శాతవాహనుల వారసత్వం – కొండాపూర్‍


సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ స్థలాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి కొండాపూర్‍. హైదరాబాద్‍ నుంచి జహీరాబాద్‍ వెళ్లే జాతీయ రహదారి మీదుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‍ ఉన్నది. ఇది చుట్టూ మట్టికోట, మధ్యలో ఒక నగరం ఉన్న చారిత్రక స్థలం. దీని ప్రాధాన్యత గుర్తించిన నిజాం ప్రభుత్వం 1940లో తవ్వకాలు ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో ఒక ఇటుక రాతి స్థూపం, రెండు చైత్యాలు, రెండు విహారాలు లభించాయి. రెండు అంతస్తుల భూగృహం కూడా లభించింది. వాటిలో నాణేలు, నాణేలు పోత పోసే మూసలు, అచ్చులు, ముద్రలు మట్టిబొమ్మలు, పూసలు, బంగారు వస్తువులు దొరికాయి. రెండు కొలుములు, ఇటుకలతో కట్టి పెంకులతో కప్పబడిన గదులు బయటపడ్డాయి. తవ్వకాల్లో 50 రాగి నాణేలు, 12 వెండి నాణేలు, 1835 సీసం నాణేలు, రోమన్‍ చక్రవర్తి ఆగస్టస్‍ నాణేలు దొరికాయి. కొన్ని పంచ్‍ మార్కేడ్‍ నాణాలు కూడా దొరికాయి. దీనిని బట్టి కొండాపూర్‍ శాతవాహనుల టంకశాల అని చరిత్రకారుల భావన.


ఎర్ర, నలుపు, రంగుల్లో చిన్న, పెద్ద సైజు మట్టి పాత్రలు బయల్పడ్డాయి. మట్టి పాత్రలఫై త్రిరత్న, పద్మం, ధర్మ చక్రం ఉన్నాయి. వీటితో పాటు మూస పోసిన చేతితో చేసిన మట్టి బొమ్మలు దొరికాయి. బోధిసత్వుల బొమ్మలు కూడా లభించాయి. దంతపు వస్తువులు అలంకరణ దృశ్యాలు, దంతపు గాజులు కూడా దొరికాయి. మెగస్తనీస్‍ రాసిన ఇండికా పేర్కొన్న ఆంధ్రుల ముప్పై కోటలలో ఇది కూడా ఒకటని చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన చక్రవర్తి హాలుడు కొండాపూర్‍ నుండి పాలించాడని, బృహత్కథను రాసిన గుణాఢ్యుడు కొండాపూర్‍ వాడేనని కూడా చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ లభించిన చైత్య గృహాలు, విహారాలు, బుద్ధ పాదాలను బట్టి ఇది మహాయాన బౌద్ధం విలసిల్లిన ప్రసిద్ధ నేల మనకు గోచరిస్తుంది.


-సరస్వతి,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,సంగారెడ్డి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *