నూరు పూలు వికసించనీ, వేయి భావాలు పరిమళించనీ..
ది నూరవ సంచిక. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సెప్టెంబర్2012లో తొలి సంచిక వెలువడింది. ఒక సామాజిక రాజకీయ మాసపత్రికగా దక్కన్ లాండ్ నిరాటంకంగా నూరు సంచికలు వెలువడటం సంతోషదాయకం.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణ ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, భాష-సాహిత్యం- జానపద కళారూపాలతో కూడిన సాంస్కృతిక వైభవం, పోరాట తెగువ వంటి తరతరాల మౌలిక సంపదతో పాటు, సమైక్య పాలకుల అధిపత్యవిధానాలు, వివక్షత, నీరు, నిధులు, నియామకాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో పాటు, ప్రజల ఆకాంక్షలకీ, పోరాటాలకీ అక్షర రూపం యిచ్చిన విశాలమైన కాన్వాస్ దక్కన్ ల్యాండ్.
తెలంగాణకు సంబంధించిన పలు మౌలిక అంశాలపై తెలంగాణ రిసోర్స్ సెంటర్ (TRC) నిర్వహించిన 200 ‘‘చర్చ’’లకు, ‘‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైద్రాబాద్’’ మరియు ఇతర వ్యక్తులు, సామాజిక సంఘాల కృషికి, సర్వేలకీ, విశ్లేషణలకీ, సలహాలకు, సూచనలకీ అక్షర రూపం దక్కన్ ల్యాండ్. తెలంగాణ సాధనలో ప్రజలను చైతన్యపరచి, ఉద్యమగమనంలో భాగస్వామిగా నిలిచిన పత్రిక దక్కన్ ల్యాండ్.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్‍నిర్మాణ కృషిలో తన పాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందూ ఆతర్వాతా ప్రజా సంక్షేమమే ధ్వేయంగా వివిధ అంశాలపై సామాజిక, రాజకీయ, సాంకేతిక, భాషా, సాహిత్య, సాంస్కృతిక మేధావుల విశ్లేషణాత్మక అభిప్రాయాలకు వేదికగా నిలిచి ప్రజల ముందుంచింది.
తెలంగాణ సర్వతోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, ఐటీ రంగం, గురుకుల పాఠశాలలు, వృత్తికులాలు, హెరిటేజ్ కాంప్రి హెన్సివ్ యాక్ట్ బిల్లు, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ఏర్పాటు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో చేస్తున్న కృషి మరియు హైద్రాబాద్ నగరాభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ వంటి వాటిని ప్రభుత్వం చేపట్టిన అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తెలియపరిచింది.
కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దాని పుట్టుక – కారణాలు – నివారణ చర్యలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక, మానవీయ సంబంధాలలో వచ్చే మార్పులు గురించి వివిధ రంగాలకు చెందిన పలువురు మేధావులను ఇంటర్వ్యూ చేసి వాటిని వరుసగా ప్రచురించింది.
వారసత్వ, పర్యావరణ, సామాజిక, సహజ వనరుల, జీవ వైవిధ్య పరిరక్షణ వెరశి ప్రజా సంక్షేమమే దక్కన్ ల్యాండ్ మౌలిక భావన.
ఇక ముందు కూడా ఈ కర్తవ్యాలతో ముందుకు సాగుతుంది. దీనికి మీ ఆదరాభిమానాలు, సూచనలు, సలహాలు మాకు అండగా నిలుస్తాయని ఆశిస్తున్నాం.
-(మణికొండ వేదకుమార్)
ఎడిటర్