‘దస్త్రమ్’ పేరిట తెలంగాణ కథలను వెతికి వెలుగులోకి తెస్తున్న క్రమంలో 2002లో వాసుదేవరావు కనబడ్డాడు. అప్పటి నుంచీ ఆయన గురించి ఏ సమాచారం దొరికినా క్రోడీకరించుకోవడం అలవాటయింది. ఆయన కథలను మళ్ళీ మళ్లీ చదివాను. శ్రీవాసుదేవరావు రాసిన కథల్లో హైదరాబాదీతనం ఉన్నది. రుబాబుగా, డాబుగా, దర్పంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండే హైదరాబాదీ (ఎనుకటి) మనస్తత్వం కథల్లో రికార్డయింది. అయితే కథకుడు శ్రీవాసుదేవరావు గురించి ఎంత వెతికినా అదనపు సమాచారం ఏమీ లభించలేదు. ఈ తరుణంలో చినుకు పత్రికలో కె.కె. రంగనాథాచార్యులు గారు రాసిన వ్యాసంలో ఆయన కథలను సమగ్రంగా పరిచయం చేసిండు. ఇక్కడ కూడా మళ్ళీ వాసుదేవరావు జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా లేవు. వాసుదేవరావు కథలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆయన పక్కా హైదరాబాదీ అని అర్థమవుతుంది. బ్రాహ్మణుడు అని కూడా తెలుస్తుంది. బహుశా తండ్రి కూడా హైదరాబాదీ అయి వుంటాడు. తల్లిది మాత్రం ఆంధ్రా ప్రాంతం.
ఆనాడు తెలంగాణకు కోడళ్ళుగా వచ్చిన ఆంధ్రావాళ్ళు చాలా మందే వున్నారు. ఇల్లిందల సరస్వతీదేవి, యల్లాప్రగడ సీతాకుమారిలు తర్వాతి తరం కోడళ్ళు. వాసుదేవరావు 1924 నాటికే బి.ఏ., పూర్తి చేసి ఎం.ఏ. చదివే ఆలోచనలో ఉన్నాడు. అంతేగాదు సివిల్ సర్వీస్‍కు ప్రిపేర్ కావాలని కూడా కోరుకున్నాడు. (ఆలోచన, ప్రయాణం కథల్లో ఆయన ఉత్తమ పురుషలో చెప్పుకున్న వివరాలను ఆధారంగా చేసుకొని చెబుతున్న విషయాలు). నిజానికి 1924 ఆ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి సివిల్ సర్వీసెస్‍కు ఎంపికైన వారిలో సిరుగూరి జయరావు ముఖ్యులు. ఈయన 1924 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్‍లో నివసించేవారు. ఆ తర్వాత 1927లో సుజాత పత్రికలో తొలి వైజ్ఞానిక కథలు కూడా రాసినాడు. ఈ జయరావు ఐసిఎస్ ఆఫీసర్‍గా ఎంపికై మధ్యప్రదేశ్‍లో పనిచేస్తూ ఒక రోడ్డు ప్రమాదంలో 1938 ఆ ప్రాంతంలో చనిపోతాడు. హైదరాబాద్‍లో చాదర్‍ఘాట్ స్కూల్ ప్రిన్సిపాల్, యూరోపియన్, ఇంగ్లీషులోకి ఖురాన్‍ని అనువదించిన తొలి ఇంగ్లీషువాడయిన మార్మడ్యూక్ పిఖ్తాల్ ఆనాడు హైదరాబాద్‍లో సివిల్ సర్వీసెస్‍కు ప్రిపేరయ్యే వారికి ట్రెయినింగ్ ఇచ్చేవాడు. జయరావుగారి సోదరుడు సిరుగూరి హనుమంతరావు నిజాం కళాశాలలో చారిత్రకాధ్యపకులుగా పనిచేశారు. ఇదే కాలంలో తనికెళ్ళ వీరభద్రుడు కూడా నిజాం కళాశాలలో ఇంగ్లీషు అధ్యాపకులుగా పనిచేశారు. బహుశా వాసుదేవరావు కూడా నిజాం కళాశాల విద్యార్థే అయి వుంటాడు. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమయినప్పటికీ నిజాం కళాశాల విద్యార్థులే ఎక్కువగా రాణించేవారు.
సాహిత్య చరిత్రలో 1920-30ల మధ్యకాలంలో ముఖ్యంగా ముగ్గురు వాసుదేవరావులు కనిపిస్తారు. అందులో ఒకరు శ్రీ వాసుదేవరావు, రెండో అతను హసబ్నీసు వాసుదేవరావు, మూడో అతను నాగసముద్రం వాసుదేవరావు. ఈ ముగ్గురూ కూడా వేర్వేరు వ్యక్తులని తోస్తున్నది. నిజానికి ఈ ముగ్గురికి కన్నడతో సంబంధాలున్నాయి. దాంతో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. ఆనాడు ఇంటి పేరు లేకుండా రాయడమనేది ఊహించలేము. పేరు ముందు ‘శ్రీ’ అనేది గౌరవ వాచకంగా గాకుండా పేరులో భాగంగానే ఉండిందని అర్థం చేసుకోవాలి. ఆంధ్రపత్రిక 1933నాటి వార్షిక ఉగాది సంచికలో ఆ ఏడాది చనిపోయిన కొంతమంది కవులు, రచయితల పేర్లు పేర్కొంటూ ఎవరికీ ముందు ‘శ్రీ’ అనే అక్షరాన్ని జోడించలేదు. ఒక్క వాసుదేవరావుకు తప్ప. దాన్ని బట్టి రచయిత పేరు ‘శ్రీవాసుదేవరావు’గా పేర్కొనడం సమంజసంగా ఉంటుంది. ఈయన 1933లో చనిపోయారు. ఆనాడు ఆ పత్రికలో ప్రచురించిన ఫోటో ఆధారంగా ఆయన వయసు 45-50ల మధ్యగా గుర్తించవచ్చు. అంటే శ్రీవాసుదేవరావు బహుశా 1880-1890 మధ్యలో జన్మించి ఉంటారని ఊహ. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం రెండు సంపుటాలు వెలువరించిన కొమర్రాజు లక్ష్మణరావు ‘ఆంధ్ర వాఙ్మయ సూచిక- ముద్రితాముద్రిత గ్రంథముల పట్టిక’ను కొంత మేరకు తయారు చేసినాడు. అయితే 1923లో లక్ష్మణరావు అర్ధాంతరంగా మరణించడంతో దాన్ని పూర్తి చేసే బాధ్యతను ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు స్వీకరించారు. ఇందుకు ఆయన ఆంధ్రపత్రిక, భారతి పత్రికల్లో పనిచేసేవారి సహాయాన్ని తీసుకొని దాన్ని పుస్తకంగా 1929లో అచ్చేసినాడు. దీంట్లో వాసుదేవరావు హసబ్నీసు పేరిట అచ్చయిన పుస్తకాలలో బాల భాగవతము, బాల భారతము, బాల రామాయణము ఉన్నాయి. పేరు కూడా వాసుదేవరావు హసబ్నవీసు అని ఉన్నది. అలాగే హెచ్.వాసుదేవరావు పేరిట మరో పుస్తకం నౌకాభంగము ఉన్నది. ఇవన్నీ 1929కు పూర్వము అచ్చయిన పుస్తకాలుగా గుర్తించాలి. ఇంతకు మించి ఈ ‘హస్నబీసు’ గురించి మరింత సమాచారం తెలియడం లేదు. తెలంగాణలో షబ్నవీసు వెంకట రామానరసింహారావు అనే అతను నల్లగొండ నుంచి నీలగిరి అనే పత్రికను వెలువరించాడు. వీళ్ళంతా కరణాలు. ప్రభుత్వ రెవిన్యూ రాత కోత వ్యవహారాలను చూసేవారు. నిజానికి ఉర్దూలో ‘నవీస్’ అంటే రాతగాడు అనే అర్థమున్నది. కెకెఆర్ గారు పేర్కొన్నట్లుగా ఈయన ‘కమ్మలు’ అనే కథను రాసినాడు. ఆ కథ ‘శ్రీవాసుదేవరావు’ రాసిన కథలతో ‘సంవదిస్తాయి’ అని కూడా చెప్పారు. ‘సంవదిస్తే’ సంవదించవచ్చు గానీ ఇద్దరూ ఒక్కరే అయ్యేందుకు అవకాశం లేదని నా ఊహ. ఎందుకంటే ‘కమ్మలు’ పేరిట ఒక కథ, మళ్ళీ అట్లాంటిదే ‘మాటీలు’ పేరిట మరో కథను ఒకే రచయిత రాయడం బహుశా కుదరని, పొసగని విషయం. రచయితలెవరైనా తమ కథలకు భిన్నమైన పేర్లు పెడుతారు. ఒకే రకమైన పేర్లు పెట్టడం చాలా అరుదు. అందునా రచయిత ఒకసారి హసబ్నీసు అని పెట్టుకొని మరోసారి ఆ పేరు లేకుండా ‘శ్రీవాసుదేవరావు’ పేరిట రాయడమనేది సమన్వయం కుదరని విషయం. దీన్ని బట్టి ఈ ఇద్దరు వాసుదేవరావులు వేర్వేరని నిర్ధారించవచ్చు.
ఇక మూడో వాసుదేవరావు ‘నాగసముద్రం వాసుదేవరావు’. ఈ వాసుదేవరావు 1895లో జన్మించి సెప్టెంబర్ 22, 1979నాడు చనిపోయినాడని రాయలసీమ రచయితలు మూడో భాగంలో కల్లూరి అహోబలరావు పేర్కొన్నారు. ఈయన కూడా బహుశా కరణమే! ఎందుకంటే ఈయన తండ్రి ‘కరణం నారాయణరావు’గా ప్రసిద్ధి. ఈ నాగసముద్రం వాసుదేవరావు అనంతపురం జిల్లా ధర్మపురికి చెందినవారు. ఈయన మనోహర విజయము (నవల), అనంతపురమండల చరిత్ర (చారిత్రక కథలు), కుసుమాంగి, విచిత్ర వివాహము (నవలలు), అనంతపురం భూగోళము మొదలైన పుస్తకాలను రాసినారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన నవలలు, వచన గ్రథాలు, చాటువులు రాసినారు. ప్రసిద్ధిమైన కొన్ని ఇంగ్లీష్ పద్యాలననుసరించి వీరు తెలుగులో పద్యాలు రాసినారు. ‘ఎడ్వంచర్స్ ఆఫ్ యులిసిస్’కు అనుసరణగా ‘మనోహర విజయము’ నవలను వెలువరించారు. ఈయన అనంతపురం జిల్లా వాడు కావడంతో పక్కనే ఉన్న కన్నడ ప్రభావం కూడా బాగానే ఉండింది. ఈ వాసుదేవరావు 1979 వరకు బతికున్నాడు. అంటే ‘శ్రీవాసుదేవరావు’ వేరు అనే విషయం అర్థమైతుంది.
‘శ్రీవాసుదేవరావు’ 1993లో చనిపోయాడని ఆంధ్రపత్రికలో ఇలా రాసినారు. ‘‘వాసుదేవరావు గారు, శ్రీ. కీ.శే.।। ‘నవలలు, కథలు రచియించి తెనుగుతల్లి క్రొత్తయలంకరించుచున్న భావుకులలో వీరొకరు. వీరి కథలను పెక్కింటిని భారతి, ఉగాది సంచిక అలంకరించుకొన్నవి. కథలను పాఠకులకు నచ్చునట్లు అల్లుట యందు వీరికి మంచి శక్తి గలదు. కొన్ని నవలలను గూడ ప్రకటించి యున్నారు’.’’ అని ఉన్నది. ఆంధ్రపత్రిక ఉగాది సంచికల్లో పెద్దగా ఈయన కథలు కానరాలేదు గానీ భారతి, ఆంధ్రభారతి పత్రికల్లో ఈయన రచనలు ఉన్నాయి. ఈ సంస్మరణలో వాసుదేవరావు నవలలు రాసినట్టుగా పేర్కొన్నారు. అవి పుస్తకాలుగా అచ్చయినాయని ఆంధ్రవాఙ్మయ సూచిక ద్వారా తెలుస్తున్నది. ఇందులో వాసుదేవరావు నవలలు పేరిట ‘‘ధృడ ప్రతిజ్ఞ, పరమ రహస్యము’ ఉన్నాయి. ఈ నవలలు దొరికినట్లయితే మరికొంత అదనపు సమాచారం దొరికే అవకాశమున్నది. అయితే ఇక్కడొక సందేహమొస్తున్నది. తెలంగాణ వాడైన వాసుదేవరావు ఆంధ్ర ప్రాంతంలోని పత్రికల్లో మాత్రమే ఎందుకు రాసినాడు అని. నిజానికి 1927-30 మధ్య కాలంలో వాసుదేవరావు బతికున్న కాలం నాటికే హైదరాబాద్ నుంచి సుజాత పత్రిక వెలువడింది. ఈ పత్రికలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ‘చలం’ కథలు కూడా అచ్చయినాయి. ఇవన్నీ పరిశీలించాల్సిన, పరిశోధించాల్సిన విషయాలు. ఏది ఏమైనప్పటికీ వాసుదేవరావు పక్కా హైదరాబాదీ. అయితే ఈయన సంబంధ బాంధవ్యాలన్నీ ఆంధాప్రాంతం వారితోనే ఉన్నాయనేది కూడా కథల్లో ప్రస్తావనల ద్వారా అర్థమైతుంది. తుదకు తేలేదేమిటంటే ‘శ్రీవాసుదేవరావు’ని ఇప్పటికైతే హైదరాబాదీగానే భావించాలి. ఎందుకంటే భాష, ఆలోచన, రుబాబు, వివిధ విషయాల పట్ల రియాక్షన్ అన్నీ హైదరాబాదీ హుందా తనాన్ని, గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్ జీవితాలను హృద్యంగా అక్షరబద్దం చేసిన తొలి తెలుగు కథకులు శ్రీవాసుదేవరావు. ఈయన కథలన్నింటిని ఇక్కడ ఒక్క దగ్గరికి తెస్తున్నాము. భవిష్యత్‍లో ఎవరైనా పూనుకొని ఆయన రాసిన నవలలు (వెతకాలి), అనువాద కథలు అచ్చులోకి తీసుకు రావాలి. అప్పుడు మాత్రమే ఆయన గురించి లోతైన పరిశీలన, విశ్లేషణ, విమర్శ రావడానికి వీలవుతుంది. ఆ తోవలో ఇదొక మైలురాయిగా భావిస్తూ, దీనికి ‘టార్చ్లైట్’ పడుతూ ముందుమాట రాసిన రంగనాథాచార్యులు గారికి ధన్యవాదాలు.
(తెలంగాణ ప్రచురణలు తరపున వెలువరించిన ‘శ్రీవాదసుదేవరావు కథలు’పుస్తకానికి రాసిన ముందుమాట)
-సంగిశెట్టిశ్రీనివాస్,
ఎ:98492 20321