రెండో పులకేశి హైదరాబాదు
రాగిరేకు శాసనం (క్రీ.శ.610-11)
(తొలిసారిగా తెలుగులో)
తెలంగాణ కొత్త చరిత్ర బృందం తలవర శ్రీరామోజు హరగోపాల్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేశారు. నేను తెలంగాణలో బాదామీ చాళుక్యులు అన్న పుస్తకాన్ని రాస్తున్నానని, తనకు రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసన ప్రతిబింబాలు, పాఠం ఉంటే పంపిస్తారా, అని అడిగారు. నేను కూడ రెండో పులకేశి గురించి చదివినపుడు ఆ శాసన ప్రస్తావనను గమనించానే తప్ప, శాసన పాఠాన్ని గానీ, ముద్రలను గానీ చూడలేదు. పురావస్తు (వారసత్వ) శాఖ గ్రంథాలయంలో ఎంత వెదికినా దొరకలేదు. ప్రముఖ శాసన పరిశోధకులను అడిగినా లాభం లేకపోయింది. ఎన్. రమేశన్‍గారు, హైదరాబాదు రాగిరేకు శాసనాలు, ఇండియన్ యాంటిక్వరీ వాల్యూం, 6లో ఉన్నట్లు రాశారు. ఐసీహెచ్‍ఆర్ వారు ప్రచురించిన బాదామీ చాళుక్య శాసనాలు పుస్తకంలో కూడ శాసనముద్రలు లేవు. అడగాల్సిన వారినందరినీ అడిగాను. చివరికి అడిగిన వారికి అడిగినట్లుగా చరిత్ర, శాసన సూచీలను, సమాచారాన్ని అందించే కొండా శ్రీనివాసులును అడిగాను. మీరు నమ్మరు గానీ, శ్రీనివాసులు ఫ్లీట్ రాసిన రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసనం (ముద్రలతో సహా) ఇండియన్ యాంటిక్వరీ, ఇంకా, ఫ్లీట్ మరో రచన డినాస్టీస్ ఆఫ్ ది కానరీస్ డిస్ట్రిక్ట్సు ఆఫ్ ది బాంబే ప్రెసిడెన్సీ (1882) నుంచి పంపించారు. దీంతో హరగోపాల్‍గారి కోరిక,నా కోరిక తీరింది.
పులకేశి. పొలికేశి. గడ్డిలాంటి జుట్టుగలవాడు. జూలుగల సింహంలాంటివాడు. ఈ పేరు ఇద్దరు బాదామీ చాళుక్యరాజుల కుంది. ఒకరు మొదటి పులకేశి (క్రీ.శ.544-566) ఇతడు బాదామీ చాళుక్య వంశానికి పునాదిరాయి. రాజ్యానికి మూలస్థంభం. ఇంకొకరు రెండో పులకేశి క్రీ.శ.610-642). బాదామీ చాళుక్య రాజ్యాన్ని సామ్రాజ్యంగా విస్తరించాడు. రెండో పులకేశి, క్రీ.శ.566 నుంచి 592 వరకూ పాలించిన మొదటి కీర్తివర్మ కొడుకు. రాజ్యపునాదులను బలోపేతం చేసిన కీర్తివర్మ క్రీ.శ.592లో మరణించే నాటికి సింహాసనాన్ని అధిష్టించాల్సిన రెండో పులకేశి చిన్నపిల్లగాడు. అందువల్ల అతని పినతండ్రి మంగళేశుడు రాజైనాడు. సింహాసనాన్ని అసలు వారసుడైన రెండోపులకేశికి అప్పగించటానికి విముఖత చూపటంతో యుక్త వయస్కుడైన రెండోపులకేశి, క్రీ.శ.609-10లో మంగళేశునితో యుద్ధం చేసి, వధించి సింహాసనాన్ని వశపరచు కొన్నాడు. ఎరెయతియదిగల్ అని (రాజు కాక ముందు) పిలువబడిన రెండో పులకేశి, రణవిక్రముడన్న బిరుదుగల మంగళేశుని, నడనూరులో జరిగిన ఎళ్పత్తుసింభిగె అనే యుద్ధంలో చంపాడని అనంతపురం జిల్లా పెదవడుగూరు శాసనం చెపుతుంది. (ఎపిగ్రాఫియా ఇండికా, వా. XL పే.225).
సింహాసనాన్నెక్కిన తరువాత రాజ్యాన్ని సుస్థిర పరచి, పశ్చిమగాంగులు, కాదంబులు, ఆళుపలు, మౌర్యుల (కొంకణ)ను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. తరువాత, లాట, మాళవ, ఘూర్జరులను, హర్షవర్ధనున్ని, కళింగ, కోసల, ఆంధ్ర ప్రాంతాలను జయించి నట్టు రెండోపులకేశి విడుదల చేసిన, ప్రస్తావనలున్న శాసనాలు చాలా ఉన్నాయి. అవి, పెదవడుగూరు శాసనం, దక్షిణ భారత శాసన సంపుటి వా.9,శా.సం.46; హైదరాబాదు రాగిరేకు శాసనం క్రీ.శ.613, ఇండియన్ యాంటిక్వరీ, వా.6,పే.72-75; మోడ్లింబ్ రాగిరేకు శాసనం, ఎపిగ్రాఫియా ఇండికా, వా. 38, పే.215-18, కందల్ గామ్ రాగిరేకు శాసనం, క్రీ.శ.614-15, ఇండియన్ యాంటిక్వరీ, వా.14, పే.330-31; రెండో పులికేశి ఎనిమిదో పాలనా సం. క్రీ.శ.617-18 నాటి విష్ణువర్ధనుని సతారా రాగిరేకు శాసనం, ఎపిగ్రాఫియా ఇండికా, వా.19, పే.303-11; లోహనేర్ రాగిరేకు శాసనం క్రీ.శ.630, ఎపిగ్రాఫియా ఇండికా, వా.27, పే.37-41; కొప్పరం రాగిరేకు శాసనం, పాలనా సం.21, క్రీ.శ.630, ఎపిగ్రాఫియా ఇండికా, వా.18, పే.257-61; కుబ్జవిష్ణువర్ధనుని తిమ్మాపురం రాగిరేకు శాసనం, ఎపిగ్రాపియా ఇండికా, వా.9, పే.317-19; ఐహోలు ప్రశస్తి శాసనం, క్రీ.శ.634-35, ఎపిగ్రాఫియా ఇండికా, వా.6, పే.1-12; తుంబైయనూరు రాగిరేకు శాసనం, ఎన్. రమేశన్, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధప్రదేశ్ గవర్నమెంట్ మ్యూజియం, హైదరాబాదు, వా.1, హైదరాబాదు 1962, పే.40-45; మారుటూరు రాగిరేకు శాసనం, ఇదే గ్రంథం, పే.11-39; చిప్లూన్ రాగిరేకు శాసనం, ఎపిగ్రాఫియా ఇండికా, వా.3, పే.50-53; లక్ష్మేశ్వర్ రాతిశాసనం, ఇండియన్ యాంటిక్వరీ, వా.7, పే.106-07; దక్షిణ భారత శాసన సంపుటి-20, శా.నిం.3; కడమరకాలవ నమూనా గుడిశాసనం, కె.వి.రమేష్, చాళుక్యాస్ ఆఫ్ వాతాపి, 1964,పే.98; రెండో పులకేశి మరియూ యువరాజు మొదటి విక్రమాదిత్యుని ఐహోలు శాసనం ముక్క ఇదే గ్రంథం, పే.104. నెరూర్ రాగిరేకు శాసనం, ఇండియన్ యాంటిక్వరీ వా.8, పే.43-44; ఇంకా, రెండో పులకేశి చివరి శాసనం, ఆయన కుమారుడు మొదటి విక్రమాదిత్యుడు మొదటి శాసనం మధ్య 13 సం।।ల కాలంలో విడుదలైన, ఆదిత్యవర్మ కర్నూలు రాగిరేకు శాసనం, జెబిబిఆర్ ఏఎస్, వా.16, పే.223-25, 233-35; అభినవాదిత్యుని నెలకుండ రాగిరేకు శాసనం, ఎపిగ్రాఫియా ఇండికా, వా.32, పే.213-16 మరియు పిట్టిఅమ్మన్ అరళిహొండ శాసనం, ఎపిగ్రాఫియా ఇండికా, వా.37, పే.333-34. ఇవి రెండో పులకేశి చరిత్ర, సాధించిన విజయాలు, చేసిన దానాల వివరాల నందిస్తున్నాయి.
క్రీ.శ.621/624లో తన తమ్ముడు కుబ్జ విష్ణువర్థనున్ని వేంగి ప్రాంత పాలకునిగా నియమించి తూర్పు చాళుక్యరాజ్యాన్ని ఏర్పరచాడు. అటు తరువాత, పల్లవ రాజులైన మొదటి మహేంద్రవర్మను తరిమి కొట్టాడు. ప్రస్తుత హైదరాబాదు రాగిరేకు శాసనంలో పేర్కొన్నట్లు ‘సమరశత సంఘట్ట సంసంక్తపరనృపతి పరరాజయోగలబ్ద పరమేశ్వరాపరనామధేయః’ అని కీర్తించబడినా క్రీ.శ.641-42లో, పల్లవరాజు మొదటి నరసింహవర్మ జరిపిన యుద్ధంలో మరణించక తప్పలేదని చరిత్రకారులు పేర్కొన్నారు. ఏదిఏమైనా చాళుక్యరాజుల్లో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచాడు. ఇతని కాలంలో వాతాపి నగరాన్ని సందర్శించిన చైనా బౌద్ధాచార్యుడు యువాన్ చ్వాంగ్ అతని పాలనను ప్రశంసించాడు. ఇతని గొప్పతనాన్ని ఐహోలు ప్రశస్తి శాసనంలో, తనమిత్రుడు, మంత్రి అయిన రవికీర్తి వివరంగా పేర్కొన్నాడు.
అప్రతిహత చాళుక్య చక్రవర్తి రెండో పులకేశిని, శక్తిత్రయ సంపన్నుడని (మంత్రశక్తి, ఉత్సాహశక్తి, ప్రభుశక్తి) శాసనాల్లో పేర్కొనబడినాడు. సత్యాశ్రయ, పృధ్వీవల్లభ, పరమేశ్వర, మహారాజ, మహారాజాధిరాజ ప్రధ్వస్తప్రబల శతృమహిమా, ప్రతాపాతిశయోప నీత సమగ్ర సామస్త మండల, నిర్గృహీతదుష్టజన, పరిగృహీత విద్వత్ సఖుడు, అనుగృహీత భృత్యవర్గ, భృత్యలబ్ధ ప్రసాద, అప్రతిహతజ్ఞ, సర్వషడ్గుణాశ్రయ, పరమభాగవత, దేవద్విజగురు సుశ్రుషవర, దక్షిణాపథ పృథ్వీవ్యూహస్వాపి హిమాచలఆనుకారీ అని కీర్తించ బడినాడు.
ఈ హైదరాబాదు రాగిరేకు శాసనం, హైదరాబాదులోని బేగంబజారులో ఉంటున్న మహేంద్ర శాంతయ్య అనే జైన గురువు దగ్గర నుంచి 1882లో జనరల్ ఫ్రేజర్ సంపాదించి, సర్ డబ్ల్యు ఇల్లియట్‍కు చేర్చగా ఆయన వాటిని ఫాసిమైల్ కలెక్షన్స్లో చేర్చాడు. అలా సేకరించిన రెండో పులకేశి రాగిరేకు శాసన వివరాలను ముద్రలతో సహా ఫ్లీట్ మహాశయుడు, ఇండియన్ యాంటిక్వరీ, వా.6.లో ప్రచురించి పుణ్యం కట్టుకోవటాన మనకు దక్కింది.
రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసన పాఠం.
మొదటి రేకు:
- స్వస్తి శ్రీమతాం సకలభువన సంస్థూయమాన మానవ్యసగోత్రాణాం హారతీపుత్రాణాం స
- స్తలోకమాతృభః సప్తమాతృభిరభివర్ధితానాం కార్తికేయాను గ్రహ పరిరక్షణ ప్రా
- ప్త కళ్యాణ పరంపరాణాం భగవన్నారాయణ ప్రసాద సమాదాదిత వరాహలా
- ఞ్చనేరక్షణ వశీకృతాశేష మహీభృతాం చలిక్యానాం కులమలం కరిష్ణ (ష్ణాః)
- అశ్వమేథావభృథ స్నాన పవిత్రికృత గాత్రస్య సత్యాశ్రయ శ్రీ
- పొలికేశి వల్లభ మహారాజస్య పాత్రః పరాక్రమాక్రాన్త వనవాస్యాది పరన్న
- పతిమండల ప్రతి బద్ధ విశుద్ధ కీర్తి పతాకస్య కీర్తివర్మ వల్లభ మహా
- రాజస్య తనయో న్య వినయాదిగుణ విభూత్వాశ్రయః శ్రీ సత్యాం
రెండో రేకు మొదటి పక్క - శ్రయ పృథివి వల్లభమహోరాజః సమర శతసంఘట్ట సంసక్త పరన్నపతి పరా
- జయోపలబ్ధపరమేశ్వరాపరనామ ధేయః సర్వానాజ్ఞాపయత్యస్తు వోమితంమ్ర
- యా వాతాపీనగరీ మధిష్టితానాత్మనః ప్రవర్ధమానరాజ్యాభిషేక సంవత్సరేతృత
- యే శకన్న పతి సంవత్సర శతేషు చతుత్రింశాధికేఘ పంచస్వతీతేఘ భావు
- పదామావాస్యాయాం సూర్యగ్రహణ నిమిత్తం మాతాన్ పిత్రోరాత్మనః పుణ్యా
- వాప్తయే వాసిష్ఠస గోత్రాయ తైతిరీయాయ తగరాధివాసినే
- చతుర్వేదాయోః బరఖేడకులనాధేయాయ జ్యేష్ఠశర్మణే రోట్కా
- క్యుత్తరతః కవప్పగ్రామదక్షిణతః మాకరప్పిర్నామ గ్రామః
రెండో రేకు – రెండో పక్క : - సనిధిః సోపనిధిః సక్లప్తః సోపరికరః
- ణార్థముదకపూర్వకం దత్తః అయమస్మద్దాయో పంచమహాయజ్ఞ నిర్వాప
- న్తవ్యో వర్థనీయశ్చయో వాజ్ఞానాదంజర మంమరం వాత్మానం మన్య మానోప
- హరేత్స పంచమహాపాతక సంయుక్తః బహూని కల్పసహ
- ప్రాణి నరకం వసతి యః పాలయతి తాన్యేవ స్వర్గావసతి
- రాజభిస్సగరాదిభిః యస్యయస్య యదా భూమిల్లోస్య తస్యం
మూడో రేకు : - తదాఫలం స్వదత్తాం పరదాత్తాం వాయత్నాద్రక్ష యుధిష్టర మహీం మహీ
- మతాం శ్రేష్ఠ దానాచ్ఛ్రేయోన్నపాలనం షష్ఠి వర్ష సహప్రాణి స్వర్గో
- మోదతి భూమిదః ఆచ్చేతా చానుమన్తాచతాన్యేవ నరకే వసేత్ వింధ్యా
- ట వీష్యతో యాసు శుష్క కోట రవాసినః కృష్ణాహయోపి జా
- యన్తే భూమిదానం హరస్తియే! దత్తానియానీహపురా నరేంద్రైః
- ర్మార్ధయ శష్కరాణి నిర్మాల్య వాస్తప్రతిమాని తాని కో నామ సాదానాని ధ
- ధుః పునరాదదీతఃత్ర ।ఇతి।
మానవ్యగోత్రానికి చెంది, హారీతి పుత్రులైన చాళిక్య వంశానికి చెందిన సప్తమాతృకల చేత, కార్తికేయునిచేత రక్షించబడుతున్న, భగవన్నారాయణుని చేత వరాహలాంఛనాన్ని పొందిన, సమస్త భువనముల చేత స్థుతించబడిన, అశ్వమేధ అవభృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడైన, సత్యాశ్రయ మొదటి పొ(పు)లికేశి వల్లభ మహారాజు మనుమడు; వనవాసి మొదలైన పరరాజుల ఏలుబడిలో నున్న అనేక రాజ్యాలపై తన పరాక్రమంతో దాడి చేసి విశుద్ధకీర్తి పతాకాన్నెగరేసిన కీర్తివర్మ వల్లభమహారాజ కుమారుడు; వినయగుణ సంపన్నుడు, సత్యాశయ బిరుదాంకితుడైన, వంద యుద్ధాల్లో శతృరాజులనోడించి, పరమేశ్వర బిరుదు పొందిన పృధ్వీవల్లభ మహారాజు రెండో పులకేశి, తన పాలనలో నున్న ప్రజలను ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ‘‘శకరాజు తరువాత 534 సంవత్సరాల తరువాత, తన మూడో పాలనా సం।।లో, భాద్రపద మాస అమావాస్య, సూర్య గ్రహణ నిమిత్తం, తనకు, తన తల్లి దండ్రులకు పుణ్యం కోసం, రోల్కుఱికి గ్రామానికి ఉత్తరంగా కదప్ప గ్రామానికి దక్షిణంగా ఉన్న మాకరప్పి అనే గ్రామాన్ని సర్వకరపరిహారంగా నిధినిక్షేపాలతో పాటు, ఐదు గొప్ప యజ్ఞాలు చేయటానికి, ఉంబరఖేడ వంశానికి, వశిష్ట గోత్రలి, తైత్తిరీయ శాఖకు చెంది, తగరనగరవాసి జ్యేష్ఠశర్మకు, ధారాపూర్వకంగా, వాతాపి నగరం నుంచి దానం చేస్తున్నాను. నేనిచ్చిన ఈ దానం నా తరువాత రాజులు పరిరక్షించి, వృద్ధి చేయాలి’’.
రెండో పులకేశి గుణగణాలను వర్ణించటమే కాక, అతడు క్రీ.శ.610వ సం।।లో సింహాసనం ఎక్కాడన్న విషయాన్ని తెలియ జేయటం వల్ల, ఆ విషయం హైదరాబాదునగరం ద్వారా వెలికి రావటం వల్ల, ఈ శాసనం అలనాటి తెలంగాణ మేటి శాసనాల్లో ఒకటైంది. శాసనాక్షరాలు, తొలి కాలపు కన్నడ అక్షరాలు రూపుదిద్దుకొంటున్న నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ శాసన పాఠం ముద్రల నందించిన ప్రముఖ చరిత్రకారుడు కొండా శ్రీనివాసులుకు, తెలుగులో తొలిసారిగ ప్రచురిస్తున్న యం. వేదకుమార్‍గారికి కృతజ్ఞతలు.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446