నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్‍ టెక్నాలజీతో సాకారం…!!


(గత సంచిక తరువాయి)
మొదటి హైపర్‍లూప్‍ మార్గం ఎక్కడ?

ఎలనమస్క్ మొట్టమొదటిసారిగా ఈ హైపర్‍లూప్‍ని అమెరికాలో లాస్‍ ఏంజెల్స్ నుండి శాండియాగో, లాస్‍ వేగాస్‍ని కలుపుతూ శాన్‍ఫ్రాన్సిస్‍స్కో వేద్దామని నిర్ణయించారు. అయితే లాస్‍ ఏంజెల్స్ నుండి శాన్‍ఫ్రాన్సిస్కోకి కాలిఫోర్నియా హైస్పీడ్‍ రైల్‍ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో, ఈ మార్గంలో హైప్‍లూప్‍ నిర్మాణం ఆలస్యమవుతోంది. కానీ చికాగో, క్లీన్‍లాండ్‍, వాషింగ్టన్‍ మరియు న్యూయార్క్ నగరాలకు మధ్యలో ఈ హైపర్‍లూప్‍ మార్గాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


హైపర్‍లూప్‍ టెక్నాలజీ – భారతదేశం:

  • జులై 2017న నీతిఆయోగ్‍ ప్రజా రవాణాను మెరుగు పరచడంలో భాగంగా వేగవంతమైన రవాణా మార్గాలను ఏర్పాటు చేసేందుకు 6 ప్రతిపాదనలను ఆమోదించింది. అందులో హైపర్‍లూప్‍ కూడా ఉంది.
  • సెప్టెంబర్‍ 2017న విజయవాడ మరియు అమరావతి మధ్య నున్న 35 కి.మీ. దూరంలో హైపర్‍లూప్‍ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు గానూ ‘‘హైపర్‍లూప్‍ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్‍’’ అన్న సంస్థతో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైపర్‍లూప్‍ ద్వారా 35 కి.మీ దూరాన్ని కేవలం 5 ని।।లలో చేరుకోవచ్చని అంచనా.
  • ఫిబ్రవరి 2018న మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, పూణేల మధ్య హైపర్‍లూప్‍ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు గానూ వర్జిన్‍ గ్రూప్‍ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. హైపర్‍లూప్‍ ఏర్పాటైతే ముంబై, పూణేల మధ్య ప్రయాణ సమయాన్ని 3 గం।।ల నుండి 25 ని।।లకు తగ్గించవచ్చు.
  • ప్రారంభదశలోనే హైపర్‍లూప్‍ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మనం ముందుండాలని నీతిఆయోగ్‍ భావిస్తోంది. అందులో భాగంగా సాంకేతిక, ఆర్థిక, వాణిజ్యపర, భద్రతా పరమైన సాధ్యాసాధ్యాలను, ఆసాంకేతిక పరిజ్ఞానం పొందటానికి చట్టపరంగా ఉన్న అకాశాలపై అధ్యయనం చేయించాలని నవంబర్‍, 2020న నిర్ణయించింది. ఇందుకోసం నీతిఆయోగ్‍ సభ్యుడు వి.కె. సారస్వత్‍ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మరో సభ్యుడు సుధేందు జ్యోతి సిన్హా కన్వీనర్‍గా వ్యవహరిస్తారు.
  • రైల్వేబోర్డు చైర్మన్‍ వి.కె. యాదవ్‍, కేంద్ర పట్టణాభివృద్ధి, రవాణా శాఖల కార్యదర్శులు, మహారాష్ట్ర రవాణా కార్యదర్శి, డీఆర్‍డీఓ చైర్మన్‍, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‍, ఫోర్‍ కాస్టింగ్‍ – అసెస్‍మెంట్‍ కౌన్సిల్‍ చైర్మన్‍ సభ్యులుగా ఉంటారు.


హైపర్‍ లూప్‍ టెక్నాలజీ – ప్రయోజనాలు :
ప్రస్తుతం సరుకు మరియు ప్రయాణీకులను రవాణా చేస్తున్న సాంప్రదాయ రైల్వే వ్యవస్థను ఆధునీకరించే దిశగా చేస్తున్న ప్రయత్నాలలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఆవిరి, డీజిల్‍, ఎలక్ట్రిక్‍ తదితర ఇంధనాలతో నడుస్తున్న సాంప్రదాయ రైళ్ళు ప్రధానంగా అధిక బరువును కల్గి ఉండడం వల్ల, పట్టాలకు మరియు రైలు చక్రాలకు మధ్య ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటోంది. అంతిమంగా ఇది రైలు యొక్క వేగాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. కానీ హైపర్‍లూప్‍ టెక్నాలజీలో మాగ్నటిక్‍ లెవిటేషన్‍ మరియు ఎయిర్‍ బేరింగ్స్ ఘర్షణను పూర్తిగా తగ్గించి ‘‘పాడ్‍’’ యొక్క వేగాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకెళతాయి. ఇవే కాకుండా హైపర్‍ లూప్‍ టెక్నాలజీ వల్ల ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి.


వేగం :
హైపర్‍ లూప్‍ టెక్నాలజీ విధానంలో ‘‘పాడ్‍’’ ఒక బంధిత వాతావరణం (Sealed environment)లో ప్రయాణించడం వల్ల గాలి నిరోధకత మరియు ఘర్షణ అతి తక్కువ స్థాయికి క్షీణించి, సుమారు 1200 ఖఎ/ష్ట్ర వేగాన్ని అందుకుంటుంది. ఇది బుల్లెట్‍ ట్రైన్‍ మరియు కమర్షియల్‍ ఎయిర్‍క్రాప్ట్ వేగం కన్నా 2 నుండి 3 రెట్లు అధికం.


పర్యావరణానికి అనుకూలం :

సాంప్రదాయ రైల్వే వ్యవస్థతో పోల్చినట్లయితే సోలార్‍ ప్యానెల్స్ ద్వారా విద్యుచ్ఛక్తిని వినియోగించుకోవడం వల్ల హైపర్‍ లూప్‍ టెక్నాలజీతో ఎలాంటి శబ్దాలు, కాలుష్య కారకాలు వెలువడవు. సాధారణ రైల్వేలతో పోలిస్తే, మౌళిక వసతులు ఖర్చు కూడా తక్కువ, కాబట్టి పర్యావరణానికి బహుళ ప్రయోజనకారి అని చెప్పవచ్చు.


ఆర్థిక ప్రయోజనాలు :
హైపర్‍లూప్‍ టెక్నాలజీకి భూసేకరణ ఆవశ్యకత చాలా కనిష్ఠంగా ఉంటుంది. సోలార్‍ ప్యానెల్స్ ద్వారా విద్యుత్‍చ్ఛక్తిని వినియోగించుకోవడం వల్ల ఇంధన ఖర్చు కూడా తక్కువ. హైపర్‍లూప్‍ టెక్నాలజీకి సాధారణ హైస్పీడ్‍ రైల్‍ కారిడార్‍ నిర్మాణానికి అయ్యే పెట్టుబడి కన్నా తక్కువే ఖర్చు అవుతుంది. బుల్లెట్‍ రైళ్ళు మరియు విమాన ప్రయాణానికి అయ్యే ధరలకన్నా తక్కువ ధరలోనే హైపర్‍లూప్‍ ద్వారా ప్రయాణించవచ్చు.


తక్కువ మానవ తప్పిదాలు :
సాధారణ రైల్వే వ్యవస్థతో మానవ తప్పిదాల వల్ల రైళ్ళు పట్టాలు తప్పడం, ఢీకొనడం లాంటి అనూహ్య సంఘటనలు (Accidents) సంభవిస్తాయి. కానీ హైపర్‍లూప్‍ పూర్తిగా ఆటోమేటిక్‍ కావడం వల్ల ఇలాంటి తప్పిదాలకు అవకాశం ఉండదు. బంధిత గొట్టాల గుండా హైపర్‍లూప్‍ ప్రయాణించేటపుడు ప్రయాణీకులు ఆక్సిజన్‍ సరఫరా సమస్య తలెత్తితే, వాడుకు నేందుకు వీలుగా ఆక్సిజన్‍ మాస్కులు కూడా అందుబాటులో ఉంటాయి.


బహుళ ఇంధన వనరులు :
హైపర్‍లూప్‍ టెక్నాలజీ సౌరఫలకాలు (Solarpannels), గాలి మరలు (Windmiles), న్యూక్లియర్‍ రియాక్టర్స్ ఇలా వేటి ద్వారానైనా ఇందనాన్ని వినియోగించుకుంటుంది.


భూకంప నిరోధకం :
హైపర్‍లూప్‍ ‘పాడ్‍’ గొట్టపు మార్గం నిలువు స్తంభాలపై నుండి రెండు పార్శ్వపు దిమ్మెలపై ఏర్పాటు చేయబడుతుంది. అందువల్ల భూమికి, ఈ గొట్టానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఒకవేళ భూకంపం వచ్చినా, భూకంప కదలికలను ఈ నిలువెత్తు స్తంభాలు శోషించుకుంటాయి.
గొట్టపు మార్గంలో గాలి పీడనాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల సాధారణ రైళ్ళను చెడు వాతావరణం (Bad Weather) నిరోధించినట్టుగా, హైపర్‍లూప్‍ను నిరోధించే అవకాశం ఉండదు. హైపర్‍లూప్‍లో ప్రతీ 20 సెకన్లకు ఒక పాడ్‍ ప్రయాణీకులతో గమ్యస్థానానికి బయలు దేరుతుంది. సాధారణ రైళ్ళలో ఇటువంటి అవకాశం ఉండదు.


సవాళ్ళు :
అత్యధిక పెట్టుబడులు :
హైపర్‍లూప్‍ మార్గం ఏర్పాటు చేయడానికి అత్యధిక మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. అందువల్ల ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల మధ్య నుంచి సమన్వయంతో కూడిన భాగస్వామ్యం అవసరం.
గరిష్ఠ ఇంధన వినియోగం :
సాధారణ రైల్వే వ్యవస్థతో పోలిస్తే హైపర్‍లూప్‍ అత్యధిక మొత్తంలో విద్యుచ్ఛక్తిని వినియోగించుకుంటుంది. కాబట్టి ఆర్థికంగా ఇది పెనుభారంగా పరిణమించే అవకాశం ఉంది.


సాంకేతిక సవాళ్ళు :

  • హైపర్‍లూప్‍ ‘‘పాడ్‍’’ శబ్దవేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు ‘‘పాడ్‍’’ కంపించడం (Vibration), నెట్టుకుంటూ (Jostle) ప్రయాణించడం మరియు మలుపుల వద్ద పాడ్‍ వంగి ప్రయాణించడం వల్ల పాడ్‍ ఇరు పార్శ్వాలలో అధిక గురుత్వాకర్షణ బలానికి లోనవుతుంది. ఫలితంగా ప్రయాణీకులకు తలతిరుగుట, వికారం, వాంతి వచ్చిన భావనలు కలుగుతాయి.
  • హైపర్‍లూప్‍ ‘‘పాడ్‍’’ ప్రయాణించే గొట్టపు మార్గంలో విద్యుత్‍ సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే తలెత్తే పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మరింత స్పష్టత అవసరం.
  • పీడన రహిత స్టీలు గొట్టాలను సుదూర ప్రాంతాలకు నిర్మించాలంటే సాంకేతికంగా మరిన్ని నైపుణ్యాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • అదే విధంగా హైపర్‍లూప్‍ కొరకు పొడవైన స్టీలు గొట్టాలను ఏర్పాటు చేస్తారు. బయటనున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ స్టీలు గొట్టాలు వ్యాకోచించి, వాటి స్వరూపం మారిపోయే అవకాశం ఉంది. తత్ఫలితంగా హైపర్‍లూప్‍ ప్రయాణించే మార్గమంతా నాశనమవుతుంది. కాబట్టి, స్టీలు గొట్టాలను నిర్మించేటపుడు ఆయా ప్రాంతాల వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
  • హైపర్‍లూప్‍ ప్రయాణ మార్గానికి చాలా తక్కువ మొత్తంలో భూమి అవసరమైనప్పటికీ ఆ భూమిని వినియోగించుకునే హక్కులు ఎంత మేరకు లభిస్తాయన్నది కూడా ప్రాజెక్ట్ అమలు పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • హైపర్‍లూప్‍ రవాణా మార్గం మొత్తం ఆటోమేటిక్‍ వ్యవస్థతో అనుసంధానమైనప్పటికీ, ఆ ఆటోమేటిక్‍ వ్యవస్థ పనితీరులో ఏదైనా అవరోధం తలెత్తి అనూహ్యమైన సంఘటనలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. దీనిపైన కూడా మరింత విస్తృతమైన పరిశోధన అవసరం.
  • హైపర్‍లూప్‍ ప్రయాణ మార్గాన్ని నిర్మించడానికి కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో చెట్లను నరకవలసి ఉంటుంది. తత్ఫలితంగా ఎంతో కొంత పర్యావరణానికి హానికలిగే అవకాశం ఉంటుందన్నది కాదనలేని సత్యం.


చివరిగా :
ప్రస్తుతం గ్లోబల్‍ వార్మింగ్‍ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీత మార్పులు సంభవించి పుడమితల్లి పుట్టెడు దుఃఖంలో మునుగుతున్న తరుణంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకుండా, అత్యధిక వేగంతో గమ్యస్థానాలకు చేర్చే విధంగా హైపర్‍టెక్నాలజీ ఆవిర్భవించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే పైన చర్చించినట్లు హైపర్‍లూప్‍లోని సాంకేతిక సమస్యలతో పాటు, ఇతర అవరోధాలను అధిగమించినట్లయితే హైపర్‍లూప్‍ టెక్నాలజీ మానవాళికి లభించిన గొప్ప వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


పుట్టా పెద్ద ఓబులేసు, ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *