ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’

గణగణగంటలు మ్రోగే గుళ్లు గోపురాలు, అజాలు వినిపించే గుంబజ్‍లు మినార్లు, ఆదివారం ప్రాతఃకాలం ప్రార్థనలతో కళకళలాడే చర్చ్లు, చాపెల్స్లు లేకపోతే ఈ హైద్రాబాద్‍ నగరం ఇంత అందంగా కనబడేదా? హారం ఒకటే కాని అందులోని పువ్వుల రంగులు మాత్రం వేరువేరు.
‘‘తూ హిందు బనేగ న / ముసల్మాన్‍ బనేగ
ఇన్సాన్‍ కి ఔలాద్‍ హై / ఇన్సాన్‍ బనేగ’’

సరిగ్గా ఈ తత్వాన్నే సూఫీ ఇజం ప్రచారం చేసింది. వైష్ణవ మత ప్రచారానికి ఆళ్వార్లు ఎలాగో, శైవ మత ప్రచారానికి నాయనార్లు ఎలాగో, ఇస్లాంను ప్రచారం చేసిన వారే సూఫీ తత్వవేత్తలు. వీరు కాలధర్మం చెందాక భక్తులు వీరికి సమాధులను నిర్మించి ప్రార్థనలు, కీర్తనలు చేసారు. ఉర్దూలో వాటిని దర్గాలు అంటారు. నగరంలో పహాడీ షరీఫ్‍ దర్గా, జాహంగీర్‍ పీర్‍ దర్గా, మౌలాలీ దర్గా, యూసుఫియాన్‍ దర్గా, హుస్సేన్‍ షా వలీ దర్గా చాలా మహిమ కల్గిన, పవిత్రమైన దర్గాలు. హిందూ ముస్లింలందరూ భక్తి ప్రపత్తులతో వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి ఫాతెహాలను సమర్పించి, మన్నత్‍లను మొక్కు కుంటారు. హిందూ పూజా విధానంలోని పద్దతులు, పువ్వులను సమర్పించటం, దీపాలు అగరొత్తులు వెలిగించటం, ప్రసాదం పంచటం లాంటి వన్నీ మనం ఈ దర్గాలలో చూడవచ్చు. హిందూ, ముస్లిం సమైక్యతకు సరిఐన సంకేతాలు ఈ దర్గాలు.


సరే ఇక పహాడీ షరీఫ్‍కు వెళ్దాం పదండి.
పహాడీ షరీఫ్‍ అంటే పవిత్రమైన గుట్ట అని అర్థం. చార్మినార్‍ నుండి 85వ నంబర్‍ బస్సు ఎక్కితే అలియాబాద్‍, ఫలక్‍నుమా, చెన్నరాయని గుట్ట అంటే చంద్రాయణ్‍ గుట్ట, బార్కాస్‍ దాటితే శ్రీశైలం వెళ్లే దారిలో కుడివైపు ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఈ పహాడీ షరీఫ్‍ కనబడుతుంది. అంచెలంచెలుగా వొంపుసొంపులు తిరుగుతూ రాతిమెట్లు పైవరకూ ఉంటాయి. వాటిపై భక్తి ప్రపత్తులతో పాదం మోపగానే ప్రతి రాయి ‘‘రామపాదం సోకిన రాయిలా’’ మనల్ని పులకింపచేస్తుంది.
ఇంతకూ దీని మహత్తు ఏమిటో?


హైద్రాబాద్‍, హైద్రాబాద్‍ నగరంగా రూపొందక ముందు కాకతీయుల కాలంలో ఇదొక చిన్న పల్లె. దాని ముద్దుపేరు మంగళాపురం. ఆ పల్లెను ఒక గొల్లరాణి పరిపాలించేది. ఆమె ఒక కొండమీద ఒక చిన్న కోటను కట్టించింది. ఆ యాదవరాణి నిర్మించిన కోటను స్థానికులు ‘‘గొల్లకొండ’’ అని పిలవసాగారు. తర్వాత పొరుగునే ఉన్న బలమైన రాజ్యం బహమనీ నవాబు మొదటి మహ్మద్‍షా ఆ యాదవరాణిని ఓడించి ఆ గొల్లకొండను గోల్‍కొండ అన్నాడు. మంగళాపురం అని నోరు తిరగక తన పేరు వచ్చేటట్లు మహమ్మద్‍ నగర్‍ అన్నాడు. కుతుబ్‍షాహీల కాలంలో మహమ్మద్‍ నగర్‍ మళ్లీ పేరు మార్చుకుని హైద్రాబాద్‍గా అవతరించింది.
సరే మళ్లీ కొంచెం వెనక్కి వెళ్దాం. కాకతీయుల కాలంలో మంగళాపురంలో ఇంకా ముస ల్మానులు ప్రవేశించని కాలంలో సుమారు క్రీ.శ. 1250లో అనగా ఇప్పటికి 665 సం।।ల క్రింద బాబా షర్ఫొద్దీన్‍ అనే సూఫీ యోగి మంగళాపురం లోకి ప్రవేశిం చాడు. అతను అరేబియా దేశస్తుడు. అష్ట కష్టాలు పడి కాలినడకన అంబరాన్ని చుంభించే హిందూకుష్‍ పర్వతాలలోని కైబర్‍, బోలాన్‍ కనుమలు దాటి హిందుస్థాన్‍కు వచ్చి మరొక సూఫీ తత్వవేత్త నిజాముద్దీన్‍ ఔలియాను దిల్లీలో కలిసి ఆయనకు శిష్యుడయ్యాడు. గురువు ఆదేశాల మేరకు దక్కన్‍కు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. అంబరాన్ని చుంబించే వింధ్య పర్వతాలను అధిగమించి, నర్మదా నదిని దాటి దక్షిణదేశ ముఖద్వారం బుర్హాన్‍పూర్‍ ద్వారా మంగళాపురం చేరి మూసీనదికి దక్షిణాన ఉన్న ఒక గుట్టపై నివసించసాగాడు. తనకు తెలిసిన వనమూలికల వైద్యం ద్వారా స్థానిక ప్రజలకు ఆప్తుడయ్యాడు. భాష రానందున మౌనమునిలా ఆ గుట్టపైనే తన ఏకాంత మనో వల్మీకంలో నిరంతర ధ్యానంలో మునిగి తేలేవాడు. పసుల కాపర్లు ఇచ్చే పాలు, పండ్లు అపుడపుడూ స్వీకరించేవాడు. అతను ఏ దేశస్తుడో, ఏ మతమో తెలియని ఆ పల్లె ప్రజలు అతనిని సాధువుగా భావించి పూజించారు.

జో జిస్సే మిలా సీఖా హమ్నే / గైరోఁకోభీ అప్నాయా హమ్నే
(ఎవరు కలిసినా వారి నుండి నేర్చుకున్నాం. ఇతరులను కూడా మనవాళ్లుగా మార్చుకున్నాం)
ఇదీ మన భారతీయ మనస్తత్వం. ఒకరోజు గుట్టక్రింది సమీప గ్రామానికి వచ్చి తనకో సహాయం చేయమని సైగల ద్వారా అభ్యర్తించాడు. చిత్తం అని ప్రజలు వినయంగా చేతులు జోడించారు. కొండమీద ఒక ఆవు చనిపోయింది. దాని అంత్యక్రియలకు మీరు సహాయం చేయాలి అన్నాడు. పదండి అన్నారు ప్రజలు. బాబా షర్పొద్దీన్‍ ముందుకు సాగి గుట్టను అధిరోహిస్తున్నాడు. ప్రజలు గౌరవంగా కాస్తా వెనకగా అనుసరి స్తున్నారు. కొండ పై భాగం చేరుకోగానే ఒక దివ్యశక్తి ఆయన చుట్టూ ఒక వలయంగా కమ్ముకుంది. కండ్లు మిరుమిట్లు గొల్పుతుంటే ఆ శక్తి నెమ్మదినెమ్మదిగా అంతరించింది. దాంతో పాటే బాబా కూడా అంతర్ధానమైనాడు. అదే స్థలంలో ఒక ఆవు నిర్జీవంగా నేలపై పడి ఉంది. దాని తలపై ఒక వస్త్రం కప్పబడి ఉంది. భక్తులు ఆ వస్త్రాన్ని కొంచెం తొలగించి చూడగా ఆ ఆవు తలలో వారికి బాబా ముఖం కనిపించింది. ప్రజలు భక్తి ప్రపత్తులతో అక్కడే సమాధి కట్టారు. పర్షియన్‍ భాషలో సమాధిని ‘‘దర్గా’’ అంటారు.


ఒక ముస్లిం సూఫీ సాధువుకు హిందూ ప్రజలు కట్టిన సమాధిపేరే ‘‘పహాడీ షరీఫ్‍ దర్గా’’. ఆగండాగండి. అప్పుడే అయిపోలేదు. ఈ సందర్భంలో దర్గాకు సంబంధించి మరో రెండు కథలు కూడా చెప్పుకుందాం. ఆరవ నిజాం మీర్‍ మహబూబ్‍ అలీఖాన్‍ బాబా షర్పొద్దీన్‍ భక్తుడు. ఎంత కులాసాల, విలాసాల భోగజీవితం గడిపినా అదే సమయంలో చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా గడిపేవాడు. అది ఆయన జీవన వైరుధ్యం. ఒంటికాలిపై నిలుచుని గంటల తరబడి ప్రార్థనలు చేయడం, రోజుల తరబడి ఉపవాసాలు చేయడం ఆయన విపరీత మనస్తత్వం.
ఆయన బాబా సమాధి వద్ద కొన్ని రోజుల తరబడి ఉండేవాడు. అక్కడ ఆయన ఉన్నన్ని రోజులు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుండేది. అక్కడున్న సమీప గ్రామాలలో హిందువులు, శాఖాహారులు కావున ప్రత్యేకంగా శాఖాహార భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు. భోజనాలకు వచ్చిన వారెవరు మిగిలిన పదార్థాలను ఇంటికి పట్టుకెళ్లరాదనే నియమం ఒకటి అమలులో ఉండేది.


ఒకనాడు ఒక పేద బ్రాహ్మణ బాలుడు తను భోజనం చేసిన తర్వాత మరికొన్ని పదార్థాలను రహస్యంగా తన పంచె చివరలో మూటగట్టుకుని వెళ్లుతుండగా కాపలాదారులు గమనించి అతడిని పట్టుకున్నారు. ఆ సంగతి అక్కడే మకాం వేసిన నవాబుకు కూడా తెలిసింది. ఆ బాలుడిని పిలిపించారు. వాడు రాగానే నవాబుగారి పాదాలపై మోకరిల్లి క్షమించమని ప్రార్థించాడు. అక్కడి కొండ క్రిందనే ఉన్న చిన్న పల్లెలో తన ఇల్లు ఉందని, అక్కడ తన అక్క నిండు గర్బిణిగా ఉండి ఇంతదూరం నడిచి రాలేక తనకు ఈ పని అప్పగించిందని విన్నవించుకున్నాడు. మనస్సు కరిగిన నవాబుగారు వెంటనే సేవకులకు ఆజ్ఞాపించి ఒక పెద్ద వెండి పళ్లెంలో షడ్రుచుల శాఖాహార పదార్థాలను అమర్చి ఆ బాలుడి వెంట వెళ్లి ఆమెకు అందచేయమని అన్నాడు. సేవకులు తిరిగి వచ్చి ఆ బాలుడు చెప్పింది నిజమేనని నవాబుకు తెలియచేసారు. దానితో దయార్ధహృదయుడైన ఆ నవాబు తానున్న అన్ని రోజులు ఆ గర్బిణికి భోజనం సరికొత్త వెండి పళ్లెంలో పట్టుకెళ్లాలని, ఆ పళ్లాన్ని తిరిగి తీసుకు రాకుండా ఆమెకే ఇచ్చి వేయాలని హుకుం జారీ చేసాడు. పైగా ఆ యువతి పండంటి పిల్లడిని కనాలని ప్రతిరోజు బాబా దర్గా వద్ద మొక్కుకునేవాడు.

మరొక మజేదార్‍ కహానీ కూడా వినండి. నవాబ్‍ మహబూబ్‍ అలీగారు ఒకనాడు ఒక బంగారు బాలికను చూసి మనసు పారేసుకుని ఆమె తల్లిని రప్పించి ‘‘నీ కూతుర్ని నాకు నజరానాగా సమర్పించగలవా’’ అని సున్నితంగా అడిగాడు. దాంతో ఆమె ఉబ్బితబ్బిబై ‘‘మహా ప్రభూ ఒక నా కూతురే కాదు మీరు ఆజ్ఞాపిస్తే నేను కూడా మీ సేవకు సిద్దమే’’ అని విన్నవించుకున్నది. ఆ రాత్రే ఆ కన్యారత్నం నవాబుగారి శయ్యాగృహంలోకి ప్రవేశపెట్టబడింది. నిజంగానే పాల్గారే చెక్కిళ్ల ఆ అమాయకపు బాలిక నవాబుగార్ని చూడగానే భయంతో ఏడ్చేసింది. కనుసైగ చేస్తే చాలు పరుగెత్తుకొచ్చి వొడిలో వాలే కన్నెపిల్లల గురించి మాత్రమే తెలిసిన నవాబుగారు ఆశ్చర్యంతో ఎందుకు భయపడుతున్నావూ అని బుజ్జగించి అడిగాడు.


‘‘మీరు దయామయులు, ధర్మప్రభువులు. ఇంత వరకు నేను మిమ్మల్ని ఒక తండ్రిగానే భావించాను’’. అని ఎక్కిళ్ల మధ్య కన్నీళ్లు కారుస్తూ చెప్పింది.
దాంతో ఆ నవాబుగారి శిరస్సు అవనతమై, నేత్రాలు అశ్రుసిక్తమైనాయి.
ఆ కన్నె పిల్లను ఆరాత్రే సగౌరవంగా కానుకలతో సాగనంపి మరుక్షణమే ప్రాయశ్చిత్త నిమిత్తమై పహాడీ షరీఫ్‍ దర్గాకు పయనమైనాడు. మూడు రోజుల ఏకాంత వాసంలో ఉపవాస దీక్ష నాచరించి ఒంటికాలి మీద నిలబడి ఆధ్యాత్మిక చింతనతో తనను తాను శుభ్రపరచుకున్నాడు. రామపాదం సోకిన రాయి నాతిగా మారినట్లే పవిత్రమైన పహాడీ షరీఫ్‍ మహాత్యం వలన ఒక కాముకుడు నిష్కాముకుడిగా మారిపోయినాడు.


ఎక్కడో అరేబియా ఇసుక ఎడారులలో ప్రారంభమైన బాబా షర్పొద్దీన్‍ మహాప్రస్థానం చివరాఖరికి దక్కన్‍ పీఠభూమిలోని హైద్రాబాద్‍ గుట్టపై మహాభినిష్క్రమణం చెంది ‘‘పహాడీ షరీఫ్‍’’గా మిగిలిపోయింది.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *