ఒకరుగాదు ఇద్దరు కాదు. అనేకమంది పురాలిపి పరిశోధకులు, భాషావేత్తలు, శాసన విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది కొరవి శాసనం. ప్రస్తుత తెలంగాణా, మునుపటి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకాకు 10 కి.మీ. దూరంలో నున్న కొరవిలోని వీరభద్రాల యంలో ఉంది. ఈ శాసనం అసలక్కడికెలా వచ్చిందో తెలిపే ఓ కథ ఉంది.
1966లో ఈ శాసనం తొలిసారిగ పురావస్తుశాఖ దృష్టిని ఆకర్షించింది. ఆ సం।।మే ఈ శాసనం నకలు తీసి, శాసన విభాగపు వార్షిక నివేదికలో 327 నంబరు శాసనంగానూ డా.ఎన్. వెంకటరమణయ్యగారి సంపాదకత్వంలో వెలువడిన ఇన్స్క్రిప్స్న్స్ ఆఫ్ ఆంధప్రదేశ్ – వరంగల్ డిస్ట్రిక్టు హైదరాబాద్ (ఆం.ప్ర. పురావస్తుశాఖ), 1974లో శాసనం 6గానూ (పే.10-15); ఆ తరువాత 1969లో ఆం.ప్ర.పురావస్తుశాఖ, డా.ఎన్. వెంకట రమణయ్యగారి సంపాదకత్వంలో వెలువడిన ఎపిగ్రాఫియా ఆంధ్రికా వా.l, (హైదరాబాదు, 1969 పే.119-145)లో ఎంవిఎన్ ఆదిత్యశర్మ, ఎస్.దాశరథి, ఎన్. ముకుందరావు, జి.జవహర్లాల్‍ల నాలుగు వ్యాసాలుగానూ; మొదటి ప్రపంచ తెలుగు సభల (1975) సందర్భంగా, పి.వి.పరబ్రహ్మశాస్త్రిగారు రాసిన తెలుగు శాసనాలు పుస్తకంలో, ‘కొరవిశాసనాలు’ శీర్షికన (పే.46-67); పరబ్రహ్మశాస్త్రి గారే ‘భారతి’లో ‘కొరవిశాసనాలు పునర్విమర్శ’ పేరిట వ్యాసం, భారతీయ భాషా సంస్థ (CIL), మైసూరు వారు 2019లో ప్రచురించిన ఈమని శివనాగిరెడ్డి, కొండా శ్రీనివాసులు రాసిన తెలుగు వారి శాసనాలు క్రీ.పూ.3వ శతాబ్ది క్రీ.శ.18 శతాబ్దాలు, (సంపాదకులు : డి. మునిరత్నం నాయుడు), ‘ముదిగొండ చాళుక్య నిరువద్యుని కొరవిశాసనం’ పేరిట (పే.117-122) వ్యాసం, ఇంకా ఎంతో మంది రాసిన వ్యాసాల్లో కొరవి శాసనంపై తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. క్రీ.శ.10వ శతాబ్ది నాటి తెలంగాణభాష, లిపి, వ్యాకరణం, రాజకీయం, సమాజం, మర్యాద, మన్ననలు, నేరము, శిక్షలు, కక్షలు – కార్పణ్యాలు, ఆర్థిక విషయాలెన్నో ఉన్న ఈ శాసనంలో నిధుల గురించిన వివరాలున్నాయని దుండగులు ఈ శాసనాన్ని ముక్కలు చేశారు. అంతవరకూ ఈ శాసనం కొరవి ఊర్లో ఉన్న ఒక మండపం దగ్గరుండేది. తమ ప్రయత్నంలో భాగంగా, ఆ దుండగులు ముక్కలైన ఈ శాసనం పెద్ద ముక్కను అక్కడే వదిలేసి నాలుగు ముక్కల్ని కొరవి చెరువు కట్టమీద పడేశారు. నిధులు దొరక్కపోగా, చేతులు బొబ్బలెక్కి, వళ్లంతా చెమటలుపట్టి, వట్టి చేతుల్తోనే దుండగులు వెళ్లిపోయారు. అలా దురాగతానికి బలైన శాసనపు పెద్ద ముక్కను ఆ మండపం దగ్గర నుంచి, గ్రామ పెద్దలు, వీరభద్రస్వామి దేవాలయానికి తరలించి భద్రపరచారు. మరో నాలుగు ముక్కలు చెరువు కట్టమీదే ఉండిపోయాయి. విడిపోయిన తల్లి, బిడ్డల్లా. అదుగో అలా రెండు చోట్ల ఉన్న శాసన శకలాల్ని పురావస్తుశాఖకు చెందిన ఎన్.ముకుందరావు నకళ్ళను తీశారు. ఇదీ ఆ శాసనం, శాసన శకలాల కథ.
ఇక అసలు విషయానికొద్దాం. మొత్తం శాసనంలో 104 పంక్తులున్నాయి. మొదటి భాగంలో 1 నుంచి 43, రెండో భాగంలో 44 నుంచి 69 వరకూ, మూడో భాగంలో 70 నుంచి 104 వరకూ మూడు భాగాలుగా ఉంది. శాసన చివరి వ్యాసగీత సంస్కృతంలోనూ మిగతా శాసనమంతా నన్నయ కంటే వందేళ్ల ముందటి తెలుగు భాషలో ఉంది. చివరన శాసనాన్ని రచించిన సంధివిగ్రహి చాముంఱెయ (చాముండరాయ) వ్రాలు అని ఉంది.
తెలంగాణారాష్ట్రం, మహబూబాద్ జిల్లా కొరవిలో వీరభద్రస్వామి దేవాలయంలోనున్న ఈ శాసనం క్రీ.శ.935 నాటిది. నన్నయకంటే 100 సం।।లు ముందరిది. తెలుగు పద్యాలు, తెలుగుపదాలు, ఆనాటిభాష, లిపిని తెలియజేస్తుంది. ముదిగొండ కేంద్రంగా పాలించిన ముదుగొండ చాళుక్యులు క్రీ.శ.800-1200 వరకూ వేంగీచాళుక్యుల సామంతులుగా పాలించారు. వేంగీ చాళ్యు మొదటి భీముని పట్టాభిషేక సందర్భంగా క్రీ.శ.892లో వేంగీచాళుక్యులు, రాష్ట్రకూటులమధ్య జరిగిన ఘర్షణల్లో ముదుగొండ చాళుక్యరాజైన కుసుమాయుధుడు, రాష్ట్రకూటుల రెండో కృష్ణునితో పోరాడి, చాళుక్యభీముని పట్టాభిషిక్తుని గావించాడు. తరువాత జరిపిన దాడిలో, కుసుమాయుధుడు మరణించాడు. పిమ్మట జరిగినయుద్ధంలో కృష్ణున్ని, కుసుమాయుధుని కొడుకు గొణగయ్య తరిమికొట్టాడు. ఈశాసన తొలిభాగంలో ఈవిషయాలున్నాయి.
తరువాత రాష్ట్రకూటరాజు నాలుగో గోవిందునికి, వేంగీచాళుక్యులకు జరిగిన యుద్ధంలో చాళుక్య రెండో భీముని పక్షాన నిలబడి గెలిపించినవాడు ఈ శాసనకర్త ముదుగొండ చాళుక్యనిరవద్యుడు. కుసమాయుధుని కుమారుడు.
పెద్దరాయి – మొదటివైపు
- శ్రీ విక్రమాదిత్య నృపా
- గ్రతనయుణ్డయ్న చాలుక్య
- భీమునకు శౌచకన్దప్పు
- నకువే (ఏ) గీశ్వరునకు రన
- మద్ధ (ద్ధా ) న్వయ కులతిలకు
- ణ్డయ్న కుసమాయుధుణ్డు గ
- న్నర బల్లహుని కస్త ప్రాప్త
- (o) బయ్న రనమద్ధ (ద్ద ) కణ్ఠియం దన
- భుజవీయ్య ( ) బలపరాక్ర
- మంబున శెచ్చి కణియం గట్టి
- పట్టం బెత్తి ఖర్గసహాయు
- ణ్డై నేల యెల్లం గావంబు (బూ)ని
- మంచి కొణ్డ నాణ్డా దిగ
- వేంగి దేసము విఘ్నవ
- ద్దె (ద్ద ) నుతో నద్ధ రాజ్యంబుసే
- యు చున్న కుసుమాయుధు పె
- మణిమకుట మకరికా
- కషణ మృశృ (సృ)ణిత చ(రణలి),
పెద్దరాయి – రెండవ వైపు
(ఈ క్రింది రెండు వైపుల నేది రెండవదో
ఏది మూడవదో చెప్ప వీలుగాకున్నది)
- గల కలావత్త oబు రా
- జ్యంబు సేయుచు నిష్ఠ (ష్ట)వి
- షయ కామ భోగంబుల
- ను భవించుచు సుఖంబు
- ణ్డి యొక్క నాణ్డు కొరవి నల్ల
- మే ఱె య కొడుకు పెద్దన
- రావించి నీవు నాప్రాణ స
- మానుణ్డ వైన చెలివి నీ
- చేసిన యుపకారంబు నా
- కు బ్రత్యుపకారంబు సేయ
- వలయుం గాన నీకేమి వ
- లయుం దాని వే
- ణ్డి కొమ్మన్న నీ
- శ్రీ నాకెల్లం గలదేమిలే
- కున్న వేణ్డి కొణ్డు మయ్న
- ంబరోపకారంబు పొణ్ఠె నా
- ని కొరవి యన్నది ముదు
- గొణ్డ సల్కుల కులసన్త
పెద్దరాయి – మూడవ వైపు
- న(టా) నెగల్ల శ్రీనిరస
- ద్యుణ్డ నేక సమర సంఘ
- ట్టణ భుజాసి భాసురు
- ణ్డై తమ యన్న రాజ్య శ్రీ
- కెల్ల న్దాన యరు హుణ్డై
- చేకొని నిల్చి భీమసలు
- కి యన్ద నేక వస్తు వా
- హనోత్సవంబు ల్వడ యు
- చు తమ యన్న గొణంగయ్య
- చేసిన ధబెంబ వులు నస
- ంబును నెగఱ్పను గావను
- రక్షింపను వలయునని
- చేకొని కొరవికిచ్చిన
- స్తితి సల్పి శిలాస్థ (స్త) మ్భ
- ంబు ప్రతిష్ఠి (ష్ఠి)ంచి భీమేశ్వ
- రంబును నాతని కొఱ్ఫించి
- న చెఱువులు మఱియు మె
- వ్వి యే నాతని (చా(చే) యంబడి
- (న) ధమ్ము వుల (న్దీ ఱ…)
మొదటిరాయి నాలుగవ వైపు
- ముక్కు దఱిగినవ చఱి
- చినను చురియ వెఱికిన
- ను ముఱ్చి లినను ఱంక్కాడి
- నను ఇరువాద్యది ఏను
- ద్రమ్మలు మాణిసి చేసిన
- దోసంబునకు వాని జీవిత
- ం ఒ దణ్డువు వరియా ర (ంఒ)
- ంబు పడవరంబు, వెల్లార
- ం•ంబు ఎరగద్యాణంబు పె
- రామణి పున్నమ నాణ్డు ఏ
- నూరు ద్రమ్మలరివె
- ట్టి సుఖంబు మనువ (వా) రు (।లి)
- నాయకుణ్డైయన్న (న) కాంపులయ్న
- వెఱ రాజులంజొచ్చి మ
- నా(ం) జనదు యీ స్తితి యడి
- సి కొన్న రాజుల్గ ల రేని
- యు యీ స్తితి యడిసిన కవ
- నాపకు ఇన్దు మన్న కంపు
చిన్నరాయి – మొదటి వైపు
- … ఱు నన్దమ
- న ప ట్టంబు గావం బూని (ధు)
- రదెడె రాహుణ్డై తనచే
- తివాల తోడుగా ననుంగు
- గొణంగణ్డను పేరితో జ
- లుక్య భీమణ్డు న్ద ను
చిన్నరాయి – రెండవ వైపు
- గాల(ం)బున…
- కాన్తరితుణ్డై చనిన నా
- తన తమ్ముణ్డు సకలలో
- కాశ్రయ, మణికణ (న కము
- క్తాలంకార చలుక్య కు(లో)
- ద్భవ సితగ చఱక్క బీ
చిన్నరాయి – మూడవ వైపు
- ఇచ్చిన స్తితియు పఱియ (ద)
- యు (ం) బోయు వెరెయంబు జి
- ట్టరి యెల్ల న్దక్కి చా బొడి
- చిన మాట యిరువది ద్ర
- మ్మలు మనం బొడిచిన
- నఱువది ద్రమ్మలు
- అక్కసలకు క ఱ కు (ం) లి
చిన్నరాయి – నాలుగవ వైపు
- మహీపతి వంశ జాశ్చపా
- పాదపేత మనసో భువి భూ
- రిభూపా ఏ (యే) పాల యన్తిమ
- మధమ్మ మిమం సమస్తం
- తేషాం(ం) మయా విరచి తోంజలి రేష
- మూద్ని (ధ్ని ) (।।లి) చన్ది (సన్ది విగ్రహిచాము (ంలి)
- ఱెయవ్ర (వ్రా)లు.
ఇక శాసనంలోని విషయాలను పరిశీలిద్దాం.
శాసనం ప్రస్తుత తెలంగాణలో దొరికినా, వేంగీచాళ్యురాజు మొదటి చాళుక్య భీముని పట్టాభిషేకంతో ప్రారంభమౌతుంది. క్రీ.శ.892కు కొంచెం ముందు. రాష్ట్రకూటరాజు రెండో కృష్ణుడు వేంగిదేశంపై దండెత్తి, అలకల్లోలాన్ని సృష్టించాడు. అపుడు వేంగీచాళుక్యల ఆదరణ చవిచూచిన, ముదుగొండ చాళుక్యశాఖకు చెందిన కుసుమాయుధుడు, రెండో కృష్ణుని ఢీకొని, అతడు మరలిపోయేట్టు చేశాడు. దీంతో వేంగీచాళుక్య మొదటి భీముడు పట్టాభిషిక్తుడైనాడు. పగతో రగిలిపోయిన రెండో కృష్ణుడు, మళ్లీ వేంగిదేశంపై దండెత్తి వస్తూ, ముందుగా ముదుగొండపై దాడిచేసి కుసుమాయుధుణ్ణి చంపాడు. ముదుగొండ చాళుక్యరాజ్య స్థాపకుల్లో ఒకడైన రణమర్డుడనే రాజు తన పట్టాభిషేకం సందర్భంగా మెడలో ఒక కంఠికను ధరించాడు. దానికి రణమర్థకంఠిక అని పేరు. అప్పటి నుంచి అదొక ఆచారమై, ముదుగొండరాజులందరూ పట్టాభిషేకం సందర్భంగా ధరించారు. అలా ధరించిన కుసుమాయుధుడు, రెండో కృష్ణుని చేతిలో మరణించినప్పుడు కూడా దాన్ని ధరించి ఉన్నాడు. కుసుమాయుధుడుని పెద్ద కొడుకు గొణగయ్య, యుద్ధభూమి నుంచి తండ్రి శిరస్సును, రణమర్ధకంఠికను కాపాడాడు. ఆ కంఠికను ధరించిన గొణగయ్య, రెండో కృష్ణుని ఎదుర్కొని, పారద్రోలి ప్రత్యక్షంగా ముదుగొండ రాజ్యాన్ని, పరోక్షంగా వేంగీరాష్ట్రాన్ని కాపాడిన విషయాలు శాసన రెండో భాగంలో ఉన్నాయి. కొంతకాలం తరువాత రాష్ట్ర కూటరాజైన నాలుగో గోవిందుడు, పాత పగతో మళ్లీ ముదుగొండపై విరుచుకుపడ్డాడు. భీకర పోరులో గోవిందుడు పైచేయి సాధించగా, తట్టుకోలేక, గొణగయ్య, వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరి వద్ద ఆశ్రయం పొందాడు. మారిన రాజకీయ పరిణామాల వల్ల, రెండో చాళుక్య భీముడు వేంగి సింహాసనాన్నిధిష్టించాడు. గొణగుని సోదరుడైన నిరవద్యుడు, రెండో చాళుక్యభీమునితో చేరి, రాష్ట్ర కూటరాజు గోవిందుని పారదోలి ముదుగొండను వశపరచుకొని, రాజైనాడు. ఇలా నాటకీయంగా ముదుగొండ రాజైన నిరవద్యుడే ఈ కొరవి శాసనాన్ని వేయించాడు. తనకు సహకరించిన నల్లమేడియ కొడుకు పెద్దనను మెచ్చి, ఏమి కావాలో కోరుకొమ్మనగా, పెద్దన ‘నీ సంపదంతా నాకున్నట్లే. నాకేమీ వద్దు, కొరవి ముదుగొండ, చాళుక్యులదే, ఎవరు రాజైనా తాను విధేయుడుగా ఉంటాననగా, నిరవద్యుడు అతన్ని కొరవి పాలకునిగావించాడు. అంతేకాదు, మునుపు గొణగయ్య ఇచ్చిన స్థితిగతులన్నింటినీ, నిరవద్యుడు పెద్దనకు తిరిగి కట్టబెట్టాడు. ఇది శాసనం రెండో భాగంలోనున్న విషయం.
ఇంకా నాలుగు శాసన శకలాలు ఆనాటి సాంఘిక, పాలనా పరమైన విషయాలను తెలియజేస్తున్నాయి. ఎవరైనా, ముక్కు దరిగినా, చరిచినా, ఛురియగుచ్చినా, చంపినా, రంకాడినా, ఇరువైఐదు ద్రమ్మలు చెల్లించాలని, తీనేరం చేసిన వారికి మరణశిక్ష అనీ, ఎవరూ శతృవుల పంచన చేరరాదనీ, పెరామణి పున్నమినాడు, ఎరగద్యాణం, వరియారంబం, పడువారంబు, వెల్లారంబంబులగాను 500 ద్రమ్మలు చెల్లించాలన్న నిబంధనల గురించి తెలియజేస్తున్నాయి. తన తండ్రి గొణంగడు చాళుక్య భీమునితో కలిసి రామునితో సమానంగా పాలించాడని, అనుకోకుండా చనిపోయిన అతని తమ్ముడు సకల లోకాశ్రయుడనీ, చాళుక్య కులోద్భవుడని, చివరగా ఎవరినైనా చావబొడిస్తే 120 ద్రమ్మలు, మానం బొడిస్తే 40 ద్రమ్మలు చెల్లించా లనీ, అక్కసాలులకు (బంగారుపని చేసేవారికి) కఱకూలిలేదనీ, ఈ శాసనాన్ని సంధి విగ్రహిచాముంఱెయ రాశాడని ఉంది. ఇంతటితో శాసనం ముగుస్తుంది.
శాసనంలోని కొన్ని పదాలు అనాటి పలుకు బడిని తెలియజేస్తాయి. తనయుణ్ణయ్న = తనయుడైన, వేగీశ్వరునకు = వేంగీశ్వరునకు, రనమద్ధి = రణమర్థుడు, తిలకుణ్ణయ్న = తిలకుడైన, కుసుమాయుధుణ్డు = కుసుమాయుధు(ం)డు, ప్రాప్తంబయ్న = ప్రాప్తంబైన, ఖఱ్గ సహాయుణ్ణై = ఖడ్గ సహాయుండై, వేంగిదేసము = వేంగి దేశము, విఘ్నవద్దె నుతో = విష్ణువర్థనునితో, సుఖంబుణ్డి= సుఖంబుండి, రావించి = రప్పించి, వేణ్డకొమ్మిన్న = వేడుకోమనిన, నీ శ్రీ = నీ సంపద, ముదుగొణ్డసల్కుల = ముదుగొండ చాలుక్యుల, శ్రీ నిరవద్యుణ్డనేక = శ్రీ నిరవద్యుడు అనేక, యరుహుణ్డై = అర్హుండై, భీమసలుకి = చాళుక్య మొదటి భీముడు, గొణుంగయ్య = గొణగుడు, ముక్కు దఱిగినను = ముక్కు చెక్కినా, చఱిచినను = చేతితో కొట్టిన, ముఱ్చిలినను = దొంగిలించినా, ఱంకాడినను = వ్యభిచరించినా, ఇరువాద్యడిఏను = ఇరవై ఐదు, మాణసిసేసిన = రాజసేవకుడు (తప్పులు) చేసినా, జీవితం బదణ్డవు = జీతం ఇవ్వబడదు, పడవరంబు, ధాన్యరూపంలో ఇచ్చే కవులు, వెల్లారంబంబు = మెట్టపైరు, ఎరగద్యాణంబు = ఒకపేరుగల నాణెము, పెరామణి పున్నమనాణ్డు = వైశాఖ వుణ్ణమినాడు, వెఱరాజులంజొచ్చి = పరరాజల పంచన చేరితే, కంపు – కాపు, చేతివాలతోడుగా = కరవాలము (కత్తి)లా, చాళుక్యకులోద్భవుడూ = (కులంలో) చంద్రుడు లాంటి అన్న అర్థాలు సరిపోతాయి.
ఇంతకు ముందు శాసనాలమాదిరిగనే, రకారపొల్లు ముందు, అక్షరాలు ద్విత్వాలుగా ఉన్నాయి. కన్దప్పు (కందర్పు), రనమద్ద (రణమర్థ), విఘ్నవద్దె ను (విష్ణువర్థను), అద్ద రాజ్యం (అర్ధరాజ్యం), కలావత్త oబు (కలావర్తంబు) ఇందుకు ఉదాహరణలు. రాయటంలో దొర్లిన కొన్ని పొరపాట్లు రణమర్థకురనమర్థ, విష్ణు యెర్థనునకు విఘ్నవర్ధనుతో, అయినకు అయ్ని. అయి అన్న పదానికి బదులు ఐత్వం ప్రయోగింపబడింది. నాయకుణ్ణై కొన్ని సంస్కృత పదాలకు తెలుగు ప్రయోగాలు గమనించదగ్గవి.
కరవాలము – చేతివాలము, ఆచంద్రార్కలము = కరకాలవర్తంబు. అన్ని విభక్తులు శాసనంలో కనిపించటం, వచనం కూడా చోటు చేసుకోవటం ఈ శాసన ప్రత్యేకతలు.
క్రీ.శ. 10వ శతాబ్ది రాజకీయ, సాంఘిక, భాషాపరమైన అనేక విలక్షణతలు కలిగి ఆనాటి ఆచారవ్యవహారాలను తెలుసుకోవటానికి ఉపకరించే ఈ శాసనం అలనాటి మేటి తెలంగాణ శాసనాల్లో ఒకటి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446