సైబర్‍ సెక్యూరిటీ


ఐటీ రంగంలో పలు దేశాలు వేగంగా అభివృద్ధి చెందు తున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భౌతిక యుద్ధాలు అవసరం లేదు. వాటి సమాచార వ్యవస్థను ఛేదిస్తే చాలు. అందుకే రోజూ ఎన్నో రకాల సైబర్‍ దాడులు జరుగు తుంటాయి. మన దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
కమ్యూనికేషన్‍ వ్యవస్థ, కంప్యూటర్‍, నెట్‍వర్క్ రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పుల ఫలితంగా సమాచారం అందరికీ అందుబాటులో ఉండటం ఒక వరమైతే, అదే సమయంలో ఆ సమాచారానికి భద్రత లేకపోవడం ప్రమాదకరమైన విషయం. అందుకే ఆ భద్రత కల్పనలో భాగంగా నిపుణుల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. సమాచార లభ్యత తోపాటు సమగ్రత, గోప్యతలను కూడా ఎంతో అవసరమైన సేవలుగా వీరు అందించాల్సి ఉంటుంది.


ఆధునిక బీజ కంప్యూటర్‍ కనిపెట్టక ముందే చాలా తతంగం జరిగింది. గణన కోసం అబాకస్‍ లాంటి వాటిని ఉపయోగించే వారు. విల్హెల్మ్ షికార్డ్ 1963లో మొదటి క్యాలిక్యులేటర్‍ ను నిర్మించాడు. తర్వాత చార్లెస్‍ బాబేజ్‍ విక్టోరియా రాణి కాలంలో డిఫరెన్సు ఇంజన్ను నిర్మించాడు. దాదాపు 1900వ సంవత్సరంలో ఐ.బి.యం కంపనీ వారు పంచ్‍ కార్డ్ మెషీన్లను తయారుచేసి అమ్మేవారు. అయినప్పటికీ ఈ యంత్రాలన్నీ ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ పనులు చేసేవి కావు. 1920 కన్నా ముందు కంప్యూటర్‍ అనే పదం గణించే ఉద్యోగినుద్దేషించి వాడబడేది. మొదటి తరం కంప్యూటర్‍ శాస్త్రపరిశోధకులైన కర్ట్ గోడెల్‍, అలోంజో చర్చ్ మరియు అలన్‍ ట్యూరింగ్‍ ఒక గుమాస్తా ఎలా పనిచేస్తాడో గమనించారు. ఒక గుమాస్తా సృజనాత్మకత ఏదీ లేకుండా గంటలకు గంటలు ఇవ్వబడిన సూచనల ప్రకారం పని చేయడం వారిని ఆకర్షించింది. ఈ విధమైన పనులకు స్వయంచాలిత యంత్రాలను ఉపయోగించినట్టైతే మానవ తప్పిదాలను నివారించవచ్చనే ఆలోచన వచ్చింది. ఈ పరిశీలన వారిని గణన యంత్రాలను నిర్మించేందుకు పురికొల్పింది. వారియొక్క సూక్ష్మబుద్ధి సకల విధాలైన గణిత సంబధిత పనులను చేసేటటువంటి యంత్రాలను తయారు చేయవచ్చనే యూనివర్సల్‍ కంప్యూటర్‍ సిద్ధాంతానికి రూపకల్పన చేసింది. యూనివర్సల్‍ కంప్యూటర్‍ సిద్ధాంతమే ఆధునిక కంప్యూటర్‍ శాస్త్రానికి పునాది వేసింది. 1940 ల తర్వాత మరింత శక్తివంతమైన గణన యంత్రాలను తయారు చేయడం మొదలు పెట్టారు. క్రమేణా కంప్యూటర్‍ అనే పదం మనుషులను కాక యంత్రాలను సూచించే పదంగా పరివర్తన చెందింది. కంప్యూటర్లు కేవలం గణిత సంబంధితమైన పనులకే పరిమితంకావని తెలుసుకున్న తరువాత కంప్యూటర్‍ శాస్త్రం దినదినాభివృద్ధి చెందడం మొదలు పెట్టింది. 1960 లో కంప్యూటర్‍ శాస్త్రం విశ్వ విద్యాలయాలలో ఒక అధ్యయన విభాగంగా రూపు దిద్దుకొని పట్టభద్రులను తయారు చేయడం మొదలైంది.కంప్యూటర్ల లభ్యత బాగా పెరగడంతో వివిధ రకాలైన కంప్యూటర్‍ అప్లికేషన్లకు ప్రత్యేకమైన బోధనా తరగతులు ప్రారంభించ బడ్డాయి.


సైబర్‍ ప్రపంచ సంరక్షణ!

ఒక పక్క ఇంటర్‍నెట్‍ వినియోగం ఎక్కువవుతుంటే దాంతో సమానంగా సైబర్‍ నేరాలు కూడా పెరుగుతున్నాయి.
వీటిని అరికట్టడంలో భాగంగా కొత్త కొత్త ఉద్యోగాలు, కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు సైబర్‍ ప్రపంచ సంరక్షణ సరికొత్త కీలక ఉద్యోగ బాధ్యతగా అభివృద్ధి చెందుతోంది!
అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతి సామాన్య వ్యక్తుల వరకు అందరూ సైబర్‍ ప్రమాదాల బారిన పడుతున్నారు. మన సమాచారాన్ని మనకు తెలియకుండానే దొంగిలిస్తున్నారు. అణుయుద్ధాల కంటే సైబర్‍ యుద్ధాలే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తగిన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న కెరియర్‍ సైబర్‍ సెక్యూరిటీ. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణ్వస్త్రాలే అవసరం లేదు. ఆ దేశ సమాచార వ్యవస్థపై సైబర్‍ దాడి చేసి ధ్వంసం చేస్తే చాలు. కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.


సైబర్‍ సెక్యూరిటీ అంటే ఏంటి?
సైబర్‍ నేరగాళ్ల సాంకేతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న వ్యవస్థను రూపొందించి, నిర్మించి, నిర్వహించి నెట్‍వర్క్ను భద్రంగా కాపాడుకోవడాన్ని సైబర్‍ సెక్యూరిటీ అని చెప్పవచ్చు. తద్వారా ఈ-కామర్స్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయడం దీని ప్రధాన లక్ష్యం.
సాధారణంగా కంప్యూటర్‍, నెట్‍వర్క్, సాఫ్ట్వేర్‍, హార్డ్వేర్‍ లక్ష్యంగా సైబర్‍ నేరాలు (వైరస్‍, ఎస్‍క్యూఎల్‍ ఇంజెక్షన్‍, డిస్ట్రిబ్యూటెడ్‍ డినయల్‍ ఆఫ్‍ సర్వీస్‍) జరుగుతుంటాయి. ప్రభుత్వం, కార్పొరేట్‍ సంస్థలు, ఇతర వ్యవస్థలు ఇందులో ప్రధాన బాధితులు. అందుకే పోగ్రామింగ్‍, సురక్షితమైన, దుర్భేద్యమైన నెట్‍వర్క్ల అభివృధ్ధి ఇప్పుడు మేధావుల, ఉద్యోగుల ప్రధాన లక్ష్యంగా మారింది.
ఆధునిక టెక్నాలజీ ద్వారా అన్ని పనులు ఆన్‍లైన్‍లో సులువుగా జరిగిపోతున్నప్పటికీ సమాచారానికి భద్రత లేకుండా పోయింది. దీంతో ఇన్‍ఫర్మేషన్‍ సెక్యూరిటీ అనేది ఎన్నో రకాల ఉద్యోగాల, కోర్సుల ఆవిర్భవానికి కారణమైంది. ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది.
కంప్యూటర్‍ టెక్నాలజీ, నెట్‍వర్క్ల సంయోగం ద్వారా సమాచారాన్ని క్షణాల్లో సరఫరా చేయడం సాంకేతికంగా ఒక విప్లవాత్మక మార్పు. కానీ ఆ సౌలభ్యంతోపాటు అనేక రకాలుగా టెక్నాలజీ దుర్వినియోగం అవుతోంది. అందుకే ఇన్‍ఫర్మేషన్‍ సెక్యూరిటీ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.


ఇన్ఫర్మేషన్‍ సెక్యూరిటీ అంటే ఏమిటి?
‘ఇన్ఫోసెక్‍’ అనే చిట్టి పేరు కలిగిన ఇన్‍ఫర్మేషన్‍ సెక్యూరిటీ, డిజిటల్‍ రూపంలో ఉన్న సమాచారాన్ని భద్రపరచడానికి అవసరమైన పద్ధతులను అన్వేషిస్తుంది. వాటిని గుర్తించి, అభివృద్ధి చేస్తుంది. అంటే అనధికారికంగా సమాచారాన్ని సంగ్రహిం చడం, వినియో గించడం, ఇతరులకు పంపిణీ చేయడాన్ని నివారిస్తుంది. అనైతిక, చట్ట విరుద్ధమైన చర్యల నుంచి సమాచారానికి రక్షణ కల్పిస్తుంది.
సమాచారం లేదా డేటా ఎలాంటి పరికరంలోనైనా ఉండవచ్చు. ఈ రక్షణ పక్రియలో సీఐఏ అనే మూడు మౌలికాంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ‘సి’ (కాన్ఫిడెన్షియాలిటీ) సమాచార గోప్యతకు, ‘ఐ’ (ఇంటిగ్రిటీ) సమాచార సమగ్రతకు, ‘ఎ’
(అవైలబిలిటీ) సమాచార లభ్యతకు సూచికలు. గోప్యత అంటే అర్హత లేని వారికి సమాచారం లభించకుండా చేయడం, సమగ్రత అంటే రవాణా పక్రియలో సమాచారం ఎక్కడ ఎలాంటి మార్పులకూ గురికాకుండా ఉండటం. మూడోదైన లభ్యత అంటే కోరుకున్న సమయానికి సమాచారం అందుబాటులో ఉండటం. ఇన్ఫర్మేషన్‍ సెక్యూరిటీ ఈ మూడు మౌలికాంశాలను లక్ష్యాలుగా పరిగణిస్తుంది. వాటికి హామీ ఇచ్చే అల్గారిథమ్‍ను (క్రమసూత్ర పద్ధతులు), పోగ్రామ్‍లను అభివ•ద్ధి పరుస్తుంది. సమాచార భద్రత స్థాయిల గురించి పటం ద్వారా తెలుసుకోవచ్చు.


డిజిటల్‍ సమాచారం ఎంత భద్రం?
కంప్యూటర్లలో సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందను కోవడం భ్రమ. అల్గారిథమ్‍, దాని ఆధారంగా రాసిన పోగ్రామ్‍లకు సంభావ్యతా సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది. కాబట్టి వాటి వివరాలను గణితాన్ని ఉపయోగించి ఇతర మార్గాల ద్వారా తెలుసు కోవచ్చు. భద్రతా వలయాన్ని ఛేదించవచ్చు. అందుకే కంప్యూటర్‍ లేదా డిజిటల్‍ వ్యవస్థలో సంపూర్ణ భద్రత అసాధ్యం. అందుకే వీలైనంత తక్కువ సమయంలో ఆన్‍లైన్‍ వ్యవహారాలు ముగించ డానికి పాస్‍వర్డ్లతోపాటు వన్‍ టైమ్‍ పాస్‍వర్డ్ (ఓటీపీ) వంటి వాటిని వాడుతున్నారు.


అనేక దారుల్లో అభద్రత
సమాచారానికి రకరకాల మార్గాల్లో ప్రమాదం వాటిల్లుతుంది.

  • వివిధ వైరస్‍లతో సాఫ్ట్వేర్‍ను ధ్వంసం చేయడం
  • మేధో సంపత్తిని దొంగిలించడం
  • పాస్‍వర్డ్ ఆనవాళ్లను సంగ్రహించడం
  • సమాచారాన్ని అనుమతి లేకుండా సేకరించడం
  • సమాచారాన్ని ధ్వంసం చేయడం
  • ఫిషింగ్‍ (మన ప్రమేయం లేకుండానే ఈ-మెయిల్‍ను సంపాదించి పదే పదే మెయిల్స్ పంపడం)


ఇవే కాకుండా, రోజురోజుకీ కొత్త పద్ధతుల్లో సమాచారానికి ప్రమాదం కలిగిస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే పక్రియలోనే అనేక రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.


ముఖ్యమైన సర్టిఫికేషన్‍లు

  • ఎథికల్‍ హ్యాకింగ్‍ (సర్టిఫైడ్‍ ఎథికల్‍ హ్యాకర్‍)
  • సిస్కో నెట్‍వర్కింగ్‍ (సీసీఎన్‍ఏ)
  • మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా ఎంసీఎస్‍ఈ సర్టిఫికెట్‍ కోర్సు
  • ఇసాకా సంస్థ ద్వారా సర్టిఫైడ్‍ సెక్యూరిటీ అనలిస్ట్.


ఎలాంటి ఉద్యోగాలు?

మన నిర్లక్ష్యం, అలసత్వాల వల్లే సమాచారానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే భద్రత కల్పించే ఉద్యోగులు పలు అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదించాలి. సంస్థ రక్షణ నియమాలు, ఇన్‍ఫర్మేషన్‍ సెక్యూరిటీ నిర్వహణ, సమాచార ఆస్తుల రక్షణ, మానవ వనరుల భద్రత, ఆథెంటికేషన్‍, సమాచార సేకరణ-నిర్వహణ వివరాలు, చట్టపరమైన జాగ్రత్తల వంటి అంశాల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. కొన్నేళ్లుగా ఈ రంగంలో ఏటా దాదాపు 20% పైగా ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. 2024 వరకూ ఇదే రీతిన వృద్ధి ఉంటుందని ఒక సర్వే వెలడైంది.

ఈ రంగంలో ఉండే ఉద్యోగాల్లో కొన్ని…

  • నెట్‍వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‍
  • సిస్టమ్‍ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‍
  • నెట్‍వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్‍
  • డేటా అనలిస్ట్
  • ఇన్‍ఫర్మేషన్‍ సిస్ట్టమ్‍ సెక్యూరిటీ మేనేజర్‍


-సృజన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *