శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం


ఉషోదయ వేళ విప్పారిన పుష్పం కనువిందు చేస్తుంది. కాని అంతకుముందు రోజే మొగ్గయి, రాత్రి విచ్చుకుంటేనే ఇది సాధ్యం. కాల ప్రవాహంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు జలజల రాలిపడుతుండటం-మనిషి జీవితకాలంతో పోల్చలేం. మానవాళి నాగరికతను అమోఘంగా ప్రభావితం చేసిన విజ్ఞానశాస్త్రం, ప్రగతి వంటి అంశాలను బేరీజు వేసినపుడు వంద సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యవధికాదు.


సంకేతంగా రాళ్ళు వాడటం క్రీ.పూ. 24,00,000లో ప్రారంభం కాగా, వేటకు సోలతులు, బాణాలు, అంబులు వాడటం క్రీ.పూ. 25,000లో మొదలైంది. అలాగే ఆకులు గల చక్రం మెసపటో మియాలో తయారైంది క్రీ.పూ. 2000 సంవత్సరంలో. చూశారా… ఈ మూడు పరిశోధనలకు ఎంత ఎడం వుందో? వీటిని ఎవరు కనుగొన్నారో మనకు వివరాలు తెలియవు. ఈ దృష్టితో చూసినప్పుడు వంద సంవత్సరాలు కాల పురుషునికి ఒక అంగకు కూడా సరిపడవు. అంతేగాక క్రీ.పూ.200 నుంచి క్రీ.శ. 14వ శతాబ్దం దాకా విజ్ఞానశాస్త్రం దాదాపు స్తబ్దంగా కనపడుతుంది. అందువల్ల వంద సంవత్సరాలు పెద్ద వ్యవధి కాకపోయినా-20వ శతాబ్దంలో సైన్స్ సాధించిన ప్రగతి విస్మయం కలిగిస్తుంది. జె.డి. బెర్నాల్‍ ‘‘సైన్స్ ఇన్‍ హిస్టరి’’ అనే గ్రంథంలో పేర్కొన్నట్లు ఈ శతాబ్ది తొలి అర్థభాగంలో వచ్చిన పరిశోధనల సమాహారం- అంతవరకు మానవాళి సాధించిన సైన్స్ సంచయం కన్నా గొప్పదని పేర్కొంటారు. 1954లో మొదట ప్రచురితమైన ఈ పుస్తకంలో బెర్నాల్‍ వెలిబుచ్చిన అభిప్రాయమిది. కాగా, రెండవ అర్ధభాగంలో వచ్చిన ఆవిష్కరణల గురించి ఏమని వ్యాఖ్యానించి వుండేవారో! మానవాళి చరిత్రలో వ్యవసాయం చేయడాన్ని మొదటి విప్లవంగాను, పారిశ్రామిక విప్లవాన్ని రెండవదానిగానూ పేర్కొంటారు. మూడవ విప్లవం సమాచార విప్లవం ఈ శతాబ్ది రెండవ అర్ధభాగంలో సంభవించింది. ఈ ప్రకారంగా మనం బేరీజు వేసినా ఈ శతాబ్దం ప్రగతి అద్భుతమైనది.


సహస్రాబ్దం అంచున వున్న మనం 19వ శతాబ్దం చివరా, 20వ శతాబ్దం చివర సైన్స్ గమనాన్ని వీక్షిస్తే అది నిద్రమత్తులో నడిచే నడకకూ, శరవేగంగా సాగే పరుగుకూ ఎంత తేడా వుందో అంతవుందని మనకు అవగతమవుతుంది. ఇప్పుడు చంద్రమండలానికి కాదు, ఇతర గ్రహాలకు అంతరిక్ష పర్యటన యాత్రలు ఎంతో దూరంలో లేవని సూచనలు వస్తున్నాయి. కాని గంటకు 135 కి.మీ. నడిచే ఎలక్ట్రిక్‍ కారును ప్రయోగాత్మకంగా తయారుచేసింది 1902లోనే. హెలికాప్టర్‍ 1907లో ఆవిష్కరించబడగా, పారాచూట్‍ 1912లో తయారైంది. 1926లో తొలుత రూపకల్పన చేయబడ్డ రాకెట్‍ 60 మీటర్లు మాత్రమే ఎగరగలిగినా, 1956 కు గంటకు 20,000 కి.మీ. వేగం అందుకో గలిగింది. చంద్రమండలంలో కాలనీలూ, అంగారక గ్రహం మీద అపార్ట్మెంట్లు అనే రీతిలో సాగుతున్న ఈనాటి అంతరిక్ష పరిశోధనల పాదముద్రలు ఎంత నెమ్మదిగా మొదలయ్యాయో ఆశ్చర్యమేస్తుంది.


ఒక్క వేగం విషయంలోనే కాదు, అన్నింటా ఇదే వేగం మనకు ప్రస్పుటమవుతుంది. భౌతికశాస్త్రంలో ఆధునిక భౌతిక శాస్త్రం అనే విభాగం వుంది. 1895 వ సంవత్సరం తర్వాత వెలువడిన భౌతికశాస్త్ర పరిశోధనలు ఆధునిక భౌతికశాస్త్ర పరిశోధనలుగా పేర్కొన బడుతున్నాయి. వాస్తవానికి ఆ సమయంలో అణువు అనేది అత్యంత చిన్నకణమని, ఇక దాన్ని పగలగొట్టలేమని పరిగణించారు. న్యూటన్‍ ప్రతిపాదించిన సిద్ధాంత చట్టాలు అన్నీ పూర్తిగా అంగీకరించబడి, ఇక వాటికి ఎటువంటి మార్పులూ, కొనసాగింపులూ అవసరం లేదని భావించారు. అయితే 1895-96 ప్రాంతంలో ఆవిష్కరించబడిన ఎక్స్ కిరణాలూ, రేడియోధార్మికత కొత్త పరిశోధనలకు జెండా ఊపాయి. దాంతో ఎలక్ట్రాన్‍, న్యూట్రాన్‍, ప్రోటాన్‍ ఆవిష్కరణలు జరిగాయి. నేడు పరమాణువుల్లో దాదాపు రెండు వందలకు పైగా మౌలిక కణాలున్నాయని ధృవపడింది. ఇంకా ఎన్నో ఉండవచ్చు. ఈ దశాబ్దంలో నాలుగుసార్లు నోబెల్‍ బహుమతిని ఈ రంగం కైవసం చేసుకుంది. డిభాగ్లీ ‘పదార్థతరంగ భావన’ గానీ, ఎలక్ట్రాన్‍ ‘తరంగ ప్రవృత్తి’ గాని, ఐన్‍స్టీన్‍ ‘సాపేక్షతా సిద్ధాంతం’ గాని, అటు తర్వాత వచ్చిన ‘క్వాంటం సిద్ధాంతం’ గాని, అనిశ్చితత్వ సూత్రం గాని అద్భుతమైన సంచలనాలు కలిగించాయి.


అసలు అణువును పగలగొట్టలేమని భావించటంతో 19వ శతాబ్దం ముగిసినా, అణువిచ్ఛేదంతో అమోఘశక్తి ఉత్పన్నం చేయవచ్చని ఈ శతాబ్దం మొదట్లోనే సైద్ధాంతికంగా భావించబడి ప్రపంచయుద్ధ సమయంలో అణుబాంబు రూపం పొందింది. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో మానవాళిని ఆటంబాబు వేసిన కాటు కిరాతక చిహ్నాలు నేటికీ సుస్పష్టంగా కనపడుతున్నాయి. మొదటి ప్రపంచయుద్ధం సముద్రతలంపై జరగ్గా, రెండవ ప్రపంచయుద్ధానికి రంగస్థలం ఆకాశం కావడంలో సైన్స్ టెక్నాలజి పాత్ర ఎంతో వుంది.సబ్‍మెరిన్స్, రైఫిల్‍, విషవాయువు, టియర్‍ గ్యాస్‍, క్లురిక్‍ గ్యాస్‍ వాడకం తొలి 15 సంవత్సరాల వ్యవధిలో మొదలైంది. యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు కావడానికి సైన్స్ను ఎంతగానో వాడారు. కేవలం సైన్స్ ప్రగతి మూలంగా మిలిటరీ ఆయుధాలకు పదును మాత్రమేకాక టెలికమ్యూనికేషన్లు, ఇతర రంగాలలో వచ్చిన పరిణామాలతో యుద్ధం ఒకేసారి సర్వ ప్రపంచాన్ని భయపెట్టగలిగింది. నేడు ఎయిర్‍ టు ఎయిర్‍ మిస్సైల్స్ దాకా ఈ మిలటరీ సామర్థ్యం ఎన్నో దేశాలనూ, ఎంతోమందిని కలవరపెడుతోంది. ఆయుధాలుగల దేశాలు ఆయుధాలు లేని దేశాలు అనే కొత్త విభజన నేడు మొదలైంది. అంతేకాదు ప్రపంచశాంతి అందునా కొత్తగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడి అరశతాబ్దం దాటిపోయింది. అణ్వస్త్రాల తయారీకి దోహదపడిన మౌలిక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణల వికృత రూపాలకు తల్లడిల్లవలసి వచ్చింది.


ఇప్పుడు సైన్స్ అంటే టి.వి. కంప్యూటర్‍, ఇంటర్‍నెట్‍ చిహ్నాలుగా భావిస్తున్నాం. కంప్యూటర్‍ రాకతోనే మూడవ విప్లవం – సమాచార విప్లవం శ్రీకారం చుట్టుకుంది. టి.వి. గాని, కంప్యూటర్‍ గానీ ఏ ఒక్కరి పరిశోధనల ఫలితం కాదు. పలువురు శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టి.వి. కంప్యూటర్‍ లాంటి ఆవిష్కరణలు సాధ్యపడ్డాయి. 1904లో డయోడ్‍ వాల్వు, 1906లో ట్రయోడ్‍ వాల్వు ఆవిష్కరించ బడ్డాయి. అయితే 1948లో జాన్‍ బర్దీన్‍, వాల్టర్‍ హెచ్‍.బ్రిట్టయిన్‍, విలియం షాక్లీగార్లు ట్రాన్సిస్టర్‍ రూపకల్పన చేయడంతో ఎలక్ట్రానిక్‍ విప్లవం పురుడు పోసుకుంది. తర్వాత పది సంవత్సరాలకు ఇంటిగ్రేటెడ్‍ సర్క్యూట్(ఐసి) రావడంతో ‘సూక్ష్మంలో మోక్షంగా’ అన్నీ కుంచించుకుపోయాయి. దీనితో మొదలైన ఎలక్ట్రానిక్‍ ఆవిష్కరణలు కమ్యూనికేషన్‍ రంగంలో ప్రవేశించడంతో ప్రపంచం చిన్న గ్రామంగా మారిపోయింది. ఫోన్లు, ఫాక్స్, ఫాసిమిలి, ఐ.ఎస్‍.టి., టి.వి., టెలికాన్ఫరెన్స్, ఇంటర్‍నెట్‍, కేబుల్‍ టీవీ ఇలా ఆవిష్కరణల జలపాతంలో మానవాళి తడిసిపోతోంది.


20వ శతాబ్దంలో దూరాన్ని, కాలాన్ని జయించగలిగాం. అణువును విచ్ఛిన్నం చేయడమే కాదు, పరమాణువులను సంశ్లేషణ చేయగలిగాం. ఒక టెలిస్కోపు మాత్రమే కాదు, మైక్రోస్కోపు కూడా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఒక్కసారి వైద్యశాస్త్రంలో వచ్చిన నోబెల్‍ బహుమతుల వివరాలు చూద్దాం.
1902 – మలేరియా (రోనాల్డ్ రాస్‍)
1904 – జీర్ణవ్యవస్థ (ఐనాక్‍ పర్‍లాల్‍)
1905 – క్షయ (రాబర్ట్ కోల్‍)
1906 – నరాల వ్యవస్థ (కెమిలో గోల్గి)
1907 – ప్రోటోజోవా రోగం (చార్లెస్‍ లావెరిన్‍)
1908 – రోగనిరోధకత్వం (పాల్‍ ఎర్లిచో)

ఇలా మొదలైన పరిశోధనలు కణరసాయన శాస్త్రం, కంటి నిర్మాణం, మెటబాలిజం, ఇన్సులిన్‍, రక్తవిభజన, ఎంజైములు, రక్తహీనత, విటమిన్లు, క్రోమోజోములు ఇలా సాగుతుంది జాబితా. కలరా, క్షయరోగాలు దేవుని శాపాలని భావించే స్థితిని నిర్మూలించ గలిగాం. వంధ్యత్వం కూడా శాపమనే భావననుంచి మానవ శారీరకలోపమనే అవగాహనకు రావడమే కాదు, టెస్ట్ట్యూబ్‍లో ప్రకృతికార్యాన్ని ఫలప్రదంగా నిర్వహించడం జరిగి రెండు దశాబ్దాలైపోయింది. అంతేకాదు, నేడు ఏక కణం నుంచి మరో ‘నకలు’ జీవిని తయారు చేయగల క్లోనింగ్‍ సామర్థ్యం సాధ్యపడింది.


వైద్యరంగంలో సాధ్యపడిన ఆవిష్కరణలతో రోగాలు గండాలు గడిచి, మనిషి ఆయుర్ధాయం పెరిగింది. ఒక్క మనదేశంలోనే గడిచిన 50 సంవత్సరాల్లో మనిషి సగటు ఆయుష్షు రెట్టింపు అయింది. అంతేకాదు, శిశుమరణాలు బాగా తగ్గడంతో జనాభా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోంది. పెరిగిన జనాభాతో అవసరాలు పెరిగాయి. అన్వేషణ మొదలైంది. సహజవనరులు పెంచుకోవడానికి గానీ, వాటి ఉత్పత్తి పెరగడానికి సైన్స్ అవసరమైంది. దాంతో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పెరిగాయి. హరితవిప్లవం అంటూ భుజాలు ఎగురవేస్తూ నేల నోట రసాయనాలు కుమ్మరించి ధాన్యం పితుక్కున్నాం. అయితే నేడు నేల తల్లి వృక్షం కాలుష్యమయం కావడమేకాక, పండిన పంట పొట్టలో ఈ రసాయనాల చిరునామా కనపడటం ప్రారంభించింది. బంగారు బాతుగుడ్డు కథలాగా అత్యాశతో మనం సహజ వనరులను విషతుల్యం చేసుకోవడంతో కొత్తభావన మన స్ఫురణకు వచ్చింది. అదే పర్యావరణం. ఈ సంగమ స్థానంలో మనిషి పరిధి కూడా తేటతెల్లమైంది. 70వ దశకం దాకా మనం రియాక్టయ్యే ప్రతిదీ మనలను ప్రభావితం చేస్తుందని మనకు బోధపడలేదు. పెరిగే వాతావరణ ఉష్ణోగ్రతతో కరిగే మంచుగడ్డలూ, కరిగే ఓజోన్‍ పొర కన్నాలతో పాటు పలు రకాల పర్యావరణ కాలుష్య ఫలితాలు కనపడుతున్నాయి. ఈ కాలుష్య స్థూలస్థాయి నుంచి ఆవిష్కరణల ఫలితంగా జన్యుస్థాయికి చేరాయి. అందుకు నేడు జెనెటికల్లి మోడీఫైడ్‍ ఫుడ్‍, క్రాప్స్, టెర్మినేటర్‍ లాంటి విత్తనాలు యావత్‍ ప్రపంచాన్ని గగ్గోలు పెట్టిస్తున్నాయి. పదార్థం, శరీరంలోకే చూడటం కాదు మనోవాల్మీకంలోకి తొంగి చూడటం ఈ శతాబ్దంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది.


భౌతికశాస్త్రాల్లో ఐన్‍స్టీన్‍, జీవపరిణామానికి సంబంధించి డార్విన్‍ ఎంత కుదుపు కుదిపారో సైకాలజీతో ఫ్రాయిడ్‍ అంత కుదుపు కుదిపారు. కలల వివరణకు సంబంధించిన సిద్ధాంతం 1900లోనే సిగ్మండ్‍ ఫ్రాయిడ్‍ ప్రతిపాదించారు. మనిషి ప్రవర్తననూ, ఆలోచనలనూ ఫ్రాయిడ్‍ సైన్స్రీత్యా విశ్లేషించడానికి కృషిచేసి, విజయం సాధించారు. సైకాలజీ కేవలం మనసు అని మాత్రమే గాక మనిషి లైంగికావసరాలు, ప్రవృత్తులను విశ్లేషించి సంప్రదాయ భావనలకు గండికొట్టింది.


ఈ ఆవిష్కరణల ప్రస్థానంతోపాటే మనకు స్పష్టంగా కనపడే దుష్ఫలితాలు:

1.అణ్వాయుధాల భీతి 2. పెరిగే జనాభా 3. పర్యావరణ కాలుష్యం 4. పెరిగిన యాంత్రిక జీవనం 5. విచ్చలవిడితనం, భోగలాలసత, ఇంటర్‍నెట్‍లో సెక్స్ 6. మానవ క్లోనింగ్‍, టెర్మినేటర్‍ సీడ్స్ లాంటి బయోటెక్నాలజీ వినిమయతత్వం 8. స్పెషలైజేషన్‍ వేలం వెర్రి.


ఈ శతాబ్ది మొదట పాదార్ధిక పరిశోధన అణువు అంతఃకుహరాలలోకి పోవడంతో మొదలై, అణువిస్ఫోటనం ఒక వైపూ, ట్రాన్సిస్టర్‍, ఐసి., మైక్రోచిప్‍, కంప్యూటర్‍, టీవీ, ఇన్‍ఫర్‍మేషన్‍ టెక్నాలజీ వైపూ సాగింది. ఇంత సూక్ష్మరీతిలో పరిశోధన సాగడానికి అనువైన పరికరాలు, పద్ధతులూ రూపొందించబడ్డాయి. ఈ సౌకర్యాలు, సౌలభ్యాలూ జీవశాస్త్రం వైపు అనువర్తించడంతో కొత్తశాస్త్రాలు బయలు దేరాయి. కొత్త రంగాలు ఆవిష్కృతమయ్యాయి. అలా వచ్చినవే బయోటెక్నాలజీ, జెనెటిక్‍ ఇంజనీరింగ్‍, మరోరకంగా చెప్పాలంటే ఈ శతాబ్దాన్ని పాదార్థిక పరిశోధన వ్యాపిస్తుందని సూచనలు కనపడు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు రేపు రాబోయేది జీవ సాంకేతిక ప్రపంచమని కూడ పేర్కొంటున్నారు. ఇన్‍ఫర్‍మేషన్‍ టెక్నాలజీ వైపు పరిణితి పుష్పించిందని, ఇక కేవలం సంచలనం కన్నా ఎక్కువ స్థాయిలో రేపు జీవసంబంధమైన అద్భుతాలు వీలవుతాయని భావిస్తున్నారు. జీవరహితమైన పదార్థంతో వచ్చిన ఆవిష్కరణలే విచిత్రాలూ, కాలుష్యాలు కలిగించినప్పుడు జీవపదార్థ పరిశోధనలు ఎంత విస్మయం, గగ్గోలు కలిగించాలి? సరిగ్గా ఈ విషయంలో నైతిక సూత్రాలు, చట్టాలు అవసరమవుతున్నాయి. గ్లోబల్‍ ఎథిక్స్ కమిటీలు ఏర్పడుతున్నాయి. విపరీతంగా వచ్చిపడుతున్న ఆవిష్కరణలను ఆకళింపు చేసుకోవడానికి సాధ్యం కాదు కనుక విభిన్న విభాగాలు ఏర్పడ్డాయి. స్పెషలైజేషన్లుగా వృద్ధిచెందాయి. ఈ సందోహంలో ఈ విభాగాల మధ్య సంబంధాన్ని మనం మరచిపోతున్నాం. దాంతో సామాజిక శాస్త్రాల ప్రభావం ఏమిటో, ప్రాధాన్యత ఎంతో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.


ఇదివరకటి లాగా నేడు రేడియో, టీవీ, పత్రికలు, ఇంటర్నెట్‍ ద్వారా ప్రపంచం ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ఇతర ప్రాంతాలకు తెలుస్తోంది. ఇది కూడా సైన్స్ ఆవిష్కరణల ఫలితం. అయితే ఈ సైన్స్ ప్రగతి ఏమిటి? ఎందుకు? ఎవరికి? అని సమాజం ఆధారంగా ఆలోచన పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి శాస్త్రవేత్తలు, మీడియా, రచయితలు దోహదపడాలి. సైన్స్ సమాజ కల్యాణానికి తోడ్పడాలి.


20వ శతాబ్దపు ముఖ్య ఆవిష్కరణలు

  • 1900 – బ్లాక్‍ బాడి సంబంధించి మాక్స్ ప్లాంక్‍ సూత్రం ప్రతిపాదన, క్వాంటం సిద్ధాంత సూచనలు
  • బఠాణి మొక్కలకు సంబంధించి మెండెల్‍ సిద్ధాంతాన్ని హ్యూగో డివ్రయ్యస్‍ బలపరచడం
  • గామా కిరణాల ఆవిష్కరణ
  • 1902 – ఫోటో ఎలెక్ట్రిక్‍ ఎఫెక్ట్ మీద మరింత అధ్యయనం
  • హార్మోన్‍ల ప్రాధాన్యతను విలియం బైలెస్‍, ఎర్న్స్ట్ స్టార్‍లింగ్‍ బలపరచడం
  • 1903 -Chromosomes theory of Heridity ని న్యూటన్‍ ప్రచురించడం
  • 1905 – ఫోటాన్‍ భావన,Special Theory of Relativity లను అల్బర్ట్ ఐన్‍స్టీన్‍ ప్రతిపాదించడం
  • 1908- 09 అల్ఫా కిరణాల విక్షేపణంపై రూథరుఫర్డు పరిశోధనలు
  • 1909 – Gene, Genotype, Phenotype అనే పదాలను విల్‍హెల్మ్ జాక్సన్‍ వాడటం.
  • 1910 – వారసత్వ లక్షణాలకూ, సెక్స్కూ సంబంధం వుందని మోర్గాన్‍ కనుక్కోవడం
  • 1911 – రూథరుఫర్డు పరమాణు కేంద్రక ఆవిష్కరణ
  • 1913 – orrespondence principleను నీల్స్బోర్‍ ప్రతిపాదించడం
  • 1914 – Proton Theoryని రూథరుఫర్డు ప్రతిపాదించడం
  • 1916 – ఐన్‍స్టీన్‍ – Theory of general relativity
  • 1922 – ఫ్రెడెరిక్‍ బ్యాంటింగ్‍, చార్లెస్‍ బెస్ట్ ఇన్స్లిన్‍ను తయారుచేయడం
  • 1923 – ఎలక్ట్రాన్ల తరంగ – కణ ప్రవృత్తిని బాయిస్‍ దిబ్రాగ్లీ ప్రతిపాదించడం
  • 1925 – పాలీ ‘ఎక్స్క్లూషన్‍ ప్రిన్సిపల్‍ ’ ప్రతిపాదన
  • 1926 – ఎర్విన్‍ ష్రుండిజర్‍ ‘‘వేక మెకానిక్స్’’ పరిశోధన తొలిరూపం
  • 1927 – పాల్‍ డిరాక్‍ ‘‘క్వాంటం ఎలెక్టోడ్రినమక్స్’’
  • హైసన్‍బెర్గ్ ‘‘అనిశ్చితత్వ సూత్రం’’
  • బోర్‍ ‘‘కాంప్లిమెంటాలిటి’’ భావన
  • 1928 – అలెగ్జాండర్‍ ప్లెమింగ్‍ పెన్సిలిన్‍ ఆవిష్కరణ
  • 1931 – ‘న్యూట్రాన్‍’ వుంటుందని పౌలి ప్రతిపాదన
  • ‘పాజిట్రాన్‍’ వుంటుందని డిరాక్‍ ప్రతిపాదన
  • 1932 – జేమ్స్ ఛాడ్విక్‍ న్యూట్రాన్‍ ఆవిష్కరణ
  • 1934 – ఐరిన్‍, ఫెడ్రిక్‍, జూలియట్‍ క్యూరీలు కృత్రిమ రేడియోధార్మికతను ఆవిష్కరించడం
  • 1938 – పెన్సిలిన్‍ను వైద్యరంగంలో ఎర్నెస్ట్బి, చెయిన్‍, హోవార్డ్ వాల్టర్‍ ఫ్లోరీలు వాడటం
  • 1942 – మొట్టమొదటి అణుబాంబు నిర్మాణం
  • 1945 – హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగం
  • 1947 – రేడియో కార్బన్‍ డేటింగ్‍ విధానాన్ని విలార్డ్ ఫ్రాంక్‍ లి- రూపకల్పన
  • బెల్‍ లాబరేటరీలో విలియం షాక్లి బృందం ట్రాన్సిస్టర్‍ ఆవిష్కరణ
  • 1948 – జార్జిగామోక్‍, రాల్ఫ్ ఆల్ఫర్‍, రాబర్ట్ హార్మన్‍లు విశ్వం పుట్టుకకు సంబంధించి ‘బిగ్‍ బ్యాంగ్‍ థియరీ’ ని ప్రతిపాదించడం.
  • 1951 – తొలి వాణిజ్య పరమైన కంప్యూటర్‍ Univac నిర్మాణం
  • ప్రయోగాత్మక బ్రీడర్‍ రియాక్టర్‍ నిర్మాణం
  • 1952 – న్యూక్లియర్‍ రియాక్టర్‍లో తొలి ప్రమాదం
  • గర్భనిరోధక మాత్ర తయారీ
  • 1953 – డి.ఎన్‍.ఎ. అణువుకు డబుల్‍ హెలిక్స్ నిర్మాణం వున్నట్లు ఫ్రాన్సిస్‍ క్రిక్‍, జేమ్స్ వాట్సన్‍ ఆవిష్కరణ
  • 1954 – పోలియో వాక్సిన్‍ను జొనాస్‍ సాక్‍ తయారి
  • న్యూక్లియర్‍ సబ్‍మెరిన్‍ ప్రారంభం
  • 1957 – కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్‍’ ప్రయోగం
  • 1958 – పాలపుంత అధ్యయనానికి రేడియో టెలిస్కోపు వాడటం
  • ‘ఎక్స్ప్లోరర్‍’ ఉపగ్రహం భూకక్ష్యలోకి ప్రవేశించడం
  • 1959 – సోవియట్‍ రష్యా చందగ్రహశోధన
  • 1960 – క్వాజర్స్ (Quasars) కనుక్కోవడం (అలన్‍ శాండేజ్‍, థామస్‍ మాథ్యూస్‍)
  • థియోడర్‍ హెచ్‍. యమ్‍.యన్‍. విజయవంతంగా ప్రయోగాత్మక ‘లేజర్‍’
  • 1961 – అంతరిక్షపు భూ కక్ష్యలో తొలి మానవుడు యూరీ గగారిన్‍
  • 1962 – సమాచార ఉపగ్రహం ‘టిల్‍స్టార్‍’ను అమెరికా ప్రయోగించడం
  • 1963 – తట్టు, అమ్మవారుకు వాక్సిన్‍
  • 1969 – డోరతి హడెకెన్‍ బి 12 విటమిన్‍ నిర్మాణం గురించి పరిశోధన
  • చంద్రుని మీద నీల్‍ ఆర్మ్స్ట్రాంగ్‍ దిగడం
  • 1970 – ఆర్‍.ఎన్‍.ఎ.ల, డి.ఎన్‍.ఎ.లకు సంబంధించి వైరస్‍లని ఎండ్రిమ్‍ తొలి క్రెడిటిక్‍ యింజనీరింగ్‍ పోకడను హోవర్డ్ ఎం.టి.ఎన్‍. డేవిడ్‍ బాల్టిమోర్‍ ఆవిష్కరించడం
  • హరగోవింద ఖురానా తొలిసారి జన్యువును సంశ్లేషించడం
  • 1973 – ‘స్కైలాబ్‍’ ప్రయోగం (1979లో పడిపోయింది)
  • గడ్డకట్టిన పిండం నుంచి దూడ జననం
  • 1976 – అంగారక శోధన కోసం వైకింగ్‍ – 1, -2ల ప్రయోగం
  • పనిచేసే సింథటిక్‍ జన్యువును ఖోరానా తయారు చేయడం
  • 1980 – పరమాణువును విడిగా ఫోటో తీయడం
  • డిఎన్‍ఎ నిర్మాణానికి సంబంధించి అధ్యయనం
  • 1983 – కృత్రిమ క్రోమోజోమ్‍ను ఆండ్రూ డబ్ల్యు ముర్రే, జాక్‍ డబ్ల్యు. సోస్టాక్‍ సృష్టి
  • 1985 – అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‍ పొరలో చిల్లు వుందని గమనించడం
  • 1986 – ఛాలెంజర్‍ ప్రమాదంలో ఐదుమంది దుర్మరణం
  • సోవియట్‍ ‘మీర్‍’ ప్రయోగం
  • రష్యాలో చెర్నోబిల్‍ న్యూక్లియర్‍ ప్లాంట్‍ ప్రమాదం
  • 1990 – కేబుల్‍ టెలిస్కోపు ప్రారంభం
  • 1991 – గామారే అబ్జర్వేటరీ ప్రయోగం
  • 1993 – పెద్ద పేగు క్యాన్సర్‍కు కారణమైన జన్యువును గుర్తించడం
  • 1994 – షుమేకర్‍ లెవీ-9 తోకచుక్క గురుగ్రహాన్ని ఢీకొనడం
  • క్యాన్సర్‍ నిర్మూలనకు తోడ్పడే Taxolను నిక్లాక్‍ బృందం తయారుచేయడం
  • పదార్థానికి ఐదవ స్థితి వుందని ప్రయోగాత్మకంగా ధృవీకరించడం
  • 1997 – క్లోనింగ్‍ ద్వారా ‘డాలీ’ గొర్రెపిల్ల జననం
  • అంగారక గ్రహంపై పాత్‍ఫైండర్‍ దిగడం
  • అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన కల్పనా చావ్లా
  • 1998 – న్యూట్రినో ఉపకణానికి ద్రవ్యరాశి వుందని స్పష్టం కావడం (అంతవరకు లేదని భావించేవారు)
  • క్లోనింగ్‍ ద్వారా జన్మించిన ‘డాలి’ తల్లికావడం
  • పరం – 10,000 సూపర్‍ కంప్యూటర్‍ను భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించడం
  • చంద్రుని మీద నీరు ఉందని స్పష్టం చేయడం
  • 1999 – క్లోనింగ్‍ డాలికి త్వరగా – తన తల్లిని పోలిన ముదిమి లక్షణాలు రావడం.
  • డా. నాగసూరి వేణుగోపాల్‍
    ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *