ప్రణయ – చరిత్రకు పట్టం

తెలుగునాట ఎంతోమంది సాహితీవేత్తలు తమ ఇంటి పేరు తోనే ప్రసిద్ధులు. ఆ రచయితలు సీమాంధ్ర ప్రాంతం వారైనా వారి ఇంటిపేర్లున్న ఊళ్లు తెలంగాణలో ఉన్నాయి. వాళ్లు కూడా తమకు తెలంగాణాతో అనుబంధమేదో ఉన్నదనే భావించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు తాము పౌరోహిత్యం చేస్తున్న/ నివసిస్తున్న ఊరిపేర్లనే ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. అట్లాంటి వారిలో రాచకొండ విశ్వనాథశాస్త్రి, కందుకూరు వీరేశలింగం, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ముదిగొండ వీరభద్రమూర్తి, ఆదిభట్ల నారాయణ దాసు, తెలకపల్లి రవి ఇట్లా కొన్ని వందలమంది పండితులు, రచయితలున్నారు. ఇంకా చెప్పాలంటే వారందరికీ కలిపి ఉమ్మడిగా ‘గోలకొండ’ వ్యాపారస్తులు అని పేరు. తెలం గాణలో కూడా అనేకమంది తమ ఇంటిపేరుకి బదులుగా ఊరిపేరుతోనే ప్రఖ్యాతులయిన వారున్నారు. దేవులపల్లి రామానుజాచార్యులు, జమలాపురం కేశవరావు ఇంకా చాలామంది ఉన్నరు. హైదరాబాద్‍ రాష్ట్ర ముఖ్యమంత్రి రామకృష్ణా రావు మహారాష్ట్ర ప్రభావంతో తన ‘పుల్లమ రాజు’ ఇంటి పేరును పుట్టినూరుని బట్టి బూర్గులగా మార్చుకున్నడు. మహా రాష్ట్రలో ఎక్కువమంది తమ పేరుపక్కన ఊరుపేరుని జోడించుకుంటరు. ఉర్దూ రచయితలు ఇలా ఊరిపేరుని తమ పేరుకు జోడించు కోవడం ఆనవాయితి. షకీల్‍ బదాయునీ, సాహిర్‍ లూథియాన్వీ, జోష్‍ మలియాబాద్‍, మజ్రూ సుల్తాన్‍పురీ ఇట్లా చాలా మంది ఉన్నరు. కన్నడంలో ఇటీవల హత్యకు గురైన మల్లేషప్ప మడివాళ్లప్ప (ఎం.ఎం) ‘కల్బుర్గి’ తన ఊరిపేరు తోనే ప్రసిద్ధి. అయితే తన ఊరిపేరును కావాలనే కలం పేరుగా మార్చుకున్నవాడు దోరవేటి. రంగారెడ్డి జిల్లాలోని నేటి మండల కేంద్రం ధారూరు పూర్వనామం దోరవేటి.


ఈ దోరవేటి రచనలతో ముఖ్యంగా కథలతో 20-25 యేండ్లకుపైగా పరిచయమున్నప్పట్టికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దోర వేటిని సన్నిహిత మిత్రుడిని చేసింది. సోదరుడిగా మార్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడానికి వేసిన కమిటీలో దోరవేటి ఉన్నాడు. నేను కూడా అందులో భాగస్వామిని కావడంతో ఇద్దరం రోజూ కలుసుకోవడానికీ, ఆయన బహుముఖ ప్రజ్ఞను ప్రత్యక్షంగా చూడ్డానికి అవకాశం చిక్కింది. కథ, నవల, కవిత, పద్యం, పాట, వ్యాస పక్రియలతోబాటుగా అవధానం, గాత్రం, చిత్రలేఖనంలో కూడా ప్రతిభను ప్రదర్శించాడు. అట్లాంటి దోరవేటి వెలువరిస్తున్న ‘అసమా న వీరుడు-అనురాగ దేవత’ చారిత్రక నవల తెలుగు నవలా సా హిత్యానికి మేలైన జోడింపు. ఒక రకంగా ఇంతకుముందు రాసిన మరోశివాజీ నవలకు ఇది కొనసాగింపు. కథ దానికి తగ్గట్టుగా కథనం. ఆ కథనం ఆకట్టుకునే విధంగా ఉండడమే గాకుండా, కమనీయంగా కండ్ల ముందట బొమ్మల్ని సాక్షాత్కరింపజేసిన నవల ఇది. టైమ్‍ మెషిన్‍లో మూడు వందల యేండ్ల ఎనుకకు తీసుకు పోయిన నవల ఇది.


‘ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది చరిత్రవుతుంది’. దానికి కల్పన జోడించి రాస్తే కావ్యం, నవల, కథ అవుతుంది. తెలుగు సాహిత్యంలో శ్రీపాద కృష్ణమూర్తి నాటకం ‘తిలక్‍ మహారాజు’, విశ్వనాథ, కొడాలి ఆంజనేయులుల సంయుక్త రచన ‘అవతార పరివర్తనం’, దువ్వూరి రామిరెడ్డి ‘కాంగ్రేస్‍ వాలా’ స్వాతంత్య్రోద్యమ సందర్భంలో వచ్చిన చారిత్రక నాటకాలు. రాజశేఖర శతావధాని- అమరసింహ చరిత్ర, పుట్టపర్తి నారాయణా చార్యులు- షాజి, సి పాయి పితూరి ఖండ కావ్యాలు, మధునా పంతుల సత్యనారాయణ -ఆంధ్రపురాణం, ముదిగొండ వీరభద్ర మూర్తి – ఝాన్సీరాణి, వందేమాతరం, సి. నారాయణ రెడ్డి -కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు లాంటి చారిత్రక కావ్యాలు భారతదేశ గత వైభవాన్ని, ఘనతను అక్షరీక రించాయి. నోరి నరసింహశాస్త్రి, విశ్వనాథ సత్యనారా యణ, అడివి బాపిరాజు, ఒద్దిరాజు సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి తదితరుల చారిత్రక నవలలు తెలుగుసాహిత్యంలో 1861 నుంచి వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో వెలువడ్డ తొలి నవల కంబుకంధర చరిత్ర కూడా చారిత్రక నవలే! దీన్ని రాసింది తెలంగాణకు చెందిన తడకమళ్ళ వేంకటకృష్ణారావు. ఆ తర్వాత రంగరాజ చరిత్ర, రాజ శేఖర చరిత్ర, హేమలత, హేలావతి ఇలా అనేక చారిత్రక నవలలు వెలువడ్డాయి.


తొలుత తెలుగు సాహిత్యంలోకి బెంగాళీ నవలలు తర్జుమా అయ్యాయి. తెలంగాణలో ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ ప్రభావంతో నవలలు వెలువడ్డాయి. అవి స్థానిక చరిత్రను ప్రతిఫలింపజేశాయి. సురవరం ప్రతాపరెడ్డి అలభ్య నవల ‘శుద్దాంతకాంత’, ఒద్దిరాజు సోదరుల ‘రుద్రమదేవి’, బిరుదురాజు రామరాజు ‘సదాశివరెడ్డి’ మొదలైనవున్నాయి. అడివి బాపిరాజు రాసిన నవలల్లో ఒకటి రెండు తప్ప అన్నింటికీ వస్తువు తెలంగాణే! ఆయన హైదరాబాద్‍లో మీజాన్‍ పత్రిక సంపాదకుడిగా ఉన్న కాలంలో (1944-47) అందులో సీరియల్‍గా అచ్చేశాడు. రుద్రమదేవి సినిమా ద్వారా ఇటీవల పాపులర్‍ అయిన ‘గోన గన్నారెడ్డి’ని మొట్టమొదట నవలగా మలిచిం డు. ఏరోజు కారోజు బాపిరాజుగారు కూర్చొని డిక్టేట్‍ చేస్తూ ఉంటే వాటిని కంపోజ్‍ చేసేవారట. దీంతో విషయంపై బాపిరాజు గారి కున్న పట్టు తెలుస్తుంది. అట్లాంటి ప్రజ్ఞనే దొరవేటి ఈ నవలలో ప్రదర్శించాడు.


రొమాన్స్, సాహసం, యుద్ధ వ్యూహాలు, ఎత్తుగడలు, దేశభక్తి, మతవిశ్వాసాలు, బ్రాహ్మణాధిపత్యం, రాజనీతిజ్ఞత అన్నీ కలగలిపి బాజీరావు-మస్తానీల సాహస, ప్రేమకథను దోరవేటి నవలగా మలిచిండు. 18 ఏండ్లకే మరాఠా రాజ్య ప్రధానమంత్రి పదవి చేపట్టి, చేసిన అన్ని యుద్ధాల్ని గెలిచి కేవలం 42వ యేట 1740లో మరణించిన బాజీరావు గురించిన కథ ఇది. శివాజీని ఆదర్శంగా తీసుకొని వాటిని చివరి వరకూ కొనసాగిస్తూ దేశ శ్రేయస్సు కోసం అవసరమైతే సర్వం త్యాగం చేయాలని చెప్పే కథ ఇది. మతమే దైనా ప్రేమించిన స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని అడ్డంకులు, ఇబ్బందు లెదురైనా పాణంగా చూసుకోవాలని చెప్పే కథ ఇది. మత విశ్వాసాలేవైనా కార్యనిర్వహణలో అవి అడ్డంకి కారాదు అని చెప్పిన కథ ఇది. సమాజంపై బ్రాహ్మణా ధిపత్యం, అందులో దక్కనీ బ్రాహ్మణులపై కొంకణస్థ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని రికార్డు చేసిన నవల ఇది. దాదాపుగా 1720-1742 సంవత్సరాల మధ్యకాలంలో మరాఠా రాజ్యం దాని పరిసరాల్లోని నిజాం, బుందేల్‍ఖండ్‍, మాళవ, గుజరాత్‍, ఢిల్లీ, ఆగ్రాలతో చేసిన యుద్ధాలు/ సయోధ్యలు ఇందులో చోటు చేసుకున్నాయి.


ఈ నవల రాసిన సందర్భం వేరు ఇప్పుడు పుస్తకంగా వస్తున్న సందర్భం వేరు. మొదట ‘భారతీయ పరిరక్షణ’ అనే జాతీయ మాస పత్రికలో ఈ నవల డిసెంబర్‍ 2013 నుంచి జూలై 2015 వరకు సీరియల్‍గా అచ్చయింది. సీరియల్‍గా వెలువడుతున్న కాలంలో మతసహనం/అసహనంపై దేశంలో పెద్దగా చర్చ లేదు. నిజానికి అది ఎన్నికల సంధికాలం కాబట్టి అంతా ‘సంయమనం’ పాటించారు. ఇప్పుడు పరిస్థితి వేరు. ధబోల్కర్‍, పన్సారే, కల్బుర్గిలు ఛాందసుల చేతిలో హతమయ్యిండ్రు. ఇందులో మొదటి ఇద్దరూ నవలా క్షేత్రమయిన షాహు పాలనా ప్రాంతం వారే! ఇక తినే తిండిపై ఎన్నడూ లేని విధంగా దుమారం రేగుతోంది. ఆంక్షలు విధిస్తున్నారు. బీఫ్‍ ఈటర్లపై దాడులు జరుగుతున్నయి.


సరిగ్గా ఇదే అసహనాన్ని ఈ నవల్లో బ్రాహ్మణాధిపత్యం ప్ర దర్శించింది. బాజీరావు పీష్వా కులం రీత్యా బ్రాహ్మణుడైనప్పటికీ వృత్తిరీత్యా ప్రధాని కావడంతో అందుకు తగ్గట్టుగానే అలవాట్లు మారాయి. యుద్ధ సమయాల్లోనూ, విందుల్లోనూ మాంసం తినే వాడు. మాంసం తిన్నందున అతన్ని, అతడితో పాటు కుటుంబాన్ని కులం నుంచి వెలివేయాలని ప్రయత్నిస్తారు. బుందేల్‍ఖండ్‍ రాజు ఛత్రసాల్‍కు ముస్లిం స్త్రీ వల్ల పుట్టిన మస్తానీని వివాహమాడినందుకు మత భ్రష్టుడయ్యిండంటూ బాజీరావుని సామాజిక బహిష్కరణకు బ్రాహ్మణులు పూనుకుంటారు. మొత్తం మరాఠా రాజ్య ప్రధానికే మాంసం తినడం సమస్య అయ్యిందంటే ఇక సామాన్య ప్రజలపై ఈ బ్రాహ్మణాధిపత్యం ఏవిధంగా ఉండిందో అంచనా వేయొచ్చు. బయట బహిష్కరణల పర్వం కొనసాగు తుండగానే మస్తానీని అంతః పురం లో అంతంజేసేందుకు బాజీరావు తల్లి రాధాబాయి, మొదటి భార్య కొడుకు బాలాజీరావులు కుట్ర పన్నుతారు. అయితే ఈ కుట్రని బాజీరావు మొదటి భార్య కాశీబాయి పసిగట్టి విఫలం జేస్తుంది. అయి నప్పటికీ నవల విషాదాంతంగా ముగుస్తుంది.


మస్తానీతో రోమాన్స్తోపాటు శత్రువుల గుండెల్లో నిద్రబోయే అవిశ్రాంత పోరాట యోధుడిగా, రణతంత్ర వీరుడిగా, ప్రధానిగా, తండ్రిగా, భర్తగా, అన్నగా, ప్రజా పక్షపాతిగా, భావుకుడిగా బాజీరావు భిన్న పార్శ్వాలను దోరవేటి సమర్ధవంతంగా తీర్చి దిద్దిండు. ఇందులో ఉపయోగించిన భాష కథతోపాటుగా మనం నడిచేందుకే గాకుం డా వస్తువుని ఇంటర్నలైజ్‍ చేస్తుంది. వాచ్యం చేయకుండానే కంఠస్వరం కనబడుతది. వినబడుతది. భాషతోనే హావభావాలు, కరవాలాల ఝులిపింపులు వినబడతయి.

దాదాపు 300 యేండ్ల కిందటి కథను ఇయ్యాలటి భాషలో రాస్తుండడంతో ఆనాటి వాతావరణం కళ్లముందర కనిపించేలా చేయడం వర్ణనల ద్వారా కొంత మేరకే సాధ్యమైతది. అయినా దోరవేటి ఆ అడ్డంకిని అధిగమిం చిండు. పాత్రోచిత భాష రాయడమనేది కొంచెం కష్టమే! కాపలా దారుడు, ప్రధాని ఇద్దరూ మాట్లాడుకునే సమయంలో వెంట వెంటనే భాష మారడం. మారిన భాష పాఠకుడికి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగడం కష్ట సాధ్యమైన పని. దాన్ని దోరవేటి హైవే మీద రోల్స్ రాయిస్‍లో ప్రయాణంగా చేసిండు. ఈ నవల చదివిన తర్వాత నాకు ఎదురైన అనుభవమది. ఎందుకంటే దొరవేటి ఫోన్‍చేసి అన్న నువ్వు నా నవలకు ముందుమాట రాయాలని అడుగంగనే. ఇప్పటికీ పుస్తకావిష్కరణల తేదీలు నిర్ణయించుకొని నా ముందుమాట కోసం ఆగిన ప్రచురణలు నాలుగైదున్నయి. మళ్ళీ ఇది ఒప్పుకోవడమంటే ఇబ్బంది అయితదేమో అని కొంచెం ఆలోచించిన. అయితే అంతకు కొద్దిరోజుల ముందే మరోశివాజీ నవల సదివిన కాబట్టి సరే అన్న. సరే అంటూనే టైమియ్యాలె అని కూడా చెప్పిన.

టైమియ్యాలే అంటే నా ఉద్దేశం ఓ నెల రోజుల సమయం తీసుకుందామనుకున్న. కాని వారం రోజుల్లోనే అన్న రాసుడయిందా అని అడిగిండు. ఆవిష్కరణ డేట్‍ కూడా చెప్పిండు. ఇగ తప్పదని నవల చదవడం ఆరంభిస్తే ఎక్కడ ఆగకుండా పూర్తి చేసిన. ఈ మధ్య కాలంలో ఒకే సిటింగ్‍లో కంప్లీట్‍గ చదివిన పుస్తకమది. దేశ సమగ్రత నిలవాలన్నా, మనమంతా ఒక్కటే అనే భావన పెంపొందాలన్నా, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలన్నా ఒక భాషలోని సాహిత్యం ఇంకో భాషలోని వారికి అందుబాటులోకి రావాలి. అలాగే ఒక ప్రాంతంలోని చరిత్ర, చారిత్రక వ్యక్తులు, వారి ఘనత, ప్రాధాన్యత ప్రజలందరికీ తెలియాలి. లేదంటే ఎక్కడేమి జరిగినా కన్సర్న్ లేకుండా పోతుంది. మనవాళ్ళే అనే భావన సన్నగిలుతుంది. ఇది జాతి మనుగడకే ముప్పుతెస్తుంది. ఈ ముప్పుని అధిగమిం చడంలో జాతీయ స్థాయిలో సాహిత్య అకాడెమీ, జాతీయ బుక్‍ట్రస్ట్ కొంతమేరకు ఈ పనిని చేస్తున్నాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో లేవు. అయితే సంస్థలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తన భుజస్కంధాలపై వేసుకొని చారిత్రక, సాంస్కృతిక ఆదాన్‍- ప్రదాన్‍లో భాగంగా వెలువడుతున్న ఈ ‘అసమానవీరుడు- అనురాగ దేవత’కు స్వాగతం.


ఈ నవలకు తెలంగాణకు కూడా సంబంధముంది. నిజాము, నాజర్‍ జంగ్‍తో బాజీరావు యుద్ధ సన్నివేశాలే కాదు. నవలా నాయిక మస్తానీ మూలాలు తెలంగాణలో ఉన్నాయి. అయితే చరిత్రకారుల్లో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండడంతో బహుశా దొరవేటి ఆ విషయాన్ని దాటవేసి ఉండొచ్చు. మస్తానీ తల్లి రుహానీ బాయి పర్షియన్‍. ఈమె నిజాం ఖాందాన్‍లోని మహిళ. ఈ విషయాన్ని జి.ఎస్‍. ఛాబ్రా తన ‘అడ్వాన్స్ స్టడీ ఇన్‍ ద హిస్టరీ ఆప్‍ ఇండియా 1707-1803, భాగం -1’ పేర్కొన్నడు. ఇక్కడ మస్తానీ గురించి కొంచెం చెప్పుకోవాలె. రజియా సుల్తానాలాగా మస్తానీ కూడా యుద్ధరంగంలో ఆరితేరిన యోద్ధ. కత్తిసాములోనూ, గుర్రపు స్వారీలోనూ, బల్లెం విసరడంలోనూ ఆమెకు తిరుగులేదు. ఈ విషయాన్ని నవలలో బాజీరావు తమ్ముడు చిమ్మాజీతో ఆమె తలపడ్డ ప్పుడు దోరవేటి చెప్పిండు. ఇంతటి అసమాన పోరాట పటిమతో పాటు నృత్యం, సంగీతంలోనూ ఆమెకు ఎదురులేదు. నిజానికి బాజీరావు ఫిదా అయింది ఆమె గాత్రానికే! ఆమె నృత్యానికి ఒక ప్రత్యేకత ఉందని మస్తానీ జీవిత చరిత్రను మరాఠీలో రాసిన ఇ నాందార్‍ పేర్కొన్నాడు. అందెల రవళితోనే రాగాలు పలికించేదని ఆయన చెప్పిండు. అలాగే ‘మస్తానీ’ జీవిత చరిత్రను మరాఠీలో డి.జి.గాడ్సే 1989లో రాసిండు. మస్తానీకి బాజీరావు పీష్వా వల్ల కలిగిన ఏకైక సంతానం శంషేర్‍. ఈతడు ఇప్పటి గోవా-మహారాష్ట్ర సరిహద్దులోని బందా జాగీర్దారుగా ఉండి పానిపట్టు యుద్ధంలో మరాఠాల తరపున పాల్గొన్నడు.


ఈ మధ్యకాలంలో టీవీల్లో రాణాప్రతాప్‍, రజియా సుల్తానా, జోధా అక్బర్‍, ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పుసుల్తాన్‍, రాణి పద్మిణీ, శివాజీ, రాణి చెన్నమ్మ ఇట్లా అనేక చారిత్రక సీరియళ్లు ప్రసారమై నయి. ఒకప్పటి రామాయణ, మహాభారత ట్రెండ్‍ తర్వాత ఇప్పుడు చారిత్రక సీరి యళ్లదే కాలమని చెప్పొచ్చు. వీటికి ప్రేక్షాకాదరణ కూడా ఎక్కువ గానే ఉన్నది. రాత్రి పదిగంటలకొచ్చే మహారాణా ప్రతాప్‍ సీరియల్‍ని స్కూలు పిల్లలు కూడా చూసి చర్చిం చుకుంటున్నారంటే దాని పాపులారి టీని అర్థం చేసుకొవొచ్చు.


ఇక సినిమాలకొస్తే బాహు బలి, రుద్రమదేవి తెలుగువారు తీసిన సినిమాలు. ఇవి దేశవ్యాప్తంగా తెలంగాణవారి ప్రతిభతో పాటు చరిత్రను (కొంత కల్పితమున్నా) రికార్డు చేశాయి. అలాగే హిందీలో రజియా సుల్తానా అంతకు ముందు నుంచి రాబోయే బాజీరావు మస్తానీ వరకు అనేక చారిత్రక సినిమాలు తెరకెక్కాయి. సంజయ్‍ లీలాభన్సాలీ గత రెండేండ్లుగా సస్పెన్స్లో పెట్టి నిర్మించిన ‘బాజీరావు మస్తానీ’ త్వరలో విడుదల కానున్నది. గతంలో ధీరు బాయి దేశాయి 1955లోనే ‘మస్తానీ’ పేరుతో ఈ కథను తెరకెక్కిం చిండు. చరిత్రను దృశ్యమానం చేసినట్లయితే నిరక్షరాస్యులకు కూడా అది అర్థమవు తుంది. నిరక్షరాస్యులు అధికంగా ఉన్న మన దేశంలో అందుకే సినిమాలు అంత పాపులారిటీని సంతరించుకున్నాయి.


చరిత్ర విలువ తెలువని వాండ్లు హైటెక్కు యుగంలో ‘చరిత్ర చదువులు’ అవసరం లేదని అహంభావాన్ని ప్రదర్శించిండ్రు. పం డితులు శివాజీ మొదలు టిప్పుసుల్తాన్‍లను కాంట్రవర్షియల్‍ చేస్తున్నరు. ఇట్లాంటి సందర్భంలో విషాదాంతమే అయినప్పటికీ ఒక అద్భుతమైన రొమాంటిక్‍ హిస్టారిక్‍ నవలను వెలువరిస్తున్న దోర వేటిని అభినందిస్తూ, అభిమానంతో ముందుమాట రాయమని అడిగినందుకు ధన్యవాదాలు.


-సంగిశెట్టిశ్రీనివాస్‍,
98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *