మనం మరిచిన మహా విమర్శకుడు ఆచార్య గోపాలకృష్ణారావు (జననం : 24 ఫిబ్రవరి, 1926)


మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో గత ఎనిమిది వందల యేండ్లుగా వన్నె తరగకుండా దేదీప్యమానంగా వెలుగుతున్న పక్రియ ‘శతకం’. శతక సాహిత్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు సమకాలీన చరిత్రకు అద్దం పట్టింది. పాండిత్యానికి పెద్ద పీట వేసింది. కన్నడ, సంస్కృత భాషల్లో ఈ పక్రియ కనుమరుగవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం కొత్తరూపు సంతరించుకుంటూ ముందుకు పోతుంది. పండితులే గాకుండా గువ్వల చెన్నడి లాంటి సామాన్యులు కూడా ఈ శతకాలను రాసి రంజింప జేసిండ్రు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చిండ్రు. వేమన రాసిన శతక పద్యాలు ఇంగ్లీషు భాషలోకి తర్జుమా అయిన తొలి తెలుగు రచన. సి.పి.బ్రౌన్‍ అందుకు కృషి చేసినాడు. అయితే ఈ శతకాలపై విస్తృతమైన పరిశోధన చేసి వాటిని విషయాల వారీగా వర్గీకరించి వాటి చరిత్రను, అవి సమాజంపై చూపించిన ప్రభావాన్ని తెలుగు సాహిత్యంలో తమ విమర్శ, విశ్లేషణ, పరిశోధన ద్వారా రికార్డు చేసింది ఆచార్య కోవూరి గోపాలకృష్ణారావు.


గోపాలకృష్ణారావు ఒక్క శతక సాహిత్యమే గాకుండా తెలుగు, ఉర్దూ, పర్షియన్‍ భాషా సాహిత్యాలపై, గోలకొండ నవాబులు, అన్యదేశ్య పదాలు, అధిక్షేప సాహిత్యం, తదితర అంశాలపై విస్తృతంగా ప్రామాణికమైన పరిశోధన పత్రాలు సమర్పించాడు. విలువైన వ్యాసాలను రాసిండు. అయినప్పటికీ సమకాలీన సాహితీ సమాజం ఆయన్ని విమర్శకుడిగా గుర్తించలేదు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘విమర్శ’పై ఒక ప్రత్యేక విజ్ఞానసర్వస్వాన్ని వెలువరించారు. 1100ల పుటలకు పైగా ఉన్న ఈ బృహత్తర గ్రంథంలో కె.గోపాలకృష్ణారావు గురించి ఒక్క అక్షరం ముక్క కూడా లేదు. దీనికంతటికీ సమకాలీన సాహిత్య సమాజమంతా ‘ఈజీ మనీ’ లాగా ‘ఈజీ రీసెర్చ్’కు అలవాటు పడడమే ప్రధాన కారణం. గోపాలకృష్ణారావు ఎన్నడూ తనను తాను ప్రమోట్‍ చేసుకోలేదు. విశ్వవిద్యాలయంలో తన కన్నా చిన్నవారు, ఇంకా చెప్పాలంటే తన శిష్యులే తనకన్నా ముందు శాఖాధిపతులు, బోర్డ్ ఆఫ్‍ స్టడీస్‍ చైర్మన్‍ అయినా ఎన్నడూ నొచ్చుకోలేదు. అభ్యంతర పెట్టలేదు. అంతెందుకు తనకు హక్కుగా దక్కాల్సిన పదవులు, హోదాలు, అవార్డులు, కేంద్ర, రాష్ట్ర సాహిత్య సంస్థల సభ్యత్వాల గురించి ఎన్నడూ ఆయన పట్టించుకోలేదు. లౌల్యాలకు, ప్రలోభాలకు తావు లేకుండా తాను నమ్మిన పద్ధతిని ఎవరినీ నొప్పించకుండా ఆచరించిన స్వార్థత్యాగి గోపాలకృష్ణారావు.


నాలుగైదు దశాబ్దాల క్రితం గోపాలకృష్ణారావు అంటే ఆనాటి తెలుగు సాహితీ, పరిశోధనా, అధ్యాపక ప్రపంచానికి బాగా తెలుసు. ఈ కాలంలోనే ఆయన శతక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన చేసి సరిగ్గా యాభై ఏండ్ల క్రితం దాన్ని పుస్తకంగా తీసుకొచ్చాడు. నిజానికి సామాన్యుడి కష్టాలు సాహిత్యంలో ఎక్కువగా రికార్డయిన పక్రియ శతకం. ఆ శతక సాహిత్యంపై ఎవ్వరూ దృష్టి సారించని సమయంలో తాను పూనుకొని సమగ్రమైన పరిశోధన, విశ్లేషణ చేసి మరుగున పడ్డ ఎన్నో మట్టిలోని మాణిక్యాలను తన శతక సాహిత్య చరిత్ర ద్వారా వెలుగులోకి తెచ్చినాడు. నిజానికి ఇట్లా తీసుకురావడమే ఆయనకు గుర్తింపు రాకుండా చేసిందేమో అనే అనుమానమూ ఉన్నది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్క బిరుదురాజు రామరాజు తప్ప 1970లకు ముందు దాదాపు అందరూ ఆధ్యాత్మిక, పౌరాణిక, ప్రబంధ రచనలపైనే పరిశోధన చేసిండ్రు. అయితే ఈ ఒరవడికి భిన్నంగా సమాజంలోని అన్ని వర్గాలను అలరించిన, లేదా అన్ని వర్గాలు ఆదరించిన శతక పక్రియ లోతుపాతులను గోపాలకృష్ణారావు వెతికి వెలుగులోకి తెచ్చినాడు. నిజానికి గోపాలరావు దృష్టి కేంద్రీకరించిన శతక సాహిత్యం ప్రధానంగా బ్రాహ్మణేతర కులాల వారిని కవులుగా తీర్చి దిద్దింది. ఇందుకు వేమన తొలి సాక్ష్యం. ఆ తర్వాత గువ్వల చెన్నడు మరో ఉదాహరణ. ఇందులో చాలా వరకు అధిక్షేప రచనలున్నాయి. అలాగే గోపాలకృష్ణారావు ప్రధాన కాంట్రిబ్యూషన్‍ ఉర్దూ, పారశీకాలకు సంబంధించింది కావడం కూడా మెయిన్‍స్ట్రీమ్‍ తెలుగు సాహిత్యానికి ఆయన్ని దూరం చేసిందని చెప్పవచ్చు. దూరం చేసింది అంటే నా ఉద్దేశం తెలుగు సాహిత్య విమర్శకులు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని చెప్పడమే! వివక్ష చూపిందనేది కూడా నిర్ధారణ అవుతున్నది. ఉర్దూపై తెలుగు ప్రభావం, తెలుగుపై ఉర్దూ భాషా ప్రభావంపై విస్తృతంగా వ్యాసాలు రాసిండు. ఆయన రాసిన తెలుగుపై ఉర్దూ, పారశీకముల ప్రభావం అనే పుస్తకానికి ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడెమి ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఇచ్చి పుస్తకాన్ని ప్రచురించింది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఇదే ప్రామాణికమైన గ్రంథం.


హైదరాబాద్‍/ఆంధప్రదేశ్‍/తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు-ఉర్దూ రెండూ అధికార భాషలు. అయితే వీటి మధ్యన ఆదాన్‍-ప్రదాన్‍లు అంతగా లేకపోవడంతో ఇవి రెండూ ఇరు భాషీయులకు పరాయిగానే మిగిలి పోయాయి. ఇట్లా పరాయి భాషలుగా మిగిలిపోయిన తెలుగు-ఉర్దూ మధ్యన ఒక వంతెన నిర్మించడానికి పూనుకున్నది కె.గోపాలకృష్ణారావు. అందులో భాగంగానే ఆయా భాషలపై విస్తృత అధ్యయనం చేసి వ్యాసాలను వెలువరించారు. తెలుగు సాహిత్యాన్ని ఉర్దూ, పర్షియన్‍ భాషీయులకు అందించారు. అలాగే ఉర్దూ, పర్షియన్‍ భాషల్లోని సాహిత్య మాధుర్యాన్ని తెలుగువారికి తెలియజేసిండు. అంతెందుకు 1968లో అప్పటి ఆంధప్రదేశ్‍ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.వి.నరసింహారావు తెలుగును అధికార భాషగా ప్రకటించినాడు. ఆ సమయంలో తెలుగు భాష అమలులో కీలక భూమిక పోషించింది కె.గోపాలకృష్ణారావు. ఈయనే ‘తెలుగు’ అధికార భాషగా మనగలగాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వాటి అమల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలో తాను ఒక రిపోర్టుని తయారు జేసిండు. ఈ నివేదికను తర్వాతి కాలంలో తెలుగు అకాడెమి ముద్రించింది. గోపాలకృష్ణారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో తొలి తెలంగాణ అధ్యాపకులు. లెక్చరర్‍. అంతకుముందు రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, సరిపల్లె విశ్వనాథ శాస్త్రి, కురుగంటి సీతారామ భట్టాచార్యలున్నారు. ఆ తర్వాత దివాకర్ల వెంకటావధాని, వేటూరి ఆనందమూర్తి, ఇట్లా అనేక మంది తెలంగాణేతరులు తెలుగు విభాగంలో తమ హవాను కొనసాగించారు. వారి పోటీని తన ప్రజ్ఞాపాటవాలతో ఎదుర్కొన్నాడు. హైదరాబాద్‍పై పోలీసు చర్య అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంతా ఆంధాప్రాంతానికి చెందినవారే అజమాయిషీ చెలాయించారు. ఎందుకంటే మిలిటరీ అధికారులకు స్థానికులైన ముస్లింలు/హిందువులపై కూడా నమ్మకం ఉండింది కాదు. అయినప్పటికీ ఆంధ్రుల పోటీని అధిగగమించి 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో లెక్చరర్‍గా ఉద్యోగంలో చేరారు. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వారికి ఏ విధమైన అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయినప్పటికీ తెలుగు శాఖలో తనదైన ముద్రవేస్తూ, తెలంగాణ తనాన్ని కాపాడుకుంటూ ఒక ముప్పై యేడేండ్లు నిర్విరామంగా తెలుగు శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‍ పాతనగరంలో నివాసముండి ‘తెలంగాణ తెహజీబ్‍’ని రచనల్లోకి ఒంపిండు.


సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ తనకు నచ్చిన విధంగా జీవించినాడు. ఓల్డ్సిటీలో ముస్లిములతో దోస్తానీ, వెజ్‍, నాన్‍ వెజ్‍ అనే తేడా లేకుండా తన నాలుకకు ఏది నచ్చితే అది తిన్నాడు. నలభై, యాభై ఏండ్ల కింద ఇంటి ముందటికే కంజులు, బురకలు అమ్మడానికి వచ్చేవి. ఊర్లల్లోనే కాదు హైదరాబాద్‍లోనూ ఈ పరిస్థితి ఉండింది. వాటిని సైతం గోపాలకృష్ణారావు టేస్ట్ చేసిండు. తాను ఆర్టస్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నా రోజూ హైదరాబాద్‍ ఓల్డ్సిటీ నుంచి చార్మినార్‍, అఫ్జల్‍ గంజ్‍ మీదుగా ఉద్యోగానికి బస్సులోనే వెళ్ళేవారు. ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలకు తావు లేకుండా సింపుల్‍గా జీవించినాడు. ఎనకటి అందరి (మెజారిటీ) తెలంగాణ పెద్దమనుషుల్లాగానే ఆయనకు కీర్తి కండూతి లేదు. తన జీవిత కాలంలో ఎన్నో వ్యాసాలు రాసినా వాటిని పుస్తక రూపంలో తీసుకురావడంలో శ్రద్ధ చూపలేదు. ఇక్కడ శ్రద్ధ చూపలేదు అంటే తప్పుని ఎత్తి చూపడంగా భావించవద్దు. ఎందుకంటే ఆనాటి రచయితలందరూ తమ తృప్తి కోసం మాత్రమే రాసేవారు. తమకు నచ్చని విషయాలను ఎంతటి వారు అడిగినా రాసేవారు కారు. లోతైన అధ్యయనం తర్వాతనే రాసేవారు. నిజానికి గోపాలకృష్ణారావు రాసిన వ్యాసాలను సాహిత్య, చారిత్రక వ్యాసాలుగా విభజించవచ్చు. ఇప్పుడీ సంపుటిలో సాహిత్య వ్యాసాలను వెలువరిస్తున్నాము. భవిష్యత్‍లో ఆయన చరిత్ర ముఖ్యంగా గోలకొండ, అసఫ్జాహీల గురించి రాసిన వ్యాసాలు వెలువరించాల్సిన అవసరమున్నది.


ఇప్పుడీ సంపుటిలో చోటు చేసుకుంటున్న వ్యాసాలన్నీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేవిగా ఉన్నాయి. అధిక్షేప కావ్యాలు, శతకముల గురించి ఇప్పటికీ అంతగా పరిశోధన జరగలేదు. ఆ దిశలో పరిశోధన, విశ్లేషణ, విమర్శ, పున:వ్యాఖ్యానిం చడానికి ఈ పుస్తకం ఖచ్చితంగా తోడ్పడుతుంది.
హైదరాబాద్‍ ఆనాడూ ఈనాడూ విశ్వనగరమే! ఇరాన్‍/ఇరాక్‍ నుంచి వచ్చిన కుతుబ్‍షాహీలు, అసఫ్జాహీలు విదేశీ కట్టాడాల శైలిని హైదరాబాద్‍లో తీర్చిదిద్దినారు. అసఫ్జాహీలు తమ వివాహ సంబంధాలను టర్కీవారితో ఏర్పర్చుకున్నారు. అట్లనే పర్షియన్‍, ఉర్దూ కూడా అంతర్జాతీయ భాషలే! ఈ అంతర్జాతీయ భాషల్లో ఇండియాతో పాటు వివిధ దేశాల్లో వెలువడిన సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు ఎరుక జేసిన ఘనత గోపాలకృష్ణారావుది. అయితే ఎక్కడైనా ఆ యా ప్రాంతాల్లో నివసించే భాషా సమూహాల మధ్యన ఆదాన్‍-ప్రదాన్‍ లేనట్లయితే పొరపొచ్చాలు ఏర్పడుతాయి. ఘర్షణలకు దారి తీస్తాయి. సమాజంలో ఒకరకమైన భయవాతావరణం నెలకొంటుంది. కచ్చితంగా 1983 తర్వాత తెలంగాణలో ఇదేజరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిచోటా తెలుగును ఉద్ధరిస్తున్నట్టు, పోషిస్తున్నట్టు కొంత వాగాడంబరం, కొంత ప్రచారం జరిగింది. ఉద్దరణ తెలుగు యూనివర్సిటీ ఏర్పాటుకు మాత్రమే పరిమితమైంది. ఈ ఉద్దరణ పేరుతో ఉర్దూని పూర్తిగా విస్మరించారు. హైదరాబాద్‍ నగరంలో సగం మంది తెలుగేతర ప్రజలన్న సోయి ప్రభుత్వాలకు లేకుండా పోయింది. దీంతో తెలుగేతర ప్రజలు ముఖ్యంగా ఉర్దూ మాతృభాషగా కలిగిన ముస్లిములు తాము రెండోశ్రేణి పౌరులుగా దిగజార్చబడ్డామని ఫీలయ్యారు. అట్లాగే తమని, తమ భాష ఉర్దూని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది అనే భావనలోకి నెట్టి వేయబడ్డారు. మిగతా ఇతరేతర కారణాలతోపాటు ఉర్దూపై ప్రభుత్వ వివక్ష కూడా హైదరాబాద్‍లో ఎన్టీఆర్‍ పాలనలో మతకలహాలకు కారణమయింది. 1983కు ముందు ఎగ్జిబిషన్‍ గ్రౌండ్‍లో ‘ముషాయిరా’లు జరిగితే ముస్లింలతోపాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనేవారు. వాటిని తమ సంస్కృతిలో భాగంగా భావించేవారు. అట్లా భావించినందువల్లనే ఆయా భాషల మాధుర్యాన్ని, గొప్పతనాన్ని తెలుగువారికి తెలిసేలా చేసినవాడు గోపాలకృష్ణారావు. ఒక్క తెలుగువారికి తెలియజేయడమే గాకుండా ఉర్దూ, పర్షియన్‍ పాఠకులకు తెలుగు భాషా, సాహిత్యాల గొప్పతనాన్ని తెలియజెప్పారు. ఇట్లా తెలుగు-ముస్లిం సమాజానికి మధ్యన సాంస్కృతిక వంతెన నిర్మించిన ప్రయోగశీలి గోపాలకృష్ణారావు. ఎప్పుడైతే ప్రభుత్వాలు భాష వంతెనలను నిర్మూలించుకుంటూ పోయాయో అప్పుడే ప్రజల్వో వైమనస్యానికి బీజాలు పడ్డాయి. ఈ వైపరీత్యాలకు భాషా, సాహిత్యాల ఆదాన్‍-ప్రదాన్‍ ద్వారా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేసిన వారిలో అగ్రగణ్యులు కె.గోపాలకృష్ణారావు.


సాహిత్యం విషయంలోనే గాకుండా భాషా విషయంలోనూ గోపాలకృష్ణారావు కృషి చేసినాడు. ఉర్దూ భాషకు సేవ చేసిన తెలుగువారి గురించి ప్రత్యేకంగా రాసినాడు. దోమకొండ సంస్థానాధీశులు రాజా శ్రీ రాజేశ్వరరావు ‘అస్గర్‍’ ఉర్దూ, అరబీ, పార్సీ భాషలకు చేసిన సేవను రికార్డు చేసినాడు. ఉర్దూ, పారశీక, అరబీ నిఘంటువులతో పాటు మొత్తం నలబైకి పైగా గ్రంథాలను ఆయా భాషల్లో వెలువరించిన ఆయన మూర్తిమత్వాన్ని, సారస్వత సేవను, పాలన పటిమను తెలుగు పాఠకులకు తెలియజెప్పినాడు. అలాగే తెలుగువారు నడిపిన ఉర్దూ పత్రికల గురించి కూడా రాసినాడు. దీనితో పాటు పద్మనాభ యుద్ధకాలంలో వివిధ దేశాలు ముఖ్యంగా ఫ్రెంచ్‍, డచ్‍, ఇంగ్లీష్‍, అరబ్‍, తురుష్కులు, పారశీకులు, పోర్చుగీసు దేశాలకు చెందిన వారి పదాలు ఎట్లా తెలుగు పాఠకులకు చేరువయ్యాయో కూలంకషంగా చర్చించినాడు. ఇట్లా ఈ పదాలను విడదీసి చెప్పాలంటే కచ్చితంగా ఆయా భాషలపై ఎంతో కొంత సాధికారత ఉంటేగాని అది సాధ్యం కాదు. పద్మనాభ యుద్ధ కాలములో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తమైన పద సంపదను పరిశోధనా పటిమతో పరిశీలించి వెలుగులోకి తీసుకొచ్చినాడు. తద్వారా ఏ పదం ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా కనుక్కోవాలో కూడా ఆయన తెలియజేసిండు. పరిశోధన రంగానికి ప్రాధాన్యత నిస్తూ వివిధ సంస్థలు పుస్తకాల ప్రచురణకు, సాహిత్యానికి ఇచ్చిన చేయూతను ‘తెలుగులో సాహిత్య పరిశోధన- సంస్థల పాత్ర’ అన్న వ్యాసంలో వివరణాత్మకంగా తెలియజేసిండు. ఇందులో వందేండ్లకు ముందు ప్రారంభమైన సంస్థలతో పాటు విప్లవ రచయితల సంఘం, యువభారతి వరకు తెలుగునాట ప్రారంభమైన అనేక సంస్థల గురించి చెప్పిండు. ఇలాంటి సమాచారమంతా ఒక్క దగ్గర పోగుపడడం పరిశోధకులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఇవే గాకుండా శేషప్ప కవి, కైఫియతులు, యక్షగానాలు, భాగ్యమతి, ఏకవీర, పండితారాధ్య చరిత్ర ఇట్లా అనేక అంశాలపై సాధికారికమైన రచనలు చేసిండు. అయితే చేసిన రచనలన్నీ ఇప్పుడు అలభ్యంగా ఉన్నాయి. ఉన్నవాటిలోంచి కొన్ని ఎంపిక చేసి ఇప్పుడీ పుస్తకాన్ని మీముందుకు తెస్తున్నాము. భవిష్యత్‍లో గోపాలకృష్ణారావు సమగ్ర రచనలు (ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషాల్లో రాసిన వాటితో సహా) సంకలనంగా తేవాల్సిన అవసరమున్నది. ఆయన రచనలన్నీ ఒక్క దగ్గరికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దానికొక విశిష్టత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి సాహిత్యానికి, రచనలకు, విమర్శకు, విశ్లేషణకు పాఠ్యపుస్తకాల్లో పాఠశాల స్థాయి నుంచి స్నాతకోత్తర తరగతుల వరకూ పెద్ద పీట వేస్తున్నారు. పాఠకులకు ఇన్నేండ్లు ఈ సాహిత్యం అందుబాటులో లేక పోవడం వల్ల సమగ్రమైన సాహిత్య చరిత్రను సాధికారికంగా రికార్డు చేయడం కుదరలేదు. ఇప్పుడు గోపాలకృష్ణారావు రచనల్లో కొన్ని అందుబాటులోకి వస్తున్నందున కొత్త బాటలు వేసినవారమవుతున్నాము. ఈ బాట భవిష్యత్‍కు మార్గదర్శిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


ఆచార్య గోపాలకృష్ణారావు సంగారెడ్డి పట్టణంలోని తాళ్లపల్లిలో 24 ఫిబ్రవరి, 1926లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత కొంత కాలం విద్యాభ్యాసం భువనగిరి పట్టణంలో జరిగింది. ఉన్నత చదువులన్నీ హైదరాబాద్‍లోనే జరిగాయి. హైదరాబాద్‍పై పోలీసు చర్య అనంతరం 1949లో
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా చేరి దాని అనుబంధ కళాశాలలు, ఆర్టస్ కళాశాల, వరంగల్లు కళాశాలలో పనిచేశారు. ఫిబ్రవరి 28 1986 నాడు రిటైరయ్యారు. రిటైరైన తర్వాతి సంవత్సరం మే 19, 1987నాడు చనిపోయారు.


-సంగిశెట్టిశ్రీనివాస్‍,
ఎ : 98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *