చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍


ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల ఏర్పాటుకు వీలుండింది. మొత్తం 25000ల చదరపు అడుగుల్లో నిర్మితమైన ఈ భవంతిలో చికిత్స అంతా కుతుబ్‍ షాహిల రాజ వైద్యుడు హకీమ్‍ సైఫుద్దీన్‍ జిలానీ నేతృత్వంలో జరిగేది. రోగులకు ఉచిత ప్రోటీన్‍ యుక్త భోజన సదుపాయాలు కూడా ప్రభుత్వమే కల్పించేది. అందుకే ప్రపంచంలో పేరుగాంచిన ‘యునాని’ వైద్యులు ఆనాడు హైదరాబాద్‍లో స్థిరపడినారు. సామాన్యులు మొదలు నవాబుల వరకు వారు వైద్యాన్ని అందించారు.

యునాని’తో పాటుగా ఆయుర్వేద వైద్యానికి కూడా అసఫ్జాహీల కాలంలో కొంత ప్రాచుర్యం ఉండేది. హకీం నారాయణదాస్‍, హకీం జనార్ధన దాస్‍ లాంటి వారు ఏడో నిజామ్‍కు రాజ వైద్యులుగా పనిచేశారు. రాధాకృష్ణ బిషగాచార్య, వైద్యరత్న బి.రామరాజు, బి. మార్కండేయులు లాంటి ఆయుర్వేద వైద్యులు ఇక్కడ రాణించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా పరుచుకుపోయిన, విస్తృతంగా అమల్లో ఉన్న అల్లోపతి వైద్యం లేదా ఇంగ్లీషు వైద్యం గురించి మాట్లాడుకుందాం! ఆ వైద్యం హైదరాబాద్‍కు ఎప్పుడు ఎలా వచ్చిందనేది చర్చించుకుందాం!


అన్ని రంగాల్లో ‘ఆధునికత’ అనేది విదేశీయుల రాకతో హైదరాబాద్‍లో ఆరంభ మయింది. అల్లోపతి వైద్యం కూడా అలాగే హైదరాబాద్‍కు వచ్చింది. 1798, 1800ల సంవత్సరాల్లో ఈస్టిండియా కంపెనీతో రెండో ‘నిజామ్‍ నిజామ్‍ అలీఖాన్‍’ సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‍, బొల్లారం, సికింద్రాబాద్‍ జాల్నా, ఔరంగాబాద్‍ తదితర ప్రాంతాల్లో బ్రిటీష్‍వారు తమ సైన్య స్థావరాలను ఏర్పర్చినారు. ఈ సైన్యం నిజాం ప్రభుత్వం కోరినదే తడవుగా ఆయనకు సహాయాన్ని అందించేది. శాంతిభద్రతలు కాపాడడంలో ఈ సైన్యం పాత్ర ప్రధానంగా ఉండేది. ఇట్లా బొల్లారం, బ్రిటీష్‍ రెసిడెన్సీ (కోఠీ)లో ఏర్పాటు చేసిన పటాలాల బాగోగులను బ్రిటీష్‍ అధికారులే చూసుకునేవారు. వాటి నిర్వహణ, జీత భత్యాల నిమిత్తం నిజాం ప్రభుత్వం బ్రిటీష్‍వారికి ఆంధ్రా జిల్లాలను దారదత్తం చేయడం జరిగింది. అందుకే వీటిని సీడెడ్‍ జిల్లాలంటారు. ఇది 1800ల నాటి సంఘటన.


ఇట్లా ఏర్పాటైన సైన్యం ఆరోగ్యం, చికిత్సకు సంబంధించిన బాగోగులని పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా బ్రిటీష్‍ రెసిడెన్సీ అధికారుల పైనే ఉండేది. అందుకే 1814లో బ్రిటీష్‍ రెసిడెంట్‍ సర్‍ హెన్రీ రస్సెల్‍ తమ సైన్యం వైద్యం నిమిత్తం ఈస్టిండియా కంపెనీ, గవర్నర్‍ జనరల్‍ అనుమతితో రెండు పోస్టులను సృష్టించాడు. ఇట్లా సృష్టించిన పోస్టుల్లో నియమితులైన ఫస్ట్ డ్రెస్సర్‍, సెకెండ్‍ డ్రెస్సర్‍ పేరిట ఇద్దరు వైద్యులు చికిత్సను అందించేవారు. దీనికి కొనసాగింపుగా 1818లో అప్పటికే ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా ఒక సర్జన్‍ని నియమించారు. ఆ తర్వాత 1827లో ‘హైదరాబాద్‍ కంటిం జెంట్‍’కు (పటాలం) అనుబంధంగా ఒక మెడికల్‍ స్టోర్‍ కీపర్‍, మరో మెడికల్‍ సూపరింటెండ్‍-(సర్జన్‍)ని కూడా నియమించారు. ఇట్లా 1835లో బొల్లారం మిలిటరీ కేంద్రంలో రెసిడెన్సీ అధికారులు ఒక మెడికల్‍ స్కూల్‍ని ప్రారంభించారు.

ఈ సమయంలో కల్నల్‍ జె. స్టెవార్ట్ రెసిడెంట్‍గా ఉన్నాడు. స్థానికులకు అల్లోపతి మెడిసిన్‍లో శిక్షణ ఇచ్చి వారిని సైన్యంలోనే ఉద్యోగస్థు లుగా, సహాయకులుగా నియమించడం వారి ఉద్దేశ్యం. ఈ స్కూల్‍ మొదటి ప్రిన్సిపాల్‍గా అసిస్టెంట్‍ సర్జన్‍ థామస్‍ కీ పనిచేశారు. ఈయనకు సహాయకుడిగా మెడికల్‍ స్టోర్‍ కీపర్‍ సైమన్‍ యంగ్‍ ఉన్నారు. అయితే ఇక్కడ పనిచేసే సూపరింటెండ్‍ రిటైర్‍ కావడంతో ఈ మెడికల్‍ స్కూల్‍ నిర్వహణ వల్ల రెసిడెన్సీ ఖజానా మీద అధిక భారం పడడమే గాకుండా దానివల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదనే మిషతో అప్పటి రెసిడెంట్‍ జేమ్స్ స్టువార్ట్ ఫ్రేజర్‍ పాఠశాలను రద్దు చేసిండు. ఈ నిర్ణయం 1846 మే ఒకటిన జరిగింది. దీంతో హైదరాబాద్‍లోని పత్రికలు రెసిడెంట్‍ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తీవ్రంగా విమర్శించాయి. ఈ విషయం ఈస్టిండియా కంపెనీ అధికారులకు కూడా చేరింది. దీంతో ఫ్రేజర్‍ దిద్దుబాటు చర్యలు చేపడుతూ పూర్తిస్థాయిలో మెడికల్‍ స్కూల్‍ ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతమున్నదాన్ని రద్దు చేశామని చెబుతూ, త్వరలోనే ఆ పాఠశాల ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ మేరకు ఫ్రేజర్‍ ఈస్టిండియా కంపెనీ గవర్నర్‍ జనరల్‍తో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి మెడికల్‍ పాఠశాల నడిపేందుకు అనుమతి తీసుకున్నాడు. ఇదే విషయాన్ని నాలుగో నిజామ్‍ నాసర్‍జంగ్‍ దృష్టికి కూడా తీసుకొచ్చినాడు. ఎందుకంటే వీటి నిర్వహణకయ్యే ఖర్చు నిజాం ప్రభుత్వమే భరించేది. తమ ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనకు నాసర్‍జంగ్‍ అంగీకారం తెలిపినాడు. అంతేగాదు ఈ మెడికల్‍ పాఠశాలలో బోధనా భాష ‘ఉర్దూ’లో ఉండాలని షరతుని విధించినాడు. అందుకు ఫ్రేజర్‍ అంగీకరించడంతో మొత్తం భారతదేశంలోనే దేశీయ భాషల్లో ‘మెడికల్‍ విద్య’ను బోధించే మొట్ట మొదటి పాఠశాల 1846 సెప్టెంబర్‍లో హైదరాబాద్‍లో ప్రారంభమయింది. ఇట్లా పూర్తి విదేశీ వైద్య విద్యను స్వదేశీ భాషలో బోధించిన ఘనత హైదరాబాద్‍కు దక్కుతుంది.


అయితే గ్రీకులో పుట్టి పర్షియా గుండా హైదరాబాద్‍కు వచ్చిన ‘యునాని’ వైద్యంలో నిజాం రాజులకు, నవాబులకు, ప్రజలకు నమ్మకముండేది. బ్రిటీష్‍ రెసిడెన్సీలో అల్లోపతి వైద్యం అందిస్తున్నప్పటికీ దాని పట్ల నవాబులకు, నిజాం రాజులకు ముఖ్యంగా హకీమ్‍లకు ఏ మాత్రం నమ్మకముండేది కాదు. ఈ హకీమ్‍లు నవాబులకు, రాజులకు ఆంగ్ల వైద్యం పట్ల పూర్తి వ్యతిరేకతను నూరి పోశారు. ‘టాబ్లెట్‍’ మింగితే రక్షించే, చికిత్స చేసే, ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తమది కాదని చెప్పేవారు. ఒక రకంగా ‘అల్లోపతి’ వైద్యం పట్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిండ్రు. ఇలాంటి దశలో 1845-46 ఆ ప్రాంతంలో నాలుగో నిజామ్‍ నాసిరుద్దౌలా ‘డయాబిటిస్‍’తో బాధపడుతూ ఉండేవాడు. ‘యునాని’ వైద్యంతో ఆయనకు స్వస్థత చేకూరలేదు. దీంతో నిజామ్‍ని క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి వచ్చిన ఫ్రేజర్‍ అల్లోపతి వైద్యం గురించి చెబుతూ, దాని ద్వారా స్వస్థత పొందవచ్చని పేర్కొన్నాడు. అంతేగాదు చికిత్స నిమిత్తం రెసిడెన్సీ వైద్యుడు మెక్లీన్‍ని పంపించాడు.

ఈ సమయంలో డాక్టర్‍ మెక్లీన్‍కు నాసిరుద్దౌలా కొన్ని షరతులు విధించాడు. ‘నేను మీరిచ్చే ఒక్క అల్లోపతి మాత్రను కూడా మింగేది లేదు. కనీసం ముట్టుకునేది లేదు’. అని తేల్చి చెప్పిండు. దానికి మెక్లీన్‍ అంగీకరిస్తూ కొన్ని ‘టెస్టులు’ చేసి ‘డయాబిటిస్‍’కు పాటించాల్సిన పత్యాన్ని సూచించాడు. ‘డైటింగ్‍’లో మార్పులు చేసిండు. డాక్టర్‍ సూచించిన పత్యాన్ని, డైట్‍ని తూ.చ. తప్పకుండా నాసిరుద్దౌలా పాటించాడు. దీంతో మూడు నెలల్లోనే ఆయన ఆరోగ్యం కుదురుకుంది. అలా అల్లోపతి వైద్యంపై నిజాంకు నమ్మకం ఏర్పడింది. ఇట్లా హైదరబాద్‍లో తొలి మెడిసిన్‍ స్కూల్‍ ఆధునిక పద్ధతుల్లో స్థాపనకు పునాదులు పడ్డాయి.


బ్రిటీష్‍ రెసెడిన్సీ హాస్పిటల్‍ (ప్రస్తుత సుల్తాన్‍ బజార్‍ దవాఖానా) సూపరింటెండెంట్‍గా, సర్జన్‍గా డాక్టర్‍ విలియం కాంప్‍బెల్‍ మెక్లీన్‍ 1844లో నియమితుడయిండు. ఇందుకు గాను ఆయనకు నెలకు వెయ్యి రూపాయలు జీతంగా లభించేది. ఆయనకు ఐదు వందల రూపాయల అదనపు జీతం ఇచ్చే ఖరారుతో ‘హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍’ 1846లో నగరంలోని ఆబిడ్స్ ప్రాంతంలో (ఒకప్పటి ప్యాలెస్‍ థియేటర్‍ ఉన్న స్థలంలో) ‘మెడికల్‍ స్కూల్‍’ ఏర్పాటయింది. దీనికి తొలి ప్రిన్సిపాల్‍గా మెక్లీన్‍ పనిచేశారు. అయితే బోధన ఉర్దూలో చేయాల్సి రావడంతో ఆయన ఆ భాషలోనూ పట్టు సాధించాడు. కోర్సు మెటీరియల్‍ అంతా కూడా ఉర్దూలో తయారు చేయించారు. కేవలం ఉర్దూలోనే కాదు తెలుగులో కూడా కొన్ని వ్యాధులు, వాటి నివారణకు సంబం ధించిన వివరాలు ఈ మెడికల్‍ స్కూల్‍ వాళ్లు ప్రచురించారు.

1850ల నాటికే హైదరాబాద్‍లో ‘మశూచి-స్ఫోటకం’ గురించి మెక్లీన్‍ ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేసి అచ్చేశారు. ఇట్లా మెక్లీన్‍ ఒకవైపు బ్రిటీష్‍ రెసిడెన్సీలో పనిచేస్తూనే, నాసిరుద్దౌలా, షంషుల్‍ ఉమ్రా, సూరజ్‍ ఉల్‍ ముల్క్ తదితర రాజులు, నవాబులకు రాజ వైద్యుడిగా కూడా కొనసాగాడు. ఈయన ఈ పదవిలో 1854 వరకు ఉన్నాడు. ఈ ‘మెడికల్‍ స్కూల్‍’ నుంచి మొదటి బ్యాచి విద్యార్థులు 1852-53లో బయటి కొచ్చారు. మొదటి బ్యాచ్‍లో మొత్తం పది మంది విద్యార్థులు పట్టా పుచ్చుకున్నారు. ఇందులో ఒక్కరు మినహా ముస్లిములే! వారి పేర్లు. 1.మొహ్మద్‍ అష్రఫ్‍, 2. హెన్రీ పికాక్‍, 3. మొహ్మద్‍ బాకర్‍ అలీ, 4. ఫైజుల్లా ఖాన్‍, 5. సయ్యద్‍ ఒమర్‍, 6. ఐన్‍ ఖాన్‍, 7. గులామ్‍ జిలానీ, 8. ఖ్వాజా అష్రఫ్‍, 9. మొహ్మద్‍ యాకూబ్‍, 10. పీర్‍ ఖాన్‍.


నిజానికి మెక్లీన్‍ హైదరాబాద్‍లో ‘అల్లోపతి వైద్య పితామహుడు’. ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఈయన 1811 నవంబర్‍ 29న స్కాంట్లాండ్‍లో పుట్టి చాలా ఏండ్లు ఇండియాలోని వివిధ ప్రదేశాల్లో పనిచేశారు. రిటైరైన తర్వాత ఇంగ్లండ్‍లోని వివిధ మెడికల్‍ కళాశాలల్లో లెక్చర్సిచ్చారు. ఈయన తన 87వ యేట 1898 నవంబర్‍ పదో తేదిన మరణించారు. ఈయన తన జీవిత చరిత్రను కూడా రాసుకున్నారు. మెక్లీన్‍ ఏర్పాటు చేసిన ఈ ‘మెడికల్‍ స్కూల్‍’ 1861లో ‘అఫ్జల్‍ గంజ్‍ దవాఖానా’గా మారింది. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఏర్పాటైన తర్వాత 1925లో దానికి అనుబంధంగా ‘ఉస్మానియా మెడికల్‍ కాలేజి’గా రూపుదిద్దుకుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మెడికల్‍ స్కూల్‍ ప్రారంభం అంత ఈజీగా ఏమీ జరగలేదు.


‘హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍’ మెక్లీన్‍ పూనిక మేరకు సరైన పద్ధతుల్లో ప్రారంభమయింది. తొలుత నెలకు ముప్పయి రూపాయల అద్దెతో ఒగిల్వీ అనే భూస్వామి భవనాన్ని కిరాయికి తీసుకున్నారు. అలాగే అమీర్‍ అలీని క్లర్క్గా నియమించుకున్నాడు. దుబాసీగా ముర్రే అనే అతన్ని ఉద్యోగిగా నియమించాడు. వీరికి తోడుగా ఇద్దరు అటెండర్లను కూడా ఆయన నియమించాడు. ఇదంతా బాగానే ఉన్నది కానీ విద్యార్థులెవ్వరూ మెడిసిన్‍ విద్యను చదవడానికి ఆనాడు సిద్ధంగా లేరు. దీనికి ప్రధాన కారణం ఐదారేండ్లు ‘హకీమ్‍’ కోర్సును చదవాల్సి రావడం. అలాగే బోధన ఉర్దూలో ఉన్నప్పటికీ విషయం పెద్దగా తెలిసింది కాకపోవడం కూడా ఒక కారణం.

కొంతమంది వైద్యాలయంలో మానవ కంకాళాలను చూసి భయపడి విద్యను మధ్యలోనే మానుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ సమస్యల్ని అధిగమించడానికి విషయాన్ని డాక్టర్‍ మెక్లీన్‍ నాలుగో నిజాం దృష్టికి తీసుకొచ్చినాడు. అందుకు ఆయన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తన కార్యాలయాధికారి మీర్‍ ఇమామ్‍ అలీఖాన్‍ని కోరినాడు. చివరికి నవాబ్‍ షంషూల్‍ ఉమ్రా దగ్గర వకీల్‍గా పనిచేస్తున్న గులామ్‍ మొహియుద్దీన్‍ ఖాన్‍ విద్యార్థులను చేర్పిస్తానని మాటిచ్చాడు. ఆ మేరకు షంషూల్‍ ఉమ్రా పోషణలో చదువుకుంటున్న నాలుగు వందల మంది ఉర్దూ, పర్షియన్‍ బాగా తెలిసిన విద్యార్థుల నుంచి 30 మంది తెలివైన విద్యార్థులను తీసుకొని రావాల్సిందిగా అక్కడి అధ్యాపకులను ఆదేశించారు. అందులో నుంచి షంషుల్‍ ఉమ్రా తానే స్వయంగా ఒక పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కౌన్సిలింగ్‍ ఇచ్చాడు. మీ భవిష్యత్తు బాగుంటుంది, దానికి నాది భరోసా అంటూ వారికి ధైర్యాన్నిచ్చాడు. వైద్య విద్య చదవడం ద్వారా సేవ చేయడమే గాకుండా, ఆర్థికంగా కూడా బలపడవచ్చని వారిని ప్రోత్సహించాడు. అంతేగాకుండా ఎంపికైన విద్యార్థులందరికీ ఒక ‘ఇంక్‍పాట్‍’, ‘నైఫ్‍’, పేపర్‍ బండిల్స్ తానే స్వయంగా అందించి వారి వైద్యవిద్యకు అండగా నిలిచాడు.


ఇట్లా ప్రారంభమైన స్కూల్‍లో పాసైన వారికి ‘హకీమ్‍’ సర్టిఫికెట్‍ ఇచ్చేవారు. ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థులకు బోధన చేసేవారు. అయితే అందులో పది, పన్నెండు మించి పాసయ్యే వారు కాదు. వాళ్ళు మళ్ళీ తర్వాతి సంవత్సరం పరీక్షలు రాసేవారు. ఇట్లా పాసైన ‘హకీమ్‍’లు సాలర్‍జంగ్‍, షంషుల్‍ ఉమ్రా తదితర నవాబుల దగ్గర వైద్యులుగా చేరేవారు. సాలర్‍జంగ్‍ వద్ద వైద్యులుగా చేరిన వారు నగరంలో ఉచిత వైద్య సేవలు అందించేవారు. మరికొంతమందిని హైదరా బాద్‍ ప్రధాని సాలార్జంగ్‍ తాలూకా కేంద్రాల్లో ‘హకీమ్‍’ లుగా నియమించినాడు. వీరికి నెలకు ఆనాడు 30 రూపాయల జీతాన్ని ఇచ్చేవారు. ఈ హకీమ్‍లకు పూర్తి వైద్య సదుపాయాలతో డిస్పెన్సరీని ఏర్పాటు చేయడమే గాకుండా వారు ధనవంతుల నుంచి కొంత ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఆనాడే ఉచిత వైద్య సదుపాయాన్ని సాలర్‍జంగ్‍ కల్పించారు. మెక్లీన్‍ అనంతరం ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్‍గా డాక్టర్‍ జార్జ్ స్మిత్‍ పనిచేశారు. 1861లో డాక్టర్‍ స్మిత్‍ ప్రమోషన్‍పై మద్రాసు మెడికల్‍ కాలేజికి వెళ్ళిండు. స్మిత్‍ స్థానంలో ప్రిన్సిపాల్‍గా డాక్టర్‍ ఫ్లెమింగ్‍ నియుక్తులయ్యారు. ఆ తర్వాత 1867లో డాక్టర్‍ పంబర్టన్‍, 1882లో డాక్టర్‍ విండోవ్‍ తదితరులు ప్రిన్సిపాల్స్గా వ్యవహరించారు. ఈ దశలో మెడికల్‍ విద్యార్థులకు నెలకు నాలుగు రూపాయల స్టైఫండ్‍ ఇచ్చి ఇంగ్లీషు నేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహించింది. 1861-62 తర్వాత వైద్య విద్యలో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరచడంతో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సికింద్రాబాద్‍ ఆసుపత్రికి చెందిన డాక్టర్‍ ఫోర్బస్ చైర్మన్‍గా వ్యవహరించేవారు. ఆయనతో పాటుగా ఆల్వాల్‍కు చెందిన డాక్టర్‍ సాండర్సన్‍, సికింద్రాబాద్‍కు చెందిన డాక్టర్‍ మార్టిన్‍ సభ్యులుగా ఉండేవారు. బోధనా మాధ్యమాన్ని ఇంగ్లీషుకు 1883-84లో మార్చినారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే కొనసాగుతున్నది. ఈ సమయంలో ‘మెడికల్‍ స్కూల్‍’కు ఎడ్వర్డ్ లారీ అనే అతను ప్రిన్సిపాల్‍గా పనిచేశాడు. ఈయన తర్వాత అంటే 1888-94లో క్లోరోఫామ్‍ మిషన్‍ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‍ కీర్తిపతాకను, పరిశోధన రంగానికి నిజాం ప్రభుత్వం చేస్తున్న సేవలను ఎరుక పరిచాడు. ఇంగ్లండ్‍లోని వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసి హైదరాబాద్‍లో జరుగుతున్న పరిశోధనలను వెల్లడించారు. ‘లాన్సెట్‍’ అనే ఒక బ్రిటన్‍ పత్రిక సంపాదకుడు ఆయన పరిశోధనలపై కొంత సందేహాన్ని వ్యక్తం చేసిండు. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు బ్రిటన్‍ నుంచి పత్రిక ప్రతినిధిని రప్పించి వివిధ జంతువులపై హైదరాబాద్‍లో‘అనస్తీషియా’ విషయంలో చేసిన పరిశోధనలు రుజువు చేసినాడు. దీని కొనసాగింపుగానే హైదరాబాద్‍లో రోనాల్డ్ రాస్‍ మలేరియా కారకాల మీద చేసిన పరిశోధనకు గాను 1902లో నోబెల్‍ ప్రయిజ్‍ వచ్చింది. అలాగే ముత్యాల గోవిందరాజులు నాయుడు కూడా తర్వాతి కాలంలో ఈ కళాశాల ప్రిన్సిపాల్‍గా పనిచేశారు. డాక్టర్‍ మల్లన్న ఇక్కడి నుంచే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ.


ఇట్లా ప్రపంచ చరిత్రలో హైదరాబాద్‍ వైద్య రంగానికి ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతేకాదు నిజాం ప్రభుత్వం వైద్యవిభాగాలను ప్రోత్సహించింది. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించింది. వైద్యవిద్యలో నూతనంగా చోటు చేసు కుంటున్న పరిశోధనలు వైద్యులందరికీ అందుబాటు లోకి తెచ్చేందుకు గాను సాలార్జంగ్‍ ఆర్థిక సహకా రంతో ఈ మెడికల్‍ స్కూల్‍ ‘రిసాలా తిబ్బాత్‍’ అనే వైద్య పత్రికను నడిపించింది. ఈ పత్రికకు ఆనాడు ఒక్క హైదరాబాద్‍లోనే గాకుండా బొంబాయి, కలకత్తాల్లో కూడా చాలా మంచి పేరుండేది. ఇన్నేండ్లు విస్మృతంగా ఉన్న ఘన చరిత్ర అందరికీ తెలియాలి.


-సంగిశెట్టిశ్రీనివాస్‍, ఎ:98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *