అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672)

కొల్లాపురం. మళ్లీ అలంపురం తరువాత నేను జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రెండో తెలంగాణా పట్టణం. అలంపురంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మహబూబ్‍నగర్‍ జిల్లా, కొల్లాపూర్‍ తాలూకా, జటప్రోలు దేవాలయాలు శ్రీశైలం జలాశయ నీటి ముంపుకు గురౌతున్నందున, వాటిని ఎగువకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొల్లాపురంలో అందుకోసం దేవదాయశాఖ, సబ్‍డివిజన్‍ ఉన్న జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చిన్నమారూరు దేవాలయాల చిత్రాలు గీసి, రాయి రాయికీ నంబర్లు వేసే పనికి చాలా మంది శిల్పులు కావాలి. గాబట్టి అలంపూరు నుంచి నన్ను కొన్నాళ్లపాటు కొల్లాపూరుకు డిపుటేషన్‍ మీద పంపారు. అలంపూరులో బస్సెక్కి, మారమునగాల దగ్గర దిగి, అరిగిలి (పుట్టి)పై కృష్ణానదిని దాటి (తొలి అనుభవం) వనపర్తి తాలూకా, యాపర్లకు చేరుకొని, మళ్లీ బస్సెక్కి కొల్లాపురం చేరుకొన్నాం. సబ్‍డివిజన్‍ ఆఫీస్‍లో బస. ఆరోజు ఆదివారం. ఊరు చూద్దామని బయలుదేరా. ముందుగా జటప్రోలు రాజప్రసాదం, దాని ముందు విశాలమైన రోడ్డు, ఆ రోడ్డు కిరువైపులా సంత, సంతలో జనం, కొత్తగా అనిపించింది. రాజాగారి ప్యాలెస్‍ ముందు గంటకొట్టే విధానం, ఎత్తైన ధర్వాజ, యూరోపియన్‍ శైలి నిర్మాణం వింతగా ఉన్నాయి. కొల్లాపూర్‍ అయ్యంగారి హోటల్లో భోంచేసి విశ్రాంతి తీసుకున్నాం.


మరుసటిరోజు మల్లేశ్వరానికి జీపులో ప్రయాణం. నేను, నాతోపాటు ప్రస్తుత యాదాద్రి ఆలయ నిర్మాణ స్థపతి వేలు. ఇంకా నా సహోద్యోగులు సుబ్రమణి, భారతి, రాజేంద్ర అందరం కలిసి జీపులో ఉన్నాం. మల్లయ్యగారనే సూపర్‍వైజర్‍ జీపును గతుకుల రోడ్డుపై కొండలు, గుట్టలూ దాటుకుంటూ తీసుకెళ్తుంటే ఎక్కడో స్విట్జర్‍లాండ్‍లో ప్రయాణిస్తున్నామా అన్న ఆలోచన. గంటసేపటికి మల్లేశ్వరంలో ఓ ఇంట్లో దిగాం. పునరావాసం కింద ఖాళీ అయే ఊరు గాబట్టి, కరెంటు లేదు. మట్టిరోడ్లు. దిగుడుబావి నీళ్లు. అలా ఊరుబయట కెళ్తామని బయలుదేరాం. ఎదురుగా ఎటుచూచినా కొండలే. కొండ, కోనల్లో కవ్విస్తూ కదలాడుతున్న కృష్ణానది కనిపించింది. మనసు పులకరించింది. దిగి స్వచ్ఛమైన నీళ్లు తాగి, ఊడదీసే గుళ్ల దగ్గర కెళ్లాం. ఆశ్చర్యం! ఒకే చోట 12 గుళ్లు. కొంచెం పక్కగా మరో 3. మొత్తం 15 దేవాళాలు. ఒక చక్కటి తోరణ ద్వారం. ఆలయ సముదాయం చుట్టూ మట్టి పేరుకు పోయింది. ఈ ఆలయాలన్నింటికీ నంబర్లు వేసి రాయిరాయి కొలతలు తీసి, ఉన్నవి ఉన్నట్లుగా డ్రాయింగు వేసి భద్రపరచి, వాటి ఆధారంగా ఎగువున పునర్‍నిర్మించాలని మాకు అప్పటి డిప్యూటీ స్థపతి పెరుమాళ్లుగారు తర్ఫీదునిచ్చారు.


మళ్లీ ఊళ్లో కొచ్చి ఆగిరి బాలస్వామి అంగట్లో సబ్బు, పేస్టు కొనుక్కొని బసకు చేరుకున్నాం. మాకు మల్లేశ్వరం బాలయ్య వంట చేసే వాడు. ఆరోజు రాత్రి పెట్రో మాక్సులైటు వెలుతురులో జొన్న రొట్టె, పుంటికూర (గోంగూర) పప్పు. ఎంత బాగుందో. మొదటిసారిగా జొన్నరొట్టె తినటం. చాలా రుచిగా ఉంది. కొన్నాళ్లు పని చేసిన తర్వాత, మళ్లీ సోమశిల మీదుగా, కొల్లాపూర్‍కు ప్రయాణం. దాదాపు 12 కి.మీ.లు కొండలు, లోయలు, దట్టమైన అడవి, అపురూపమైన నెమళ్లు, జింకలు, పక్షులు. ఒక్కసారిగా మను చరిత్రలో ప్రవరాఖ్యుడు దిగిన ప్రదేశం గుర్తుకొచ్చింది. కొల్లాపురం డివిజన్‍ ఆఫీసులో ఒకరోజు విశ్రాంతి. ఆఫీసు పక్కనే విశాలమైన కొల్లాపూర్‍ జిల్లా పరిషత్‍ పాఠశాల. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డిగారు. కొంచెం సేపు ముచ్చటించిన తర్వాత మళ్లీ ఆఫీసు. ఆరోజు మ్యాట్నీ చూచి, పొద్దు కూకుతుండగా, కాలినడకన మళ్లీ మల్లేశ్వరం ప్రయాణం. ఇది 1980 జనవరి నెల సంగతి.


ప్రస్తుతం చర్చిస్తున్న బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని రాగిరేకు శాసనం ఇంతకు ముందు నేను చెప్పిన కొల్లాపురం జిల్లా పరిషత్‍ హైస్కూల్లో అప్పటి ప్రధానోపాధ్యాయుడు 1967లో రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించినది. అతని పేరేమిటో, అతనికి ఎలా దొరికాయో వివరాల్లేవు. ఈ శాసన సంక్షిప్త వివరాలు ఆంధప్రదేశ్‍ పురావస్తు శాఖ వార్షిక శాసన నివేదిక 1967 పే.20లో ఉన్నాయి. అటు తరువాత, ఎన్‍. మార్కండేయశర్మ, ‘కొల్హాపురం ప్లేట్స్ ఆఫ్‍ విక్రమాదిత్య-1’ పేరిట ఎ.పి. గ్రాఫికా ఆంధ్రిక-4లో పే.9-12లో ఆంగ్లంలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ప్రభుత్వం ప్రకటించిన మహబూబ్‍నగర్‍ జిల్లా శాసన సంపుటాల్లోగానీ, తెలంగాణా శాసనాల్లో గానీ, తెలంగాణా శాసన సంపుటాల్లోగానీ ఈశాసనం లేదు. ఈ శాసనాన్ని తెలుగులో ప్రచురించిన ఘనత దక్కన్‍ల్యాండ్‍కే దక్కుతుంది.
శాసనాన్ని విడుదల చేసింది మొదటి విక్రమాదిత్యుడు. బాదామీచాళుక్య చక్రవర్తి రెండో పులకేశి, మూడో కొడుకు. ఇతన్ని గురించిన ప్రస్తావన ఐహోలు శాసనం (కెవి రమేష్‍ 1984, పే.101)లో కనిపిస్తుంది. మొదటి విక్రమాదిత్యుడు తురిమెళ్ల శాసనాన్ని (ఎఇ 29, పే.160), కర్నూలు శాసనాన్ని (జెబిబిఆర్‍ఏఎస్‍-16, పే.223-233), తెబుర్హి (మహారాష్ట్ర) శాసనాల్ని (జెఇఎస్‍ఐ- IX పే1. జెఇఎస్‍ఐ 1983, పే.32), గద్వాల శాసనాన్ని (ఇఐ-10, పే.100) హైదరాబాదు రాగిరేకు శాసనాల్ని (ఇండియన్‍ యాంటిక్వరీ-6, పే.75), సవనూరు రాగిరేకు శాసనాన్ని (ఇఐ-27, పే.115), రామాపురం శాసనాన్ని (జెఇఎస్‍ఐ-7, పే.78), ఆముదాలపాడు రాగిరేకు శాసనాన్ని (ఎఇ-32, పే.175), అలంపూరు శాసనాన్ని (ఇఐ.వా.40,పే.31), పణ్యాల శాసనాన్ని (తెలంగాణా శాసనాలు-2, పే.5), తలమంచి రాగిరేకు శాసనాన్ని (ఇఐ-9 పే.98), రత్నగిరి శాసనాన్ని (జెబిబి ఆరుఎ ఎస్‍-16, పే.227) విడుదల చేశాడు. ఈ శాసనాన్ని కాక, విజయాదిత్యుని అలంపురం ప్రశస్తి శాసనం, దక్కన్‍లాండ్‍, నవంబర్‍ 2020, విక్రమాదిత్యుని గురించిన వివరాలనందిస్తున్నాయి. ఒక్కసారి, బాదామీ చాళుక్య వంశక్రమాన్ని పరిశీలిస్తే, జయసింహుడు మూలపురుషుడు. అతనికి రణరాగుడు, రణవిక్రముడు బుద్ధవర్మ అని ముగ్గురు కొడుకులు. రణరాగుని కొడుకైన మొదటి పులకేశికి కీర్తివర్మ, మంగళేశులతో చాళుక్యుల పాలన స్థిరపడింది. కీర్తివర్మ క్రీ.శ.566 నుంచి క్రీ.శ.591 వరకూ, మంగళేశడు క్రీ.శ.591 నుంచి క్రీ.శ.609 వరకూ పాలించారు. క్రీ.శ.610 నుంచి క్రీ.శ.642 వరకు పాలించిన రెండో పులకేశి పాలనలో తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు చాళుక్యుల ఆధీనంలో కొచ్చాయి. రెండో పులకేశి కాలంలో తీరాంధ్రలో, అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్థనుడు రాజుగా, తూర్పు లేక వేంగీచాళుక్యరాజ్యం ప్రారంభమైంది.
రెండో పులకేశికి నలుగురు కొడుకులు (ఆదిత్య వర్మ, చంద్రాదిత్య, మొదటి విక్రమాదిత్య, ధరాశ్రయ జయసింహుడు)ల్లో మూడో వాడైన మొదటి విక్రమాదిత్యుడు క్రీ.శ.654 నుంచి క్రీ.శ.681 వరకూ పాలించారు. బాదామి నుంచి పాలించినా, కన్నడ నాడులోనూ, అతని ఆధీనంలోనున్న తెలంగాణా, రాయలసీమల్లో అతని శాసనాలు దొరికాయి. వీటిలో ఒక శాసనమే ప్రస్తుత కొల్లాపూర్‍ రాగిరేకు శాసనం.


శాసనపాఠం :
మొదటిరేకు రెండో పక్క :

  1. జయత్యావిష్కృతం విష్ణ్రోర్వారాహంక్షోభితార్ణవం దక్షిణోన్నత దంష్టాగ్ర విశ్రాంతభువనంవపుః
  2. శ్రీమతాం సకలభువన సంస్తూయ మానమానవ్యస గోత్రాణాం హారతీపుత్రాణాం సప్తలోక
  3. స్వస్తి మాతృభిస్సప్త మాతృభిర్వర్థితానాం కార్త్రికేయ పరిరక్షణ ప్రాప్త కళ్యాణపరం
  4. పరాణాం భగవన్నారాయణ ప్రసాద సమాసాదితవరాహ లాంఛనేక్షణ
  5. వశీకృతాశేష మహీభృతాం చలుక్యానాంకులమలంకరిష్ణో రాశ్వమేధావభృధస్నాన
  6. పవిత్రీకృతగాత్రస్య శ్రీపొలికేశి వల్లభ మహారాజస్య ప్రపౌత్రః పరాక్రమాక్రాన్త వ
  7. నవాస్యాది పరనృపతిమణ్డల ప్రణివద్ధ విశుద్ధకీర్తేః శ్రీ కీర్తివర్మ పృధివీవల్ల
  8. భమహారాజస్య పౌత్రః సమరసంసక్తసకలోత్తరాపధేశ్వర శ్రీహర్షవర్ధనపరా


రెండో రేకు – మొదటి పక్క :

9. జయోపలబ్ధ పరమేశ్వరా పరమ్రనామధేయస్య సత్యాశ్రయ శ్రీ పృధివీవల్లభ మహారాజాధిరాజ
10. పరమేశ్వరస్య ప్రియతనయః రణశిరసి రిపునరేంద్రాస్ది శిథిశి జిత్వా వ(స్వ) వంశజాలక్ష్మీ ప్రా(ప్తః)ప్య
11. (చ) పరమేశ్వరతాం అనివారిత విక్రమాదిత్యః అపిచైక(ఏ) వచిత్ర కష్టా(ణ్ణ) కాఖ్యదివ్యాశ్వేనస
12. ర్వం (ర్వా) న్దాయాదావి (న్వి) జే (జి) త్య స్ప విక్రమాక్రాస్త సకల మహీమండలాధిరాజ్యా(జ్యో) విక్రమాదిత్యసత్యా
13.శ్రయ శ్రీపృధివీవల(ల్ల)భ మహారాజాధిరాజ పరమేశ్వర స్సర్వ(ర్వా)నాజ్ఞా పయతి విదితి
14. మస్తువో స్మాభి(భిః) స్వరాజ్య విజే(జ)య సత్తత్సశ (సప్తదశ) సంవత్సరే ప్రి(పృ)ధివీపతి రాజేన విజ్ఞాపితే కార్తీక
15. పౌర్ణ మాష్యా(స్యా)ం మాతా పిత్రోరాత(త్మ)నశ్చ పుణ్యయశోభి వృద్ధయే భారద్వాజ ప(స) గోత్రాయశ్రీ
16. స్వామి (నః) పుత్రాయ సోమవర్మాణేతచ్చుపు (త్సుపు) త్రాయ వాడ్డ ఱేణ్ణ (భ) తు(కృ)ష్ణవేణ్నస్సే (స్యో)త్తర తోటీ కొట్టాత్తశీ


రెండో రేకు – రెండో పక్క :

17. మస్యా(ని) ఆదిరాజమానేన అష్టోత్తరశత నివర్తనం క్షేత్రం (చ) దత్తం అస్మద్వంశైః (స్యై) రన్యైశ్చ
18. పరిపాలనీయ(న్త) స్యో పదధాతకా(కాం) పన్చ మహాపాతక సంయుక్తా భవన్తయు (ఉ) క్తంచ భ
19. (గ) వతాదే (వే) దవ్యాసేన వ్యాసేన । బహుభిర్వసుధాభుతా (క్తా) రాజభిస్సక (గ) రాభి(ః) యస్యయస్య
20. యదాభూమి త్య(స్త్ర) స్యతస్య తథా ఫల(మ్‍) స్వ ద్రత్తాం పరదత్తాం వా యో హరేత వసుం
21. ధరాం షష్టిం వర్ష సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమిః


ఈ శాసనంలోని మానవ్యస గోత్రానికి చెంది, హారీతి పుత్రులుగా, సప్తమాతల చేత వృద్ధి, కార్తికేయని పరిరక్షణలో కళ్యాణ పరంపరను పొందుతున్న వారు, భగవన్నారాయణుని చేత వరాహలాంఛనాన్ని పొందిన వారుగానూ చెప్పబడింది. చాళుక్య కుల తిలకునిగా కీర్తి గడించిన, అశ్వమేధయాగం చేసి అవవృధస్నానంతో పవిత్రుడైన శ్రీ పులకేశివల్లభమహారాజు మునిమనుముడును, పరాక్రమంతో, వనవాసి మొదలైన రాజులచే కీర్తించబడిన కీర్తివర్మ పృధ్వీవల్లభమహారాజు మనుమడును, ఉత్తరాపశ్వరుడైన శ్రీహర్ష వర్థనుని ఓడించిన సత్యాశ్రయ పృధ్వీవల్లభ మహారాజాధిరాజైన రెండో పులకేశి ప్రియతనయుడూ, దైవాశ్వమైన చిత్రకంఠంపై అధిరోహించి యుద్ధాల్లో అనేక మంది రాజుల్ని, దాయాదుల్ని జయించి సకల మహామండలాధిరాజుగా, సత్యాశ్రయునిగా, పరమేశ్వరునిగా కీర్తి గించిన (మొదటి) విక్రమాదిత్యుడు, పృధివీపతి రాజు విజ్ఞప్తితో, మాతాపితరులకు పుణ్యంకోసం, భరధ్వాజ గోత్రానికి చెందిన స్వామి మనుమడు, సోమశర్మకును కొడుకును మారు రెండు గ్రామంలో 108కు, కృష్ణానది ఉత్తర ఒడ్డునగల కొట్టాత్త సీమలో ఆదిరాజమానంలో 108నివర్తనాల భూమిని దానం చేసినట్లు పేర్కొనబడింది. మొదటి విక్రమాదిత్యుడు ఈ శాసనాన్ని క్రీ.శ.672వ సం।।లో విడుదల చేశాడు. శాసన లిపి క్రీ.శ.7వ శతాబ్దినాటి తెలుగు – కన్నడ లిపిగా చెప్పుకోవచ్చు. ఈ శాసనాక్షరాలు, తూర్పు చాళుక్య మొదటి జయసింహుని శాసనాక్షరాలను పోలి ఉన్నాయి.


ఈ శాసనం సంస్కృత భాషలో ఉంది. అక్షరాల పొందికలో, మ, షలకు తేడాలేదు. ‘నృపతి మండల’లోని ‘మ’ ‘ష’లాగ ఉంది. తొలి చాళుక్య రాజుల శాసనాల మాదిరిగానే, రేఫానికి ముందు ద్విత్వాక్షర ముంది (కాత్తి కేయ). వార్తిమా(ష్యా)(స్వా)లో ‘స’ బదులు ‘ష’ అక్షరముంది. ‘ల’ ‘ళ’ కారాల తేడా కనిపిస్తుంది. ‘విజయ సంవత్సరే’ కి బదులు ‘విజయ సంత్తరే’ అని ఉంది. ‘వ’, ‘ఛ’ అక్షరాల మధ్య తేడా కనిపించటంలేదు. అలాగే పృధ్వి అన్న పదం ‘ప్రిధ్వి’గా ఉంది. పాలనా సం।।న్ని పేర్కొంటూ దాన్ని ‘సప్తదశ’ ‘సత్తత్సశ’ అని చదువుకోవాలి.

ఈ రాగి రేకు శాసనంలో రెండు రేకులు ఒక కడియానికి బిగించబడి ఉంది. కడియం పైన చాళుక్య చిహ్నమైన వరాహ లాంఛనముంది. ఒక్కో రేకు 23×7.3 సెం.మీ. కొలతలతో ఉన్నాయి. మొదటిరేకు రెండో పక్క 8, రెండో రేకు మొదటి పక్క 8, రెండో పక్క 5, మొత్తం 21 పంక్తులున్నాయి. రెండురాగిరేకులూ కడియమూ కలిపి 1000 గ్రా. బరువున్నాయి.

తెలుగు భాషలో తొలిసారిగా దక్కన్‍ల్యాండ్‍లో ప్రచురించబడిన ఈ శాసనం తెలంగాణాలోని కొల్లాపూరులో దొరకటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎక్కడ బాదామి, ఎక్కడ కొల్లాపురం!


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *