తెలంగాణా ప్రాచీన శివాలయాలు


ఇంద్రపాలనగర శివాలయాలు
విష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అమ్రాబాద్‍) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ గుట్ట పైన వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు, కోనేర్లు, బౌద్ధ స్థూపాలు, జైన మత విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. కోటగోడ కొసన వారి రాజ చిహ్నమైన పంజా ఎత్తి గర్జిస్తున్న సింహం శిల్పం రాజదర్బారు వెనుకనే పడి ఉండటంతో ఈ కోటగోడ కట్టడాలు విష్ణుకుండులవే అని నిర్ధారించడానికి వీలైంది.
ఇంద్రపాల గుట్ట కింద ఒక త్రికూట శివాలయం, గుట్ట పాదం గుహలో మరో శివాలయం ఉన్నాయి. ఈ రెండు ఆలయాల మధ్యలో ఉన్న గుట్ట గుహలో మరో అద్భుత శివలింగం చెక్కడం ఉంది.


త్రికూట శివాలయం సర్వ హంగులతో నిర్మించబడింది. తూర్పుకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో తూర్పున తప్ప మిగతా మూడు దిశల్లో మూడు శివాలయ గర్భగుడులు అంతరాళాలతో అలరారుతున్నాయి. ఈ మూడు అంతరాళాల ముందర 36 స్థంభాల మంటపముంది. ఇది ఇక్కడి ప్రత్యేకాకర్షణ. ఈ మంటపం మధ్యలో రంగ మంటపముంది. మంటపానికి ఎడమ పక్కన కళ్యాణ మంటపం, ఈశాన్యంలో కోనేరు, తూర్పున ద్వార గోపురం ఉన్నాయి. ఈ త్రికూటాలయ గోపురాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి.
ఇంద్రపాలగుట్ట పాదంలో ఉన్న శివాలయం విష్ణుకుండుల తొలి కాలానికి… అంటే క్రీ.శ.5వ శతాబ్దానికి చెందింది. ఈ ఆలయం నిజానికి ఒక పెద్ద గుహను ఆవరించుకొని కట్టినది. నిలువెత్తు గుహలో 5 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో చెక్కిన ఎర్రరాతి పానవట్టంలో నిల్పిన నల్లరాతి శివలింగం చూడ చక్కనిది. ఈ ఆలయం ముందర ఒకప్పుడు నంది మంటపం, కళ్యాణ మంటపాలు ఉండేవనడానికి ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఆలయం ముందు ఆనాటి సహజసిద్ధమైన కోనేర్లు ఇప్పటికీ నీటితో కళకళలాడుతూ కన్పిస్తాయి.


ఈ శివాలయానికి ఉత్తరాన ఫర్లాంగు దూరంలో గుట్ట అంచున మూసీనది ఒడ్డున మరో శివాలయం ఉంది. ప్రాకార పరివేష్టితమైన ఈ శివాలయం కూడా గర్భ గృహం, అంతరాళం, ముఖ మండపాలతో, శిఖర శోభతో తూర్పుకభిముఖంగా ఉండి వంకలు తిరిగి పారుతున్న మూసీనది అందాలను ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ శివాలయం వెనుక ఫర్లాంగు దూరంలో మూసీనది మధ్యలో ఉన్న ఒక ద్వీపపు రాతిబండపైన 108 శివలింగాలు చెక్కి ఉన్నాయి. ఈ ప్రాంత సౌందర్యం ఆస్వాదించ దగింది. విష్ణుకుండుల కాలంలో శివభక్తులు ఇక్కడ మూసీనదిలో స్నానం చేసి ఇక్కడి కోటపైకి ఉన్న మెట్ల ద్వారా నడిచి అక్కడి శివాలయాలను చేరుకుని శివలింగాలకు అభిషేకాది పూజలు చేసేవారని అర్థమవుతుంది. ఇంకా, ఈ ప్రాంతంలో కనిపించే అనేక రాతి గుండ్లకు వీరభద్ర, కాలభైరవ శిల్పాలు చెక్కి ఉన్నాయి. శివ సంబంధ ఇతర విగ్రహాలు, ఆలయాలు కూడా ఇంద్రపాల నగరంలో చాలా ఉన్నాయి.


కీసరగుట్ట శివాలయాలు
ఇంద్రపాలగుట్ట దగ్గరి మూసీనది ద్వీపంపై ఒకేచోట 108 చిన్న చిన్న శివ లింగాలు చెక్కి ఉంటే గజమెత్తు శివలింగాలు 108 హైదరాబాద్‍ దగ్గరి (30 కి.మీ.) కీసర గుట్ట పైనున్నాయి. ఇవి నల్లగా నునుపుగా చాలా అందంగా ఉన్నాయి. ఒక దగ్గర కాకుండా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి. వీటిని కూడా విష్ణుకుండి రాజే కట్టించాడు. ఆయన పేరు రెండవ మాధవవర్మ. క్రీ.శ.5వ శతాబ్దంలో ఆయన శత్రువులపై సాధించిన ఒక్కొక్క విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్టించి ఆ లింగాల చుట్టూ ఆలయాలను కట్టించాడు. వాటి ఇటుకలను స్థానికులు తీసుకు పోవడంతో ఇప్పుడు కేవలం శివలింగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే కాలక్రమంలో భూమిలో కూరుకు పోయిన ఇటుక ఆలయాలు కొన్ని గుట్ట కింద చెరువు దగ్గర రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో బయటపడుతున్నాయి. ఇక ప్రధాన రాతి నిర్మిత శివాలయం నేటికీ లక్షల మంది శివ భక్తుల పూజలు అందుకుంటూనే ఉంది.


మంథని దగ్గర మరో అజంతా
విష్ణుకుండులు తెలంగాణా ప్రాంతాన్నంతటినీ పరిపాలించారు. కాబట్టి వీరి రాజ్యంలో గోదావరి తీరంలోని రామగిరి కోట, మంథని ప్రాంతాలు కూడా ఉండేవి. రామగిరి కోటపైన మాధవవర్మ కట్టించిన మాధవీ మంటపం, గుహా రామలింగేశ్వర ఆలయం చూడదగినవి. ఇక తెలుగు ప్రజలకు కూడా తెలియని విష్ణుకుండులనాటి శివాలయాలు మంథని దగ్గరి గోదావరి నదిలోని లంజమడుగు పైన ఉన్నాయి.


ఇక్కడ తూర్పు వైపు ప్రవహిస్తున్న గోదావరి అకస్మాత్తుగా ఉత్తరం వైపు తిరిగి ఒక ఎత్తైన గుట్టను వేగంగా గుద్దుకొని మళ్ళీ వెంటనే తూర్పు వైపు తిరగడంతో దాని దాటికి ఆ ప్రాంతంలో ఒక పెద్ద లోతైన మడుగు ఏర్పడింది. ఈ మడుగును ఆనుకొని ఉన్న నిటారైన గుట్ట అంచున 200 అడుగుల ఎత్తున కొన్ని గుహాలయాల సముదాయము ఉంది. ఈ గుహాలయాలు ఐదు కావడంతో, వీటిల్లో శివలింగాలు ఉండడంతో ఇవి నిజానికి పంచ లింగాలయాలని, వీటి వాస్తు శిల్పరీతులు క్రీ.శ.5వ శతాబ్దం ప్రాంతానివి కావడంతో వీటిని విష్ణుకుండి రాజులే కట్టించారని చెప్పవచ్చు. వీటి నీడ ప్రతిబింబాలు కిందుగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహంలో (లంజమడుగులో) అందంగా కనిపిస్తాయి. ఈ దృశ్యం అజంతా కంటే అందమైనది. లంజమడుగులో చేసే పడవ ప్రయాణం పక్కనున్న గుట్టలు, పచ్చని అడవుల మధ్య సాగుతూ మనకు కేరళ అందాలను గుర్తుకు తెస్తాయి. ఈ గుడులలో తర్వాతి కాలంలో ప్రబలి, ఆ మతంలో స్త్రీలకు ప్రవేశముండి లైంగిక కార్యకలాపాల ద్వారా ముక్తి సాధ్యమనే భావనతో ప్రచారం కావడంతో ఈ గుళ్ళకు లంజగుళ్ళని పేరు వచ్చింది.


దక్షిణాభిముఖంగా ఉన్న ఈ గుళ్ళకు తూర్పున ఫర్లాంగు దూరంలో మరో రెండు గుహాలయాలున్నాయి. వీటిని కోమటి గుళ్ళు అంటారు. వీటి గర్భగృహాల ముందున్న అర్ధమంటప స్తంభాలకు విష్ణుకుండుల కాలపు లఘు శాసనాలు చెక్కి ఉన్నాయి.
ఇలా ప్రకృతి అందాల నడుమ నెలకొన్న పరమ శివాలయాల ప్రాచీనత మన వరకూ కొనసాగి మనకూ కన్పించడం మనం చేసుకున్న అదృష్టం.

ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078

(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి)
ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29. తెలంగాణ. వెల: రూ.100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *