వేముల పెరుమాళ్ళు

ఇంటికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు మాటల్లోనే చెప్పాలంటే మన సాహిత్య చర్చలన్నీ ‘ఉత్తుత్తి పుట్నాలు – మూడు మూడు కుప్పలన్నట్లుగా సాగుతున్నాయి’.

మంచి మనిషిగా, నిగర్విగా గుర్తింపు ఉన్న పెరుమాళ్ళు కొంతకాలం రాజకీయాలలో కూడా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కరీంనగర్‍ జిల్లాలోని రాయికల్‍ మండల అధ్యక్షులుగా ఎన్నికై కొద్దికాలం పనిచేశారు. 1989లో శాసనసభకు కూడా పోటీచేశారు. కానీ గెలవలేకపోయారు. అయినా ఆయన ప్రజా జీవితానికి దూరం కాలేదు. సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండేవారు. అందువల్లే లేబర్‍ కాంట్రాక్టు సహకార సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్రం టెలిఫోన్‍ కమిటీ సభ్యులుగా చాలాకాలం కొనసాగారు. అస్వస్థులై 17 సెప్టెంబర్‍, 2005 కన్నుమూసే నాటికి ఆయన వయసు 62 మాత్రమే.


వేముల పెరుమాళ్ళు 8 జనవరి, 1943న కరీంనగర్‍ జిల్లా రాయికల్‍ గ్రామంలో జన్మించారు. కోరుట్ల, జగిత్యాల, శ్రీకాళహస్తిలో హైస్కూలు చదువు పూర్తిచేసి గ్రామీణాభివృద్ధిలో డిప్లమా తీసుకున్నారు. ఇక సాహిత్య రంగాన ‘గౌతమి సాహిత్య సమాఖ్య’ కరీంనగర్‍ కార్యవర్గ సభ్యులుగా అనేక సభలు నిర్వహించారు. స్వయంగా ప్రసంగాలు చేశారు. ‘తెలంగాణ జాతీయాల’పై ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. అవి గాఢమైన చింతనతో సూటిగా, స్పష్టంగా ఉండేవి. తన అనుభవాల్ని, ఆలోచనల్ని రంగరించి జాతీయాలను విశ్లేషిస్తూ ఉంటే ఎవరో వృద్ధ పండితుడు మాట్లాడుతున్నట్టు ఉండేది. నిజానికి అప్పుడాయన వయసు నలభైకి పైచిలుకు. చదువు స్కూలు పైనలే. కానీ ఆయన వాక్యం రసాత్మకం. శైలి ఒక ప్రవాహం. నిగూఢమైన అంశాల్నివంగడిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు ఆయనది మహా మేధావుల స్థాయి.


ఒక పది పుస్తకాలు ప్రచురించడానికి సరిపడినన్ని జాతీయాలు సేకరించిన పెరుమాళ్ళు అతి కష్టం మీద 2 వందల 70 పేజీల ‘తెలంగాణ జాతీయాలు’ 1998లో ప్రచురించగలిగారు. ఆ ఒక్క పుస్తకం అచ్చువేయడానికి పెద్దమొత్తంలో అప్పుకావడం వల్ల అది తనకు ‘చిన్న ముండకు పెద్ద శోకం’ అంటే శక్తికి మించిన పని అయ్యిందని చెప్పుకున్నారు. ఆ పుస్తకం చదివిని వారికి ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఎవరూ పట్టించుకోని జాతీయాల్ని ఉడతా భక్తిగా సేకరించి, వాటికి వివరణలు, వ్యాఖ్యానాలు రాసి ప్రసంగిస్తుంటే వినడం ఒక గొప్ప అనుభవం. ఆ విషయాన్ని ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య యానకి కృష్ణకుమారి, డాక్టర్‍ దాశరథి రంగాచార్య వంటి నాటి సాహితీ ప్రముఖులు పుస్తకానికి రాసిన ముందు మాటాలలో వివరించారు. విశ్వవిద్యాలయాలు, అకాడమీలు సాహిత్య సంస్థలు చేయాల్సిన పనిని వేముల పెరుమాళ్ళు ఒంటరిగా చేశారు. ఉండుంపట్టు, దీక్ష, కార్యశూరత్వం గలవారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోకగా చేయగలరని ‘తెలంగాణ జాతీయాలు’ పుస్తకం చూస్తే తెలుస్తుంది. పాఠకులు ‘తంతే పరుపులో పడ్డట్టు పడతారు’.


తెలుగు సంస్కృతి అంతా ఒకటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో, యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ఇతర జాతీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిలపర్చుకున్నారు. వారి సామెతల్ని, మౌళిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్రపరుచుకున్నారు.


నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. వ్యవసాయ పరంగా చూస్తే ఈ ప్రాంతపు భూములు పెద్దగా పంటలు పండేవి కావు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, నీటికొరత, వ్యాపారానికి కూడా అనువైన ప్రదేశం కాదు. అందువల్ల ఆర్థికంగా బలపడే అవకాశాలే లేవు. అంటే అన్ని రకాల ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ ప్రజలు తమ భాషను, యాసను, సంస్కృతీ సంప్రదాయా లను కాపాడుకుంటూ వచ్చారన్నది మనం గ్రహించాలి. సహృద యంతో అందులోని గొప్పతనం అర్థం చేసుకోగల వారికైతే అది అర్థమవుతుంది. అది అర్థం చేసుకునే ఒక అవకాశం వేముల పెరుమాళ్ళు మనకిచ్చారు. ‘ఇది గుర్రం – ఇది మైదానం’ అన్నట్లు తేటతెల్లం చేశారు.


‘తెలంగాణ జాతీయాలు’ ఏకాగ్రతతో మనసుపెట్టి చదివిన వారికి తెలుగు జాతి ఔన్నత్యం గూర్చి తెలుస్తుంది. మన పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్లు, పేరంటాలు, క్రీడలు, విందులు, వినోదాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, ఆచరణలో ఉన్న వివిధ విధానాలు, వాటివాటి ప్రత్యేకతలు అన్నీ కొంతవరకైనా తెలుస్తాయి. ఇంగ్లీష్‍ చదువులు ఎక్కువైపోయి, విదేశీ సంప్రదాయాలు మక్కువైపోయి తమ అస్థిత్వాన్ని తామే వదులుకుంటూ పరాయీకరణ చెందుతున్న నేటి యువతరం ఎంత సత్వరంగా తమను తాము గుర్తించుకుంటే అంత మంచిది. ఎన్నెన్నో అవరోధాల్ని తట్టుకుంటూ కొన్ని వేల సంవత్సరాల నుంచి అఖండ దీపంలా వెలుగుతూ వస్తున్న మన జానపద సంస్కృతి విలువను నేటితరం అర్థం చేసుకోవాలి. ‘ఇంటోడు దొంగల్ని కల్సినట్టు కాకూడదు’.

మన పాతతరం మనుషులు ఏ రెండు నిముషాలు మాట్లాడినా అందులో పుష్కలంగా జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, పదాలు అలవోకగా వినిపించేవి. ఇప్పుడు ఈ మారిన కాలంలో అన్నీ మారిపోయాయి. ‘చిత్తు బొత్తయ్యింది’ అంటే తారు మారయ్యింది. భాష కాలుష్యమై పోయింది. యాస కాలుష్యమైపోయింది. జానపదుల ఆత్మసౌందర్యం గుబాళించే జాతీయాలు కనుమరుగై పోతున్నాయి. ఈ కనిపించని వరదల్లోంచి, ఉప్పెనలోంచి, వాయుగుండాల్లోంచి, సునామీల్లోంచి మనల్ని మనం రక్షించుకోక తప్పదు. అలాంటి ముఖ్యమైన విషయాన్ని ఎత్తిచూపి మన బాధ్యతను మనకు గుర్తు చేసిన పెరుమాళ్ళు చిరస్మరణీయులు.


పరభాషా దురాక్రమణ వల్ల మన జాతీయాలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయని ఆయన ఆవేదన చెందారు. ‘పోయింది పొట్టు, ఉన్నది గట్టి’ అన్న పెద్దల వాక్యానికి కట్టుబడి, ఆయన తెలంగాణ మారుమూల పల్లెల్లోంచి జాతీయాలు పోగుచేశారు. ఆయనకు అదొక యజ్ఞం. అదొక తపస్సు. ఒక్కోసారి జాతీయం వెంట సామెత, సామెత వెంట జాతీయం కలిసి ఉంటాయి. తల్లీ పిల్లల్లాగా, అది విడదీయరాని బంధం, జాతీయాల్లో అక్కడక్కడా కొంత బూతు తొంగిచూస్తుంది. అయితే అది నాగరికులైన అక్షరాస్యుల దృష్టి కోణంలో మాత్రమే బూతు. వారి దృష్టిలో అంటే జానపదుల లేదా నిరక్షరాస్యుల దృష్టిలో అది బూతు కాదు. వారు అమాయకంగా, సహజంగా, స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా పదాలు వాడతారు. మనం వాటిని వారి కోణంలోంచే, వారి స్థాయిలోంచే పరిశీలించాలి.


వేముల పెరుమాళ్ళు ఈ విషయంలో ఎంతో సాహసవంతుడు. తెలంగాణ జాతీయాల్ని పరిరక్షించడం తన కర్తవ్యమని, జీవిత ధ్యేయమని భావించారు. యధాతథంగా జాగ్రత్తగా వాటిని గ్రంథస్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తరతరాల తెలంగాణ సామాజిక చరిత్రను గ్రంథస్తం చేశారన్న మాట. ‘పిర్రలు చూసి పీటలు వేసే కాలమిది’ వేముల పెరుమాళ్ళు వంటి వారి గూర్చి ఎవరు మాట్లాడుతారు?


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-డా।। దేవరాజు మహారాజు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *