కళావరు రెండు


గుహనిండా చెల్లా చెదరుగా పడి ఉన్న రాళ్ళ మధ్య వాళ్లు నలుగురూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నించున్నారు. గుహ బయట ఉన్న రాళ్ళు, రప్పలు, తుప్పలు, ఆకుపచ్చని వెలుగులో తళ తళలాడిపోతున్నాయి. ఆ రాళ్ళ మధ్య వాళ్ళు వచ్చిన అంతరిక్ష నౌక ‘పినాకిని’ నిశ్చలంగా ఉంది. గుహ బయట వాళ్ళకు ఎదురుగా పర్వతంలా ఉన్న ఒక భయంకరమైన జంతువు నిలబడి ఉంది. ఆ జంతువు పెద్ద లోహపు ముద్దలా ఉంది. దాని వీపు నిండా ఉన్న ముళ్ళు విచ్చు కత్తుల్లా ఉన్నాయి. బయటకు పొడచుకొని వచ్చిన దాని కోరలు తళతళ లాడుతున్న కసాయి కత్తుల్లా ఉన్నాయి. ఆ జంతువు గుహలోకి వచ్చి వాళ్ళను గుటుక్కున చప్పరించేసేదే. అయితే వాళ్ళ అదృష్టం బాగుంది. ఆ గుహ ముఖద్వారం చాలా చిన్నది. అందుకే ఎన్ని తిప్పలు పడ్డా ఆ జంతువు లోపలికి రాలేకపోతోంది.
ఆ జంతువు బుసలు కొడుతోంది. అది గాలి వదిలినప్పుడల్లా ఆ గుహ అంతా దుర్గంధంతో నిండిపోతోంది. చివరికి ఆ జంతువు తన ముందు కాలు ఎత్తి గుహద్వారాన్ని అటూ, ఇటూ తన్నింది. దాని కాలికి ఉన్న పిడి బాకులు లాంటి గోళ్ళు కొండరాయికి తగిలి ఖణేళ్‍ మన్నాయి. నిప్పురవ్వలు గాలిలోకి లేచాయి. పిడిబాకులు బిగించినట్టు ఉన్న ఆ కాలును చూడగానే, వాళ్లు నలుగురూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు.


‘‘ఈ జంతువు గనుక ఒక్క తాపు తంతే, మనం ఒళ్ళంతా స్టీలు కోటింగు వేయించుకొన్నా సరే, ఇట్టే చచ్చి ఊరుకుంటాము’’ అన్నాడు రాజన్‍.
‘‘ఇంతకీ దానికి ఏం పేరు పెడదాం సార్‍’’ అంది మానస, చింతామణితో –
‘‘కత్తులపంది అంటే ఎలా ఉంటుంది?’’ అన్నాడు విజయ్‍.
‘‘మనం ఈ గుహలో చిక్కుకుపోయాం. అంతరిక్షంలో ఉన్న మాతృనౌక ‘భగీరథి’ ఇంకో రెండు గంటలు మాత్రమే మన కోసం ఎదురు చూస్తుంది. తరవాత అది భూమి మీదికి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ లోగా మనం పినాకినిని మాతృనౌకతో కలపాలి. లేకపోతే మనం ఈ గుహలోనే శవాల్లాగ మారక తప్పదు’’ అన్నాడు చింతామణి.
రాజన్‍, విజయ్‍, మానస అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేటు కోసం పరిశోధన చేస్తున్న విద్యార్థులు. వాళ్ళు ముగ్గురూ పాతికేళ్లలోపు వాళ్లే. చింతామణి వాళ్ళ గైడు. ఆయనకు 45 ఏళ్లు ఉంటాయి. పరిశోధనల నిమిత్తం భూమికి కోట్లాది మైళ్ల దూరంలో ఉన్న నలుసులాంటి గ్రహం ‘భట్టారక కక్షలోకి ప్రవేశించగానే, పినాకినిని దాని నుండి విడదీసి, వాళ్లు భట్టారక మీద దిగారు. ఆ గోళం మీద ఉన్న ప్రతీ వస్తువు ఆకు పచ్చగా మెరిసిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. దూరంగా
ఉన్న నక్షత్రం నుంచి భట్టారక మీదికి ఎప్పుడూ ఆకుపచ్చని వెలుతురు పడుతూ ఉండటమే అందుకు కారణమని చింతామణి వాళ్ళకు చెప్పాడు. తరవాత భట్టారక మీద గల రాళ్ళను, రప్పలను, తుప్పలను, మట్టిని ప్లాస్టిక్‍ సంచుల్లో నింపుకోసాగారు. ఇంతలోనే చెవులు చిల్లులు పడేటట్లు వినిపించిన ఒక రంకె వాళ్లను నిశ్చేష్టులను చేసింది. అందరూ బిక్క చచ్చిపోయి, ఒకళ్ల మొహాల్లోకి మరొకరు చూసుకున్నారు.


‘‘అదుగో ఏదో వస్తోంది’’ అంది మానస. అందరూ అటు చూశారు. ఏనుగు కంటె పెద్దగా ఉన్న పందిలాంటి జంతువు వాళ్ళ వైపు వస్తూ కనిపించింది. దాన్ని చూడగానే నలుగురికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం చెయ్యాలో తెలియని వాళ్లు అటూ, ఇటూ చూశారు. దగ్గరలోనే ఒక గుహ కనిపించింది. ఒక్క అంగలో నలుగురూ వెళ్ళి ఆ గుహలో దూరారు. ఆ జంతువు గుహ దగ్గరికి రానే వచ్చింది. గుహ ద్వారం మరీ చిన్నది కావడం వల్ల లోపలికి రాలేకపోతోంది.
కత్తుల పంది అసహనంగా వాళ్ల వేపు చూస్తూ నిలుచుండిపోయింది. తరవాత గుహ గోడను చాచి ఒక్క తన్ను తన్నింది గుహ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. చిన్న చిన్న రాళ్ళు గుహనిండాపడ్డాయి. విజయ్‍ కొన్ని రాళ్లను ఏరాడు.


‘‘మానసా! కాస్సేపు పచ్చీసు ఆడుకుందామా? ఎలాగో చావక తప్పదు. ఆడుతూ పాడుతూ చచ్చిపోదాం’’ అన్నాడు.
విజయ్‍ మాటలు చింతామణిని కదిలించి వేశాయి. ఆ ముగ్గురూ కత్తుల పంది వాతపడి మరణించడమో, లేక ఆకలిదప్పులతో మల మల మాడి ఆ గుహలో దిక్కులేని చావు చావడమో జరగక తప్పదన్న వాస్తవం ఆయన గుండెల్ని పిండి వేసింది.
‘‘మాస్టారూ! నాలుక ఎండిపోతోంది’’ అంది మానస పెదవులతో నాలుక తడుపుకొంటూ!
‘‘నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి’’ అన్నాడు రాజన్‍.
వీళ్లకంటె ఎక్కువగా కత్తుల పందిని ఆకలి దహించి వేస్తున్నట్టు ఉంది. అందుకే మళ్లీ కాలు ఎత్తి గుహ పక్క భాగాన్ని బలంగా ఒక తన్ను తన్నింది. గుహ ఎండుటాకులా అల్లల్లాడి పోయింది. పెద్ద పెద్ద రాళ్లు వాళ్ల ముందుపడ్డాయి.


‘‘కత్తుల పంది తాడికి ఈ గుహ ఎంతో సేపు తట్టుకోలేదు. కాస్సేపట్లో కుప్పకూలిపోతుంది. అందరం చస్తాం. కాని అందరం చావడానికి వీలులేదు. మనలో ఎవరో ఒకరు చచ్చి మిగతా ముగ్గురిని బతికించాలి. ఏమంటారు?’’ అన్నాడు చింతామణి.
‘‘మీరే ఏదన్నా ఉపాయం ఆలోచించండి’’ అన్నాడు విజయ్‍. చింతామణి కాస్సేపు ఆలోచించాడు. చటుక్కున జేబులోంచి పేకముక్కలు తీశాడు. వాటికి కత్తెర వేసి నాలుగు సార్లు కలిపాడు. ‘‘పేక కంటే పచ్చీసే బాగుంటుంది మాస్టారూ!’’ అంది మానస. ‘‘అవును పచ్చీసు అంటే నాకూ ఇష్టమే. చిన్నప్పుడు గంటల తరబడి ఆడేవాణ్ణి’’ అన్నాడు చింతామణి.
ఆయన మాటలు పూర్తి కాకుండానే కత్తుల పంది అడ్డంగా తిరిగి వీపుతో గుహ గోడను గట్టిగా తాకింది. గోడమీంచి భగ్గున మంటలు లేచాయి. గుహ కప్పు మీంచి నాలుగు రాళ్ళు కిందపడ్డాయి. రాజన్‍ గనుక పక్కకు లాగకపోతే మానస తల పచ్చడియిపోయేది. మానస భయంతో కెవ్వున అరిచింది. విజయ్‍ ఒకరాయి తీసి కత్తుల పంది మీదికి విసిరాడు. ఆ రాయి కత్తుల పంది నోట్లో పడింది. దాన్ని అది కరకరా నమిలి మింగేసింది. రాయిని నములుతుంటే దాని నోట్లోంచి నిప్పురవ్వలు తుంపరలులాగా బయటికి వచ్చాయి.
చింతామణి మళ్లీ పేక కలపసాగాడు. రాజన్‍, విజయ్‍ చింతామణి వేపు కోపంగా చూశారు. ఆయన వాళ్ల చూపుల్ని లెక్కచెయ్యలేదు. బాగా కలిపిన పేకను గుహలో ఉన్న ఒక రాయి మీద పెట్టాడు. ‘‘పేకలోంచి అందరం తలా ఒక ముక్క లాగుదాం. అన్నిట్లోకి చిన్న ముక్క ఎవరికి వస్తుందో వారు గుహ బయటకు వెళ్లాలి. కత్తుల పంది వాళ్ల మీదకు దూకుతుంది. అది ఆ మనిషిని తినేసేలోగా మిగతా ముగ్గురు పినాకిని వైపు పరిగెత్తాలి. దాంట్లో కూర్చుని దాన్ని మాతృనౌక వైపు తీసుకుపోవాలి. ఎలా ఉంది నా ఉపాయం?’’ అన్నాడు చింతామణి అందరి మొహాల్లోకి చూస్తూ.
ఎవరూ మాట్లాడలేదు. ‘‘మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు. వెంటనే ముక్కలు లాగండి’’ అన్నాడు చింతామణి. వణుకుతున్న చేతులతో అందరూ తలా ఒక ముక్క లాగారు. ‘‘విజయ్‍! నీకేం ముక్క వచ్చిందో చెప్పు’’ అన్నాడు చింతామణి.
‘‘మరీ నాసిరకం ముక్క కాదనుకోండి. ఇస్పేటు రాణి వచ్చింది’’ అన్నాడు విజయ్‍.
‘‘నీకంటే నేను నయం. నాకు డైమండు రాజు వచ్చింది’’ అంది మానస. తన ముక్క చూసుకొన్న రాజన్‍ మొహం భయంతో పాలిపోయింది. అతని గొంతు బావిలోంచి వచ్చినట్టు వచ్చింది ‘‘ఆఠీన్‍ మూడు’’ అన్నాడు.
మానస కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజన్‍కి దగ్గరగా జరిగి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. చింతామణి వాళ్ళ వైపు క్రీగంట చూశాడు.
‘‘ప్రకృతి తన ధర్మాన్ని పాటించింది’’ అన్నాడు చింతామణి తన చేతిలోని ముక్కను చూసుకుంటూ.
మిగతా ముగ్గురూ ఆయన వైపు అయోమయంగా చూశారు.
‘‘ముసలి వాళ్ళు వెళ్లిపోవడం, చిన్న వాళ్ళు బతికి బట్ట కట్టడం ప్రకృతిలో రివాజు. అందుకే కాబోలు నాకు కళావరు రెండు వచ్చింది’’ అన్నాడు గలగలా నవ్వుతూ.
‘‘మాస్టారూ! మేముండగా మీరు ఆ కత్తుల పంది నోట పడటం నా కిష్టం లేదు. అదీ గాక మీరు మా గురువు’’ అన్నాడు విజయ్‍.
చింతామణి మాట్లాడలేదు. తన చేతులో ఉన్న ముక్కను జేబులో పెట్టుకొని ఒక్క దూకులో గుహ గుమ్మం వైపు పరిగెత్తాడు. గుమ్మం దగ్గరికి రాగానే మోకాళ్ల మీద నించుని ఆ కత్తులపంది కాళ్ల మధ్యలోంచి కుందేలులా గెంతుతూ అవతలకు వెళ్ళిపోయాడు.


తన ఆహారం బయటకు వచ్చిందన్న సంగతి కత్తుల పంది పసికట్టింది. గిర్రున వెనక్కి తిరిగి, పరిగెడుతున్న చింతామణి వైపు దూకింది. చింతామణి ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ‘‘మొద్దుల్లా అలా నించున్నారేం. మీ బ్యాగులు తీసుకొని పినాకిని వైపు పరిగెత్తండి. అదే మీరు నాకిచ్చే గురుదక్షిణ’’ అని గట్టిగా అరిచాడు.
ముగ్గురూ బ్యాగులు తీసుకున్నారు. ‘‘మాస్టారి జ్ఞాపకార్థం నేను ఈ పేకముక్కలను ఉంచుకుంటాను’’ అంటూ వాటిని తీసుకుంది మానస. వెంటనే ఒకరి తరవాత ఒకరు గుహ బయటకు వచ్చి పినాకిని వైపు పరిగెత్తుతూ దాన్ని చేరుకొని రెండు అంగల్లో పైకి ఎగబాకారు. విజయ్‍ స్టీరింగు ముందు కూర్చున్నాడు. రాజన్‍, మానస అతని పక్కనే కూర్చున్నారు. విజయ్‍ చకచకా మరలను తిప్పాడు. పినాకిని పైకి లేచింది. అద్దంలోంచి బయటకు చూస్తున్న మానస కెవ్వున అరిచింది. కత్తుల పంది కాలు చింతామణి వీపు మీద పడింది. రక్తం చివ్వున పైకి చిమ్మింది.
మానస తన చేతుల్లో ఉన్న పేకను ఆప్యాయంగా నొక్కింది. ‘‘మాస్టారి గుర్తుగా వీటిని పదిలంగా ఉంచుకుంటాను’’. అంటూ వాటిని వరసగా సీటు మీద పరవసాగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అరిచింది. పానెల్‍ బోర్డులో ఏదో మర తిప్పుతున్న రాజన్‍ ఉలిక్కిపడి ఆమెవైపు చూశాడు. ‘‘రాజన్‍ కళావర్‍ రెండు పేకలోనే ఉంది’’ అంటూ దానిని ఇవతలికి తీసింది.
రాజన్‍ ఆమె చేతిలోంచి పేక ముక్కల్ని లాక్కొని, అన్ని ముక్కల్నీ పరీక్షగా చూశాడు. ‘‘ఆఠిన్‍ ఆసు కనిపించడం లేదు’’ అన్నాడు.
‘‘అయితే మాస్టారికి వచ్చింది ఆఠిన్‍ ఆసు అన్నమాట. మనని కాపాడటం కోసం కళావరు రెండు అని చెప్పి తనను తాను బలి ఇచ్చుకున్నాడు’’ అన్నాడు విజయ్‍.


ఎస్‍. శ్రీనివాసరావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *