నేషన్ టెలికాం యూనియన్ (ITU) 1శాతం మొబైల్ బ్రాడ్ బాండ్ ధరలు పెరిగినట్లయితే తత్ఫలితంగా 0.13% దత్తత రేటు (adoption rate) తగ్గిపోతుంది. (దత్తత రేటు అనగా ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు సంపాదించి ఉపయోగించుకునే వేగం) అదేవిధంగా మొబైల్ బ్రాడ్‍బ్రాండ్ దత్తతరేటు 1శాతం తగ్గితే 0.19శాతం జీడీపీలో తలసరి ఆదాయం తగ్గుతుందని తెలిపింది.
5జీని ప్రవేశపెట్టడం వల్ల 30-50 శాతం ధరలు పెరిగినట్లయితే 3.9-6.5 శాతం వరకు మొబైల్ బ్రాడ్‍బాండ్ దత్తత రేటు క్షీణిస్తుంది. తత్ఫలితంగా జీడీపీలో తలసరి ఆదాయం 0.7-1.2% వరకూ తగ్గిపోయే అవకాశం ఉందన్నది ఐటీయూ అంచనా.
చివరిగా :
భారతదేశంలోని టెలికాం నియంత్రణా సంస్థలు, 5జీ ద్వారా ఎదురయ్యే సరికొత్త భద్రతాపరమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు వీలుగా రూపాంతరం చెందాలి. ఇందుకొరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరముంది. 5జీ ద్వారా అందించే సేవలను మరియు మౌళిక వసతులను సమగ్రపరిచేందుకు సార్వజనీన ప్రమాణాలను, పక్రియలను రూపొందించాలి.
5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కంపెనీలు భారతదేశ భద్రతకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా ఇతరులకు అక్రమంగా చేరవేయమని, తమద్వారా ఎలాంటి గూఢాచర్య కార్యకలాపాలు జరగవని నిర్ధారిస్తూ భారత ప్రభుత్వంతో “No-Back Door” ఒప్పందంపై సంతకం చేయాలి.
5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రారంభంలో కలిగే అధిక ఆర్థిక భారాన్ని తగ్గించడానికి డ్రోన్లు మరియు బెలూన్ల ద్వారా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అంతర్జాల సదుపాయం అన్నిచోట్లకూ విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలి. 5జీ సాంకేతిక పరిజ్ఞానికి సంబంధించిన క్లిష్టమైన మౌళిక వసతులు మరియు పరికరాలను దేశీయంగానే అభివృద్ధి పరిచేవిధంగా పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి ప్రభుత్వం మరింత మెరుగైన ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
-పుట్టా పెద్ద ఓబులేసు,
9550290047